BSP MP
-
లోక్‌సభలో డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కలకలం రేపాయి. గురువారం రాత్రి లోక్‌సభలో తమ పార్టీ ఎంపీ బిధూరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానమివ్వాలని ఎంపీ బిధూరీని ఆదేశించింది. ఎంపీ బిధూరి వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. బిధూరి వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ముస్లిం ఎంపీని ఉద్దేశిస్తూ చేసిన అన్ పార్లమెంటరీ వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. సదరు ఎంపీని సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. రమేశ్ బిధూరీకి బీజేపీ షోకాజ్ నోటీసు ఇవ్వడం, మంత్రి రాజ్‌నాథ్ క్షమాపణ చెప్పడం సరే కానీ, సదరు ఎంపీపై సరైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే నేతలు రమేశ్ బిధూరి వ్యాఖ్యల విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రివిలేజ్ కమిటీకి నివేదించండి: స్పీకర్‌కు డానిష్ అలీ లేఖ లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి తనను అసభ్య పదజాలంతో దూషించడం విద్వేష ప్రసంగం కిందికే వస్తుందని, విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. విద్వేష ప్రసంగం వినడానికి ప్రజలు తనను పార్లమెంట్‌కు పంపలేదన్నారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేయించాలని స్పీకర్‌ను కోరారు. బిధూరిపై చర్యలు తీసుకోకుంటే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎంపీ బిధూరి వాడిన అత్యంత దుర్మార్గమైన భాష తీరని వేదన కలిగించిందన్నారు. అవి లోక్‌సభ రికార్డులో భాగమని కూడా తెలిపారు. ‘ఇది అత్యంత దురదృష్టకరం. స్పీకర్‌గా మీ నేతృత్వంలోని పార్లమెంట్ కొత్త భవనంలో ఇలా జరగడం ఈ గొప్ప దేశంలోని మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీగా నాకు తీవ్ర హృదయ వేదన కలిగించింది’అని డానిష్ అలీ తెలిపారు. విచారణ జరిపి నివేదిక అందించేందుకు లోక్‌సభ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్లోని రూల్ నంబర్ 227 కింద ప్రివిలేజ్ కమిటీకి ఈ విషయాన్ని రెఫర్ చేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు. -
‘బీజేపీ నేతపై చర్యలు తీసుకోకపోతే’.. బీఎస్పీ ఎంపీ కన్నీటి పర్యంతం
న్యూఢిల్లీ: తనపై మతపరమైన దూషణలు చేసిన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్యలు చేపట్టకపోతే లోక్‌సభకు రాజీనామా చేసేందుకు సిద్ధమని బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీ స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధి అయిన తనకే ఇంత అవమానం జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు బీఎస్పీ ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. తన మైండ్ బద్దలు అయ్యేలా ఉందని, ఈరోజు రాత్రి నిద్ర కూడా పట్టేలా లేదని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. బిధురి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశానని బీఎస్పీ ఎంపీ తెలిపారు. స్పీకర్‌గా మీ నేతృత్వంలో నూతన పార్లమెంట్ భవనంలో ఇలా జరగడం దురదృష్టకరమని లేఖలో ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. బిధూరిపై చర్యలు తీసుకుని తన హక్కులను కాపాడనిపక్షంలో లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతానని పేర్కొన్నారు. చదవండి: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం ‘ప్రజలు ఎన్నుకున్న ఎంపీలను వారి మతాలతో ముడిపెట్టి దాడి చేయడానికే ఈ ప్రత్యేక సమావేశాలకు పిలిచారా?. ఇది మొత్తం దేశానికే సిగ్గుచేటు. సొంత పార్టీ ఎంపీపై బీజేపీ ఏదైనా చర్య తీసుకుంటుందో లేదా అతన్ని వెనకేసుకొస్తుందో చుద్దాం.. ఇదొక ద్వేషపూరిత ప్రసంగం’ అని పేర్కొన్నారు. మరోవైపు బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ ఎంపీ రమేష్ బిధురికి బీజేపీ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు 25 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ కోరింది. అదే విధంగా ముస్లిం ఎంపీని కించపరిచేలా మాట్లాడిన రమేష్ బిధురిని స్పీకర్ ఓంబిర్లా తీవ్రంగా మందలించారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కాగా చంద్రయాన్ విజయంపై లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీని ఉద్ధేశిస్తూ.. సౌత్ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డానిష్ అలీని ఉగ్రవాదిగా చిత్రీకరిస్తూ అభ్యంతరకర పదాలు ఉపయోగించారు. మైనార్టీ ఎంపీపై బీజేపీ లోక్‌సభ సభ్యుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయపరంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీ సభ్యుడి ప్రవర్తనపై విపక్షాలు భగ్గుమన్నాయి. బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: చంద్రయాన్ -3: ఇస్రో కీలక అప్డేట్ -
సంచలన ఘటన.. రేప్ కేస్‌లో అతుల్ రాయ్ నిర్దోషి!
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎంపీ అతుల్ రాయ్‌కు ఊరట లభించింది. అత్యాచార కేసులో ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది వారణాసి కోర్టు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోసి నియోజకవర్గంలో బీఎస్పీ తరపున భారీ మెజార్టీతో గెలిచాడు అతుల్ రాయ్. అయితే.. గెలిచిన తర్వాతే రేప్ కేసులో పోలీసులకు లొంగిపోయాడు. 2019లో తూర్పు యూపీకి చెందిన 24 ఏళ్ల యువతి.. అతుల్‌రాయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. 2018లో వారణాసిలోని తన ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈలోపు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చేదాకా పోలీసులను తప్పించుకుంటూ తిరిగాడు అతుల్ రాయ్. నెల రోజుల తర్వాత.. 2019 జూన్‌లో అతుల్ రాయ్ పోలీసులకు లొంగిపోయాడు. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నాడు. అయితే.. ► సుప్రీం కోర్టు పెరోల్‌కు అనుమతి ఇవ్వగా.. అలహాబాద్ హైకోర్టు రెండు రోజుల పెరోల్ ఇవ్వడంతో BSP MP Atul Rai పార్లమెంటేరియన్‌గా ప్రమాణం చేశాడు. ఆపై తిరిగి జైలుకే వెళ్లాడు. ► నవంబర్ 2020లొ అతుల్ రాయ్ సోదరుడు బాధితురాలి మీద ఫోర్జరీ కేసు నమోదు చేశాడు. అయితే అత్యాచార కేసు వాపసు తీసుకునేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయింది ఆమె. అయితే కోర్టు ఆమె వాదనను పట్టించుకోలేదు. ఆగస్టు 2021లో ఆమెకు వ్యతిరేకంగా నాన్ బెయిల్ వారెంట్‌ను జారీ చేసింది. ► ఆ బాధతో ఆమె, ఆమె స్నేహితుడు సుప్రీం కోర్టు ముందు ఆగష్టు 16, 2021న నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అంతేకాదు ఆ అఘాయిత్యాన్ని ఫేస్బుక్ లైవ్‌లో స్ట్రీమ్ చేశారు కూడా. ► ఆత్మహత్యాయత్నానికి ముందు పలువురు పోలీస్ అధికారులు, జడ్జిలు రాయ్‌తో కుమ్మకు అయ్యారంటూ వాళ్ల పేర్లను సైతం గట్టిగా అరిచి చెప్పారు వాళ్లు. ► ఐదు రోజుల తర్వాత ఆమె స్నేహితుడు, మరో మూడు రోజుల తర్వాత బాధితురాలు మృతి చెందారు. ► అయితే అత్యాచార కేసులో అతుల్‌రాయ్‌కు ఊరట లభించినా.. జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు ఇప్పట్లో లేవు. ► అందుకంటే.. బాధితురాలిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు కారణంగా జైల్లో గడపాల్సిందే. ► జులైలో ఎంపీ అతుల్‌రాయ్ బెయిల్ కోసం అలహాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయినా కోర్టు ఊరట ఇవ్వలేదు. ఇప్పుడు వారణాసి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అత్యాచార కేసులో రాయ్‌ను నిర్దోషిగా ప్రకటించారు. ఇదీ చదవండి: అత్యాచారానికి గురైన మైనర్.. మగ బిడ్డకు జననం.. 27 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి తల్లి కోసం కొడుకు పోరాటం -
‘ఆ పార్టీలో నాతో అసభ్యంగా ప్రవర్తించారు’
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) మాజీ ఎంపీ అక్బర్ అహ్మద్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ బీజేపీ ఢిల్లీ ఉపాధ్యక్షురాలు షాజియా ఇమ్లి పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రైవేటు పార్టీలో తనను బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. ‘‘సౌత్‌వెస్ట్ ఢిల్లీలో వసంత్ కుంజ్‌లో ఫిబ్రవరి 5న జరిగిన ఓ డిన్నర్ పార్టీలో అక్బర్ అహ్మద్ తప్పుగా ప్రవర్తించారు. చేతన్ సేత్ పార్టీకి హాజరైన ఆయన నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. చేతన్ సేత్, ఆయన కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా నీచంగా వ్యవహరించారు. హిందీలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని పబ్లిక్ చేయాలనుకోలేదు. అలా అని ఆయనను అలాగే వదిలిపెట్టకూడదు. లేదంటే అలాంటి వాళ్లు మరింతగా రెచ్చిపోతారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను’’అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనపై సెక్షన్ 506(బెదిరించడం), 509(మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడం) కింద ఫిబ్రవరి 7న కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసుపై అక్బర్ అహ్మద్ ఇంతవరకు స్పందించలేదు. చదవండి: దిశ రవి బెయిలు పిటిషన్: జడ్జి కీలక వ్యాఖ్యలు -
ముజఫర్‌నగర్ అల్లర్లు: ఎంపీ, ఎమ్మెల్యేలపై చార్జ్‌షీట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌నగర్ మత ఘర్షణల కేసులో బీఎస్పీ ఎంపీ ఖదీర్ రాణా, ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు మరో ఏడుగురిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) శనివారం చార్జ్‌షీట్ కేసు దాఖలు చేసింది. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నరేంద్ర కుమార్ ఎదుట సీట్ శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. గతేడాది ఆగస్టు 30న ముజఫర్‌నగర్‌లోని కల్హపర్ ప్రాంతంలో సదరు ఆ పది మంది ముస్లిం నాయకుల ప్రసంగం మత విద్వేశాలను రెచ్చగొట్టేదిగా ఉందని సీట్ అభిప్రాయపడ్డింది. నాయకులు ప్రసంగంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.... ఆ ఉద్రిక్తతలు ఘర్షణలకు దారి తీసిందని పేర్కొంది. అదే అంశాన్ని సిట్ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు నూర్ సలీం రాణా, మౌలానా జమిల్, కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ఉజ్ జామ, అతని కుమారుడు సల్మాన్ సయ్యద్, ముజఫర్‌నగర్ పట్టణ సభ్యుడు అసద్, నౌషద్ ఖురేషి, వ్యాపారి అహ్షన్ ఖురేషి, సుల్తాన్ ముషిర్, నౌషద్లపై చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలో దాదాపు 60 మందికి పైగా మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘర్షణల నేపథ్యంలో అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లి ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. -
ఎంపీ ధనుంజయ్ బెయిల్ పిటీషన్ ను తోసిపుచ్చిన కోర్టు
న్యూఢిల్లీ: హత్య కేసుకు సంబంధించి బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్, అతని భార్య జాగృతి సింగ్ ల బెయిల్ అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. పని మనిషి హత్య కేసులో వీరిద్దరూ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇది వరకే మెజిస్టేరియల్ కోర్టు వీరి బెయిల్‌ను తిరస్కరించడంతో నిందితులు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. కేసులో నిజానిజాలు వినకుండా కింద కోర్టు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిందని సింగ్ సెషన్స్ కోర్టులో వాదనలు వినిపించారు. మెజిస్టేరియల్ కోర్టు తీర్పుతో ఏకీభవించిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ధర్మేష్ శర్మ వారి బెయిల్ పిటీషన్‌ను తోసిపుచ్చారు. పని మనిషి కొ్ట్టేందుకు భార్య జాగృతిని ఎంపీ తరుచు ప్రోత్సహించినందుకు బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.ధనుంజయ్ నివాసంలో పని మనిషిగా చేసిన రాఖీభద్ర హత్యకు గురికావడంతో వీరిని ఈ నెల 5న అరెస్టు చేశారు. -
పోలీసు కస్టడీకి బీఎస్పీ ఎంపీ
న్యూఢిల్లీ: పని మనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్, ఆయన భార్య జాగృతిలను విచారించేందుకు స్థానిక కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిన దృశ్యాల్లో కనిపించిన గుర్తు తెలియని వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు వీరి కస్టడీ అవసరమన్న పోలీసుల వాదనకు ఓకే చెప్పింది. ఈ నెల ఐదున తమ ఇంటిలోని పనిమనిషి రాఖీ భద్ర మృతి కేసులో అరెస్టయిన ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్పూర్ నియోజకవర్గ ఎంపీ ధనంజయ్, ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో దంత వైద్యురాలు జాగృతిల జ్యుడీషియల్ కస్టడీ పూర్తవడంతో శనివారం పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వీరిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే వీరి వాదనలు విన్న కోర్టు రెండు రోజుల విచారణకు మాత్రమే అనుమతించింది. అయితే నవంబర్ ఒకటి, నాలుగు తేదీల మధ్యలో ధనంజయ్ ఢిల్లీలోనే లేరని ఆయన తరఫు న్యాయవాది హరిహరన్ వాదించారు. గత రెండేళ్ల నుంచి దక్షిణ ఆవెన్యూ 175లోనే ధనంజయ్ ఉండటం లేదన్నారు. ఇప్పటికే ఐదు రోజులు పాటు పోలీసులు విచారించారని, కావున మళ్లీ కస్టడీకి ఇవ్వాల్సిన అసరం లేదని వాదించారు. -
పనిమనిషి హత్య కేసులో ఎంపీకి పోలీస్ కస్టడీ
