ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల బేరం!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోందన్న వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ ఆ పార్టీపై ఆరోపణస్త్రాలను ఎక్కుపెట్టారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనే ప్రయత్నం చేస్తోందని, ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయల ఇస్తానంటూ ప్రలోభపెడుతోందని ఆరోపిస్తూ మంగళవారం ఆడియో విడుదల చేశారు. రికార్డు చేసిన ఈ ఆడియో సందేశం బుధవారం రేడియోలో ప్రకటనల రూపంలో ప్రసారమైంది. ఇదిలాఉండగా ట్విటర్‌లో కూడా ఆరోపణలను కొనసాగించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చడంలో విపలమైన బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేప్రయత్నం చేస్తుందంటూ ట్వీట్ చేశారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ప్రలోభపెట్టి తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వచూపడంతోపాటు ఇద్దరికి మంత్రి పదవులను, నలుగురికి చైర్మన్ పదవులను ఆశచూపిందని ట్విటర్లో ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి బీజేపీ అనైతిక పద్ధతులను అనుసరిస్తోందన్నారు. ఇది పూర్తిగా తప్పని, వందలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, ఇటువంటి అక్రమ పద్ధతులతో ఏర్పాటుచేసే నిజాయితీలేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులను, ధరలను పెంచుతుందని, అవినీతికి పాల్పడుతుందని 45 సెకన్ల హిందీ ప్రసంగంలో ఆరోపించారు. ఇటువంటి ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించలేదన్నారు. నరేంద్ర మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. రికార్డు చేసిన ఈ సందేశాన్ని వివిధ వేదికల ద్వారా ప్రజలకు చేరవేయనున్నట్లు ఆప్ నేతలు తెలిపారు. మై అరవింద్ కేజ్రీవాల్ బోల్ రహాహూ.. అంటూ బుధవారం ఈ సందేశం రేడియోలో ప్రకటనల రూపంలో ప్రసారమైంది.
ఖండించిన బీజేపీ...
కేజ్రీవాల్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అధికారం దూరమైందన్న నిరాశతోనే కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. కే జ్రీవాల్ తన మానసిక స్థితిని ఓసారి పరీక్షించుకోవాలని ఢిల్లీ ఎంపీ రమేశ్ బిధూరీ ఎదురుదాడి చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం, అబద్దాలాడడం కేజ్రీవాల్‌కు అలవాటని, అందువల్ల వాటిని తాను పట్టించుకోనని బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ అన్నారు. కేజ్రీవాల్ ఆరోపణలపై స్పందించడం వృథా అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక్కటిగా ఉన్నారని, ముందు ఆప్ నేతలను కేజ్రీవాల్ కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రతినిధి ముకేశ్ శర్మ హితవు పలికారు. తమ పార్టీ ఎమ్మెల్యేల్లో అధికులు మైనారిటీ వర్గాలకు చెందినవారని, వారు బీజేపీలో చేరబోరని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
మళ్లీ పోస్టర్ వార్ షురూ..!
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనుసరించిన పోస్టర్ సూత్రాన్నే ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ అమలు చేస్తోంది. ఢిల్లీలో తన ఉనికిని చాటుకుని మరోసారి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలోభాగంగా అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సోమవారంతో 49 రోజులను పూర్తిచేసిన నేపథ్యంలో.. ఆప్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో రాష్ట్రపతిపాలన కొనసాగుతుండడంతో నరేంద్ర మోడీ 49 రోజుల పాలన, తన 49 రోజుల పాలనలో ఏది మేలని ఈ పోస్టర్ల ద్వారా ప్రజలను అడుగుతోంది.
ఎవరి పాలన మేలన్న ప్రశ్నతో రూపొందించిన పోస్టర్లను ఆప్ ఆటోరిక్షాల వెనుక అంటించి ఢిల్లీవాసులను ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలియచేయడం కోసం ఆప్ పోస్టర్లలో ఓ టెలీపోన్ నంబర్‌ను కూడా చేర్చింది. ఢిల్లీలో ఎన్నికలు జరిగే అవకాశాలుండడంతో ప్రజల్లో కోల్పోయిన తన పట్టును సాధించడం కోసం ఒక్కో నియోజకవర్గంలో 2000 పోస్టర్లు అంటించాలనుకుంటోంది. ఒక్కో నియోజకవర్గంలో తమకు మద్దతు ఇచ్చే 200 మంది ఆటో డ్రైవర్లకు పోస్టర్లు అందచేస్తోంది.