పనిమనిషి హత్యకేసులో బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్ అరెస్టు
బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య జాగృతి తీవ్రంగా కొట్టడంతో 35 ఏళ్ల పనిమనిషి మరణించింది. మరో బాలికను కూడా ఇనుప రాడ్లు, కర్రలతో విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఈ కేసులో ముందుగానే జాగృతిని అరెస్టు చేసిన పోలీసులు.. అనంతరం సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలతో ఎంపీ ధనుంజయ్ సింగ్ను కూడా అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని సౌత్ ఎవెన్యూలోని బహుజన సమాజ్ పార్టీ ఎంపీ ధనుంజయ్ సింగ్ నివాసంలో పనిమనిషి రాఖీ (35) మంగళవారం తెల్లవారుజామున మరణించింది. ఆమె చేతులు, కాళ్లు, ఎద మీద తీవ్రంగా కొట్టినట్లు గాయాలు కనిపించాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ మహిళ మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ముందుగా ఉదయం జాగృతిని 12 గంటల పాటు విచారించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై చాణక్యపురి పోలీసు స్టేషన్లో సెక్షన్లు 302, 307, 344 కింద కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు బాల కార్మికులను వెట్టి చాకిరీకి పెట్టుకున్నందుకు మరో కేసు పెట్టాలని కూడా పోలీసులు యోచిస్తున్నారు. ఇక ఇదే కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు ఎంపీ ధనుంజయ్ సింగ్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఎంపీ భార్య తీవ్రంగా కొట్టి, హింసించినందువల్లే పనిమనిషి రాఖీ మరణించిందని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆమె సోమవారం ఉదయం 8.30కి మరణించినా, ఎంపీ మాత్రం పోలీసులకు 12 గంటల తర్వాత.. అంటే రాత్రి 8.30 గంటలకే తెలిపారు. వీళ్ల ఇంట్లోనే పనిచేస్తున్న మరో మైనర్ బాలికను కూడా జాగృతి తీవ్రంగా కొట్టింది. తాను ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గమైన జన్పూర్ పర్యటనలో ఉన్నానని, సోమవారం రాత్రే తిరిగి వచ్చానని ఎంపీ అంటున్నారు.