రైతు ఆత్మహత్యలపై కళ్లు తెరవాలి
షబ్బీర్ అలీ సూచన
సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తు న్నామని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. ఉప నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు కరువు, అకాల వర్షాలు వంటివాటితో పలు సమస్యలను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకో వడంలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.750 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయ డంవల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోయా రన్నారు.
ప్రచార గిమ్మిక్కులతో, రైతుల కోసం ఏదో చేస్తున్నామని మొసలి కన్నీరు పెట్టకుండా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 3వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నదని విమర్శించారు. రైతుల కు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పడం వల్ల 2015లోనే 14వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
ఆత్మహత్యలపై అఖిలపక్షం వేయాలి
రైతు ఆత్మహత్యల నివారణకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, తగిన చర్యలను తీసుకోవాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వంలో కదలిక రావాలన్నారు. ఆత్మహత్యల నివారణ కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వానికి కనువిప్పు రావడం సంతోషమన్నారు.