పని మనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్, ఆయన భార్య జాగృతికి స్థానిక న్యాయస్థానం ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. వీరిద్దరినీ బుధవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరపరిచారు. ధనంజయ్ సింగ్, జాగృతి తీవ్ర కొట్టడంతో 35 ఏళ్ల పనిమనిషి మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ధనంజయ్ దంపతులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ లోక్‌సభ నియోజవర్గం నుంచి ధనంజయ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, జాగృతి ఓ ఆస్పత్రిలో డెంటల్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. ధనంజయ్, ఆయన భార్య కర్రలు, ఇనుప రాడ్లతో పనిమనుషులను తీవ్రంగా కొట్టినట్టు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో మరణించిన రాఖీది పశ్చిమబెంగాల్ రాష్ట్రం. గాయపడిన మరో ఇద్దరికి చికిత్స చేయిస్తున్నారు. నిందితులు వాడిన ఆయుధాలను, సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
పనిమనిషి హత్యకేసులో బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్ అరెస్టు
బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య జాగృతి తీవ్రంగా కొట్టడంతో 35 ఏళ్ల పనిమనిషి మరణించింది. మరో బాలికను కూడా ఇనుప రాడ్లు, కర్రలతో విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఈ కేసులో ముందుగానే జాగృతిని అరెస్టు చేసిన పోలీసులు.. అనంతరం సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలతో ఎంపీ ధనుంజయ్ సింగ్‌ను కూడా అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని సౌత్ ఎవెన్యూలోని బహుజన సమాజ్ పార్టీ ఎంపీ ధనుంజయ్ సింగ్ నివాసంలో పనిమనిషి రాఖీ (35) మంగళవారం తెల్లవారుజామున మరణించింది. ఆమె చేతులు, కాళ్లు, ఎద మీద తీవ్రంగా కొట్టినట్లు గాయాలు కనిపించాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ మహిళ మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముందుగా ఉదయం జాగృతిని 12 గంటల పాటు విచారించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై చాణక్యపురి పోలీసు స్టేషన్లో సెక్షన్లు 302, 307, 344 కింద కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు బాల కార్మికులను వెట్టి చాకిరీకి పెట్టుకున్నందుకు మరో కేసు పెట్టాలని కూడా పోలీసులు యోచిస్తున్నారు. ఇక ఇదే కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు ఎంపీ ధనుంజయ్ సింగ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీ భార్య తీవ్రంగా కొట్టి, హింసించినందువల్లే పనిమనిషి రాఖీ మరణించిందని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆమె సోమవారం ఉదయం 8.30కి మరణించినా, ఎంపీ మాత్రం పోలీసులకు 12 గంటల తర్వాత.. అంటే రాత్రి 8.30 గంటలకే తెలిపారు. వీళ్ల ఇంట్లోనే పనిచేస్తున్న మరో మైనర్ బాలికను కూడా జాగృతి తీవ్రంగా కొట్టింది. తాను ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గమైన జన్పూర్ పర్యటనలో ఉన్నానని, సోమవారం రాత్రే తిరిగి వచ్చానని ఎంపీ అంటున్నారు. -
ఎంపీ ఇంట్లో పని మనిషి అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీలోని సౌత్ ఎవెన్యూలోని బహుజన సమాజ్ పార్టీ ఎంపీ ధనుంజయ్ సింగ్ నివాసంలో మహిళ పనిమనిషి మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆ ఘటనపై పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ మహిళ మృతదేహన్ని పోలీసుల స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య జాగృతి సింగ్ హింసించడం వల్ల పని మనిషి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పనిమనిషి ఒంటి నిండా గాయాలు ఉన్నాయని తెలిపారు.అలాగే ఆమె తలకు తీవ్ర గాయమైనట్లు తాము గుర్తించామన్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ అసలు సంగతి బహిర్గతమవుతుందని పోలీసులు వెల్లడించారు. ధనుంజయ్ సింగ్ భార్య జాగృతి సింగ్ తరచుగా పని మనిషి రాకీని హింసించేదని తొటి పనిమనిషి రాంపాల్‌ను విచారించగా తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని జన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ధనుంజయ్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు.