గతిలేకనే విధానసభ రద్దు నిర్ణయం
న్యూఢిల్లీ: తమ పార్టీ ఎమ్మెల్యేలను తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని, ఢిల్లీ విధానసభను కేంద్ర మంత్రి మండలి రద్దు చేయడానికి ఇదే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో సహచర నేతలతో కలసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈసారి జరిగే ఎన్నికల్లో తమ పార్టీ45 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏదోవిధంగా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావించిందని, అయితే ఆ పార్టీ ప్రయత్నాలను తమ ఎమ్మెల్యేలు వమ్ము చేశారంటూ వారందరినీ అభినందించారు. ‘ఇప్పటికి నాలుగు పర్యాయాలు తమ పార్టీ ఎమ్మెల్యేలను వారివైపు తిప్పుకునేందుకు యత్నించారు. ఇటువంటి అసమంజస ధోరణికి మా పార్టీ ఎమ్మెల్యేలు తలొగ్గలేదు. వక్రమార్గాల ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ శతవిధాలా యత్నించింది. ఆ యత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. చివరికి న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. దీంతో విధిలేని పరిస్థితుల్లోనే కేంద్ర మంత్రిమండలి విధానసభ రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది’అని అన్నారు.
వీడియో క్లిప్ ప్రస్తావన
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తమ పార్టీ మీడియాకి చూపిన వీడియో క్లిప్ అంశాన్ని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రస్తావించారు. అందులో బీజేపీ రాష్ర్ట శాఖ ఉపాధ్యక్షుడు షేర్‌సింగ్ దగార్... ఆప్ ఎమ్మెల్యేకి రూ. నాలుగు కోట్లతో ఎర వేసేందుకు యత్నిస్తున్న దృశ్యాలున్న విషయం విదితమే. దీంతో అప్పట్లో షేర్‌సింగ్ దగార్‌కి బీజేపీ... షోకాజ్ నోటీసును జారీచేసింది. ఈ విషయమై అరవింద్ మాట్లాడుతూ ఇలా వక్రమార్గాన ప్రభుత్వ ఏర్పాటుకు చేసిన యత్నాలు విఫలం కావడం దేశచరిత్రలో బహుశా ఇది తొలిసారి కావచ్చని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీవాసుల ఆశీస్సులు మాకే
త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో నగరవాసుల ఆశీస్సులు తమ పార్టీకే ఉంటాయంటూ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ‘కనీసం 45 స్థానాలను కైవసం చేసుకుంటాం’అని అన్నారు. కాగా గత ఎన్నికల్లో ఆ పార్టీ 28 స్థానాలను దక్కించుకున్న సంగతి విదితమే.
అవినీతి రహిత పాలనను అందిస్తాం
‘తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలనను అందిస్తామని ఆప్ అధినేత అరవింద్ పేర్కొన్నారు. ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా మారుస్తామన్నారు. కాగా త్రిలోక్‌పురి పరిసరాల్లో ఉద్రిక్తల విషయమై మాట్లాడుతూ విద్వేష రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.