న్యూఢిల్లీ: లోక్‌సభలో చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ సందర్భంగా బీఎస్‌పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కలకలం రేపాయి. గురువారం రాత్రి లోక్‌సభలో తమ పార్టీ ఎంపీ బిధూరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానమివ్వాలని ఎంపీ బిధూరీని ఆదేశించింది. ఎంపీ బిధూరి వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు.
బిధూరి వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ముస్లిం ఎంపీని ఉద్దేశిస్తూ చేసిన అన్ పార్లమెంటరీ వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. సదరు ఎంపీని సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఘటనపై బీఎస్‌పీ చీఫ్ మాయావతి స్పందించారు. రమేశ్ బిధూరీకి బీజేపీ షోకాజ్ నోటీసు ఇవ్వడం, మంత్రి రాజ్‌నాథ్ క్షమాపణ చెప్పడం సరే కానీ, సదరు ఎంపీపై సరైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ, టీఎంసీ, డీఎంకే నేతలు రమేశ్ బిధూరి వ్యాఖ్యల విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వేర్వేరుగా లేఖలు రాశారు.
ప్రివిలేజ్ కమిటీకి నివేదించండి: స్పీకర్‌కు డానిష్ అలీ లేఖ
లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి తనను అసభ్య పదజాలంతో దూషించడం విద్వేష ప్రసంగం కిందికే వస్తుందని, విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలని బీఎస్‌పీ ఎంపీ డానిష్ అలీ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. విద్వేష ప్రసంగం వినడానికి ప్రజలు తనను పార్లమెంట్‌కు పంపలేదన్నారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేయించాలని స్పీకర్‌ను కోరారు. బిధూరిపై చర్యలు తీసుకోకుంటే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎంపీ బిధూరి వాడిన అత్యంత దుర్మార్గమైన భాష తీరని వేదన కలిగించిందన్నారు.
అవి లోక్‌సభ రికార్డులో భాగమని కూడా తెలిపారు. ‘ఇది అత్యంత దురదృష్టకరం. స్పీకర్‌గా మీ నేతృత్వంలోని పార్లమెంట్ కొత్త భవనంలో ఇలా జరగడం ఈ గొప్ప దేశంలోని మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీగా నాకు తీవ్ర హృదయ వేదన కలిగించింది’అని డానిష్ అలీ తెలిపారు. విచారణ జరిపి నివేదిక అందించేందుకు లోక్‌సభ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్‌లోని రూల్ నంబర్ 227 కింద ప్రివిలేజ్ కమిటీకి ఈ విషయాన్ని రెఫర్ చేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment