ప్రాణంపోయాక పరిహారం ఇవ్వడమే మీ పనా: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ‘రైతుల ఆత్మహత్యలు నిలువరించడం ప్రభుత్వ బాధ్యత.. అంతేగానీ, వారు చనిపోయిన తర్వాత నష్టపరిహారం పంచడం కాదు’ అంటూ సుప్రీంకోర్టు తమిళనాడు సర్కారును గట్టిగా మందలించింది. రైతులను బ్యాంకులు వేధిస్తూ, అవమానిస్తుంటే ప్రభుత్వ పరంగా మీరేం చేస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక నుంచి రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆలోచన చేయబోమని, చర్యలు తీసుకోమని కోర్టు సాక్షిగా హామీ ఇవ్వాలని ఆదేశించింది.
తమిళనాడులో అప్పుల బాధ తాళలేక, బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు తిరిగి ఇవ్వలేక మనోవేధనకు గురై పలువురు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ సమస్యకు పరిష్కారం సూచించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. వేల కోట్ల రూపాయల డబ్బును ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి దర్జాగా బతికేస్తున్న విజయ్ మాల్యాలాంటి వ్యక్తిని బ్యాంకులు ఏమీ చేయలేకపోతున్నాయని, కానీ, రైతును మాత్రం పీల్చి పిప్పి చేస్తున్నాయంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. రైతులను బ్యాంకులు తీవ్రంగా అవమానిస్తున్నాయని, వాళ్ల ట్రాక్టర్లను, వ్యవసాయ పనిముట్లను, ఇతర ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటూ నిర్ధయగా వ్యవహరిస్తున్నాయంటూ అందులో పేర్కొన్నారు.
దీనిపై విచారణ ప్రారంభించిన ఉన్నత న్యాయస్థానం తమిళనాడు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. వెంటనే రైతులపై బ్యాంకుల దుశ్చర్యలను నిలువరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మిన్నకుండా ఉండటం గమనార్హం అని వెంటనే జరుగుతున్న విషయాలను ఇప్పటికైనా అప్రమత్తమై నష్టం తర్వాత పరిహారం చెల్లించడం కంటే ముందస్తుగానే అలాంటి పరిస్థితులు రాకుండా రైతులకు అనుకూలమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.