న్యూఢిల్లీ: కొన్ని రోజుల కిందట తమ కార్యకర్తలపై కొందరు బీజేపీ కార్యకర్తలు దాడిచేశారంటూ సాక్ష్యంగా ఆమ్‌ఆద్మీపార్టీ విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్ అభూత కల్పన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ ఖండించారు. ఈ వీడియో క్లిప్పింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గత శనివారం తుగ్లకాబాద్‌లో బీజేపీ, ఆప్ కార్యకర్తల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అందులో 12 మంది ఆప్ కార్యకర్తలు గాయపడ్డారు. కాగా, బీజేపీ పథకం ప్రకారమే ఆప్ కార్యకర్తలపై దాడికి దిగిందని ఆ పార్టీ నాయకులు అశుతోష్, ఆశిష్ ఖేతన్‌లు విమర్శించారు. గొడవ సమయంలో బీజేపీ కార్యకర్తలు రాడ్లు, కర్రలు ఉపయోగించారన్నారు. దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధురి బంధువులు, అభిమానులేనని దీనికి కారణమని ఆరోపిస్తూ ఆ మేరకు వీడియో క్లిప్పింగ్‌లను ఉదహరించారు. అందులో ఎంపీ రమేష్ మేనల్లుడు బీజేపీ కార్యకర్తలను ఆప్ కార్యకర్తలపైకి ఉసిగొల్పినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అశుతోష్ నొక్కి చెప్పారు. కాగా, ఈ ఆరోపణలను మంగళవారం బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్, ఎంపీ బిధురీ తోసిపుచ్చారు. వాటిని రాజకీయ దురుద్దేశ పూరిత ఆరోపణలుగా వారు కొట్టిపారేశారు.