-ముందుగా ఉద్యోగులందరికీ మాస్టర్ హెల్త్ చెకప్
-ఒక్కొక్కరికి 20 టెస్టులతో కూడిన చెకప్...రూ.2200 అంచనా
-అనంతరం బీపీ, షుగర్ వంటివి ఉంటే ఎస్‌ఆర్‌లో చేర్చాలని యోచన
-పెన్షనర్లకు స్క్రీనింగ్ టెస్టులు చేయద్దన్న వైద్య ఆరోగ్యశాఖ
-ఫిట్‌నెస్ బావున్న ఉద్యోగులకు పారితోషికాలివ్వాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న జబ్బులను ఇకపై సర్వీస్ రిజిస్టర్ (ఎస్‌ఆర్)లో చేరిస్తే బావుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. నాన్ గెజిటెడ్ అఫీసర్స్ అసోసియేషన్ (ఎన్జీవో)ల సంఘం దీనిపై విజ్ఞప్తి చేసిందని, దీనిపై ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 4.83 లక్షల మంది ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ఎస్‌ఆర్‌లో జబ్బుల జాబితాను రూపొందిస్తే బావుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం 20 రకాల టెస్టులు (మాస్టర్ హెల్త్‌చెకప్) పేరుతో ఒక్కొక్కరికి రూ.2200 వరకూ ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో మధుమేహం, సీబీపీ, మూత్రపరీక్షలు, రక్తపోటు, లిపిడ్ ప్రొఫైల్, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలు ఉన్నాయి. ఇలా పురుష, మహిళా ఉద్యోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారికి డయాబెటిక్, బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులుంటే వాటిని ఎస్‌ఆర్‌లో పొందుపరిస్తే జాగ్రత్తలు తీసుకుంటారని, ఎన్జీవో సంఘం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓను కోరినట్టు అధికారులు చెప్పారు.
అయితే ఈ ఆలోచనకు కొంతమంది అధికారులు విభేదించారు. క్యాన్సర్, హెచ్‌ఐవీ వ్యాధులుంటే ఎస్‌ఆర్‌లో పొందుపరిస్తే చూడ్డానికి, చెప్పుకోవడానికి కూడా బావుండదని, ప్రతి ఉద్యోగికి కావాలంటే ప్రత్యేకంగా మెడికల్ రికార్డు నిర్వహిస్తే బావుంటుందని సూచించారు. తిరిగి దీనిపై సెప్టెంబర్‌లో ఒకసారి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులతో పాటు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్ణయించింది. పెన్షనర్లకు స్క్రీనింగ్ టెస్టు అక్కర్లేదు పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు స్క్రీనింగ్ టెస్టులు అక్కర్లేదని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సర్వీసులో ఉన్నవారికి మాత్రమే మాస్టర్ హెల్త్ చెకప్ చేద్దామని, ఇందులో పెన్షనర్లను చేరిస్తే తమ కుటుంబ సభ్యులకు కూడా చేయాలని అడుగుతారని, అందుకే ఉద్యోగులకు మాత్రమే ఇది వరిస్తుందని ఆరోగ్యశాఖ తమ నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది.
ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆరోగ్య పరీక్షలు వర్తించవని తేల్చిచెప్పింది. బాక్స్ ఫిట్‌గా ఉంటే పారితోషికాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.83 లక్షల మందికి స్క్రీనింగ్ టెస్టులు చేసి ఫిట్‌నెస్ బాగా ఉన్న ఉద్యోగులకు పారితోషికం ఇద్దామన్న ప్రతిపాదన వచ్చింది. మొత్తం జరిగే 20 పరీక్షల్లోనూ సాధారణ రిపోర్టులు (నార్మల్) వస్తే అలాంటి వారికి మాత్రమే ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇవి క్యాష్ రూపంలోనా లేదా ఇంక్రిమెంట్ల రూపంలోనా అలాంటివేమీ తేల్చలేదు. సెప్టెంబర్ మాసంలో జరిగే సమావేశాలో ఎన్జీవోలు, సెక్రటేరియల్ ఉద్యోగుల సంఘం, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ అందరితో సమావేశమై నిర్ణయిద్దామని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది.