
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) మాజీ ఎంపీ అక్బర్ అహ్మద్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ బీజేపీ ఢిల్లీ ఉపాధ్యక్షురాలు షాజియా ఇమ్లి పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రైవేటు పార్టీలో తనను బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. ‘‘సౌత్‌వెస్ట్ ఢిల్లీలో వసంత్ కుంజ్‌లో ఫిబ్రవరి 5న జరిగిన ఓ డిన్నర్ పార్టీలో అక్బర్ అహ్మద్ తప్పుగా ప్రవర్తించారు. చేతన్ సేత్ పార్టీకి హాజరైన ఆయన నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. చేతన్ సేత్, ఆయన కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా నీచంగా వ్యవహరించారు.
హిందీలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని పబ్లిక్ చేయాలనుకోలేదు. అలా అని ఆయనను అలాగే వదిలిపెట్టకూడదు. లేదంటే అలాంటి వాళ్లు మరింతగా రెచ్చిపోతారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను’’అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనపై సెక్షన్ 506(బెదిరించడం), 509(మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడం) కింద ఫిబ్రవరి 7న కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసుపై అక్బర్ అహ్మద్ ఇంతవరకు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment