సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, గన్‌ఫౌండ్రీలోని ఏపీ ఎన్‌జీవో భవన్‌లో ఉన్న గదులను, మినీ హాల్‌ను వాటి లభ్యతను బట్టి భాగ్యనగర్ తెలంగాణ ఎన్‌జీవో సభ్యులు ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్‌జీవో సంఘం శుక్రవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. ఏపీ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను పరిష్కరించింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎన్‌జీవో భవన్‌లో గదులను, సమావేశ మందిరాన్ని ఉపయోగించుకునేందుకు తమకు అవకాశమివ్వాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఎన్‌జీవో సంఘం ఉల్లంఘించిందని, అందుకుగాను సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ ఎం.సత్యనారాయణ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్‌జీవో సంఘం తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ఏపీఎన్‌జీవో భవన్‌లో ఉన్న గదులను, మినీహాల్‌ను ఉపయోగించుకునేందుకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్‌జీవో సంఘ సభ్యులకు అవకాశం ఇస్తామన్నారు. గదులను, మినీ హాల్‌ను వాటి లభ్యతను వాడుకోవచ్చునని చెప్పారు. ఇందుకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్‌జీవో సంఘం తరఫు న్యాయవాది జెల్లి కనకయ్య అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment