ఘజియాబాద్ బరిలో షాజియా
Published Sat, Mar 15 2014 10:57 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షాజియా ఇల్మీని బరిలోకి దింపనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. షాజియా ఇల్మీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్.కె. పురం నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్పఓట్ల తేడాతో ఓడిపోయారు. ఢిల్లీలో పార్టీ టికెట్లు ఇచ్చిన తీరుపై అసంతృప్తి ప్రకటించిన షాజియా ఇటీవల వార్తల్లో ఎక్కారు. పార్టీ ఆమెను రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీకి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపాలనుకున్నా, ఆమె ఢిల్లీ నుంచి టికెట్ ఆశించారు. పార్టీ తనకు ఏడింటిలో ఏ ఒక్క నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడంతో నిరాశ చెందారు. తాను ఢిల్లీవాసినని, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయబోనని ప్రకటించారు. కుటుంబ కారణాల వల్ల తాను ఢిల్లీకి దూరంగా ఉన్నప్పటికీ, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని మీడియాకు తెలిపారు.
న్యూఢిల్లీ లేదా దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేయడంపైనే ఆసక్తి ఉందని ఆమె చెప్పారు. న్యూఢిల్లీ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబడిన ఆశిష్ ఖైతాన్ తరపున ప్రచారం చేస్తానని కూడా షాజియా ప్రకటించారు. ఈమె అసంతృప్తిని గమనించిన ఆప్ పీఏసీ ఆమెకు ఘజియాబాద్ టికెట్ ఇచ్చి బుజ్జగించింది. ఘజియాబాద్‌లో ఆప్ బలంగా ఉంది. పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్ తదితరుల నివాసాలతోపాటు పార్టీ కార్యాలయమూ ఇక్కడే ఉంది. ఘజియాబాద్ నుంచి కాంగ్రెస్ నటుడు రాజ్‌బబ్బర్‌కు టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన మళ్లీ ఘజియాబాద్ నుంచి పోటీ చేయడానికి వెనుకాడుతున్నారు. ఘజియాబాద్‌లో ఆప్ ప్రభావం అధికంగా ఉన్నందువల్ల ఆయన ఇక్కడ నుంచి పోటీకి సంకోచిస్తున్నారని అంటున్నారు.
Advertisement