చీపురు వదిలేశారు | Shazia Ilmi resigns from AAP? | Sakshi
Sakshi News home page

చీపురు వదిలేశారు

Published Sat, May 24 2014 11:08 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

చీపురు వదిలేశారు - Sakshi

చీపురు వదిలేశారు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో డీలాపడిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు వ్యవస్థాపక సభ్యులు రాజీనామా చేశారు. అధిష్టానం తీరుపై ఈ సందర్భంగా వారిరువురూ మండిపడ్డారు. అరవింద్ చుట్టూచేరిన కొందరు పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నారని షాజియా ఇల్మి విమర్శించగా, అధిష్టానం వైఖరి కారణంగా పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయని గోపీనాథ్ తప్పుబట్టారు. అందువల్లనే తాము రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.  
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు, జాతీయ ప్రతినిధి షాజియా ఇల్మి ఆ పార్టీని వీడారు. శనివారం ఉదయం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ చుట్టూచేరిన కొందరు పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. పార్టీ అనేక తప్పిదాలు చేసిందని ఆమె విమర్శించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీ నామా చేస్తున్నట్లు ఇల్మి పేర్కొన్నారు. అత్యంత బాధతో పార్టీని వీడుతున్నానని, ఏ ఉద్యమానికి, ఏ పార్టీకి తాను మొదటినుంచి ముడిపడిఉన్నానో వాటితో తాను తెగతెంపులు చేసుకుంటున్నానని చెప్పారు. స్వరాజ్యం గురించి మాట్లాడే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని ఆమె విమర్శించారు. పార్టీని కొందరు గుప్పిట్లో పెట్టుకున్నారని, వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
 
 అయితే వారెవ రనే విషయం మాత్రం ఆమె స్పష్టం చేయలేదు. కేజ్రీవాల్‌ను కలవడం తనకే కష్టంగా ఉందని, ఇక  కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని సులువుగా ఊహించుకోవచ్చని ఆమె చెప్పారు. తాను సందేశం పంపిన వ్యక్తి చెప్పిన మాటలను అరవింద్ వినిపిం చుకోలేదని ఆమె ఆరోపించారు. తిరుగుబాటు స్వరం వినిపించినందుకు తనను పక్కనబెట్టారని, పార్టీ విధాన నిర్ణయ ప్రక్రియలో తనకు చోటులేకుండా చేశారని ఆమె చెప్పారు. పార్టీ నిర్ణయాలను తాను ఐదారు నెలలుగా ప్రశ్నిస్తున్నానన్నారు. పార్టీలో అనేకమంది తనలాగే అసంతృప్తితో ఉన్నారని ఆమె చెప్పారు. తాను రాజీనామా చేస్తే పార్టీలో కనీసం అంతర్మథనమైనా జరుగుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఘజియాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల  బరిలోకి దిగి ఓడిపోయినందుకు మాత్రం రాజీనామా  చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఎన్నిక ల్లో గెలుపు ఓట ములు అత్యంత సహజమేనని ఆమె చెప్పారు. అయితే ఎన్నికల సమయంలోనే తనకు రాజీనామా చేయాలనిపిం చిందని, అయితే పార్టీకి నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో మౌనం వ హించానని ఆమె చెప్పారు.
 
 కాగా షాజియా ఇల్మి... ఢిల్లీ  నుంచి పోటీచేయాలనుకున్నారు. అయితే అధిష్టానం ఆమెను సోనియా గాంధీకి వ్యతిరేకంగా రాయ్‌బరేలీ నుంచి నిలబెట్టాలనుకుందని, అందుకు నిరాకరించిందనే వార్తలొచ్చాయి. ఢిల్లీ నుంచి టికెట్ ఇవ్వలేదని ఆగ్రహించిన షాజియాను సంతృప్తిపరచడం కోసం ఆమెను ఘజియాబాద్  నుంచి నిలబెట్టారు. ఆమె ఘజియాబాద్ నుంచి మనస్ఫూర్తిగా పోటీ చేయలేదనే వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయమై ఇల్మి మాట్లాడుతూ కేజ్రీవాల్ తన తరపున ప్రచారం చేయకపోవడం కూడా ఆగ్రహం తెప్పించిందన్నారు. ఈ ఎన్నికల్లో ఇల్మి డిపాజిట్ కూడా కోల్పోయారు. అంతకు ముందు శాసనసభ ఎన్నికల్లో ఆర్.కె.పురం స్థానం నుంచి పోటీచేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.
 
 చీటికిమాటికి ఆందోళనలు సరికాదు
 సంచలనాలను సృష్టించడం వల్ల మొదట్లో కొంత లాభం కలిగినప్పటికీ చీటికిమాటికి ధర్నాలు, ప్రదర్శనలు చేయడం సరికాదంటూ షాజియా ఆప్ విధానాలను విమర్శించారు. ప్రతిసారి  రాజకీయ నేతపైనో, కార్పొరేట్ హౌస్‌పైనో ఆరోపణలు చేయడం అవసరమా అని ఆమె  ప్రశ్నించారు. పార్టీ దిశాహీనంగా మారిందని ఆమె ఆరోపించారు. ప్రజలు కూడా ధర్నాలతో విసిగిపోయారని ఆమె చెప్పారు.  జైలు,  బెయిలు రాజకీయం కూడా సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.  ఆప్ కన్వీనర్  అర్వింద్ కేజ్రీవాల్  వ్యక్తిగత పూచీకత్తు చెల్లించడానికి నిరాకరించి జైలు లో ఆత్మచింతన చేసుకోవడానికి బదులు నలుగురి గుప్పిటి నుంచి విముక్తి పొంది జనం మధ్యలోకి వెళ్లి అంతర్మధనం చేసుకోవాలని ఆమె సూచించారు. అర్వింద్ కేజ్రీవాల్ అన్నా, నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలన్నా తనకు  ఇంకా గౌరముందని ఆమె చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని ఆమె చెప్పారు. పార్టీ తనకు  సముచితమైన పాత్ర కల్పిస్తే తిరిగి పార్టీలో చేరడానికి అభ్యంతరం లేదని తెలిపారు.
 
 నచ్చజెప్పేందుకు యత్నించాం
 షాజియా ఇల్మీ ఆరోపణలపై  పార్టీ నేత యోగేంద్ర యాదవ్ ప్రతిస్పందిస్తూ షాజియా రెండు నెలలుగా ఆగ్రహంతో ఉన్నట్లు అంగీకరించారు. ఆమె తన ఆగ్రహాన్ని పార్టీ  జాతీయ కార్యవర్గ సమావేశంలో వెల్లడించారని, లేఖ కూడా రాశారని ఆయన చెప్పారు. షాజియా పార్టీని వీడనున్నట్లు తెలిసిన తరువాత ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశామని ఆయన చెప్పారు. షాజియా మనసు మార్చుకుని రెండు నెలలలో తిరిగి వస్తారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. షాజియా లేవనెత్తిన అంశాలను పార్టీ పరిశీలిస్తుందని చెప్పారు. షాజియా  రాజీనామా చేసిన సమయం సరిగ్గా లేదని  యాదవ్ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ కారాగారం నుంచి బయటకు వచ్చిన తరువాత రాజీనామా చేసి ఉండాల్సిందని ఆయన చెప్పారు. షాజియాకు ప్రశ్నించే హక్కు ఉందని, కానీ ఆమె తొందరపడ్డారని యాదవ్ వ్యాఖ్యానించారు.
 
 ఇల్మి నివాసానికి సోమ్‌నాథ్
 షాజియాకు నచ్చచెప్పడం కోసం శనివారం ఉదయం వరకు పార్టీప్రయత్నించింది. ఆప్ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి శనివారం ఉదయం షాజియా నివాసానికి వెళ్లి ఆమెకు నచ్చజెప్పేందుకు యత్నించారు.  ఆ తరవాత విలేకరులతో మాట్లాడుతూ షాజియా కోపంతో లేదని కూడా ప్రకటించారు.
 
 అదేబాటలో గోపీనాథ్..
 దేశంలో మొట్టమొదటిచౌక విమానయాన సంస్థను ప్రారంభించిన వ్యాపారవేత్త గోపీనాథ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పనితీరు పట్ల తనకు అభ్యంతరాలున్నాయని, నితిన్ గడ్కరీ పరువునష్టం దావాలో ధరావత్తు చెల్లించకుండా కేజ్రీవాల్ కారాగారానికి వెళ్లడంతో ఈ నిర్ణయానికి వచ్చానని  గోపీనాథ్ వివరించారు. తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చే స్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు కారణం పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల అంతర్గత విభేదాలు నానాటికీ పెరిగిపోతుండడమేనన్నారు.
 కాగా ఈ ఏడాది జనవరిలో గోపీనాథ్... ఆప్‌లో చేరిన సంగతి విదితమే.
 
 తన మనోభావాలను గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా మీడియా ముందుంచానన్నారు. ఆప్ మున్ముందు మరింత ఎదగాలని కోరుకుంటున్నట్టు ఫ్రాన్స్‌లోని టౌలౌజ్‌లో ఉన్న ఆయన ఫోన్‌లో చెప్పారు. వాద్రాపై అర్వింద్ అవినీతి ఆరోపణలు చేసినపుడు బీజేపీ ఎంతో సంతోషించిందన్నారు. ఆ తర్వాత అర్వింద్... నితిన్ గ డ్కారీపై విమర్శలకు దిగారన్నారు. కాగా 2003వ సంవత్సరంలో ఎయిర్ డక్కన్ పేరిట దేశంలోనే తొలిసారిగా చవక విమాన సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత ఆ సంస్థను విజయ్‌మాల్యా కొనుగోలు చేసి దానికి కింగ్ ఫిషర్ రెడ్‌గా నామకరణం చేశారు. అది ప్రస్తుతం మూతపడిన సంగతి విదితమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement