పనిమనిషి హత్య కేసులో ఎంపీకి పోలీస్ కస్టడీ
పని మనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్, ఆయన భార్య జాగృతికి స్థానిక న్యాయస్థానం ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. వీరిద్దరినీ బుధవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరపరిచారు.
ధనంజయ్ సింగ్, జాగృతి తీవ్ర కొట్టడంతో 35 ఏళ్ల పనిమనిషి మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ధనంజయ్ దంపతులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ లోక్సభ నియోజవర్గం నుంచి ధనంజయ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, జాగృతి ఓ ఆస్పత్రిలో డెంటల్ సర్జన్గా పనిచేస్తున్నారు. ధనంజయ్, ఆయన భార్య కర్రలు, ఇనుప రాడ్లతో పనిమనుషులను తీవ్రంగా కొట్టినట్టు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో మరణించిన రాఖీది పశ్చిమబెంగాల్ రాష్ట్రం. గాయపడిన మరో ఇద్దరికి చికిత్స చేయిస్తున్నారు. నిందితులు వాడిన ఆయుధాలను, సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.