షాజియా ఇల్మిపై నాన్‌బెయిలబుల్ వారంట్
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసు విచారణకు హాజరుకానందుకును స్థానిక న్యాయస్థానం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన షాజియా ఇల్మికి వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్ వారంట్ జారీచేశారు. కేంద్ర టెలికం శాఖను వీడనున్న మంత్రి కపిల్ సిబల్ కుమారుడు అమిత్ సిబల్ ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ తదితరులపై ఈ పిటిషన్‌ను దాఖలుచేసిన సంగతి విదితమే. విచారణకు హాజరు కాకపోతే క ఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సునీల్‌కుమార్ శర్మ నెలరోజుల క్రితం కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్‌తోపాటు ఆ పార్టీ నాయకులు మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, ఇల్మిలను హెచ్చరించిన సంగతి విదితమే.
కేసు విచారణకు ప్రశాంత్ భూషణ్ హాజరయ్యారు. ఇదిలాఉండగా తండ్రి చనిపోయినందువల్ల తనకు కేసు విచారణకు హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మనీష్ సిసోడియా చేసిన విన్నపాన్ని కోర్టు అంగీకరించింది. ఆయనకు ఎటువంటి జరిమానా విధించలేదు. ఇక మరో కేసులో చిక్కుకుని కారాగారంలో ఉన్నందువల్ల తన క్లెయింట్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అర్వింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది శాంతిభూషణ్ చేసిన విన్నపాన్ని కోర్టు మన్నించింది. మినహాయింపు దరఖాస్తును సమర్పించాలని, ఆగస్టు 23వ తేదీన కచ్చితంగా విచారణకు హాజరయ్యేవిధంగా చూడాలని ఆదేశించింది. కాగా ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 23న జరగనుంది.