సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గన్‌ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవో భవన్‌లోని నాలుగు గదులు, ఒక సమావేశ మందిరాన్ని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘానికి అప్పగించాలన్న గత ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. భవనంలోని గదులకు తాళాలు వేసి అమరావతికి వెళ్లిపోతే వాటిని ఎన్జీవోలు ఉపయోగించుకోవాలంటే ఎలాగని నిలదీసింది. ఫోన్ చేస్తే వసతులు కల్పిస్తామని చెప్పడం కాదని, ఎవరైనా ఎన్జీవో చేసిన ఫోన్‌కు స్పందించనప్పుడు ఇక్కడున్న వారి పరిస్థితి ఏం కావాలో చెప్పాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
ఏపీఎన్జీవో భవన్‌లో నాలుగు గదులు, ఒక హాలును తమ సంఘం వినియోగించుకునేందుకు అప్పగించాలన్న ఆదేశాల్ని అశోక్‌బాబు ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదంటూ భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని శుక్రవారం ధర్మాసనం మరోసారి విచారించింది. గదులకు తాళాలు వేసి అమరావతికి వెళ్లి కూర్చుంటే వాటి వసతుల కోసం భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం వారు ఎవరిని కలుసుకోవాలో చెప్పాలని ధర్మాసనం అడిగింది. వాచ్‌మన్‌కు దరఖాస్తు చేసుకోవాలా.. గదులు/హాలు వినియోగానికి వీలుగా ఏపీఎన్జీవో సంఘానికి చెందినవారు ఇక్కడ ఎందుకు అందుబాటులో లేరో చెప్పాలని పేర్కొంది. భాగ్యనగర్ ఎన్జీవో అసోసియేషన్ తరఫు న్యాయవాది జల్లి కనకయ్య వాదనలు వినిపిస్తూ.. గన్‌ఫ్రౌండీలోని ఎన్జీవో సంఘం గదుల్ని అద్దెకు ఇచ్చారని, నెలకు రూ.రెండు లక్షలు అద్దె వస్తోందని, అద్దెకు ఇవ్వని గదులకు తాళాలు వేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు.
తమ సంఘ సభ్యుల్ని వాచ్‌మన్ లోపలికి రానీయడం లేదన్నారు. ఈ వివరాలన్నింటినీ కౌంటర్‌లో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై అశోక్‌బాబు తరఫు న్యాయవాది కల్పించుకుని.. ఏపీఎన్జీవో సంఘ కార్యాలయానికి ఫోన్ చేస్తే గదుల వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. వెంటనే ధర్మాసనం కల్పించుకుని.. ఫోన్ చేసినప్పుడు స్పందించకపోతే వసతి కోసం ఎక్కడ వేచి ఉండాలని ప్రశ్నించింది. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీవోకు చెందిన వారెవరైనా ఉండాలి కదా అని అడిగింది. న్యాయవాది స్పందిస్తూ.. వసతి కోసమే గదులు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయని, అయితే భాగ్యనగర్ ఎన్జీవో సంఘం కార్యాలయ గది కూడా కావాలని పట్టుబడుతోందని చెప్పారు. మీ వాదనల్ని కౌంటర్ వ్యాజ్యంలో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకపోవడంతో ధర్మాసనం ఆదేశాల మేరకు గత వారం జరిగిన విచారణకు అశోక్‌బాబు స్వయంగా హాజరయ్యారు.
ఏపీఎన్జీవో అశోక్‌బాబుపై హైకోర్టు ఆగ్రహం
Published Sat, Apr 7 2018 4:13 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment