
టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్సీలకు మొండిచేయి!
ఐదుగురిలో ఒక్కరికీ అవకాశం లేదంటూ పార్టీలో ప్రచారం
యనమల రామకృష్ణుడికిమూసుకుపోయిన తలుపులు
దువ్వారపు రామారావు, అశోక్‌బాబు, బీటీ నాయుడికీ ఛాన్స్ కష్టమే
జంగా కృష్ణమూర్తికి మాట ఇచ్చి మరీ ఝలక్
అందరినీ అవసరానికి వాడుకుని ఇప్పుడు పట్టించుకోని వైనం
సాక్షి, అమరావతి: ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో సిట్టింగ్‌లకు అవకాశం లేనట్లేనని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉంటే వారిలో ఒక్కరికి కూడా సభ్యత్వాన్ని తిరిగి రెన్యువల్ చేసే పరిస్థితి లేదని నేతలు చర్చించుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెలాఖరులో పూర్తి కానుండగా, వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి గతంలోనే రాజీనామా చేశారు.
ఈ ఐదు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఐదింటిలో ఒకటి జనసేనకు కేటాయించగా, మిగిలిన నాలుగింటిలో ఒకటి బీజేపీకి ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అగ్ర నాయకత్వం రాజ్యసభ స్థానాలపైనే ఆసక్తి చూపుతూ, ఎమ్మెల్సీ స్థానాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక స్థానం తమకివ్వాలని కోరుతున్నా, జాతీయ నాయకత్వం ఆ దిశగా టీడీపీకి ఎటువంటి సూచనలు చేయలేదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం బీజేపీ నుంచి ఎవరికీ అవకాశం దక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాలుగు స్థానాలు టీడీపీ ఖాతాలోకే వెళతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇందులో ప్రస్తుతం ఆ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.

యనమలకు అవమానం!
పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడిని అవమానకరమైన రీతిలో పక్కన పెడుతున్నట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని రెన్యువల్ చేయకపోగా, పార్టీలోనూ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉండడంతోపాటు పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం ఉన్నా ఆయన్ను పట్టించుకోక పోవడం వెనుక లోకేశ్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది.
సీనియర్లను పూర్తిగా పక్కనపెట్టి, సొంత మనుషులతో కోటరీ నిర్మించుకుంటున్నారని పార్టీలో గుప్పుమంటోంది. ఈ క్రమంలోనే చాలా కాలంగా యనమల సహా చాలా మంది సీనియర్లకు అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ కోపంతోనే కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో చంద్రబాబు తీరును తప్పు పడుతూ యనమల లేఖ రాయడం ద్వారా కలకలం సృష్టించారు. అప్పటి నుంచి పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీతో సహా మరే పదవులు ఆయనకు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
మిగిలిన నలుగురికీ నిరాశే
ఉద్యోగ సంఘాల నేతగా ఉండి టీడీపీలో చేరి, పార్టీ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్‌బాబు, ఉత్తరాంధ్ర నుంచి గతంలో శాసన మండలికి వెళ్లిన దువ్వారపు రామారావు, రాయలసీమ కోటాలో మండలిలో ఉన్న బీటీ నాయుడి పేర్లను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ముగ్గురు మండలిలో చురుగ్గా ఉండి లోకేశ్‌తో కలిసి పని చేసినా, మారిన పరిస్థితుల్లో వారి అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం.
వారివల్ల అంత ఉపయోగం లేదనే కారణంతో ఎమ్మెల్సీ సభ్యత్వం రెన్యువల్ కోసం పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించినప్పుడు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనొకరు ఉన్నారనే విషయమే టీడీపీ అధిష్టానం గుర్తించడం లేదంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment