చనిపోయాక పరిహారమా? | Compensation is Not the Remedy for Farmer Suicides, Says SC | Sakshi
Sakshi News home page

చనిపోయాక పరిహారమా?

Published Sat, Mar 4 2017 1:18 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

చనిపోయాక పరిహారమా? - Sakshi

చనిపోయాక పరిహారమా?

నివారణకు చర్యలు తీసుకోండి
♦  రైతు ఆత్మహత్యలపై సుప్రీం సీరియస్‌
♦  దశాబ్దాలుగా పరిష్కారం చూపకపోవటం దారుణమని వ్యాఖ్య  


న్యూఢిల్లీ: రైతు ఆత్మహత్యల నియంత్రణలో ప్రభుత్వం సరైన దిశలో వెళ్లటం లేదని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత పరిహారం అందించటమే సమస్యకు పరిష్కారం కాదని.. ఆత్మహత్యలు జరగకుండా పథకాలు తీసుకురావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

అప్పులు, పంట నష్టాలతో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను నియంత్రించేందుకు సరైన రోడ్‌ మ్యాప్‌ను కోర్టుకు సమర్పించాలని కోరింది.‘ఇది చాలా ముఖ్యమైన సమస్య. ప్రస్తుతం మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ సమస్యపై మీరు చేస్తున్న పని సరైన దిశలో లేదని అర్థమవుతోంది.రైతులు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని.. కట్టలేని పరిస్థితి వచ్చినపుడే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రాణత్యాగం చేశాక పరిహారం ఇవ్వటం కాదు. ఆత్మహత్యలను నియంత్రించేలా సరైన పథకాలు తీసుకురావాలి’ అని ధర్మాసనం సూచించింది.

దశాబ్దాలుగా ఆందోళన కలిగిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం ఇంతవరకు చూపకపోవటం దారుణమని మండిపడింది. ఒకవేళ మొదట్నుంచీ సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పటికే ఈ దిశలో చాలా సాధించేవారమని అభిప్రాయపడింది.‘సిటిజన్స్  రిసోర్స్‌ అండ్‌ యాక్షన్  ఇనిషియేటివ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ గుజరాత్‌లో రైతుల దుస్థితి, ఆత్మహత్యలపై వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పరిధిని యావద్దేశానికి విస్తృతం చేసింది. జాతీయ రైతుల పాలసీ– 2007లో లోపాలు కూడా రైతు ఆత్మహత్యలను నిరోధించటంలో ప్రభుత్వ వైఫల్యానికి కారణమై ఉండొచ్చని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను మార్చి 27కు వాయిదా వేసింది.

భరోసాకు మరిన్ని పథకాలు
కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పలు పథకాలను తీసుకొచ్చిందని.. పంటల బీమా పథకం–2015 ద్వారా రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పీఎస్‌ నరసింహ కోర్టుకు వెల్లడించారు. ఒత్తిడిలో ఉన్న అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉం దని భరోసా కల్పించేలా మరిన్ని పథకాల ను ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్జీవో తరపు న్యాయవాది కోలిన్  గంజాల్వేజ్‌ వాదిస్తూ.. ‘రైతుల ఆత్మహత్యలపై చాలాకాలంగా ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు బాగానే ఉన్నా క్షేత్ర స్థాయిలో వీటి అమల్లోనే అసలు సమస్య వస్తోంది. రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్‌ స్వామినాథన్ , ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ జరిపిన అధ్యయన ఫలితాలను కూడా కోర్టు పరిశీలించాలి’ అని కోరారు. పంటనష్టంతో బాధపడుతున్న రైతులకు హెక్టారుకు రూ.30వేల ఆర్థికసాయం ఇవ్వాలని గంజాల్వేజ్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement