'స్పష్టత వచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తాం'
హైదరాబాద్ : ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సమ్మెపై ఐదురోజులుగా విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్జోవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుతో పాటు పలువురు ఎన్జీవోలు శనివారం కోర్టుకు హాజరయ్యారు. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... విరమించాలని హైకోర్టు ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోలను కోరింది. ఉద్యోగుల సమస్యలను కోర్టు సావధానంగా వింటుందని పేర్కొంది.
కాగా విచారణ వాయిదా అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమకు ఒక నిర్దిష్టమైన హామీ వచ్చేంతవరకూ సమ్మెను కొనసాగిస్తామని న్యాయస్థానానికి తెలియచేశామన్నారు. తమ స్టేట్మెంట్ను ప్రధాన న్యాయమూర్తి రికార్డు చేసుకున్నారని అశోక్ బాబు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రజల కోసమే తాము సమ్మె చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ముందుకు వెళుతున్నామని కేంద్రం నెల రోజులుగా చెబుతోంది.... ఏ అంశంపై ముందుకు వెళుతుందో వేచి చూద్దామని అశోక్ బాబు అన్నారు.