ఆప్‌ను వీడిన ఇల్మి, గోపీనాథ్
కేజ్రీవాల్ తీరు నచ్చకే రాజీనామా చేశామన్న నేతలు
అధినేత జైలు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైపోయిందని విమర్శ
న్యూఢిల్లీ /బెంగళూరు: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేతలు షాజియా ఇల్మి, జీఆర్ గోపీనాథ్ శనివారం ఆ పార్టీని వీడారు. కేజ్రీవాల్ జైలు రాజకీయాలకు పాల్పడుతున్నారని, పార్టీలో అసలు అంతర్గత ప్రజాస్వామ్యమనేదే లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా తర్వాత వారు ఢిల్లీలో విలేకరులతో మట్లాడారు. కేజ్రీవాల్ జైలు రాజకీయాలకు పాల్పడుతున్నారని, గడ్కారీ పెట్టిన పరువునష్టం కేసులో బెయిల్ తీసుకోవడానికి కేజ్రీవాల్ ఎందుకు నిరాకరించారని గోపీనాథ్ ప్రశ్నించారు. కేజ్రీవాల్ పొరపాట్లే ఆయన వైఫల్యానికి కారణమవుతున్నాయన్నారు. ఇల్మి మాట్లాడుతూ... ‘‘అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలని చెప్పుకొనే ఆప్ పార్టీలోనే.. అంతర్గత ప్రజాస్వామ్యం కరువవడంతో ఈ పనిచేయాల్సి వచ్చింది. కేజ్రీవాల్ జైలులో ఉండి సమయాన్ని, శక్తిని వృథా చేయొద్దు.
బెయిల్ తీసుకుని ప్రజల మధ్యకు వచ్చి పోరాడాలి..’’ అని పేర్కొన్నారు. తాను ఆప్‌ను వీడినా మరే పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కాగా.. ఇంతకుముందే మాజీ దౌత్యవేత్త మధ భండారి ఆప్‌ను వీడారు. ఇద్దరు కీలక నేతలు వినోద్‌కుమార్ బిన్ని, అశ్విని ఉపాధ్యాయలను పార్టీ నుంచి వెలివేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి రాజీనామా కేజ్రీవాల్‌కు పెద్ద దెబ్బే కానుంది. మరోవైపు.. కపిల్‌సిబల్ కుమారుడు అమిత్ పెట్టిన పరువునష్టం కేసులో షాజియా ఇల్మిపై ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ప్రశాంత్‌భూషణ్‌లతో పాటు ఈ కేసులో నిందితురాలైన షాజియా పార్టీని వీడిన రోజే వారెంట్‌జారీ కావడం గమనార్హం.