పిలిచారు గానీ.. మాట్లాడనివ్వలేదు
ట్రిపుల్ తలాక్ విషయమై జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన ఓ సెమినార్‌కు తనను పిలిచారు గానీ, అక్కడ మాట్లాడనివ్వలేదని బీజేపీ నాయకురాలు షాజియా ఇల్మీ ఆరోపించారు. తాను బీజేపీలో ఉండటం వల్లే దీనిపై మాట్లాడేందుకు అనుమతించలేదని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, దానిపై విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందని.. కానీ నిర్వాహకులపై ఒత్తిడి ఉందని అన్నారు. తాను మాట్లాడితే అది క్యాంపస్‌లో లేనిపోని ఉద్రిక్తతలకు కారణం అవుతుందని వాళ్లు భావించి ఉంటారని ఆమె తెలిపారు.
రాజకీయాల్లో ద్వంద్వ ప్రమాణాలు, హిపోక్రసీ ఉండకూడదని.. కేవలం బీజేపీలో ఉన్నానన్న కారణంతోనే అడ్డుకున్నారని ఇల్మీ అన్నారు. ఇప్పటివరకు తాను ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని, హింసకు వ్యతిరేకంగానే మాట్లాడతానని, అన్నా హజారే ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించానని గుర్తుచేశారు. అలాంటిది తనను వాళ్లు ఎందుకు అనుమానించి, ఇలా అవమానించారని ప్రశ్నించారు. ఇలా పార్టీల ఆధారంగా వివక్ష చూపడం సరికాదని తెలిపారు. నిర్వాహకులు కార్యక్రమ షెడ్యూలును మార్చడం, ఇల్మీని వక్తల జాబితాలో నుంచి తొలగించడంతో యూనివర్సిటీలో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి.