న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ఇక వచ్చే ఐదు నుంచి పదేళ్ల వరకూ ఢిల్లీపైనే దృష్టిని కేంద్రీకరిస్తామని చెప్పారు. రాజధాని నగర ప్రజల ఆమోదం పొందిన తరువాతనే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. 49 రోజుల పాటు ఢిల్లీ రాష్ట్రాన్ని పాలించి ఆ తరువాత రాజీనామా చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆప్ నాయకుడు ఈ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీయేనని, ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. పార్టీ అభివృద్ధికి ఢిల్లీలో బలమైన పునాది అవసరమని అన్నారు. ఇతరచోట్ల పోటీ చేసే విషయమై ఢిల్లీ ఎన్నికల తరువాతనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎలా పాలించా లో కేజ్రీవాల్‌కు తెలియదు అన్న విమర్శలను ఆప్ నాయకుడు తిరస్కరించారు. ఆప్ ప్రభుత్వం వేగంగా తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు.
మరోసారి అధికారంలోకి వస్తామన్న గట్టి నమ్మకం తమకుందన్నారు. తమకు పాలించడం తెలి యదన్న ప్రచారాన్ని బీజేపీకి ఆప్‌కు వ్యతిరేకంగా సాగి స్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. అసలు పాలన అంటే ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ‘‘65 ఏళ్లలో బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అవినీతి తగ్గుముఖం పట్టిందని ఏ రాష్ట్రాన్నైనా ఉదహరించగలరా? కాంగ్రెస్ పార్టీ కూడా 65 ఏళ్ల పాటు కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. వారు కూడా అవినీతిని అరికట్టలేకపోయారు. మేము ఆ పనిని 49 రోజుల్లో చేసి చూపించాం. ఎలా పాలించాలో మాకు తెలుసు. వారికే తెలియదు’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకూడదన్న బీజేపీ నిర్ణయం ప్రజలపై దానికున్న అపనమ్మకాన్ని వెల్లడిస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరిస్తారని చెప్పారు. నగరం కోసం బీజేపీ చేసింది శూన్యమని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు ధరలను అదుపు చేయలేకపోయాయని, తాము చేసి చూపించామని కేజ్రీవాల్ చెప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో పోరు ఆప్, బీజేపీ మధ్యనే ఉంటుందని అన్నారు. నగరంలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లు, ఘర్షణలపై కేజ్రీవాల్ వ్యాఖ్యానిస్తూ, ఎన్నికల ముంగి ట అలజడిని సృష్టించే ధోరణి ప్రారంభమైందని అన్నారు. అవినీతిని అన్నా హజారే, కేజ్రీవాల్ జాతీయ సమస్యగా మార్చినప్పటికీ దాని నుంచి ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ లాభపడ్డారా అని ప్రశ్నిం చగా, కేజ్రీవాల్ నేరుగా సమాధానం చెప్పకుండా దాట వేశారు. ప్రధానమంత్రి ఇంతవరకు అవినీతిని నియంత్రించలేకపోయారని మాత్రం విమర్శించారు. ‘‘అవినీ తిని తగ్గిస్తానని మోదీ వాగ్దానం చేశారు. ఇంతవరకూ ఏమీ చేయలేదు. ప్రజలకు ఆయనపై ఆశలు ఉన్నాయి. ఆయనేదో చేస్తారని ప్రజలు ఇంకా ఆశిస్తున్నారు. మేము 49 రోజుల్లో చేసి చూపించాం. ఆయన దాదాపు 200 రోజులుగా అధికారంలో ఉన్నారు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్రంలో బలమైన ప్రతిపక్ష పాత్రను పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆప్ నాయకుడు విమర్శించారు. బలహీనమైన ప్రతిపక్షం దేశానికి మంచిది కాదన్నారు.
ప్రచారంలో సామాన్యుల సమస్యలకు ప్రాధాన్యం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు విషయమై అధికారాన్ని త్యజించిన ఆమ్ ఆద్మీ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో లోక్‌పాల్ బిల్లు, స్వరాజ్ బిల్లుల కన్నా విద్యుత్తు, నీటి చార్జీలు, పాలన వంటి సామాన్యుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. లోక్‌పాల్ బిల్లు, స్వరాజ్ బిల్లు తమ ఎజెండాలో ఉన్నప్పటికీ నిత్య జీవితంలో సామాన్యులు ఎదుర్కొనే సమస్యలకు అంటే విద్యుత్తు, నీటి చార్జీల వంటి అంశాలకు ఎన్నికల ప్రచారంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఆప్ ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు, నీటి చార్జీలు తగ్గించిన విషయాన్ని, చిన్న చిన్న సమస్యలకు ఇబ్బందిపెట్టే లంచగొండి అధికారులను పట్టించేందుకు హెల్ప్‌లైన్లను ఏర్పాటుచేసిన విషయాన్ని ప్రజలు గుర్తించారని వారు పేర్కొన్నారు. తమ పార్టీ గద్దె దిగిన తరువాత చార్జీలు పెరగడం, లంచగొండితనం మళ్లీ పెరగడం సామాన్యులకు ఆగ్రహం తెప్పించిందని, అందుకే ఈ అంశాలకు ఎన్నికల ప్రచారంలో అధిక ప్రాధాన్యాన్ని ఇస్తామని ఆప్ నేతలు చెప్పారు. నల్లధనంపై బీజేపీ అనుసరించిన రెండు నాల్కల ధోరణిని, ఎయిమ్స్ సీవీఓ సంజీవ్ చతుర్వేదీ బదిలీ, మున్సిపాలిటీలలో అవినీతిని ఎన్నికలలో ప్రచారాంశాలుగా చేసుకోనున్నట్లు వారు చెప్పారు.
ఇక దృష్టంతా ఢిల్లీపైనే..!
Published Thu, Nov 6 2014 10:30 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement