న్యూఢిల్లీ: ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పరస్పరం విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవినుంచి కేజ్రీవాల్ దిగిపోవడాన్ని బీజేపీ పరోక్షంగా ఓ రేడియో యాడ్‌ద్వారా పరోక్షంగా విమర్శించగా అటువంటిదేమీ లేదని, తాను మళ్లీ ముందుకొచ్చానని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మరో రేడియో యాడ్ ద్వారా బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. ఈ రెండు పార్టీల రేడియో యాడ్‌లు ఇలా ఉన్నాయి. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవి నుంచి దిగిపోవడాన్ని ఓ వృద్ధ మహిళ తప్పుపట్టింది. ‘ఇది నా తప్పిదమే. తనను తాను సామాన్యుడని ఆ వ్యక్తి ప్రకటించుకున్నాడు. మమ్మల్ని మోసగించాడు. గొప్ప గొప్ప వాగ్దానాలు చేశాడు. ఉచితంగా తాగు నీరు అందజేస్తానన్నాడు. అయితే చివరికి కన్నీళ్లు మాత్రమే మిగిల్చాడు.
ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు అతనిపై ప్రతీకారం తీర్చుకుంటాం. ఏ పనీ చేయని ఇతనికి ఈసారి ఓటు వేయబోం. ఢిల్లీని పూర్తిమెజారిటీతో మార్చివేసేందుకు మేమంతా మోదీతో కలిసి నడుస్తాం’అని ఉంది. ఇక అరవింద్ రేడియో యాడ్ ఇలా ఉంది. ‘మీరంతా రేడియోలో బీజేపీ యాడ్‌ను ఆలకించారా. అందులో ఓ వృద్ధ మహిళ నాపై మండిపడింది. ఈ యాడ్‌కు మా స్పందన ఇదే. ఓటు వేసినందువల్లనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని ఆ మహిళ అంది. తన ఓటును నేను గౌరవించలేదని ఆమె ఆలోచిస్తోంది. అయితే మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా. నేను పలాయనం చిత్తగించలేదు. సంపూర్ణ మెజారిటీతో సేవ చేసేందుకే మీ ముందుకు రాబోతున్నా. నేను ఆశించేది కేవలం మీ ఆశీస్సులే. మీ ఓటుగానీ, మీ కష్టంగానీ ఎట్టి పరిస్థితుల్లో వృథా పోదు. లోపం ఒక్కటే తగినన్ని సీట్లు లేకపోవడం. నాపై మీరు విశ్వాసం ఉంచండి. నాపై మండిపడకండి. ఓ చిరునవ్వు నవ్వండి చాలు’అని బుధవారం ఆయన ట్వీట్ చేశారు.
ఎంపీ బిధురిపై కోర్టుకెళతాం: ఆప్
తమ కార్యకర్తలపై దాడికి ప్రోత్సహించిన బీజేపీకి చెందిన దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధురిపై కోర్టును, ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ తెలిపింది. ఆప్ తుక్లకాబాద్ అభ్యర్థి సహిరామ్ పహిల్వాన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున పోటీచేసిన రమేష్ బిధురి నామినేషన్ అఫిడవిట్‌లో తనపై ఉన్న క్రిమినల్ కేసులను పేర్కొనకుండా ఎన్నికల కమిషన్‌ను మోసం చేశాడని ఆరోపించారు. ఈ మేరకు తగిన సాక్ష్యాలతో ఆయనపై తాము ఈసీకి, కోర్టుకు ఫిర్యాదు చేయనున్నామన్నారు. అప్పటికే బిధురిపై 10 కేసులు నమోదై ఉన్నాయని ఆయన తెలిపారు. అందులో ఐదు సంగమ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో, 3 ఓక్లాలో,ఒకటి అంబేద్కర్ నగర్‌లో ,మరొకటి గోవిందపురి పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యాయని వివరించారు. కాగా, దీనిపై బిధురి స్పందిస్తూ.. ఆప్ ఆరోపణలన్నీ నిరాధారమైనవని అన్నారు. వారి మీడియా సమావేశం వీడియో ఫుటేజీలు తెప్పించుకుంటున్నానని, వాటిని పరిశీలించి.. తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలేమైనా వారు చేసి ఉంటే లీగల్ నోటీసు పంపిస్తానని వ్యాఖ్యానించారు.
రేడియో యాడ్‌తో బీజేపీ దాడి
Published Wed, Jan 7 2015 10:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement