
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఏపీ ఎన్జీవో సంఘం భవనం లో భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘానికి భాగం ఇవ్వాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయలేదో స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబును హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని నోటీసులు జారీచేసింది.
తదుపరి విచారణకు స్వయంగా కోర్టుకు వచ్చి వివరణివ్వాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశించింది. గత ఉత్తర్వుల్ని అమలు చేయనందున అశోక్‌బాబుపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.