‘ఢిల్లీకి పూర్తి హోదా’ ప్రకటన చేస్తారా.. | Delhi full statehood: Kejriwal challenge to Modi catches BJP on the wrong foot | Sakshi
Sakshi News home page

‘ఢిల్లీకి పూర్తి హోదా’ ప్రకటన చేస్తారా..

Published Fri, Jan 9 2015 10:27 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Delhi full statehood: Kejriwal challenge to Modi catches BJP on the wrong foot

సాక్షి, న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ నిలబెట్టుకోవాలని ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేడో,రేపో అన్నట్లు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలకు మరింత ఉత్సాహం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రామ్‌లీలా మైదాన్‌లో ర్యాలీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

కాగా, దీనిపై కేజ్రీవాల్ శుక్రవారం ట్విటర్‌లో స్పందించారు. ఈ ర్యాలీలో నరేంద్రమోదీ ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇస్తానని ప్రకటన చేస్తారా అని ప్రశ్నించారు. ‘ రేపు మోదీజీ ఢిల్లీవాసులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. ఆయన రేపు దానిని ప్రకటిస్తారా? లేక ఈ విషయంలో కూడా ఆ పార్టీ యూటర్న్ తీసుకుంటుందా? అని కేజ్రీవాల్ ట్విటర్‌పై ప్రశ్నించారు. విద్యుత్తు చార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించింది.

ప్రధాని మోదీ దానిపై కూడా ఒక ప్రకటన చేస్తారని ఢిల్లీవాసులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని కేజ్రీవాల్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని మొట్ట మొదటిసారి శనివారం ఢిల్లీవాసులను ఉద్ధేశించి ప్రసంగించనున్నారని, ఆయననుంచి ఏం ఆశిస్తున్నారో ఢిల్లీవాసులు తమకు ట్వీట్ ద్వారా తెలియచేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ట్వీట్ చేసింది.
 ప్రతిదానిపై ఆర్డినెన్స్ తెచ్చే మోడీ సర్కారు ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆప్ నేత మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఢిల్లీకి పూర్తి రాష్ట్రహోదా ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసినప్పటికీ,  కేంద్రం పూర్తి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని వస్తోన్న వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ సవాలు విసిరారని భావిస్తున్నారు. ఢిల్లీకి పూర్తిరాష్ట్ర హోదా కల్పిస్తే ఢిల్లీ ప్రభుత్వానికి ఢిల్లీ పోలీసుపై అధికారాన్ని, ఢిల్లీలో భూమిపై అధికారాన్ని   బదిలీచేయాల్సి ఉంటుందని, దానికి కేంద్రం ససేమిరా సుముఖంగా లేదని ఒక ఆంగ్ల దినపత్రిక గురువారం ప్రచురించింది.

ఇదిలా ఉండగా, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోద ా కల్పించడంపై రామ్‌లీలామైదాన్ ర్యాలీలో మోదీ ప్రకటన చేయాలని ఢిల్లీ బీజేపీకి చెందిన సీనియర్ నేతలు కోరుతున్నారని తెలుస్తోంది. కాగా, కేజ్రీవాల్ ట్వీట్‌కు బీజేపీ కూడా కూడా ప్రతిస్పందించింది. ఢిల్లీలో మోదీ ర్యాలీ గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నట్లుగా ఉందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement