రైతు ఆత్మహత్యలకు పరిష్కారాలేవీ?
4 వారాల్లో కార్యాచరణ నివేదిక సమర్పించండి
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: రైతు ఆత్మహత్యల నిరోధానికి రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నివేదిక అందచేయాలని స్పష్టం చేసింది. రైతులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల మూలకారణాల్ని అధ్యయనం చేసి, వాటి నిరోధానికి ఒక విధానాన్ని తీసుకురావాలని కోర్టు సూచించింది. ‘ఇది చాలా తీవ్రమైన అంశం.
రైతుల ఆత్మహత్యలకు సంబం ధించి రాష్ట్రాలు చేపట్టాల్సిన ప్రతిపాదిత చర్యలు వెల్లడిస్తూ కోర్టు రిజిస్ట్రీకి నివేదిక సమర్పించండి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌ల∙ధర్మాసనం పేర్కొంది. గుజరాత్‌లో రైతుల దీనస్థితిపై ఓ ఎన్జీవో పిటిషన్ దాఖలు చేసింది. గుజరాత్‌లో దాదాపు 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు గల అసలైన కారణాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన విధానాన్ని తీసుకొచ్చి అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరింది.
నూతన విధానాన్ని తీసుకొస్తున్నాం: కేంద్రం
విచారణ సందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ.. వ్యవసాయ రంగం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ రూపొందించాలని కేంద్రానికి సూచించారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ వాదనలు వినిపిస్తూ... రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తోందని, రుణాల మంజూరు, పంట నష్ట పరిహారం, బీమా పరిధిని పెంచినట్లు తెలిపారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఒక నూతన పాలసీని తీసుకొస్తోందని కోర్టుకు వెల్లడించారు.