Non-gazetted Officers' Association
-
అక్కడికెళితే అవమానాలే : ట్రాన్స్జెండర్లు
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ట్రాన్స్జెండర్లు అడుగులేస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకుని సెలూన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకు అవసరమైన సేవలు ‘మామూలు’ బ్యూటీపార్లర్లు అందించడం లేదని ఆరోపిస్తున్నారు. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా స్పా, బ్యూటీ సెంటర్లు ఏర్పాటుచేసుకుని దూసుకుపోతున్నారు. సగం ధరలకే సేవలు.. ‘నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ప్రతీసారి అవమానాలు ఎదురయ్యేవి. అందుకే స్వయంగా నొయిడాలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకున్నాన’ని కాజల్ అనే ట్రాన్స్‌జెండర్, సెక్స్‌వర్కర్ తెలిపారు. తనలాగే ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్జెండర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతోందనీ, బయటితో పోల్చుకుంటే సగం ధరలకే ఇక్కడ సేవలందిస్తామమని ఆమె వెల్లడించారు. ఇక్కడే బ్యూటీకేర్ చేయించుకుంటున్న ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. పొద్దంతా కష్టపడినా పూట గడవదు. అందుకే ఈ వ్యభిచార కూపంలో చిక్కుకున్నా. తలెత్తుకుని జీవించేందుకు బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్నానని కనికా తెలిపారు. కాజల్ బ్యూటీపార్లర్ మా అందరికీ రిక్రియేషన్ సెంటర్‌గా కూడా ఉపయోగపడుతోందని తెలిపారు. రోజూ సాయంత్రం ఎంతో మంది ట్రాన్స్జెండర్లం ఇక్కడ కలులుసుకొని కష్టసుఖాలను పంచుకుంటామనీ, త్వరలోనే జీనత్ ప్రాతంలో బ్యూటీకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. ఆ పని చేయలేం.. బ్యూటీకేర్ అయితే ఓకే.. ట్రాన్స్జెండర్లకు ఒక ఎన్జీవో చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. నొయిడాలోని ‘బసీరా సామాజిక్ సంస్థాన్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ రాంకాళీ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పిస్తామంటే.. వారు వెనకడుగేశారు. కానీ, బ్యూటీ సెలూన్ల ఏర్పాటుచేసుకోవడానికి మొగ్గు చూపారని ఆయన తెలిపారు. బ్యూటీకేర్ సెంటర్ల నిర్వహణలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తున్న ట్రాన్స్జెండర్లు.. వారి అలంకరణ అవసరాలను తీర్చుకోవడంతో పాటు, రానున్న రోజుల్లో మహిళలకు కూడా తమ సేవల్ని అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
వీధి కుక్కలు విదేశాలకు చెక్కేస్తున్నాయి..
నోయిడా : ఆ వీధి కుక్కల దశ తిరిగింది. ఒకప్పుడు తిండి దొరక్క దుర్భర జీవితాన్ని గడిపి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆ కుక్కలు ఇప్పుడు ఖరీదైన ఆహారం తింటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన ‘‘కన్నన్ ఎనిమల్ వెల్ఫేర్’’ అనే స్వచ్ఛంద సంస్థ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వీధి కుక్కలను చేరదీస్తోంది. వాటి ఆరోగ్యం మెరుగు పరిచి శాశ్వత నివాసాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది. అందులో భాగంగా కుక్కలను పెంచుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపే విదేశీయులకు వాటిని దత్తత ఇస్తున్నారు. వీరు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా దాదాపు 90కుక్కలను విదేశాలకు పంపారు. వీధి కుక్కలను పెంచుకుంటున్న విదేశీయులు సైతం వాటి ప్రవర్తన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్డీఓ కోసం ఆరు గంటలు పడిగాపులు
శ్రీకాళహస్తి : పట్టణంలోని ఎన్జీఓ కార్యాలయంలో తిరుపతి ఆర్డీఓ నరసింహులు కోసం అన్నదాతలు గురువారం ఆరు గంటల పాటు పడిగాపులు కాశారు. చివరకు ఆయన రాకపోవడంతో నిరుత్సాహంగా వెళ్లిపోయారు. పూతలపట్టు–నాయుడుపేట ప్రధాన రహదారి విస్తరణ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి భూములు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డీఓ వారానికి ఓ సారి రెండు, మూడు గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించి..వారి భూములకు «ఎంత మేరకు ధర చెల్లిస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం శ్రీకాళహస్తి మండలంలోని చెర్లోపల్లె, కాపుగున్నేరి, ఇసుకగుంట గ్రామాలకు చెందిన రైతులు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్జీఓ కార్యాలయంలో ఆర్డీఓ నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని తహసీల్దార్ సుబ్రమణ్యం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీచేశారు. రైతులు టెన్షన్‌తో గురువారం ఉదయం 9 గంటలకే ఎన్జీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలు అయింది. అయినా ఆయన రాలేదు. అప్పుడు ‘భోజనం చేసి రండి..ఆర్డీఓ మూడు గంటలకు వస్తారు...’ అంటూ తహసీల్దార్ సుబ్రమణ్యం అదేశాలు జారీచేశారు. అయినా రైతులు అక్కడే వేచి ఉన్నారు. చివరకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ‘ఆర్డీఓ రావడం లేదు...మరోసారి సమావేశం నిర్వహిస్తాం....సమావేశం ఎప్పుడు నిర్వహించే విషయం వీఆర్ఏలతో చెప్పి పంపుతాం’ అంటూ తహసీల్దార్ చల్లగా కబురు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు గంటలసేపు వేచివున్న రైతులకు కోపమొచ్చింది. తహసీల్దార్ అలా చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డారు. అడ్డదిడ్డంగా రోడ్డు అలైన్మెంట్ అధికార పక్షానికి చెందిన నేతల భూములు ఉంటే వాటిని తప్పించి పేదోడి భూములపైకి రోడ్డును తిప్పడం దారుణమంటూ రైతులు తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని గ్రామాలను వదిలిపెట్టి.. ఒక్క ఇల్లు పోకుండా పొలాల్లో అలైన్మెంట్ ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు ఇసుకగుంటలో మాత్రం ఇళ్లపై, గిడ్డంగులపై రోడ్డు అలైన్మెంట్ ఇవ్వడం దారుణమంటూ రైతు సిద్దాగుంట శంకర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘మీకు ఇష్టం వచ్చినట్లుగా రోడ్డును తిప్పుకోవడం న్యాయమేనా ?’ అంటూ నిలదీశారు. రోడ్డులో మలుపులు ఉన్న చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, మలుపులు తప్పించడానికి కొన్ని చోట్ల అలైన్మెంట్ మార్పు చేశారని...అంతేతప్ప నేతల ఒత్తిళ్లతో పక్కకు తిప్పాపని చెప్పడం సరికాదంటూ తహసీల్దార్ వివరణ ఇచ్చారు. జీవితమంతా ఈ ప్రభుత్వానికి భూములను నామమాత్రపు «ధరలకు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వాపోయారు. తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని...ఒకవేళ బలవంతంగా లాక్కుంటే గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారమే భూములు ఇవ్వడానికి అంగీకరిస్తామని తేల్చిచెప్పారు. -
దారుణాతి దారుణం.. గ్యాంగ్ రేప్
రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు చోచాంగ్ గ్రామానికి వచ్చిన ఓ ఎన్జీఓ బృందానికి చెందిన ఐదుగురు మహిళలపై దుండగులు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు. వలసలు, మానవ అక్రమ రవాణాలపై అవగాహన కల్పించేందుకు 11 మంది సభ్యులతో కూడిన ఎన్జీఓ బృందం గ్రామానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దుండగులు బృందంలోని పురుషులను చితకబాది ఐదుగురు మహిళలను సమీప అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి తుపాకీ గురిపెట్టి లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. నిందితులను గుర్తించిన పోలీసులు ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారని డీఐజీ అమోల్ వీ హోంకర్ తెలిపారు. లైంగిక దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు ఘటనపై అధికారులకు తెలియపరచలేదని, తమకు అందిన సమాచారం మేరకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. బాధిత మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. -
ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న అశోక్ బాబు
సాక్షి, అమరావతి : ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన యూనియన్ నాయకులే పదవీకాంక్షతో వందలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అదే జరుగుతోంది. ఉద్యోగులకు గెజిటెడ్ హోదా వస్తే ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష పదవి పోతుందన్న భయంతో పి.అశోక్‌బాబు దానికి అడ్డుపడుతున్నారని వాణిజ్య శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిళ్లు జీఎస్టీ అమల్లోకి వచ్చాక కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ శాఖలోని ఉద్యోగులతో సమానంగా వాణిజ్య శాఖ ఉద్యోగుల హోదాలను మార్చాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గ్రేడ్ టు నాన్ గెజిటెడ్ హోదాలో ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో) పదవిని గెజిటెడ్ హోదాతో కూడిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ (జీఎస్టీవో)గా మార్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏసీటీవోలను జీఎస్టీవోలుగా మారుస్తూ సర్వీస్ నిబంధనలు జారీ అయ్యాయి. అయితే తమకు గెజిట్‌డ్ హోదా రాకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయని ఏసీటీవోలు వాపోతున్నారు. కారుణ్య నియామకం కింద వాణిజ్య శాఖలో ఏసీటీవోగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్‌బాబు గెజిటెడ్ హోదాతో కూడిన జీఎస్టీవోగా మారితే.. తక్షణం నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం నేత పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి జీవో రాకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. తన పదవి కోసం మిగిలిన 768 ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న గెజిటెడ్ హోదాకు సంబంధించిన ఫైలు కదలకుండా పైనుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్యామలరావుతో పాటు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు కూడా ఆమోదం తెలిపినా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అశోక్‌బాబు అడ్డుకుంటున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం అమలు చేయాలి రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ వంటి వారికి ఇప్పటికే గెజిటెడ్ హోదా కల్పించారు. అదే గ్రేడు పరిధిలోకి వచ్చే జీఎస్టీవోలకూ గెజిటెడ్ హోదా కల్పించాలి. ఇప్పటికే ఏసీటీవోలను జీఎస్టీవోలుగా మారుస్తూ సర్వీసు నిబంధనల్లో సవరణ చేశారు. వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న గెజిటెడ్ హోదాను తక్షణం నోటిఫై చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – కె.ఆర్.సూర్యనారాయణ, వాణిజ్య శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు -
మహేష్ సాయం.. ఆలస్యంగా...
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ముందుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ఓ మంచి పని ఆలస్యంగా బయటకు వచ్చింది. పేద క్రీడాకారుల కోసం మహేష్ గత కొద్ది నెలలుగా సాయం చేస్తున్నారు. ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ అనే ఎన్జీవో మురికివాడల్లో ఉచిత వైద్య సేవలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ కొన్ని రోజుల క్రితం ఆర్థిక స్తోమత లేని క్రీడాకారులను ప్రొత్సహించేందుకు ఉచిత క్రీడా కేంద్రాన్ని నెలకొల్పింది. దీనికి మహేష్ బాబు-నమ్రతలు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఆ కేంద్రానికి వాళ్లిద్దరూ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. భరత్ అనే నేను చిత్ర విడుదలకు ముందే ఇది జరిగింది. అయితే ఆ సమయంలో ప్రకటన చేస్తే చిత్ర ప్రమోషన్లా ఉంటుందన్న ఆలోచనతో ఫౌండేషన్ నిర్వాహకులు ఆగిపోయారు. కాస్త ఆలస్యంగా ఇప్పుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘గత కొద్ది నెలలుగా మహేష్ నమ్రతలు మా ఫౌండేషన్‌కు సాయం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలన్న ఆ దంపతుల ఆలోచనకు హ్యాట్సాఫ్. వారి ప్రొత్సహం అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు హరీష్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘ఏపీ ఎన్జీవో భవన్’ వివాదం పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, గన్‌ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవో భవన్లో ఉన్న గదులను, మినీ హాల్‌ను వాటి లభ్యతను బట్టి భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సభ్యులు ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం శుక్రవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎన్జీవో భవన్లో గదులను, సమావేశ మందిరాన్ని ఉపయోగించుకునేందుకు తమకు అవకాశమివ్వాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఎన్జీవో సంఘం ఉల్లంఘించిందని, అందుకుగాను సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ ఎం.సత్యనారాయణ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ఏపీఎన్జీవో భవన్లో ఉన్న గదులను, మినీహాల్‌ను ఉపయోగించుకునేందుకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘ సభ్యులకు అవకాశం ఇస్తామన్నారు. గదులను, మినీ హాల్‌ను వాటి లభ్యతను వాడుకోవచ్చునని చెప్పారు. ఇందుకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం తరఫు న్యాయవాది జెల్లి కనకయ్య అంగీకరించారు. -
యాసిడ్ దాడి బాధితురాలి పోరాటం
కోల్‌కతా: ఆమె నాలుగేళ్ల పోరాటం ఫలించింది. తనపై యాసిడ్‌తో దాడిని దుర్మార్గుడిని కటకటాల వెనక్కునెట్టింది. పశ్చిమ బెంగాల్లో నాలుగేళ్ల క్రితం చోటుచేసుకున్న యాసిడ్ దాడి కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సంచయిత యాదవ్(25) బెంగాల్‌లోని డుండుంలోని సెత్బగాన్ ప్రాంతంలో 2014లో సోమెన్ సాహా అనే యువకుడి చేతిలో యాసిడ్ దాడికి గురైంది. తన తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఆమెపై యాసిడ్ పోశాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో తన తల్లిముందే సంచయితపై సాహా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల పోరాటం తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయించగలిగింది. పూర్తిగా కాలిపోయిన ముఖంతో మానసికంగా ఎంతో కుంగిపోయానని, తన తల్లి సహాయంతో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేశానని సంచయిత తెలిపింది. నాలుగేళ్లనుంచి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా ఎవరు తమను పట్టించుకోలేదని, తనకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకూడదన్న ఉద్దేశంతో పోరాటం చేశానన్నారు. యాసిడ్ దాడి బాధితుల తరుఫున పోరాడే ఎన్జీవోల సహాయంతో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను కలిసి 2017లో బెంగాల్ హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకు డండం పోలీసులు ఆదివారం సోనార్‌పూర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని చూసిన సంచయిత పట్టరాని కోపంతో అతడి చెంప చెళ్లుమనిపించింది. నాలుగేళ్లుగా ఎంతో క్షోభ అనుభవించానని, తన జీవితాన్ని నాశనం చేసిన సాహా మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతుండటంతో కోపాన్ని ఆపులేకపోయినట్టు ఆమె వివరించింది. తన పోరాటం ఆగిపోలేదని, నిందితుడికి శిక్ష పడేవరకు తన పోరాటం ఆపనని స్పష్టం చేసింది. -
పొగాకు పెట్టుబడులు పెరిగాయి
పర్చూరు : గతంలో ఎకరం పొగాకుకు రూ. 30 నుంచి రూ. 35 వేల వరకు పెట్టుబడి అయ్యేదని ప్రస్తుతం లక్ష వరకు పెరిగిందని దీంతో రైతులు నష్టపోతున్నారని వెంకటాపురం గ్రామానికి చెందిన కె.బ్రహ్మారెడ్డి, ఎ.వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు ఒక తడికి రూ. 10 వేలు ఖర్చవుతుందని.. ప్రస్తుతం క్వింటా రూ. 20 వేలు అమ్మితే నష్టాల్లేకుండా పెట్టుబడులు మాత్రమే వస్తాయని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలకు సాయం అందడంలేదు పర్చూరు : వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో స్వచ్ఛంద సేవా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విరివిగా తగినన్నీ నిధులు కేటాయించి నిరుపేద హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఐఈఈఆర్డీ ప్రెసిడెంట్ బి.కిరణ్‌చంద్ తెలిపారు. అయితే ప్రస్తుతం తాగునీటి సమస్య, నిరుపేద మహిళలకు జీవన భృతి కోసం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించకలేక పోతున్నామన్నారు. వృద్ధులకు పింఛన్లు అందకపోవడం, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, జీవనాధారం కల్పించటం లేదని జగన్‌కు తెలిపారు. -
ఎన్జీఓ ఎన్నికల జాబితాలో.. బోగస్ ఓటర్లు..!
కడప రూరల్: పులివెందుల తాలూకా యూనిట్ ఎన్జీఓ అసోషియేషన్‌కు ఈ నెల 28వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. అందులో భాగంగా ఈ నెల 19వ తేదీన నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం సిద్ధం చేసిన ఓటర్ల జాబితా సమస్తం తప్పుల తడకగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బోగస్ వ్యవహారం బయటికి రావడంతో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకు ఈ విధంగా వ్యవహరించారన్నది అర్థం కావడం లేదు. ఎలాగోలా గెలుపే లక్ష్యంగా అడుగులు వేయడంలో భాగంగా బోగస్‌ల ద్వారా లబ్ధి పొందాలని ప్రణాళిక రచించినట్లు లిస్టు ద్వారా వెల్లడవుతోంది. ఈ ఎన్నికలు మూడేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఆ మేరకు అర్హులైన ఉద్యోగులను(ఎన్జీఓ)లను మాత్రమే ఓటర్ల జాబితాలో చేర్చాలి. ఆ ప్రకారం గత ఎన్నికల జాబితాలో 350 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం జరిగే ఎన్నికల జాబితాలో 503 మంది నమోదై ఉండడం గమనార్హం. అందులో పులివెందులకు సంబంధంలేని ఉద్యోగులతో పాటు అటెండర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పేర్లు కూడా నమోదు కావడం విచిత్రం. జాబితాలో అర్హులైన దాదాపు 100 మంది ఎన్జీఓల పేర్లు లేకపోవడం గమనార్హం. కేవలం గెలుపే లక్ష్యంగా బోగస్‌ను చేర్చించారని ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పోటీ లేకుండా కుట్ర..? వాస్తవానికి ఎన్నికల జాబితాను ఎన్నికల అధికారి ముందుగానే అందరికీ అందుబాటులో ఉంచాలి. అయితే నామినేషన్‌కు ముందు రోజు మాత్రమే జాబితాను అందుబాటులో ఉంచారు. దీనిని పరిశీలించిన ఉద్యోగ వర్గాలు నివ్వెరపోయాయి. . ఈ ఎన్నికల్లో కొంతమంది పోటీ చేయాలని సిద్ధమయ్యారు. అలాంటి వారి పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో ఆందోళనకు లోనయ్యారు. అంటే ప్రత్యర్ధులు పోటీలో లేకుండా చేయడానికి ఒక వర్గం ఇలా కుట్ర పన్నింది అని మరొక వర్గం ఆరోపిస్తోంది, ఈ నేపథ్యంలో ఎన్నికలను రద్దు చేయడంతో పాటు ఎన్నికల జాబితాపై విచారణ చేపట్టాలని ఉద్యోగ వర్గాలు పట్టుపడుతున్నాయి. -
ఆ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు భారతీయ రైల్వేలు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. సీనియర్ అధికారులు మినహా గ్యాంగ్మెన్లు, ట్రక్మెన్ సహా ఇతర ఎన్జీవో ఉద్యోగులకు విదేశాలను చుట్టివచ్చే ప్లెజర్ ట్రిప్‌ను ఆఫర్ చేస్తున్నట్టు సంస్థ పేర్కొంది. 100 మంది సిబ్బందితో ఈనెల28న సింగపూర్, మలేషియాలకు తొలి బ్యాచ్ విమానంలో తరలివెళ్లింది. విదేశీ పర్యటనకు ప్రయాణ ఖర్చులో 25 శాతం ఖర్చును ఉద్యోగులు భరించాల్సి ఉండగా, 75 శాతం సిబ్బంది ప్రయోజనాల నిధి (ఎస్బీఎఫ్)నుంచి వాడుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు. దిగువశ్రేణి క్యాడర్లు, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న సిబ్బందికే విదేశీ పర్యటనల అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. సంస్థలోని నాన్ గెజిటెడ్ సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ ఓవర్సీస్ క్యాంప్‌ను నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. రైల్వే సిబ్బంది తమ విదేశీ ప్రయాణంలో భాగంగా యూనివర్సల్ స్టూడియోస్, సింగపూర్‌లో సెంటోస, నైట్‌సఫారి, కౌలాలంపూర్ నగర టూర్, మలేషియాలో పెట్రోనాస్ టవర్స్, బటూ కేవ్స్, జెంటింగ్ హైల్యాండ్స్‌ను సందర్శిస్తుంది. -
సమస్యల పరిష్కారంలో ఏన్జీవో నేతలు విఫలం
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): అబద్ధాలు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇక చెప్పటానికి అబధ్ధాలే లేకుండా పోయాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీ ఏన్జీవో సంఘం ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు చెక్క భజన చేసుకుంటూ సమస్యలను వదిలేశారని ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీఆర్సీ విషయంలో సంఘం పట్టించుకోలేదని, కేవలం 4 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నారావారి పల్లె నుండి విజయవాడకు కూడా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో వ్యవసాయం పూర్తిస్ధాయిలో పడిపోయిందన్నారు. సంఘాలకు ప్రశ్నించే తత్వం లేకుండా పోయిందని, నాలుగేళ్ళలో ఒక్క నోటీసు కానీ, ధర్నా కాని చేసిన పాపాన పోలేదని అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అభివృధ్ధికి అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్న టీడీపీ నేతలు మీరు ఏ అభివృధ్ధి చేస్తే ఆయన అడ్డుపడ్డారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రుణమాఫీ దగ్గర నుండి పోలవరం వరకు ఏ ఒక్క అంశంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిధ్ధమేనని సవాల్ విసిరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బి.సాంబిరెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు ఆల్ఫ్రెడ్, నాగరాజు, అంజిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఎస్.వి.సత్యనారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్ కోసం దేశవ్యాప్త ఉద్యమం
సాక్షి, విజయవాడ : ఉద్యోగుల పెన్షన్ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సీపీఎస్ విధానం రద్దు కోసం శనివారం విజయవాడలో జరిగిన సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పెన్షన్ సాధన కోసం పెన్షన్ సాధన సమితిని ఏర్పాటు చేశామని, పెన్షన్ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల పెన్షన్ అంశాన్ని అవసరమైతే రాజకీయ అంశంగా మారుస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్‌ను సాధించుకుంటామని చెప్పారు. ఏపీ సర్కార్ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని సీపీఎస్ కేంద్రం పరిధా, లేక రాష్ట్రం పరిధిలోనిదా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయమై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫేడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గుర్తుచేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. -
కనికరం చూపని ముఖ్యమంత్రి
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి)/గుంటూరు రూరల్: ‘‘ఉద్యోగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను గతంలోలాగా కాదు. ప్రస్తుతం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారిపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా పనిచేస్తున్నాను. ఇందులో భాగంగా ఇప్పటికే 30 జీవోలు జారీ చేశాం’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుపతి ఎస్వీయూలోని శ్రీనివాసా ఆడిటోరియంలో జరుగుతున్న రాష్ట్ర ఎన్జీవో సంఘం 21వ మహాసభల ముగింపు కార్యక్రమం లో శనివారం సీఎం మాట్లాడారు. ఈ–ఆఫీస్ అమలులోకొచ్చాక పాలనలో జవాబుదారీతనం పెరిగిందని.. ఉద్యోగులు ఎక్కడ్నుంచైనా పనిచేసే సౌలభ్యముందని చెప్పారు. అయినప్పటికీ ఉద్యోగులు కార్యాలయాలకొచ్చి పనిచేయాలని కోరారు. అప్పుడప్పుడూ ఆలస్యంగా వచ్చినా పట్టించుకోనన్నారు. ఉద్యోగులకు 10వ పీఆర్సీకి సంబంధించి రావాల్సిన అరియర్స్, 11వ పీఆర్సీ అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. వృద్దురాలు అని కూడా చూడకుండా వృద్ధురాలు అనగానే ఓపికగా కాసేపు సమయం కేటాయించి ఆమె సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వృద్ధురాలిని నిర్దయగా పక్కకు నెట్టేశారు. తిరుపతి సమీపంలోని తనపల్లె వద్ద శనివారం గృహనిర్మాణ సముదాయాలను ప్రారంభించేందుకు వచ్చిన బాబుకు తన కష్టం చెప్పుకునేందుకు ఓ వృద్ధురాలు వచ్చింది. సీఎంను చూసి నమస్కరించింది. తన సమస్య చెప్పేలోపే బాబు ఆమె వైపు కోపంగా చూస్తూ ఓ చేత్తో ఆమెను నెట్టేసి వెళ్లిపోయారు. దీంతో ఆ వృద్ధురాలు కంటతడితో వెనుదిరిగింది. -
అందరూ సెక్స్ వర్కర్ల కూతుళ్లే..
సాక్షి, లండన్: సెక్స్ వర్కర్ల పిల్లలు ఏమవుతారు?. వెకిలిగా ఆలోచిస్తే వాళ్లూ సెక్స్ వర్కర్లే అవుతారు అనే మాటలు వినిపిస్తాయి. కానీ వాళ్లకు ఆశలు, ఆశయాలు ఉంటాయనే విషయాన్ని ఎంత మంది గ్రహిస్తారు. వారికి దిశానిర్దేశం చేసి ఎవరు ప్రోత్సహిస్తారు?. అందుకు మేం ఉన్నాం అంటోంది.. లాల్ బత్తి ఎక్స్‌ప్రెస్(రెడ్ లైట్ ఎక్స్‌ప్రెస్). బ్రిటన్‌లోని ఎడిన్ బర్గ్ ఫ్రింజ్లో గల ఓ చర్చిలో ముంబై రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్లుగా పని చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలతో ఓ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పించింది రెడ్ లైట్ ఎక్స్‌ప్రెస్. వారి ఆశయాలను, కోరికలను, కలలను ప్రపంచానికి తెలిసేలా చేసేందుకు ప్రపంచంలోని అత్యంత పెద్దదైన ఆర్ట్ ఫెస్టివల్‌ను వేదికగా మార్చింది. స్టేజ్ మీద కూర్చున్న 15 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరూ తమ ఊహలను, వాస్తవాలను కళ్లకు కట్టేలా ఇచ్చే ఈ ప్రదర్శనలకు 'రైలు ప్రయాణం' అనే పేరు కూడా పెట్టింది. రెడ్ లైట్ ఎక్స్‌ప్రెస్‌కు ఎన్జీవో క్రాంతి అండగా నిలుస్తోంది. లండన్‌లోని పలు ప్రాంతాల్లో పిల్లలు తాము అనుభవించిన కష్టాలను అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. బీబీసీ చానెల్ పిల్లల నుంచి ప్రత్యేకంగా ఇంటర్వూ తీసుకుంది. -
హరికిరణ్‌కు ఘన సన్మానం
కర్నూలు(అగ్రికల్చర్): బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌ను జిల్లా నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నేతలు సోమవారం ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగళరెడ్డి, జవహార్‌లాల్, కోశాధికారి పి.రామకృష్ణారెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ ఉపాధ్యక్షుడు టిఎండీ హుసేన్, ఇతర జిల్లా నాయకులు రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, కేసీహెచ్ కృష్ణుడు, బలరామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి రఘుబాబు, అరుణమ్మ, దొరస్వామిసాయిరామ్ తదితరులు జేసీకి బొకేలు, శాలువలు, పూలమాలలు, జ్ఞాపికలు సమర్పించి సత్కరించారు. హరికిరణ్ స్పందిస్తూ.. జిల్లాలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాగా సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు, -
స్వచ్ఛంద సంస్థలకు గూగుల్ఆర్గ్
నుంచి 8 మిలియన్ డాలర్ల గ్రాంటు న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్‌డాట్‌ఆర్గ్ తాజాగా భారత్‌లో నాలుగు స్వచ్ఛంద సేవా సంస్థలకు (ఎన్జీవో) 8.4 మిలియన్ డాలర్ల మేర గ్రాంట్స్ ఇచ్చింది. ఇవి టెక్నాలజీ ఆధారిత బోధన సేవలు అందిస్తున్నాయి. గ్రాంట్స్ అందుకున్న వాటిలో లెర్నింగ్ ఈక్వాలిటీ (5,00,000 డాలర్లు), మిలియన్ స్పార్క్స్ ఫౌండేషన్ (1.2 మిలియన్ డాలర్లు), ప్రథమ్ బుక్స్ స్టోరీవీవర్ (3.6 మిలియన్ డాలర్లు), ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (3.1 మిలియన్ డాలర్లు) సంస్థలు ఉన్నాయి. ఆయా సంస్థల కార్యకలాపాల విస్తరణకు తోడ్పడేలా రెండేళ్ల పాటు ఈ గ్రాంట్ అందించనున్నట్లు గూగుల్ ఆగ్నేయాసియా విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. -
రైతు ఆత్మహత్యలకు పరిష్కారాలేవీ?
4 వారాల్లో కార్యాచరణ నివేదిక సమర్పించండి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: రైతు ఆత్మహత్యల నిరోధానికి రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నివేదిక అందచేయాలని స్పష్టం చేసింది. రైతులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల మూలకారణాల్ని అధ్యయనం చేసి, వాటి నిరోధానికి ఒక విధానాన్ని తీసుకురావాలని కోర్టు సూచించింది. ‘ఇది చాలా తీవ్రమైన అంశం. రైతుల ఆత్మహత్యలకు సంబం ధించి రాష్ట్రాలు చేపట్టాల్సిన ప్రతిపాదిత చర్యలు వెల్లడిస్తూ కోర్టు రిజిస్ట్రీకి నివేదిక సమర్పించండి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ల∙ధర్మాసనం పేర్కొంది. గుజరాత్లో రైతుల దీనస్థితిపై ఓ ఎన్జీవో పిటిషన్ దాఖలు చేసింది. గుజరాత్లో దాదాపు 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు గల అసలైన కారణాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన విధానాన్ని తీసుకొచ్చి అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. నూతన విధానాన్ని తీసుకొస్తున్నాం: కేంద్రం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ.. వ్యవసాయ రంగం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ రూపొందించాలని కేంద్రానికి సూచించారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ వాదనలు వినిపిస్తూ... రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తోందని, రుణాల మంజూరు, పంట నష్ట పరిహారం, బీమా పరిధిని పెంచినట్లు తెలిపారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఒక నూతన పాలసీని తీసుకొస్తోందని కోర్టుకు వెల్లడించారు. -
ఎన్జీఓ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడిపై విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి విచారణ జరిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే రామచంద్రరావు.. వెంగళరెడ్డిపై వివిధ ఆరోపణలతో గతంలో లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ మేరకు లోకాయుక్త సమగ్రంగా విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్.. ప్రత్యేక కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఇందులో భాగంగా ఫిర్యాదు దారుడయిన రామచంద్రరావును సోమవారం విచారించారు. ఆయన తన దగ్గర ఉన్న ఆధారాలను విచారణ అధికారికి సమర్పించారు. అనంతరం ఆరోపణలపై వెంగళరెడ్డిని విచారించారు. ఆరోపణలకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. -
అశోక్‌బాబు ప్యానల్ ఏకగ్రీవ ఎన్నిక!
గాంధీనగర్ (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో పి.అశోక్‌బాబు ప్యానల్ విజయం ఖాయమైంది. అధ్యక్ష స్థానానికి అశోక్‌బాబు ఆదివారం ఎన్నికల అధికారి డి.దాలినాయుడుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే ఇప్పటి వరకు అశోక్‌బాబు ప్యానల్ మాత్రమే నామినేషన్ వేసింది. దీంతో ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లేనని అధికారవర్గాలు తెలిపాయి. నామినేషన్ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం నాయకులు ఎ.విద్యాసాగర్, ఇక్బాల్, కోనేరు రవి తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి రామకృష్ణారెడ్డికి ఉపాధ్యక్ష పదవి
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడిగా జిల్లా నుంచి జి.రామకృష్ణారెడ్డి రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఈయన మరోసారి ఆశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి ప్యానల్ తరుఫున విజయవాడలో ఆదివారం నామినేషన్ ధాఖలు చేశారు. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగళరెడ్డి, జవహార్‌లాల్ ప్రతిపాదించారు. ఒకే నామినేషన్ ధాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని అసోసియేషన్ నాయకులు అభినందించారు. -
రామకృష్ణారెడ్డి మరోసారి బరిలోకి
కర్నూలు(అగ్రికల్చర్): నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి జిల్లా నుంచి జి.రామకృష్ణారెడ్డి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఈయన మరోసారి ఆశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి ప్యానల్ తరఫున ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగళరెడ్డి, జవహార్‌లాల్, కోశాధికారి పి.రామకృష్ణారెడ్డి ఆయన పేరును ప్రతిపాదించనున్నారు. విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు ¯సంబంధించి నేడు జరిగే నామినేషన్ కార్యక్రమానికి జిల్లా నుంచి వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వెంగళరెడ్డి మాట్లాడుతూ జిల్లా కార్యవర్గం పూర్తిగా రామకృష్ణారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. -
'అమ్మ' మరణం సుప్రీంకు
చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనూహ్య మరణంపై చెన్నైకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. ఊహించనిరీతిలో అకస్మాత్తుగా ఆమె కన్నుమూయడం, ఆమెను పరామర్శించడానికి బంధువులు సహా ఎవరినీ అనుమతించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిల్ వేసింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంను కోరింది. అలాగే ఆమె చికిత్సకు సంబంధించిన అన్ని వైద్య రికార్డులను (మెడికల్ డాక్యుమెంట్స్) స్వాధీనం చేసుకోవాలని కోరింది. కాగా తీవ్ర జ్వరంతో అపోలో ఆసుపత్రిలో చేరిన అమ్మ కోలుకుంటున్నారన్న ఆనందం ఎంతో సేపు నిలవకుండానే కార్డియాక్ అరెస్ట్ తో ఈ లోకాన్ని వీడడం విషాదాన్ని నింపింది. రేపో మాపో డిశ్చార్చ్ కానున్న అమ్మ ఆకస్మిక మృతితో అన్నాడీఎంకే కార్యకర్తలు,ఇతరులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. -
సెకనుకో చిన్నారిపై కీచకం
మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఎంపీల్లో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు న్యూఢిల్లీ: భయంకర వాతావరణంలో బాల్యం బిక్కుబిక్కుమంటోంది. చిన్నారులు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారు. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. సెకనుకో చిన్నారి వేధింపుల బారిన పడుతోంది. ప్లాన్ ఇండియా అనే ఒక ఎన్జీవో నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ‘క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారులు’పేరిట ఎన్జీవో ఒక నివేదికను వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడు నెలలపాటు 2 వేల సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి 1500 మంది సర్వే నిర్వహించారు. మొత్తం మానవ అక్రమ రవాణా నేరాల్లో అండమాన్, నికోబార్ దీవులు, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ల్లో 61 శాతం నేరాలు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో అదృశ్యమైన చిన్నారుల్లో 48 శాతం మంది ఆచూకీ లభించడంలేదు. రాజస్థాన్‌లో బాల్య వివాహాలు తీవ్రంగా ఉన్నాయి. 20–24 ఏళ్ల మహిళలను సర్వే చేయగా వారిలో 57.6 శాతం మంది వివాహాలు 18 ఏళ్ల కంటే ముందే జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో 54.9, హర్యానాలో 28 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో బాలకార్మికులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 43 లక్షల మంది బాలకార్మికుల్లో 18 లక్షల మంది ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నారు. -
ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
రెండోసారి పగ్గాలు చేపట్టిన అధ్యక్ష, కార్యదర్శులు నెల్లూరు(పొగతోట): నాన్‌గజిటెడ్ ఆఫీసర్స్(ఎన్జీఓ) అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్వీర్సీ. శేఖర్‌రావు, వై.రమణారెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక ఎన్జీఓ హోమ్‌లో నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అ«ధికారి శివరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 14న ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. 15 పోస్టులకు 16 మంది నామినేషన్లు వేశారు. ఉపాధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన శ్రీకాంత్ విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి రెండోసారి ఎన్నికయ్యేటట్లు చేసిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఏసీఆర్ఎస్ఏ నాయకులు నరసింహులు, కృష్ణారావు, ఏ.పెంచలరెడ్డి, భాను, మనోహర్‌బాబు, వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం అ«ధ్యక్షుడిగా సీహెచ్‌వీఆర్‌సీ. శేఖర్‌రావు(ఇరిగేషన్), కార్యదర్శిగా వై. రమణారెడ్డి(మెడికల్ అండ్ హెల్త్) ఎన్నిక కాగా అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎన్.ఆంజనేయవర్మ(మెడికల్ అండ్ హెల్త్), ఉపాధ్యక్షులుగా ఎంవీ సువర్ణకుమారి(వ్యవసాయ శాఖ), జి.రమేష్‌బాబు (ఇరిగేషన్), ఎన్.గిరిధర్(ఐసీడీఎస్), ఎస్కే.సిరాజ్ (రెవెన్యూ), ఎల్.పెంచలయ్య(జిల్లా పరిషత్) ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.పెంచలరావు (మెడికల్ అండ్ హెల్త్), జాయింట్ సెక్రటరీలుగా ఎన్.శ్రీనివాసులు(అకౌంట్స్ ఆఫీస్), పి.సతీష్‌బాబు(మెడికల్ అండ్ హెల్త్), కె.రాజేంద్రప్రసా«ద్(విద్య శాఖ), ఇ.విజయకుమార్ (సాంఘిక సంక్షేమ శాఖ), మహిళా జాయింట్ సెక్రటరీగా ఇ.కరుణమ్మ(మెడికల్ అండ్ హెల్త్), కోశాధికారిగా బి.వెంకటేశ్వర్లు(మెడికల్ అండ్ హెల్త్) ప్రమాణ స్వీకారం చేశారు.