సాక్షి, వరంగల్/మహబూబాబాద్: తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవ ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలను బలి తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు బిడ్డలను కల్లు తాగిస్తానని తీసుకెళ్లిన తండ్రి.. ఇద్దరినీ వ్యవసాయ బావిలో తోసేశాడు. నీట ముని గి వాళ్లిద్దరూ చనిపోయారు. అక్కడి నుంచి వెళ్లి తానూ రైలు కింద పడి ఆత్మహత్య చేసు కున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి సమీ పంలోని గడ్డిగూడెం తండాలో మంగళవారం ఈ విషాద ఘటన జరిగింది. మరో వారంలో పుట్టిన జరుపుకోవాల్సిన బాలుడిని విగతజీవిగా చూసిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పిల్లలతో ఆట ఆడినట్టు నటించి..
మడ్డిగూడెంతండాకు చెందిన భూక్య రాంకుమార్ (31), అదే తండాకు చెందిన శిరీష 9 ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె అమీజాక్సన్ (7), కుమారుడు జానీ బెస్టో (3) జన్మించారు. రాంకుమార్‌కు సీఐఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం రావడంతో ఆరేళ్లుగా ముంబైలో ఉంటున్నారు. రాంకుమార్, శిరీషల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 4 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో భార్య శిరీష.. పిల్లలను విడిచిపెట్టి అదే తండాలో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది.
తండ్రి రాంకుమార్ ఇద్దరు పిల్లలను తన ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకొని కల్లు తాగిస్తానని తండాకు దూరంగా ఉన్న వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొద్దిసేపు పిల్లలతో ఆట ఆడినట్లు నటించి ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి తాను కూడా బావిలో దూకాడు. తర్వాత పిల్లలను బావిలోనే విడిచి పెట్టి తాను మాత్రం పైకి ఎక్కి ఏడ్చుకుంటూ తడి బట్టలతో బైక్‌పై పారిపోయాడు. దగ్గర్లో పని చేస్తున్న వాళ్లు ఇది గమనించి బావి దగ్గరకు వచ్చి చూడగా పిల్లల చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి గాలించగా ఇద్దరు పిల్లలు బావిలో విగతజీవులుగా కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వవడంతో కేసు నమోదు చేశారు.
పిల్లలు లేని జీవితం నాకెందుకు..
భార్యతో గొడవ పడి ఇద్దరు పిల్లలను బావిలో పడేసి వాళ్ల మరణానికి కారణమైన తండ్రి రాంకుమార్.. పిల్లలు లేని జీవితం తనకెందుకని ఎస్‌సీ గేట్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని భార్య శిరీష, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
17న జానీ పుట్టినరోజు
ఈ నెల 17న చిన్నారి జానీ బెస్టో పుట్టిన రోజు. పండుగకు, పుట్టినరోజుకు బట్టలు కొనేందుకు బుధవారం మహబూబాబాద్ వె ళ్లాలనుకున్నారు. ఇంతలోనే తండ్రి, ఇద్దరు బిడ్డలు కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆర్థికపరమైన గొడవలే కారణమా?
ఏడాది నుంచి ఇంటి ఖర్చులకు కూడా రాంకుమార్ డబ్బులు ఇవ్వకపోవడంతో భార్య నిలదీయసాగింది. శిరీషకు చెందిన 18 తులాల బంగారు ఆభరణాలు కూడా ఆయన తాకట్టుపెట్టాడు. జీతం రావడం లేదా అని భార్య అడిగితే బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని చెబుతూ వచ్చాడు. సమాధానం దాటవేస్తూ వస్తుండటం తో తన తమ్ముడు ధరావత్ సిద్ధు ద్వారా శిరీష బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించింది. దీంతో రాంకుమార్ రూ.15 లక్షలు బ్యాంకులో రుణం తీసుకున్నట్లు, రూ.40 వేల జీతంలో రూ.35 వేలు రుణం కింద కట్ అవుతున్నట్లు ఆమె తెలుసుకుంది.
రుణం ఎందుకు తీసుకున్నట్టు?
రాంకుమార్ బ్యాంకులో రూ.15 లక్షల రుణం ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ తెలియదు. ఇటు భార్యకు, అటు తల్లిదండ్రులకు కూడా రుణం విష యం చెప్పలేదు. అంతపెద్ద మొత్తం డబ్బు అతడికి ఎందుకు అవసరమైంది, ఎన్ని రోజులుగా బ్యాంకులో డబ్బు కట్ అవుతుందో స్పష్టత లేదు. భార్య కు అనుమానం వచ్చి ఆరా తీస్తే గానీ రుణం విషయం బయటపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment