krishnamurthy
-
ఐదుగురు సిట్టింగ్‌లూ కరివేపాకులు!
సాక్షి, అమరావతి: ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో సిట్టింగ్‌లకు అవకాశం లేనట్లేనని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉంటే వారిలో ఒక్కరికి కూడా సభ్యత్వాన్ని తిరిగి రెన్యువల్ చేసే పరిస్థితి లేదని నేతలు చర్చించుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెలాఖరులో పూర్తి కానుండగా, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి గతంలోనే రాజీనామా చేశారు. ఈ ఐదు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఐదింటిలో ఒకటి జనసేనకు కేటాయించగా, మిగిలిన నాలుగింటిలో ఒకటి బీజేపీకి ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అగ్ర నాయకత్వం రాజ్యసభ స్థానాలపైనే ఆసక్తి చూపుతూ, ఎమ్మెల్సీ స్థానాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక స్థానం తమకివ్వాలని కోరుతున్నా, జాతీయ నాయకత్వం ఆ దిశగా టీడీపీకి ఎటువంటి సూచనలు చేయలేదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం బీజేపీ నుంచి ఎవరికీ అవకాశం దక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాలుగు స్థానాలు టీడీపీ ఖాతాలోకే వెళతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇందులో ప్రస్తుతం ఆ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. యనమలకు అవమానం!పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడిని అవమానకరమైన రీతిలో పక్కన పెడుతున్నట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని రెన్యువల్ చేయకపోగా, పార్టీలోనూ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉండడంతోపాటు పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం ఉన్నా ఆయన్ను పట్టించుకోక పోవడం వెనుక లోకేశ్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. సీనియర్లను పూర్తిగా పక్కనపెట్టి, సొంత మనుషులతో కోటరీ నిర్మించుకుంటున్నారని పార్టీలో గుప్పుమంటోంది. ఈ క్రమంలోనే చాలా కాలంగా యనమల సహా చాలా మంది సీనియర్లకు అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ కోపంతోనే కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో చంద్రబాబు తీరును తప్పు పడుతూ యనమల లేఖ రాయడం ద్వారా కలకలం సృష్టించారు. అప్పటి నుంచి పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీతో సహా మరే పదవులు ఆయనకు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మిగిలిన నలుగురికీ నిరాశేఉద్యోగ సంఘాల నేతగా ఉండి టీడీపీలో చేరి, పార్టీ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్‌బాబు, ఉత్తరాంధ్ర నుంచి గతంలో శాసన మండలికి వెళ్లిన దువ్వారపు రామారావు, రాయలసీమ కోటాలో మండలిలో ఉన్న బీటీ నాయుడి పేర్లను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ముగ్గురు మండలిలో చురుగ్గా ఉండి లోకేశ్‌తో కలిసి పని చేసినా, మారిన పరిస్థితుల్లో వారి అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం. వారివల్ల అంత ఉపయోగం లేదనే కారణంతో ఎమ్మెల్సీ సభ్యత్వం రెన్యువల్ కోసం పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించినప్పుడు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనొకరు ఉన్నారనే విషయమే టీడీపీ అధిష్టానం గుర్తించడం లేదంటున్నారు. -
చంద్రయాన్–3లో మన కృష్ణమూర్తి
కాకినాడ: చంద్రయాన్–3 విజయవంతం కావడంలో మన కాకినాడ వాసి భాగస్వామ్యం కూడా ఉందన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశమంతటా చంద్రయాన్ సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడే పుట్టి చదువుకున్న శాస్త్రవేత్త పాత్ర ఉంది. ఆయనే కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్లో చదువుకున్న కేవీ కృష్ణమూర్తి. ఆయన ఇస్రోలో స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ గ్రూపులో డ్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సాంకేతిక విద్యపై ఆసక్తితో ఆంధ్రా పాలిటెక్నిక్‌లో మెకానికల్ పూర్తి చేశారు. దివంగత కొల్లూరు శ్రీరామమూర్తి అవధాని, లక్ష్మీసోదమ్మల నాలుగో సంతానం ఆయన. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరి, అక్కడ ఎస్వీ రాజగోపాల్ ప్రోద్బలంతో ఏఎంఐఈఈలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత బెంగళూరులోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ సెంటర్ బదిలీ అయ్యారు. అక్కడ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ గ్రూపులో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. చంద్రయాన్–3లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్‌కు పీఎస్ఐ పూర్తి చేయడంలో కీలక పాత్ర వహించారు. ఈ ప్రక్రియ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు దోహదపడిందని ఆయన తెలిపారు. చంద్రయాన్–3 మిషన్ ఆపరేషన్‌లో ఆయన 45 రోజుల పాటు ఇతర శాస్త్రవేత్తలతో కలసి శ్రమించారు. ప్రస్తుతం ఆయన గగన్‌యాన్ ప్రాజెక్టులో కూడా పని చేస్తున్నారు. ఇస్రోలో 38 ఏళ్ల కెరీర్లో కృష్ణమూర్తి మూడు ప్రాజెక్టులకు డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేశారు. చంద్రయాన్–3 సక్సెస్ సమయంలో చివరి 17 నిమిషాలు నరాలు తెగేంత ఉత్కంఠను అనుభవించామని సాఫ్ట్ ల్యాండింగ్‌తో ఊపిరి పీల్చుకున్నామని కాకినాడలోని ఆయన కుటుంబ సభ్యులు సంతోషంగా చెప్పారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ సామర్థ్యం, ఇతర కేంద్రాల డైరెక్టర్ల మార్గదర్శకాలతో చేసిన సమష్టి కృషితో ఇది సాధ్యమైందని, ఈ మొత్తం ప్రాజెక్టులో తమ వాడు ఉండటం గర్వంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వెలిబుచ్చారు. కాగా ఆదిత్య ఎల్–1 శాటిలైన్‌లో ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కూడా కృష్ణమూర్తి ఆధ్వర్యంలోనే జరిగిందని అంటున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. హీరోగా ఎంట్రీ!
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. రాజేష్ దొండపాటి దర్శకత్వంలో పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 4న రిలీజ్ కానుంది. పెట్లా రఘురామ్ మూర్తి మాట్లాడుతూ– ‘‘నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి, ఘోస్ట్ రైటర్‌గా చేశాను. ఇక మా సినిమా కథ విషయానికి వస్తే... ఈ చిత్రంలో హీరో గొర్రెల కాపరి. కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అని హీరో చెబుతుంటాడు. ఇదే మాటను అతను ఊరి జనంతో చెప్పించాడా లేదా? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. -
సెయిల్ మాజీ ఛైర్మన్ వీ.కృష్ణమూర్తి కన్నుమూత
బిజినెస్ వరల్డ్‌లో విషాదం చోటు చేసుకుంది. మాజీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్), మారుతి సుజుకి చైర్మన్ వీ.కృష్ణమూర్తి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో వి.కృష్ణమూర్తి మరణించినట్లు సెయిల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కృష్ణమూర్తి సెయిల్‌లో 1985 నుంచి 1990 వరకు చైర్మన్‌గా విధులు నిర్వహించారు. "పద్మ విభూషణ్ డాక్టర్. వెంకట రామన్ కృష్ణమూర్తి మరణం పట్ల సెయిల్ కుటుంబం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుందంటూ" సెయిల్ విడుదల చేసిన ప్రటకనలో పేర్కొంది. ఆయన సేవలు మరువలేం! వెంకట రామన్ కృష్ణమూర్తి సెయిల్, బీహెచ్ఈఎల్ వంటి దిగ్గజ సంస్థలకు చైర్మన్‌గా వ్యవరించారు. వీటితో పాటు మారుతి ఉద్యోగ్(మారుతి సుజుకి), గెయిల్‌లో చైర్మన్‌గా ముఖ్య పాత్ర పోషించారు. కృష్ణ మూర్తి మరణంపై మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ. బార్గవ విచారం వ్యక్తం చేశారు. అవుట్ స్టాండింగ్ లీడర్, గొప్ప విజనరీ ఉన్న వ్యక్తి. ఆయన సారధ్యంలోనే మారుతి ఉద్యోగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. భారత్‌లో జపనీస్ వర్క్ కల్చర్‌ను పరిచయం చేసింది కృష్ణమూర్తేనని గుర్తు చేశారు. వ్యక్తి గతంగా సివిల్ సర్వీస్ నుంచి ఇండస్ట్రీలిస్ట్‌గా ఎదగడానికి కృష్ణమూర్తి ఎంతో తోడ్పడ్డారని చెప్పారు. కృష్ణమూర్తి గొప్ప దార్శానికుడు. నా గురువుగా..టీవీఎస్ మోటార్‌ను ఒక సామ్రాజ్యంగా విస్తరించడంలో చేసిన కృషి చిరస్మరణీయం. అంతేకాదు వ్యాపార రంగంలో దేశ ఎకానమీ వృద్ది కోసం పాటు పడిన వారిలో కృష్ణమూర్తి ఒకరని టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కొనియాడారు. -
6.5 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచీ వరుసగా 6.5 శాతం నుంచి 7 శాతం సుస్థిర వృద్ధి బాటన సాగుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ అంచనావేశారు. కేంద్రం చేపట్టిన వివిధ ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతిలో ఉందని కూడా వివరించారు. కోవిడ్–19 సెకండ్ వేవ్ ఎకానమీపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ దిగ్గజ విశ్లేషణా సంస్థ– డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) నిర్వహించిన ఒక వర్చువల్ కార్యక్రమంలో సుబ్రమణియన్ వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ముఖ్యమైనవి... ► గడచిన ఏడాదిన్నరగా కేంద్రం పలు సంస్కరణాత్మక చర్యలను తీసుకుంటోంది. వచ్చే దశాబ్ద కాలంలో ఆయా చర్యలు మంచి వృద్ధి ఫలాలను అందిస్తాయని నేను భావిస్తున్నాను. ► 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో రికవరీ బాగుంది. అయితే ఊహించని రీతిలో సవాళ్లు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా ఆరోగ్య మౌలిక రంగం తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. అయితే మొదటి వేవ్‌తో పోల్చితే ఎకానమీపై ప్రభావం పరిమితమే. ► వ్యవసాయం, కార్మిక రంగాల్లో సంస్కరణలు, ఎగుమతుల పీఎల్ఐ స్కీమ్, సూక్ష్మ లఘు మధ్య చిన్న తరహా పరిశ్రమల నిర్వచనం మార్పు, మొండిబకాయిలకు సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి పలు అంశాలు భవిష్యత్‌లో దేశాభివృద్ధిని సుస్థిర బాటన నడపనున్నాయి. ► మహమ్మారి నుంచి దేశం రికవరీ సాధించడానికి వ్యాక్సినేషన్ చాలా కీలకం. తద్వారా కోవిడ్–19ను సాధారణ ఫ్లూ కింద మార్చి, దాని తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. రెండేళ్ల పురోగతికి దూరమయ్యాము: వివేక్ దేవ్రాయ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ అంతకుముందు కార్యక్రమంలో మాట్లాడుతూ, 2021–22లో భారత్ ఎకానమీ వృద్ధి 10 శాతం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఇది బేస్ మాయగా (పోల్చుతున్న నెల లేదా ఏడాదిలో అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెల లేదా ఏడాదిలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్) ఆయన అంగీకరించారు. మహమ్మారి వల్ల దేశం రెండేళ్లు ఆర్థిక పురోగతిని కోల్పోయిందన్నారు. ప్రస్తుతం కన్నా దాదాపు రెట్టింపై 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఆవిర్భావం కల దూరమయ్యిందన్నారు. దీనితోపాటు 2030 నాటికి సుస్థిర ఆర్థికవృద్ధి (ఎస్డీజీ) లక్ష్యాలనూ భారత్ చేరుకోలేని పరిస్థితి ఎదురవుతోందని అన్నారు. -
కంపెనీల మైండ్‌సెట్ మారాలి
ముంబై: లాభాలు వచ్చినప్పుడు జేబులో వేసుకునే ప్రైవేటు సంస్థలు ..నష్టాలు వచ్చినప్పుడు సమాజంలో అందరికీ పులిమే ప్రయత్నాలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ హితవు పలికారు. అలాగే కష్టకాలంలో ప్యాకేజీలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరడం సరికాదని ఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రైవేట్ సంస్థల ’మైండ్‌సెట్’ మారాలని చెప్పారు. ఎకానమీ వృద్ధి చెందడానికి వినియోగం కన్నా పెట్టుబడులే ఎక్కువగా దోహదపడతాయన్నారు. -
ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఐఎస్బీ ప్రొఫెసర్
న్యూఢిల్లీ: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్ క్యాంపస్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. మూడు సంవత్సరాలపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అరవింద్ సుబ్రమణియన్ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవిని (సీఈఏ) ఈ ఏడాది జూలైలో వీడగా, అప్పటి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ పోస్ట్‌కు ఐఎస్బీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను నియమించాలన్న ప్రతిపాదనను కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదించినట్టు ప్రభుత్వం శుక్రవారం తెలియజేసింది. పారిశ్రామికాభివృద్ధి, విదేశీ వాణిజ్యం, పారిశ్రామిక ఉత్పత్తి, ప్రధాన ఆర్థిక విషయాల ప్రకటనల్లో కేంద్ర ప్రభుత్వానికి విధానపరమైన సూచనలు, సలహాలను సీఈఏ ఇవ్వాల్సి ఉంటుంది. అపార అనుభవం ఐఐటీ, ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన సుబ్రమణియన్ ఫైనాన్షియల్ ఎకనమిక్స్‌లో అమెరికాలోని షికాగో యూనివర్సిటీ, బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీయే, పీహెచ్డీ పట్టాలు పొం దారు. బ్యాంకింగ్, కార్పొరేట్ గవర్నెన్స్, ఎకనమిక్ పాలసీల్లో సుబ్రమణ్యం దిట్ట. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కార్పొరేట్ గవర్నెన్స్ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంకింగ్ గవర్నెన్స్ కమిటీల్లోనూ పనిచేశారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్, ప్రైమరీ మార్కెట్స్, సెకండరీ మార్కెట్స్, రీసెర్చ్ విషయాల్లో సెబీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించారు. బంధన్ బ్యాంకు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకు మేనేజ్మెంట్, ఆర్బీఐ అకాడమీ బోర్డులకు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2015 ఆర్థిక సర్వేపై అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌ను సహకారం అందించారు. ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్యతో కలసి 2009లో దివాలా కోడ్‌పై పనిచేశారు. కెరీర్ ప్రారంభానికి ముందే జేపీ మోర్గాన్ చేజ్‌కు కన్సల్టెంట్‌గా, ఐసీఐసీఐ బ్యాం కులోనూ పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ‘‘ఐఎస్బీ అధ్యాపకవర్గంలో ఒకరు కేంద్ర ప్రభుత్వంలో ఎంతో ముఖ్యమైన పదవికి ఎంపిక కావడం ప్రతిష్టాత్మకం. మేము గర్వపడాల్సిన విషయం’’ అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ డీన్ రాజేంద్రశ్రీవాస్తవ ప్రకటన చేశారు. సుబ్రమణియన్ ఐఎస్బీ హైదరాబాద్‌కు 2009లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేయడం ఆరంభించారు. 2010లో ఫైనాన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. -
పురుగుల మందు తాగి..
అమరాపురం : మండలంలోని ఆలదపల్లి గ్రామానికి చెందిన దాసప్ప కుమారుడు క్రిష్ణమూర్తి (30)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరు.. అతడు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు బేకరిలో పనిచేసేవాడు. ఆరు నెలల క్రితం సొంతంగా బేకరీని పెట్టాలనే ఉద్దేశంతో రూ.4 లక్షలు అప్పు చేసి అంగడి పెట్టాడు. అయితే వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో అధిక వడ్డీకి తెచ్చిన అప్పు ఎక్కువ కావడంతో ఎలా తీర్చాలో తెలియక కుటుంబ సభ్యుల వద్ద మధనపడేవాడు. శుక్రవారం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి శనివారం బెంగళూరుకు ప్రయాణమయ్యాడు. అయితే హల్కురు సమీపంలోని ఏపీఆర్ఎస్ పాఠశాల పక్కన వంక వద్ద పురుగుల మందు తాగి భార్యకు ఫోన్ చేశాడు. దీంతో వారు వచ్చి క్రిష్ణమూర్తిని మడకశిర ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. అతడికి భార్య మంజుళ ఎనిమిదేళ్ల పాపతో పాటు తల్లిదండ్రులు, సోదరులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఈరన్న ఆదివారం తెలిపారు. మృతదేహానికి మడకశిర ప్రభుత్వాసుప త్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. -
ఉప ముఖ్యమంత్రి కేఈకి పరాభవం
-
ప్రాణాలు తీస్తున్న వడదెబ్బ
సూర్యభగవానుడు అగ్నిగోళమై మండుతున్నాడు. వడగాల్పులతో జనం బిక్కచచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మంగళవారం మరో ముగ్గురు బలికావడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. పెద్దదిక్కును కోల్పోయి ఆయా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. గుంతకల్లు రూరల్: గుంతకల్లు మండలంలోని వై.టి.చెరువు గ్రామంలో చిన్నాయప్ప అలియాస్ ఆంజనేయులు(52) అనే వ్యవసాయ కూలీ వడదెబ్బతో మృతి చెందారు. సోమవారం కూలీ పనులకు వెళ్లొచ్చిన ఆయన రాత్రి ఇంటికి చేరుకున్నారని బంధువులు తెలిపారు. నీరసం, తలనొప్పిగా ఉందంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు చెప్పారు. ఆ వెంటనే ప్రాణం వదిలినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య సోమక్క, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రావిురెడ్డి(వైవీఆర్) మంగళవారం ఉదయాన్నే గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు దశరథరెడ్డి, శంకర్, జయరావిురెడ్డి, మద్దన్న, జయన్న, సిపాయి బాషా, గోపాల్, నరసింహులు, పక్కీరప్ప ఉన్నారు. డి.చెర్లోపల్లిలో మరొకరు... బత్తలపల్లి (ధర్మవరం): బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లిలో గుజ్జల కృష్ణమూర్తి(55) వడదెబ్బతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం కూలీ పనులకు వెళ్లిన అతను సాయంత్రం ఇంటికి రాగానే తీవ్ర తల, ఒళ్లు నొప్పులతో అస్వస్థతకు గురైనట్లు వివరించారు. తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. నాయనపల్లిలో ఇంకొకరు... నార్పల(శింగనమల): నార్పల మండలం నాయనపల్లిలో వల్లెపు ఆదినారాయణ(69) అనే గొర్రెల కాపరి వడదెబ్బకు గురై మంగళవారం సాయంత్రం మరణించినట్లు బంధువులు తెలిపారు. ఉదయం పొట్టేళ్లను మేత కోసం తోలుకెళి్లన ఆయన, మధ్యాహ్నం 3 గంటలకు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయినట్లు వివరించారు. తోటి కాపర్లు చికిత్స కోసం నాయనపల్లి క్రాస్‌లోని ఆస్పత్రి వద్దకు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు అక్కడి వైద్యుడు నిర్ధారించారన్నారు. మృతుని భార్య, కుమారుడు అనాథలయ్యారు. -
జయలలితకు కొడుకు ఉన్నాడా?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఓ కొడుకు ఉన్నాడా? ఆమె ఆస్తులన్నింటికీ అతడే వారసుడా? అమ్మ మరణించిన ఇన్నాళ్ల తర్వాత.. ఇప్పుడు తానే ఆమె కొడుకునంటూ ఓ వ్యక్తి ముందుకొచ్చారు. తన తల్లిని శశికళే చంపేశారని.. అమ్మ ఆస్తులన్నింటికీ తానే అసలైన వారసుడినని చెప్పారు. గత సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత.. 72 రోజుల తర్వాత డిసెంబర్ 5న మరణించారు. దాంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పన్నీర్ సెల్వం, శశికళ, దీప వర్గాల మధ్య అధికారం కోసం తీవ్రస్థాయిలో పోరాటం జరగడం, మధ్యలో శశికళ జైలుకు వెళ్లడం, చివరకు ఆమె వర్గానికే చెందిన ఎడప్పాడి పళనిస్వామి సీఎం పదవి చేపట్టడం తెలిసిందే. కొత్త కొడుకు ఎవరు? చెన్నైలోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి.. జయలలితకు తానే అసలైన కొడుకునని, తన తల్లిని హత్య చేశారని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. తాను జయలలిత స్నేహితురాలు వనితామణి ఇంట్లో తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులతో కలిసి ఉంటానని అందులో చెప్పారు. తాను 2016 సెప్టెంబర్ 14వ తేదీన చివరిసారిగా జయలలితను పోయెస్ గార్డెన్స్‌లో కలిశానని, అప్పుడు అక్కడే నాలుగు రోజులు ఉన్నానని తెలిపారు. తనను సొంత కొడుకుగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని అమ్మ అనుకున్నారని.. అయితే ఈ విషయం శశికళకు తెలియడంతో వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని అన్నారు. సెప్టెంబర్ 22న ఇదే వివాదంలో శశికళ తన తల్లి జయలలితను మేడ మెట్ల నుంచి తోసేసి ఆమెను చంపేశారని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇన్నాళ్లూ ఎందుకు మౌనం? ఇవన్నీ బయటపెడితే తన ప్రాణానికి ముప్పు ఉంటుందన్న భయంతోనే తాను ఇన్నాళ్లూ మౌనంగా ఊరుకున్నానని, కానీ చివరకు ఎలాగోలా వాస్తవాలను బయటపెట్టాలన్న ధైర్యాన్ని కూడగట్టుకున్నానని కృష్ణమూర్తి చెప్పారు. జయలలితకు ఏకైక కొడుకును తానే కావడంతో.. ఆమె ఆస్తులన్నింటికీ కూడా తానే వారసుడినని ఆయన ప్రకటించుకున్నారు. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామికి ఈ విషయమై కృష్ణమూర్తి ఓ లేఖ రాశారని తెలుస్తోంది. ఆయన సలహా మేరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశారంటున్నారు. మొత్తమ్మీద జయలలిత మృతి విషయం మాత్రం ఇప్పటికీ ఇంకా జనం నోళ్లలో ఏదో ఒక పేరుతో నానుతూనే ఉంది. -
ఆరని అసమ్మతి సెగలు
- అవినీతిపరుల విషయం తేల్చనిదే సంస్థాగత ఎన్నికలు జరగనివ్వం - పీఏ, ఆయన అనుచరుల అవినీతిపై పట్టుబట్టిన అసమ్మతి నాయకులు హిందూపురం అర్బన్ : హిందూపురం నియోజకవర్గ టీడీపీలో అమస్మతి సెగలు ఆరిపోకపోగా రోజురోజుకూ ఎగసిపడుతున్నాయి. ఇక్కడి పరిస్థితిని చక్కదిద్ది సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని విచ్చేసిన పార్టీ పరిశీలకుడు కృష్ణమూర్తి ఎదుట అసమ్మతి నాయకులు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, మహిళా సంఘాల నాయకులు హాజరై ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్, అతని అనుచరులుగా చెలామణి అవుతున్న చిలమత్తూరు, లేపాక్షి ఎంపీపీలు చేసిన అవినీతిపై ఏకరువు పెట్టారు. అవినీతిపరులను పార్టీ, పదవుల నుంచి తప్పించకపోతే భవిష్యత్తులో పార్టీకి ఆదరణ లేకుండా పోతుందని చెప్పుకొచ్చారు. మూడు రోజులుగా నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి అక్కడి నాయకులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్న కృష్ణమూర్తి శనివారం రాత్రి హిందూపురంలోని అంబికా లక్ష్మీనారాయణ నివాసంలో అసమ్మతి నాయకులు, కొన్ని సంఘాల వారితో సమావేశమయ్యారు. చిలమత్తూరు, లేపాక్షికి చెందిన నాయకులు పీఏ శేఖర్ కారణంగా తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అలాగే శేఖర్ వసూళ్ల పర్వాన్నీ వివరించారు. ఆయన అవినీతి, అక్రమాలు, అతని అనుచరుల దురాగతాలపై నిగ్గు తేల్చనిదే పార్టీ సంస్థాగత ఎన్నికలను జరగనిచ్చేది లేదని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ వర్గీయులు తేల్చి చెప్పారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు పార్టీలో ముఖ్యమైన నాయకులతోపాటు చాలామంది సభ్యత్వాలు కూడా తీసుకోలేదన్నారు. గతంలో సభ్యత్వ నమోదులు, ఓటరు జాబితా చూసి పేర్లు రాసుకుని ఆయా గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో రూ.లక్షలు వసూలు చేశారన్నారు. అర్హులైన కార్యకర్తల పేర్లు కూడా నమోదు కాలేదని మండిపడ్డారు. లక్షలాది రూపాయల వసూలు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సంఘాల వారితో పీఏ శేఖర్ రూ.లక్షలు వసూలు చేశారని అసమ్మతి నాయకులు ఆరోపించారు. లారీ అసోసియేషన్ వారిపై పోలీసులతో ఒత్తిడి చేయించి వారికి లోడింగ్ ఇవ్వకుండా నెలసరి మామూళ్లు ఇచ్చే మరో సంఘం వారికే పారిశ్రామికవాడలో లోడింగ్ చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మధ్యాహ్న ఏజెన్సీ, స్టోర్ డీలర్లను కూడా వదలకుండా నియామకాలకు డబ్బులు వసూలు చేశారన్నారు. గతేడాది రాష్ట్రంలో వరదలు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపుతో ప్రతి కార్యకర్తా జోలె పట్టి వసూలు చేసిన డబ్బును కూడా కాజేశారని ఆవేదన చెందారు. విజిలెన్స్ అధికారులను ఉసిగొల్పి మెడికల్ అసోసియేషన్, ముద్దిరెడ్డిపల్లిలో సొసైటీ, చీరల వ్యాపారులు, స్వర్ణకారులు ఇలా అన్ని వర్గాల వారితో రూ.కోట్లు దండుకున్నారని, ఇందుకు సాక్ష్యాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. రిజిస్టర్ ఆఫీసులో ప్రతి రిజిస్ట్రేషన్‌కూ పీఏ అనుమతి తప్పనిసరి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకే ఇస్తే బాగుంటుంది : కృష్ణమూర్తి ఇంత దారుణంగా వసూళ్లకు పాల్పడిన వ్యక్తులకు కాకుండా స్థానికులకే బాధ్యత ఇవ్వడం భావ్యమని కృష్ణమూర్తి తన అభిప్రాయంగా చెప్పారు. ఆదివారం సాయంత్రం హిందూపురం నుంచి బయలుదేరతానని, ఇక్కడి విషయాలను పూర్తిస్థాయిలో ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణతో పాటు చిలమత్తూరు జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి, మార్కెట్‌యార్డు డైరెక్టర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
కదిరి : మున్సిపల్ పరిధిలోని ఇందిరాకాలనీలో కాపురముంటున్న వాచ్మెన్ ఓదులపల్లి క్రిష్ణమార్తి(58) మంగళవారం కాలనీకి సమీపంలోని దయ్యాలతోపులో చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి కథనం ప్రకారం.. క్రిష్ణమూర్తి స్వగ్రామం నల్లమాడ మండలం చారుపల్లి. పొట్టకూటికోసం 20 ఏళ్లక్రితం భార్యాపిల్లలతో ఈయన కదిరికి కాపురం వచ్చారు. ఆయనకు భార్య సునందమ్మ, ఇద్దరు కొడుకులున్నారు. ఇతను పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లదగ్గర వాచ్‌మెన్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవలే పెద్ద కొడుకు హేమంత్‌కు బెంగుళూరులో బార్బర్షాప్ ఏర్పాటు చేయించేందుకు కదిరి ప్రాంతంలో పలువురి దగ్గర సుమారు రూ.4 లక్షలు అప్పు చేశాడు. చిన్న కొడుకు కార్తీక్ పేపర్‌బాయ్‌గా చేస్తూ కదిరిలో ఇంటర్ చదువుతూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు. అప్పు తీర్చేమార్గం కానరాక సోమవారం రాత్రి లుంగీతోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘స్వచ్ఛభారత్’ లక్ష్యంగా పనిచేయాలి
జిల్లాపరిషత్ : ‘స్వచ్ఛభారత్’ లక్ష్యంగా పనిచేయాలని జిల్లాపంచాయతీ అధికారి (డీపీవో) కృష్ణమూర్తి సూచించారు. ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం నిజామాబాద్ సుభాష్‌నగర్‌లోగల జెడ్పీ సమావేశ మందిరంలో ‘స్వచ్ఛ’ పక్షోత్సవాలపై టీవోటీలకు ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడారు. 2019 అక్టోబర్ 2న గాంధీజీ 150వ జయంతి ఉందని, అప్పటివరకు దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా మార్చాలనేది కేంద్రప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని, ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. పొడి చెత్త, తడి చెత్తను వేరువేరుగా చేసి డంపింగ్ యార్డులలో పారేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు క్లోరినేషన్ చేసిన నీటినే తాగాలని డీపీవో ప్రజలకు సూచించారు. 2న గ్రామసభలు నిర్వహించాలి.. స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి 15 వరకు స్వచ్ఛ పక్షోత్సవాలను నిర్వహించాలని ఆదేశించిందన్నారు. అందులో భాగంగా 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా గ్రామసభను ఏర్పాటుచేసి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. 15వ తేదీన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించాలన్నారు. శిక్షణ పొందిన టీవోటీలు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, గ్రామజ్యోతి ఏడు కమిటీల కన్వీనర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. స్వచ్ఛ పక్షోత్సవాలను విజయవంతం చేసేలా చర్యలు చేపట్టాలని డీఎల్పీవోలు, ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలకు సూచించారు. పక్షోత్సవాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాల జాబితాను టీవోటీలకు అందజేశారు. శిక్షణలో డీఎల్పీవోలు హనూక్, రాములు, ఎంవోటీలు సంజీవ్‌కుమార్, చందర్ నాయక్, నాగవర్ధన్, సతీశ్‌రెడ్డి, రాంనారాయణ, వీరభద్రం, టీవోటీలు పాల్గొన్నారు. -
ఆయనో భ‘వనమాలి’
మేడపైనే ఆయన పెరడు ∙పూలూ, కూరలూ బోలెడు రాజమహేంద్రవరం రూరల్ : ఇల్లంటే.. ఇటుకలూ, కాంక్రీటూ, తలుపులూ, కిటికీలుండి, కొన్ని రంగుల్ని అద్దుకునే కట్టడమే కాదు.. కాసింత పచ్చదనాన్నీ సంతరించుకోవాలనుకునే వారు చాలామందే ఉంటారు. ఏవైనా మెుక్కలు పెంచాలన్న మక్కువా ఉంటుంది. అయితే అలా పెంచి తృప్తిని సొంతం చేసుకునే అవకాశం అందరికీ ఉండదు. ఎందుకంటే.. ఎందరో ఫ్లాట్లలో లేదా పెరడు లేని ఇళ్లలో నివసిస్తున్న ఈరోజుల్లో మెుక్కలు పెంచాలన్న తపన ఉన్నా ఆచరణలో సాధ్యం కాదు. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన సవిరిగాని కృష్ణమూర్తికీ మెుక్కల పెంపకమంటే ప్రీతి. ఆయన ఇంటికీ పెరడులేదు. అలాగని.. ‘చేసేదేముందిలే’ అని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. డాబాపై భాగాన్నే పెరడును సృష్టించుకున్నారు. వివిధ రకాలు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పూలూ పూయిస్తున్నారు. రెండేళ్ళ క్రితం హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని పెద్దకుమార్తె ఇంటికి వెళ్ళారు. అక్కడ పక్కనున్న డాబాపై కూరగాయలు సాగు చేయడాన్ని చూసిన కృష్ణమూర్తి అదే స్ఫూర్తితో తానూ భ‘వనాని’కి శ్రీకారం చుట్టారు. పొడవాటి తొట్టెలను తయారు చేయించారు. వాటితో పాటు డబ్బాలు, కుండీలలో మట్టిని నింపి, సేంద్రియ ఎరువులను వేసి బెండ, వంగ, బీర, కాకర, దోస, చిక్కుడు, గోరుచిక్కుడు, బొబ్బరచిక్కుడు, పచ్చి మిరప వంటి మెుక్కలూ, పాదులూ పెంచుతున్నారు. తోటకూర, గోంగూర, బచ్చలి, కొత్తిమీర వంటి ఆకుకూరలనూ పండిస్తున్నారు. కరివేపాకు మొక్కలనూ పెంచారు. అనేక రకాల పూలమెుక్కలతో పాటు పూజ కోసం తమలపాకులను సైతం పండిస్తున్నారు. ఉదయం లేవగానే భ‘వనమాలి’గా మొక్కల సంరక్షణే ఆయన వ్యాపకం. ఆ కృషిలో భార్య దుర్గ చేదోడుగా ఉంటారు. కృష్ణమూర్తి దంపతులు రెండేళ్లుగా తమ కూరల ఖర్చును గణనీయంగా తగ్గించుకోవడమే కాక.. ‘మేడ మీది పెరడు’లో కాసిన వాటిని ఇరుగుపొరుగుకూ, బంధుమిత్రులకూ ఇస్తున్నారు. -
భూసార పరీక్షల ల్యాబ్ ఏర్పాటుకు సన్నాహాలు
– డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కృష్ణమూర్తి చిలమత్తూరు : భూసార ప్రయోగ పరీక్షలకు సంబంధించిన ల్యాబ్‌లను జిల్లాలో 10 కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రార ంభించామని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కష్ణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక మార్కెట్ యార్డు గోదామల సమీపంలో ల్యాబ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన వసతులను పరిశీలించారు. గతంలో జిల్లాలో అనంతపురం, ధర్మవరం, పెనుకొండ ప్రాంతాల్లో మాత్రమే భూసార ప్రయోగశాలలు ఉండేవి. ప్రస్తుతం రూ.28 లక్షలతో మడకశిర, ఉరవకొండ, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, హిందూపురం, కదిరి, గుంతకల్లు, శింగనమల, తాడిపత్రి ప్రాంతాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఏడీఏ రోషన్ వలీ, ఇన్చార్జ్ ఏఓ సురేంద్రనాయక్, ఏఈఓ మల్లికార్జున ఆయనతో పాటు ఉన్నారు. -
తల్లికన్నా గోమాత గొప్పది
తిరుపతి కల్చరల్: గోమాత తల్లికన్నా గొప్పదని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి ఉద్ఘాటించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో గో ప్రదక్షిణశాలకు మంగళవారం ఉదయం ఆయన భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ పురాణాల్లో గోమాతకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, స్థానికులు ముందుగా గోమాతకు పూజలు చేసేలా ఇక్కడ గో ప్రదక్షిణశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడు జి.శేఖర్‌రెడ్డి సొంత నిధులతో దీన్ని చేపట్టడం ఆనందదాయకమని పేర్కొన్నారు. రూ.67 లక్షలతో 4,468 ఎస్ఎఫ్టీ వైశాల్యంలో నిర్మించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ గోప్రదక్షిణ శాల ఏర్పాటుతో గోమాతకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు జి.శేఖర్‌రెడ్డి, డాక్టర్ బాల వీరాంజనేయులు స్వామి, జి.భానుప్రకాష్‌రెడ్డి, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, సుచిత్ర ఎల్లా, ఏవీ.రమణ, డీపీ అనంత సంపత్ రవి నారాయణన్, అరికొల నరసారెడ్డి, టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింత రామచంద్రారెడ్డి, గోసంరక్షణ శాల సంచాలకుడు హరినాథ్‌రెడ్డి, టీటీడీ ఎస్ఈ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
హొసూరు (తమిళనాడు): తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా చెక్కినాంపట్టి గ్రామంలో రూ. 2 కోట్ల విలువైన నాలుగు టన్నుల ఎర్ర చందనం దుంగలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా రొంపిచెర్ల పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రొంపిచర్లలో మాస్ (35) అనే ఎర్రచందనం స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతడిచ్చిన సమాచారంతో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట మొదలుపెట్టారు. రొంపిచర్ల ఇన్స్పెక్టర్ నరసింహన్ ఆధ్వర్యంలో 20 మంది పోలీసులు బృందంగా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం చెక్కినాంపట్టి గ్రామంలో నివాసముంటున్న కృష్ణమూర్తి ఇంట్లో సోదాలు చేశారు. నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. అప్పటికే స్మగ్లర్ కృష్ణమూర్తి పరారీ అయ్యాడు. అతని ఇంటి యజమాని రామకృష్ణను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన బాలాజీతో కలిసి కృష్ణమూర్తి కొన్నేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
బంగారు వాకిలికి సొబగులు
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని ద్వారపాలకులు జయవిజయుల విగ్రహాల మధ్యలో ఉండే బంగారు వాకిలికి అమర్చిన బంగారు రేకులు శిథిలావస్థలో ఉన్నాయి. వీటికి కొత్త బంగారు రేకులు అమర్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అందుకు అయ్యే రూ. 86 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖర్‌కు అనుమతిస్తూ తీర్మానం చేసింది. శుక్రవారం టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సమావేశం వివరాలను చైర్మన్, ఈవో, జేఈవో మీడియాకు వివరించారు. తీర్మానాలు ► తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ కోసం టీటీడీ రెండో సత్రం వద్ద 2.74 ఎకరాల స్థలాన్ని రైల్వేశాఖకు అప్పగించనున్నారు. దీనికి బదులుగా తిరుచానూరు వద్ద ఉన్న రైల్వే స్థలాన్ని టీటీడీకి అప్పగించనుంది. ► శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పోలూరు గ్రామంలోని పురాతన శ్రీఅలగమల్లారి కృష్ణస్వామి ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకోనున్నారు. ► తెలంగాణ ప్రభుత్వం శ్రీవారికి రూ. 5 కోట్ల విలువైన సాలిగ్రామహారం, ఐదు పేటల కంఠె (కంఠహారం) వితరణకు అనుమతి. ► రూ. 2.55 కోట్లతో పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి. ► తిరుపతి కోదండరామస్వామి ఆలయం లో అమావాస్య రోజున సహస్ర కలశాభిషేకం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవలు, ఆర్జిత సేవలు ప్రారంభానికి నిర్ణయం. -
పైకప్పు కూలి - వ్యక్తి దుర్మరణం
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో ఇంటి పైకప్పు భాగం కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ ఘటన జరిగింది. కృష్ణమూర్తి అనే వ్యక్తి (45) నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో... వర్షానికి బాగా నానిన పైకప్పు కొంత భాగం భాగం ఊడి మీద పడింది. తీవ్రంగా గాయపడిన అతడు మంచంపైనే ప్రాణాలు వదిలాడు. వర్షాలతో ఈ గ్రామానికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో దాసరి కొండమ్మ (80) చలిగాలులు తట్టుకోలేక ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. -
మృతుడు మా ఆయనే
బోరున విలపించిన భార్య సాక్షి కథనంతో వెలుగులోకి వచ్చిన గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ మృతదేహం బంధువులకు అప్పగింత కురబలకోట : గుర్తుతెలియని మృతదేహాన్ని పూడ్చుతుండగా ఆఖరి నిమిషంలో అయిన వారు రావడంతో వారికి అప్పగించిన ఘటన మంగళవారం అంగళ్లులో జరిగింది. ముదివేడు ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. సోమవారం ఉదయం మండలంలోని అమ్మచెరువు మిట్ట వద్దకు ఓ వ్యక్తి వచ్చి పురుగుల మందు తాగేశాడు. స్థానికులు గుర్తించి వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. గుర్తుతెలియని శవంగా ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం సాక్షి దినపత్రికలో మంగళవారం ఫొటోతో సహా ప్రచురితమైంది. బంధువులు ఎవరైనా వస్తారేమోనని సాయంత్రం వరకు మార్చురీలోనే శవాన్ని ఉంచారు. ఎవరూ రాకపోవడంతో పోలీసులు శవాన్ని అంగళ్లు మల్లేల గడ్డ చెరువులో పూడ్చడానికి తీసుకెళ్లారు. ఇంతలో ఎస్ఐ వెంకటేశ్వర్లు ఫోన్ కాల్ వచ్చింది. ‘సార్..సాక్షి పేపర్లో ఈ రోజు గుర్తుతెలియని వ్యక్తి పురుగుల మందు తాగి మృతిచెందినట్లు వార్త వచ్చింది .. ఆ వ్యక్తి తమ తన భర్తే’నని ఓ మహిళ తెలిపారు. ఎక్కడున్నారంటూ ఫోన్ రావడంతో పోలీసులు శవాన్ని పక్కన పెట్టించారు. కొంత సేపటికే మృతుడి భార్య కళావతి, బంధువులు వచ్చి శవాన్ని చూసి గుర్తించారు. బోరున విలపించారు. ఈ మృతదేహం తన భర్త కృష్ణమూర్తి (41)దేనని చెప్పడంతో ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకుని శవాన్ని వారికి అప్పగించారు. కుటుంబ గొడవల వల్ల ఇతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన ఇతను 15 ఏళ్లుగా మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో మగ్గాలు వేస్తూ జీవనం సాగించేవాడని చెబుతున్నారు. ఇతని భార్య టీకొట్టు నిర్వహించేదని చెబుతున్నారు. సాక్షిలో ఫొటో వార్త రాకపోయి ఉంటే కడ చూపే కాదు విషయం కూడా తెలిసి ఉండేది కాదని మృతుడి బంధువుల తరపున వచ్చిన కుమ్మరి సంఘం నాయకులు అన్నారు. -
ఆటో ఢీకొని ఒకరి పరిస్థితి విషమం
పాతపట్నం(శ్రీకాకుళం): ఆర్టీసీ బస్సులోంచి దిగుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని నవతల జంక్షన్ వద్ద శనివారం జరిగింది. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న తోట కృష్ణమూర్తి(45) శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులోంచి దిగుతున్న సమయంలో.. శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఆటో అతడిని ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
కోట్లు మా బిడ్డల్ని తిరిగి తెస్తాయా?
న్యూఢిల్లీ : తీవ్ర విషాదాన్ని నింపిన ఢిల్లీలోని ఉపహార్ సినిమాహాల్ అగ్నిప్రమాదం కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ సోదరులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కిందికోర్టు వారికి విధించిన జైలు శిక్షను రద్దు చేసి, రూ. 60 కోట్ల జరిమానా విధించడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఈ తీర్పును అంగీకరించొద్దని విజ్ఙప్తి చేస్తూ బాధిత కుటుంబాలు శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. వాళ్లు చెల్లించే పరిహారం చనిపోయిన తమ బిడ్డలను తిరిగి ఇస్తుందా అని ఉపహార్ బాధితుల సంఘం అధ్యక్షురాలు నీలం కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన కేజ్రీవాల్... సుప్రీం తీర్పు బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తీర్పును తాము అంగీకరించమని కేజ్రీవాల్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. భారత న్యాయ వ్యవస్థపై బాధిత కుటుంబ సభ్యుల్లో విశ్వాసాన్ని నెలకొల్పేందుకు ఇంకా చాలా చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కాగా ఉపహార్ కేసులో అన్సల్ సోదరులకు కిందికోర్టు విధించిన ఏడాది జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పటికే వాళు శిక్షను అనుభవించారని పేర్కొంటూ బాధితులకు 60 కోట్ల రూపాయాలను పరిహారాన్ని చెల్లిస్తే సరిపోతుందని బుధవారం న్యాయస్థానం తీర్పుచెప్పిన సంగతి తెలిసిందే. 1997 జూన్ 13న బోర్డర్ అనే సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన 59 మందిలో నీలం కృష్ణమూర్తి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దీంతో గత 18 సంవత్సరాలుగా ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. -
అపర్ణకు ...అవేవీ అడ్డు కాలేదు..
పెళ్లి.. భర్త.. పిల్లలు... సంసారం... అనుకున్న లక్ష్యానికి అవేవీ అడ్డుకాలేదు. పట్టు పట్టిందంటే శపథం నెరవేరేదాకా విశ్రమించలేదు ఆ ధీర వనిత. ఆడపిల్ల రైల్వే పోలీసేంటి అనుకుంటున్న తరుణంలో ఏకంగా తెలంగాణలోనే ఏకైక రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ మహిళా ఎస్సైగా దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం సాధించి జిల్లా కీర్తి కిరీటాన్ని దేశమంతటా చాటిచెప్పింది కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తికి చెందిన ఆడెపు అపర్ణ. ఎల్కతుర్తి : ఎల్కతుర్తికి చెందిన ఆడెపు అపర్ణాదేవి... ఇద్దరు పిల్లల తల్లి. కానీ, చదువుపై ఉన్న శ్రద్ధ ఆమెను ఇంటికే పరిమితం చేయలేదు. పట్టుదలతో శ్రమించేలా చేసింది. అనుకున్న లక్ష్యానికి చేరువ చేసింది. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌కు చెందిన ఆడెపు పుష్పనీల-కృష్ణమూర్తి దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి సంతానం. బతుకుదెరువు నిమిత్తం ఈ కుటుంబం వరంగల్ జిల్లా భూపాలపల్లికి వలసవెళ్లింది. కృష్ణమూర్తి ఆర్ఎంపీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను చదివించాడు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కూతురు అపర్ణాదేవికి ఎల్కతుర్తికి చెందిన మేన బావ వల్లాల శ్యాంసుందర్‌తో 2003లో వివాహం జరిపించారు. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో చిరు ఉద్యోగి. అప్పటికి అపర్ణ ఇంటర్ చదువుతోంది. చదువుపై మక్కువ తగ్గని ఆమె, తాను చదువుకుంటానని, ఎప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని ఉందని భర్త శ్యాంసుందర్‌తో చెప్పి అత్తవారింట్లో ఒప్పించింది. పెళ్లయ్యాక కుటుంబ బాధ్యతలతో చదువుపై ధ్యాస తగ్గుతుందని బంధువులు, కుటుంబసభ్యులు చెప్పిచూసినా ఆమె పట్టు విడువలేదు. దీంతో అత్తారింట్లోనూ ప్రోత్సహించారు. డిగ్రీ పూర్తయ్యేసరికి ఆమె ఇద్దరు కూతుళ్ల తల్లి అయింది. కుటుంబ బాధ్యతలు మోస్తూనే బీఈడీ కూడా పూర్తి చేసింది. పెద్దకూతురు శ్రీవళ్లి ఇప్పుడు నాలుగో తరగతి చదువుతుండగా, చిన్నకూతురు శీవర్ష ఒకటో తరగతి చదువుతోంది. అవకాశాన్ని అందుకుంది దక్షిణమధ్య రైల్వేలో 2010లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్సైల నోటిఫికేషన్ వెలువడింది. పట్టుదలగా చదివి పరీక్ష రాసిన అపర్ణ 2012లో ప్ర కటించిన ఫలితాల్లో ఆర్పీఎఫ్ ఎస్సైగా సెలక్ట్ అయ్యింది. ప్రభుత్వోద్యోగం సాధించాలన్న తన కల నిజమైనందుకు ఎంతో సంతోషించింది. ఒక మహిళ రైల్వే పోలీసుగా చెయ్యడమేం టని, పిల్లల సంగతేంటని ఎంతోమంది సూటిపోటి మాటలన్నప్పటికీ భర్త, అత్తగారింట్లో ప్రోత్సాహంతో పిల్లల ఆలనాపాలనా వారికి అప్పగించి శిక్షణకు వెళ్లింది. గతేడాది డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 19 వరకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జేఆర్ ఆర్పీఎఫ్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసింది. శిక్షణ సమయంలోనే నెలకు రూ.29 వేల వేతనాన్ని అందుకుంది. అపర్ణ తమ్ముడు రాజేంద్రప్రసాద్ సైతం సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తొలి తెలంగాణ తేజం ఇప్పటివరకు ఆర్పీఎఫ్ 52 బ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ ఒక్క మహిళ ఎంపిక కాలేదు. 53వ బ్యాచ్ నుంచి ముగ్గురు మహిళలు ఆర్పీఎఫ్ ఎస్సైలుగా ఎంపిక కాగా అందులో ఒకరు రాయలసీమ, మరొకరది గుంటూరు కాగా, తెలంగాణ నుంచి ఈ అరుదైన అవకాశం ఆడెపు అపర్ణాదేవికి దక్కింది. జార్ఖండ్‌లో పోస్టింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న అపర్ణకు ఈ నెల 3న జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో ఆర్పీఎఫ్ ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు. రైల్వే స్థిర, చరాస్తులు కాపాడడం, రైళ్లలో జరిగే దొంగతనాలు, అక్రమాలు, అన్యాయం అరికట్టడం ఆమె విధులు. ప్రభుత్వోద్యోగం సాధించాలన్న కల సాకారం చేసుకున్న అపర్ణ ఈ క్రమంలో తను పడ్డ శ్రమను, శిక్షణలో అనుభవించిన కష్టాలను మరిచిపోయి రెండు రోజుల క్రితం ఎల్కతుర్తికి వచ్చింది. భర్త, పిల్లలు, కుటుంబసభ్యులను కలుసుకుని శిక్షణలో తన అనుభవాలను వారితోపాటు ‘సాక్షి’తో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది. పట్టుదలతోనే... పట్టుదల ఉంటే ఎంతటి అడ్డంకులైనా గడ్డిపోచతో సమానమే. పిల్లలు పుట్టారని చదవకుండా ఊరుకుంటే ఇప్పుడీ స్థాయికి వచ్చేదాన్ని కాదు. కష్టమనుకోకుండా ఇష్టపడి లక్ష్యాన్ని చేరుకున్నాను. మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. నా వేతనం నెలకు రూ.35 వేలపైనే ఉంటుందని తెలుస్తోంది. మొదటి వేతనం ఇంకా తీసుకోలేదు. నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే నాభర్త, తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉంది. త్వరలోనే మన రాష్ట్రానికి ఎస్సైగా రావాలని కోరుకుంటున్నా. - అపర్ణ -
డీపీఓ బదిలీ
ఇందూరు : జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు బదిలీ అయ్యారు. ఆయనను నల్గొండ జిల్లాకు బదిలీ చేస్తూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు నల్గొం డ డీపీఓ కృష్ణమూర్తి బదిలీపై వస్తున్నారు. కృష్ణమూర్తి హైదరాబాద్‌కు చెందినవారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ సెలవు నుంచి రాగానే సురేశ్‌బాబు రి లీవ్ అవుతారు. ఆ తర్వాత కృష్ణమూర్తి జిల్లాకు వచ్చి విధుల్లో చేరుతారు. సురేశ్‌బాబు జిల్లాకు డీపీఓగా 2010 మే 11న వచ్చారు. నాలుగున్నర సంవత్సరాల పాటు పని చేసిన ఆయనకు ముక్కుసూటితనం, నిక్కచ్చి గా వ్యవహరించడం, పైరవీలకు తావిచ్చేవారు కాదని పేరుంది. అసెంబ్లీ, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తనదైన శైలిలో పనిచేసి ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఎక్కడా కూడా రీ పోలింగ్ జరగకుండా, పొరపాట్లు లేకుండా పనిచేసిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. లోతుగా పరిశీలించి పని చేయడం, క్షుణ్ణంగా చూసిన తరువాతే ఫైళ్లపై సంతకాలు చేయడం ఆయన ప్రత్యేకతలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే, దాని తరువాత పెన్షన్, ఆహార భద్రతా కార్డుల సర్వేలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్‌లో సర్వే వేగవంతం చేయడానికి తోడ్పడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన వర్క్‌షాపుల్లో పాల్గొన్నారు. పథకాల అమలు, పంచాయతీ రాజ్ నూతన చట్టం తయారీలో ప్రభుత్వానికి సలహాలిచ్చారు. ప్రభుత్వం నుంచి రాష్ట్ర అధికారుల నుంచి ఎన్నో ప్రసంశలు పొందారు. జిల్లాలో అత్యధిక కాలం పని చేసిన జిల్లాస్థాయి అధికారి సురేశ్‌బాబే కావడం గమనార్హం. పలుమార్లు జరిగిన బదిలీల్లో ఈయన పేరు ఉన్నప్పటికీ కలెక్టర్లు నిలిపివేయించారు. -
ఆళ్లగడ్డలో పోటీ చేయం: టీడీపీ
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. తమ పార్టీ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సి.ఎం. రమేశ్ సోమవారం సచివాలయంలో వెల్లడించారు. ఆళ్లగడ్డ ఎన్నిక విషయంలో వైఎస్సార్సీపీ చేసిన వినతిని పరిగణనలోకి తీసుకుని వచ్చే నెల 8న జరిగే ఎన్నికలో టీడీపీ పోటీలో ఉండదని కేఈ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున భూమా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. అయితే ఎన్నికల ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. అయినా ఆ ఎన్నికల్లో ఆమెకు ప్రజలు ఘనవిజయం అందించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలసి పోటీ విషయమై విజ్ఞప్తి చేయాలని వైఎస్సార్సీపీ నేతలు నిర్ణయించారు. అయితే హుదూద్ సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు బాబు వైజాగ్ వెళ్లడంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని వైఎస్సార్సీపీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు కలిశారు. అనంతరం కేఈతో పాటు టీడీపీ ఎంపీలు సత్యనారాయణచౌదరి, సి.ఎం రమేశ్, ఎస్పీవై రెడ్డి సీఎం చంద్రబాబుతో సమావేశమై ఆళ్లగడ్డలో పోటీ విషయంపై చర్చించారు. ఇటీవల నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలబెట్టలేదని, గతంలో పలు సందర్భాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినపుడు పోటీ పెట్టిన సందర్భాలు లేవని నేతలు ఆ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థిని పోటీకి పెట్టకూడదని నిర్ణయించారు. పోటీపై కాంగ్రెస్ నేడు నిర్ణయం ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీ విషయమై కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. కాగా పోటీకి దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా డీసీసీ నేతలు తీర్మానం చేసి ఆ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి తెలిపారు. -
‘అక్కినేని ప్రపంచస్థాయి నటుడు’
హైదరాబాద్: ప్రపంచంలోని అగ్రస్థాయి నటుల్లో దివంగత సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు ఒకరని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో టి.సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో రసమయి నిర్వహణలో అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి సందర్భంగా అక్కినేనికి నీరాజనాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ... తెలుగు భాష, సినీరంగం ఉన్నంత వరకు అక్కినేని ఉంటారన్నారు. కవి సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ అక్కినేని ముఖానికి తప్ప ఆయన మనసుకు మడతలు లేవు అని కొనియాడారు. సినీనటుడు కృష్ణ మాట్లాడుతూ తాను సినీ ఇండస్ట్రీలోకి రావటానికి కారణం అక్కినేని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టి.సుబ్బరామిరెడ్డి, నటి విజయనిర్మల, రసమయి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.కె.రాము పాల్గొన్నారు. -
అప్పు వసూలు కోసం తుపాకీతో బెదిరింపు
కదిరి : అప్పు వసూలు కోసం తనను తుపాకీతో బెదిరించాడని కడప డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు వేలూరు శ్రీనివాసరెడ్డిపై అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ డేరంగుల నారాయణ ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు, బాధితుడి కథనం మేరకు.. నారాయణ బెంగుళూరులో అపార్ట్మెంట్లు నిర్మించే కాంట్రాక్టర్. ఈయన ఓ అపార్ట్మెంట్ నిర్మాణం కోసం బెంగళూరులోని క్రిష్ణమూర్తి అనే వ్యాపారి వద్ద రెండేళ్ల క్రితం రూ 20 లక్షలు విలువ చేసే సిమెంటును అప్పుగా కొనుగోలు చేశాడు. నారాయణకు అపార్ట్మెంట్ యజమాని ఇవ్వాల్సిన రూ 1.50 కోట్లు ఇవ్వకపోవడంతో అతడు సిమెంటు వ్యాపారికి డబ్బు చెల్లించడంలో జాప్యం చేస్తూ వచ్చాడు. త్వరలోనే ఇచ్చేస్తానంటూ అసలు, వడ్డీ కలిపి రూ. 27 లక్షలకు క్రిష్ణమూర్తికి మూడు నెలల క్రితం చెక్కు రాసిచ్చాడు. అయితే డబ్బు చెల్లించడం ఆలస్యం కావడంతో కదిరిలో తాను కాపురం ఉన్న ఇంటిని నారాయణ అమ్మకానికి పెట్టాడు. రూ. కోటి వ రకు ఇ వ్వడానికి పట్టణంలోని కొందరు ముందుకొచ్చారు. ఆ దివారం ఈ విషయం తెలుసుకున్న బెంగళూరుకు చెందిన క్రిష్ణమూర్తి పులివెందులలో కాపురం ఉంటున్న తన మిత్రుడు, డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని వె ంటబెట్టుకొని కేఏ 53జెడ్ 8469 నంబరు గల టొయోటో ఫార్చూనర్ వాహనంలో నేరుగా కది రిలో నారాయణ ఇంటికి వెళ్లారు. ‘క్రిష్ణమూర్తికి డబ్బు ఇవ్వాల్సింది నువ్వేనా? డబ్బు ఇస్తావా? నా చేతిలో ఉన్న తుపాకీతో కాల్చి పారేయమంటవా? ఏదో ఒకటి తేల్చుకో? లేదంటే నీ ఇల్లు మాకు రాసిచ్చేయ్’ అని శ్రీనివాసరెడ్డి గట్టిగా మాట్లాడటంతో నారాయణ బెదిరిపోయి ‘మీరెవరండి?’ మీ పేరేంటి? అని అడిగాడు. ‘నా పేరు శ్రీనివాసరెడ్డి. మాది పులివెందుల. నేను కడప డీసీసీ ఉపాధ్యక్షుడిని. చాలా.. ఇంకా ఏమైనా కావాలా?’ అని గద్దించడంతో నారాయణ భార్య, కుటుంబ సభ్యులు బెదిరిపోయి ‘సార్ ఇంట్లోకి రండి. కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తే బాగోదు’ అని గౌరవంగా చెప్పారు. అయినా అవేమీ పట్టించుకోకపోవడంతో స్థానికులెవరో ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. ఆయన వెంటనే స్థానిక పోలీసులకు చెప్పడంతో పట్టణ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ నిరంజన్‌రెడ్డి అక్కడికెళ్లి ఇరు వర్గాలనూ పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్పి వచ్చారు. బెంగళూరుకు చెందిన క్రిష్ణమూర్తితో పాటు పులివెందులకు చెందిన శ్రీనివాసరెడ్డి, ఇంకా మరో ఏడుగురు తనను తుపాకీతో బెదిరించారని నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై సెక్షన్ 452, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్ఐ తెలిపారు. తుపాకీతో బెదిరించలేదు.. క్రిష్ణమూర్తికి రూ. 47 లక్షలు డబ్బు ఇవ్వాల్సి ఉంటే అతనితో పాటు తాను కూడా వెళ్లి ఆ డబ్బు అడిగానే తప్ప.. తుపాకీతో నారాయణను బెదిరించలేదని శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. తన దగ్గర లెసైన్స్ గన్ ఉందని, అయితే తన వ్యక్తిగత గన్‌మన్ శేఖర్ చేతికి చ్చానని వివరణ ఇచ్చారు. క్రిష్ణమూర్తి తనకు రూ.16 లక్షలు ఇవ్వాలని.. నారాయణ అతనికి ఇస్తే అక్కడే తీసుకుందామని వచ్చానని చెప్పారు. ఇదిలావుండగా టీడీపీలోని ఉన్నత స్థాయి నేతల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో శ్రీనివాసరెడ్డికి ప్రాణహాని లేకున్నా గన్ను దుర్వినియోగం చేస్నున్నాడన్న కారణంతో లెసైన్స్‌ను రద్దు చేయాల్సిందిగా వైఎస్ఆర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఇక్కడి పోలీసులు సిఫారసు చేసినట్లు సమాచారం. -
ధర్మప్రచారాన్ని విస్తృతం చేయాలి
తిరుపతి : సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ సాగిస్తున్న కృషి అనిర్వచనీయమైనదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ.కృష్ణమూర్తి అన్నారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సోమవారం జరిగే త్రైమాసిక మెట్లోత్సవాలను ఆదివారం సాయంత్రం ఉపముఖ్యమంత్రి జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి సత్రాల సముదాయంలో దాససాహిత్య భజన మండళ్లతో ఏర్పాటైన సమావేశంలో ఆయన ప్రసంగించారు. గ్రామ గ్రామాన యాగాలు, హోమాలు నిర్వహించి సనాతన హిందూ ధర్మాలను విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు. తిరుమల శ్రీవారి మహిమలు అపారమైనవన్నారు. అందుకే కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భావించి విదేశాల్లో సైతం వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నారన్నారు. శేషాచల అడవుల్లో సిరులు కురిపించే అపారమైన ఎర్రచందనం చెట్లు ఉన్నాయని. ఇక్కడి ఎర్రచందనమే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పెట్టుబడిలో భాగస్వామి కాబోతోందన్నారు. టీటీడీ జేఈవో పోలా భాస్కర్ ప్రసంగిస్తూ భగవంతుని చేరుకోవడానికి సులభమైన మార్గం నామసంకీర్తనమని అన్నారు. దాససాహిత్యం పుట్టుక కర్ణాటక రాష్ట్రమైనా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించిందన్నారు. ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ ఎడిటర్-ఇన్-చీఫ్ రవ్వా శ్రీహరి, తిరుమల ఆలయ డెప్యూటీ ఈవో చిన్నం గారి రమణ, దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి పీఆర్ ఆనందతీర్థాచార్య, టీటీడీ పీఆర్వో రవి పాల్గొన్నారు. అనంతరం తిరుపతిలో భజనమండళ్ల శోభాయాత్ర సాగింది. -
10 మంది వీఆర్ఓలకు షోకాజ్ నోటీసులు
తెర్లాం రూరల్: నీటి తీరువా వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి హెచ్చరించారు. స్థానిక తహశీల్ధార్ కార్యాల యంలో గురువారం నీటితీరువా వసూళ్ల పై గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ గ్రామాల వారీగా నీటి తీరువాల లక్ష్యం, వసూళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీటి తీరువా వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన 10 మంది వీఆర్ఓలకు షోకా జ్ నోటీసులు జారీ చేశారు. తెర్లాంలోని ఇద్దరు వీఆర్ఓలు, ఉద్దవోలు, సుందరాడ, నెమలాం, కాగాం, అరసబలగ, కుసుమూరు, నందిగాం, గంగన్నపాడు గ్రామాల వీఆర్ఓలకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరిపి కృష్ణమూర్తి సబ్ కలెక్టర్ జారీ చేసిన షోకాజ్ నోటీసులు అందజేశారు. పార్వతీపురం డివిజన్లో రూ.11.22 కోట్ల నీటితీరువా బకాయిలు.. పార్వతీపురం డివిజన్లో నీటితీరువా బకాయిలు 11.22 కోట్ల రూపాయలు ఉందని సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి చెప్పారు. వీఆర్ఓల సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది డివిజన్లో రూ.కోటీ 66 లక్ష ల నీటితీరువా వసూళ్లు లక్ష్యం కాగా ఇం తవరకు రూ.24 లక్షలే వసూలయ్యూయని తెలిపారు. తెర్లాం మండలంలో రూ.48 లక్షలు లక్ష్యం కాగా ఇంతవరకు రూ.8 లక్షలు మాత్రమే వసూలైందని పేర్కొన్నారు. పార్వతీపురం డివిజన్లో ఐదు రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని చనిపోయిన డీలర్ల వారసులతో భర్తీ చేయనున్నామని చెప్పారు. ఏడో విడత భూ పం పిణీకి అవసరమైన భూములు గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో తెర్లాం డిప్యూటీ తహశీల్దార్ రామస్వామి, ఆర్ఐ కృష్ణమూర్తి, సీనియర్ సహాయకుడు సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రసకందాయంలో తిరుపతి టీడీపీ రాజకీయాలు
ఐవీఆర్ఎస్లో మొదట వెంకటరమణ పేరు అగ్గిమీద గుగ్గిలం అవుతున్న చదలవాడ వర్గీయులు రాజధానికి వెళ్లిన వెంకటరమణ, చదలవాడ సాక్షి, తిరుపతి: తిరుపతి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఒక రోజు మాత్రమే గడువు ఉండటంతో టికెట్టు కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. ఒకరి వెంట ఒకరు రాజధానికి పరుగులు తీస్తున్నారు. పార్టీ అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికకోసం చంద్రబాబు అనుసరిస్తున్న ఐవీఆర్ఎస్ కూడా వీరి మధ్య చిచ్చు పెట్టింది. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ పేరు ఐవీఆర్ఎస్లో మొదట చేర్చడం చదలవాడ వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. తిరుపతి టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థుల తొలిజాబితాను బుధవారం ప్రకటించిన వెంటనే మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ రాజధానికి వెళ్లారు. అధిష్టానం ఆశీస్సులు పొంది టికెట్టు తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇన్చార్జి చదలవాడ కృష్ణమూర్తి గురువారం ఉదయం హుటాహుటిన హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇద్దరు నేతలూ టికెట్టు తమకేనన్న ధీమాతో ఉన్నారు. ఐవీఆర్ఎస్లో వెంకటరమణ ఫస్ట్ అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు అనుసరిస్తున్న ఐవీఆర్ఎస్లో వరుసగా వెంకటరమణ, చదలవాడ, డాక్టర్ హరిప్రసాద్ పేర్లు ఉన్నాయి. ఈ ముగ్గురూ నచ్చకపోతే మీరే ఏదో ఒక పేరు సూచించాలని ఫోన్ కాల్ అందుకున్న వారిని కోరుతోంది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న చదలవాడను కాదని వెంకటరమణ పేరు ముందు చేర్చడం ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకున్నారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులుగా పోటీ చేసిన వెంకటరమణ, చదలవాడ అప్పట్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నా రు. మారిన రాజకీయ పరిణామాల్లో వెంకటరమణ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో అభ్యర్థిత్వం ఆయననే వరిస్తుందని ప్రచారం ఎక్కువ కావడం చదలవాడ వర్గీయులను మనస్తాపానికి గురిచేస్తోంది. పార్టీని నమ్ముకున్న వారిని కాకుండా అవకాశవాదంతో జెండా మార్చిన వారికి పెద్దపీట వేయడం దీనంతటికీ కారణమనే అభిప్రాయం వారిలో బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. దీంతో టికెట్టు ఆశిస్తున్న ఇరువురు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి ఉన్నా ఇంకో వర్గం నుంచి అభ్యర్థికి ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. -
ఈ నోటి దుర్వాసన ఎలా పోతుంది?
నా వయసు 32. నా నోటిలో కొన్ని పళ్లు పుచ్చిపోయి, నోరు దుర్వాసన వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చూపండి. - బి. రాణి, నిజామాబాద్ మనం తిన్న ఆహారం పుచ్చుపళ్లు లేదా పంటి రంధ్రాల మధ్య చిక్కుకుపోతుంటుంది. ఇలా నోటిలో చిక్కుకుపోయిన ఆహారంతో బ్యాక్టీరియా కలిసి సల్ఫర్ పదార్థాలు వెలువరించడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఒకవేళ పంటిలోని రంధ్రం పెద్దదిగా ఉండి మొత్తం పన్ను పాడై ఉంటే ఆ పంటిని మూలం (రూట్) నుంచి తొలగించి, అక్కడ కృత్రిమం పన్ను అమర్చుకోవాలి లేదా ‘బ్రిడ్జి’ అనే ప్రక్రియ ప్రకారం చికిత్స తీసుకోవాలి. అయితే పాడైన పంటికి ఇరువైపులా ఉండే పళ్లు బాగుంటేనే ఈ బ్రిడ్జ్ ప్రక్రియ సాధ్యమవుతుంది. ఒకవేళ పంటి రంధ్రం ఒకేచోట లోతుగా ఏర్పడి పన్ను మొత్తం పాడవకుండా, పంటి లోపల నరాలు ఉండేచోట (పల్ప్ ప్రాంతంలో) మాత్రమే దెబ్బతిని ఉంటే దీనికి రూట్‌కెనాల్ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్స చేసిన ప్రాంతంలో పంటిపైన డెంటల్ క్యాప్ లేదా క్రౌన్ అమర్చడం వల్ల పన్ను మరింత దెబ్బతినకుండా చూడవచ్చు. సాధారణంగా ఈ క్యాప్‌ను లోహం లేదా సిరామిక్ పదార్థం లేదా ఈ రెండిటి మిశ్రమంతో రూపొందిస్తారు. ఒకవేళ రంధ్రం చిన్నదిగా ఉంటే దాన్ని ఫిల్లింగ్ చేస్తారు. ఇక నోటి దుర్వాసన విషయానికి వస్తే... కొన్ని సందర్భాల్లో చిగుళ్ల సమస్య ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన రావచ్చు. ఒకవేళ మీ నోటిదుర్వాసనకు కారణం చిగుళ్ల సమస్య అయి ఉంటే... చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. దానికి సరైన చికిత్స తీసుకోకపోతే అది పయోరియాకు దారితీయవచ్చు. కొన్నిసార్లు నోటిదుర్వాసన తాత్కాలికమైన సమస్య కావచ్చు. మీరు మీ దంతవైద్యునితో తరచూ పరీక్షలు చేయించుకుంటూ మీ సమస్యకు తగిన చికిత్స తీసుకుంటే నోటిదుర్వాసన తగ్గుతుంది. నాకు యాభై ఏళ్లు ఉంటాయి. నాకు కొన్ని దంతసమస్యలు ఉన్నాయి. చికిత్స కోసం నేను చాలామంది దంతవైద్యులను కలిశాను. అయితే వారి సూచనల మేరకు వైద్యం చేయించుకోవడానికి నా ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు. తక్కువ ఖర్చుతో దంతవైద్యం చేయించుకోలేమా? ఒకవేళ సాధ్యమైతే, అలాంటి చికిత్స ఎక్కడ దొరుకుతుంది? - కృష్ణమూర్తి, విజయవాడ మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. మీరన్నట్లు అన్ని రకాల దంత సమస్యలకు అంటే ప్రత్యేకమైన చికిత్స ప్రక్రియలకు కూడా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని పొందవచ్చు. రాష్ట్రంలో దంతవైద్యకళాశాలకు అనుబంధంగా ఉండే అన్ని ఆసుపత్రుల్లో హైదరాబాద్, విజయవాడ, కడప ప్రభుత్వ కళాశాలలకు అనుబంధంగా ఆసుపత్రులు ఉన్నాయి. వీటికితోడు శ్రీకాకుళం, విశాఖపట్నం, భీమవరం, ఏలూరు, రాజమండ్రి, గన్నవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, ఖమ్మం నిజామాబాద్, మహబూబ్‌నగర్, నార్కేట్పల్లి, వికారాబాద్, సంగారెడ్డి, షామీర్పేట, హైదరాబాద్ (దిల్సుఖ్నగర్)లలో ప్రైవేటు కళాశాలలకు అనుబంధంగా దంతవైద్యశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా మీరు చౌకగా చికిత్స తీసుకోవచ్చు. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
జగన్‌కు మద్దతుగా జంగా పాదయాత్ర
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ :రాష్ర్ట విభజనపై అడ్డగోలు నిర్ణయానికి నిరసనగా సమన్యాయం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆ పార్టీ కేంద్రపాలక మండలిసభ్యుడు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి శనివారం పాదయత్ర చేపట్టారు. పట్టణంలోని మహనేత వైఎస్సార్ విగ్రహనికి క్షీరాభిషేకం చేసిన అనంతరం పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిలు పార్టీ జెండాను ఊపి జంగా పాదయాత్రను ప్రారంభించారు. మహిళలు జంగా నుదుట బొట్టుపెట్టి హారతి ఇచ్చారు. మర్రి రాజశేఖర్, అప్పిరెడ్డితోపాటు పార్టీ నేతలు అంబటి రాంబాబు, రావి వెంకటరమణ, మందపాటి శేషగిరిరావు, శిఖా బెనర్జీ తదితరులు జంగా వెంట కొద్దిదూరం నడిచారు. కార్యకర్తలు వైఎస్ జగన్ చిత్రంతో కూడిన ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ జై జగన్...జోహర్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. జోరువానలో ప్రారంభమైన పాదయాత్ర పోలీస్‌స్టేషన్ మీదుగా ఐలాండ్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ పలువురు మహిళలు జంగాను కలిసి అభినందనలు చేశారు. మార్గంమధ్యలో గంగమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మాచర్ల బస్టాండ్ సెంటర్ మీదుగా బ్రహ్మణపల్లి చేరుకున్న జంగాను రైతులు, వ్యవసాయ కూలీలు కలిసి జగన్‌ను సీఎం చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. అక్కడి నుంచి తుమ్మలచెరువు చెట్టువద్దకు చేరుకున్న జంగాకు పార్టీ కార్యకర్తలు నాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది. అనంతరం పాదయాత్ర వీరాపురం, శాంతినగర్ గ్రామాల మీదుగా దాచేపల్లి మండలంలోకి ప్రవేశించింది. జంగాకు స్వాగతం పలికిన విద్యార్థులు పాదయాత్రగా వెళ్తున్న జంగాకు విద్యార్థుల నుంచి విశేషస్పందన లభించింది. పట్టణంలోని జిల్లా పరిషత్ విద్యార్థులు జంగాకు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక స్కాలర్స్ జూనియర్ కళశాల విద్యార్థులు జగనన్న నాయకత్వం వర్ధిలాల్లి అంటూ నినాదాలు చేశారు. బ్రాహ్మణపల్లి ప్రభుత్వ పాఠశాల, జిల్లాపరిషత్ హైస్కూల్ విద్యార్థులు జంగాపై పూలవర్షం కురిపించారు. ఆయనతో కరచాలనం చేశారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ చింతా వెంకటరామారావు, మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, నాయకులు కుందుర్తి గురవాచారి, కె.వాసుదేవరెడ్డి, షేక్ సైదావలి, షేక్ జానిబాబు, కె.మాణిక్యరావు, జి.పవన్‌రెడ్డి, కొమ్ము ముక్కంటి, కట్టా వెంకటేశ్వరరెడ్డి, అల్లు పిచ్చిరెడ్డి, వెన్నా రంగారెడ్డి, జంగిటి రామకోటేశ్వరరావు, సత్తార్ సీతారామిరెడ్డి, గండికోట కోటేశ్వరరావు, గుర్రం అప్పిరెడ్డి, కొక్కెర కొండలు, దొండేటి వెంకటరెడ్డి, మైలా వెంకట్రామిరెడ్డి, వుగ్గు నాగేశ్వరరావు, షేక్ మాషాబీ, వీరభద్రుని రామిరెడ్డి, యర్రంరెడ్డి చంద్రారెడ్డి, బండి పద్మావతి, అంజిరెడ్డి, శెట్టుపల్లి పూర్ణ, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
పద్ధతులే దిద్దుతాయి!
పిల్లల పెంపకం చాలా ఈజీ అట! అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి అంటున్నారు. ఈజీనా! ఇక్కడంతా కిందమీద అవుతుంటే... చలం ‘బిడ్డల శిక్షణ’ని,నామిని ‘ఇస్కూలు పుస్తకాల్ని’ ముందేస్కుని కూర్చుంటే... ఈయనేమో వెరీ సింపుల్ అని తేల్చేస్తారా? రస్నా యాడ్‌తో బుట్టలో వేసుకున్నంత మాత్రాన... ఏం చెప్పినా పిల్లలు వినేస్తారనుకోవడమేనా! ఈమాటకు చిన్న స్మైల్ ఇస్తారు లీల, గోపాలకృష్ణలు. ‘ఎవరు చెప్పమన్నారు?’ అని ఆ నవ్వులకర్థం! చెప్పకుండా ఎలా? ‘చెప్పాలి... కానీ చెప్పీచెప్పనట్లు, చేసీ చూపినట్లు.’ ఇదే... లీలపాఠం, గోపాలపాఠం... ఈవారం మన ‘లాలిపాఠం’ కూడా. ఎనభైలలో టీవీ సామాన్యులకు అందివచ్చిన రోజులవి. వాణిజ్య ప్రకటనలను కూడా ఆసక్తిగా చూసిన కాలం. చక్కగా సూట్, కోట్ ధరించిన క్రికెట్ దిగ్గజాలు, బాలీవుడ్ నటులు తమ హుందాతనానికి కారణం ఈ దుస్తులే అన్నట్లు పోజిచ్చేవారు... బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఓన్లీ విమల్’ అనే వాయిస్ వినిపించేది, అది విమల్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ ప్రకటన. అలాగే ఫిబ్రవరి దాటి మార్చినెలలో అడుగుపెట్టామంటే ‘పదేళ్లు నిండని పాప ఎర్రని సాఫ్ట్ డ్రింకు తాగుతూ ఆ గ్లాసును బుగ్గకు తాకించుకుని ‘ఐ లవ్ యూ రస్నా’ అనేది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... కలకాలం గుర్తుండిపోయిన ఈ ప్రకటనల రూపకర్త అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి దంపతులు వాళ్ల పిల్లలను పెంచిన విధానమే ఈ వారం మన లాలిపాఠం. మీ పిల్లల వివరాలు చెప్తారా? లీల: మాకు ముగ్గురమ్మాయిలు, ఒకబ్బాయి. అనూరాధ, సుధారాణి, సుజాత, కల్యాణ్. యాడ్ ఏజెన్సీ నిర్వహణతోపాటు మైకా (ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాద్) విద్యాసంస్థను స్థాపించి శిక్షణనిచ్చిన యాడ్ ఎక్స్‌పర్ట్‌గా మీ పిల్లలను ఎలా తీర్చిదిద్దారు? కృష్ణమూర్తి: మేము పిల్లలను పెంచాం అంతే, ఇక తీర్చిదిద్దుకోవడం అంటారా... వాళ్లను వాళ్లే తీర్చిదిద్దుకున్నారు. నా ఉద్యోగం, వ్యాపారరీత్యా 45 ఏళ్లు గుజరాత్లో ఉన్నాం. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, సౌమ్యంగా వ్యాపారం చేసుకోవడానికి అనువైన గుజరాత్ సమాజం కూడా కారణమే అనుకుంటాను. గుజరాత్ సామాజిక వాతావరణం మనకు భిన్నంగా ఉంటుందంటారా? కృష్ణమూర్తి: అక్కడివాళ్లు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. ఎక్కువమంది చిన్నదో పెద్దదో వ్యాపారం చేస్తుంటారు. ‘లాభనష్టాల రిస్కుతో కూడిన వ్యాపారంకంటే చదువుకుని ఉద్యోగం చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇస్తే... ‘చదువుకున్న వాళ్లకు మేము ఉద్యోగాలిస్తాం’ అంటారు. అహ్మదాబాద్ ఐఐఎంలో గుజరాతీలకంటే బయటి రాష్ట్రాల వాళ్లే ఎక్కువగా ఉంటారు. పిల్లలకు మీరు నేర్పించినదేమీ లేదంటారా? కృష్ణమూర్తి: తెలుగు మాట్లాడడం అలవాటు చేశాను. జాతీయస్థాయిలో రాణించడానికి ఇంగ్లిష్ మీడియంలో చదివించాను, గుజరాత్లో సెకండ్ లాంగ్వేజ్‌గా గుజరాతీ చదివారు. అయినా పిల్లలెవర్నీ తెలుగు భాషకు దూరం కానివ్వలేదు. మేము నేర్పించిందల్లా మాతృభాష మీద మమకారం, పెద్దల పట్ల గౌరవం, సంస్కారం మాత్రమే. పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? కృష్ణమూర్తి: ‘యథారాజా తథా ప్రజా’ అన్నట్లు పిల్లల మీద నూటికి నూరు శాతం తల్లిదండ్రుల ప్రభావమే ఉంటుంది. పెద్దయ్యేకొద్దీ వాళ్లపరిధి విస్తరించి సమాజం ప్రభావం చూపిస్తుంది. కానీ ఆ ప్రభావం... తల్లిదండ్రులు ఇంట్లో ఎనిమిది- పదేళ్ల వరకు వేసిన పునాది మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ పునాదే పిల్లలను చక్కటి పౌరులను చేస్తుంది. ఇంట్లో సంస్కారవంతమైన వాతావరణం ఉండేటట్లు చూసుకోవడం, మంచి స్కూల్లో చేర్పించడం... ఈ రెండూ జాగ్రత్తగా చేస్తే చాలనుకునేవాణ్ని. మంచి స్కూలంటే..? కృష్ణమూర్తి: ఎక్కువ ఫీజులు వసూలు చేసే స్కూల్ కాదు. ఈ స్కూలుకి పిల్లలు ఏయే కార్లలో వస్తున్నారు... వంటివి కాదు. పాఠశాల మోటో ఏంటి, టీచర్ల దృక్పథం ఎలా ఉంది, మన సంస్కృతిని, నైతిక విలువలను నేర్పించే వాతావరణం ఉందా... వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాను. ఏ తరంలోనైనా మధ్యతరగతి జీవితాలు పాటించే విలువలే అత్యున్నతమైన విలువలని నమ్ముతాను. ఆ విలువలు పాటించే స్కూల్లోనే చేర్పించాను. ఇక మిగిలినదంతా ఈవిడే చూసుకున్నది. మరి కాలేజ్ చదువులు... కోర్సుల గెడైన్స్ ఎలా ఉండేది? లీల: ఈయనకేమో పిల్లలు అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో ఎంబిఎ చదివి మా యాడ్ ఏజెన్సీ చూసుకోవడానికి వస్తే బావుణ్నని ఉండేది. కానీ నలుగురిలో ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు. పిల్లలు ఏది చదువుతానంటే అదే చదివించాం. పెద్దమ్మాయి బిఎ, రెండో అమ్మాయి ఫ్యాషన్ టెక్నాలజీ, మూడవ అమ్మాయి ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ కోర్సులు చేశారు. అబ్బాయి బీటెక్ చేసి అమెరికాలో ఎం.ఎస్ చదివాడు. కృష్ణమూర్తి: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. దానిని ఎవరికి వారు తమకు ఇష్టమైనట్లు జీవించాలి, తమ ఆశలకు ఇష్టాలకు అనుగుణంగా మలుచుకోవాలి. అలా మలుచుకునే స్పేస్‌ని పిల్లలకు ఇవ్వాలి. ‘నేను ఫలానా వృత్తిలో ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఇదే మార్గంలో నడువు’ అని వాళ్ల దారిని మనం నిర్దేశించకూడదు. తమ అభిప్రాయాలకు విలువ ఉందనే భరోసా కలిగించాలి. తర్వాత వాళ్లకు అసంతృప్తి కలిగినప్పుడు ‘అంతా మీరే చేశారు’ అనే అవకాశం ఉంది. ఆ మాట అంటారని మాత్రమే కాదు, అనడానికి ముందు వాళ్లలో కలిగే సంఘర్షణ చిన్నదిగా ఉండదు. వీటన్నింటినీ ఆలోచించి వాళ్లకు ఇష్టమైన ప్రొఫెషన్ని ఎంచుకునే అవకాశాన్నిచ్చాను. పెళ్లి విషయంలోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చాం, అన్నీ మేము కుదిర్చిన పెళ్లిళ్లే. మా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబ నేపథ్యానికి సరిపోతాయనుకున్న సంబంధాలను షార్ట్ లిస్ట్ చేసి వాళ్ల ముందు పెడితే ఫైనల్ సెలెక్షన్ ఎవరికి వాళ్లే చేసుకున్నారు. బాల్యంలో కథల రూపంలో విలువలు చెప్పే ప్రయత్నం జరిగిందా? లీల: నేను పేదరాశి పెద్దమ్మ కథలు, విదుర నీతి, చందమామ కథలు చెప్పేదాన్ని. ఒకే పెంపకంలో పెరిగినప్పటికీ నలుగురిలో స్పష్టమైన మార్పులు కొన్ని ఉంటాయేమో!? లీల: నిజమే, పెద్దమ్మాయికి ఫ్రెండ్స్ ఎక్కువ. రెండో అమ్మాయి నా కొంగు పట్టుకుని తిరిగేది. మూడో అమ్మాయి గుంటూరులో మా అమ్మ దగ్గర పెరిగింది. ఒకరికొకరికి రెండు- మూడేళ్లు తేడానే. పెద్దమ్మాయికి, అబ్బాయికి మధ్య పదేళ్లు తేడా ఉండడంతో తమ్ముడి బాధ్యత తనే చూసుకునేది. కృష్ణమూర్తి: ఒకే నేపథ్యంలో పెరిగినప్పటికీ పిల్లల్లో మార్పులు అంటే... కోపం, శాంతం వంటి జెనెటికల్‌గా వచ్చే వాటిని ఎవరూ మార్చలేరు. కానీ నడవడిక, మాట, మన్నన వంటివి అమ్మానాన్నల నుంచే నేర్చుకుంటారు కాబట్టి నలుగురినీ ఒకే విధంగా ఉండేటట్లు పెంచవచ్చు. నా ఇన్నేళ్ల కెరీర్లో ‘కృష్ణమూర్తి ఈ విషయంలో అబద్ధం చెప్పాడు, లంచం తీసుకున్నాడు’ వంటి ఆరోపణలు చేసే వాళ్లు లేరు. అంత కచ్చితంగా ఉన్నాను కాబట్టి ఆ మాటను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ ప్రభావం పిల్లల మీద ఉండి తీరుతుంది. గుజరాత్ వ్యాపార సంస్కృతిని మీ పిల్లలూ అలవరుచుకున్నారా? లీల: అవును, ముగ్గురమ్మాయిలు కలిసి అహ్మదాబాద్‌లో రెండు బొటిక్స్(దుస్తులు డిజైనింగ్, స్టిచింగ్) పెట్టారు. పెద్దమ్మాయి పెళ్లయిన తర్వాత మిగిలిన ఇద్దరూ చూసుకునేవాళ్లు. ఇప్పుడు కుటుంబాలను చూసుకుంటూ ఇద్దరు హైదరాబాద్, ఒకరు చెన్నైలో ఉంటున్నారు. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి టీవీ, రేడియోలను విప్పి సెట్ చేస్తుండేవాడు. అలాగే ఎలక్ట్రానిక్స్ వైపే వెళ్లాడు. కృష్ణమూర్తి: ఇష్టమైన పనిని ఎన్ని గంటలు చేసినా శ్రమ అనిపించదు. నేను పద్దెనిమిది గంటలు పని చేశానంటే నాకు ఇష్టమైన క్రియేటివ్ ఫీల్డు కాబట్టి చేయగలిగాను. అకౌంట్స్ సాల్వ్ చేయమంటే అరగంట కూడా కూర్చోలేను. అయితే ఆ తరంలో గుంటూరులో మా కుటుంబ నేపథ్యంలో నాకిలా గైడ్ చేసే వాళ్లు లేకపోవడంతో హిస్టరీ చదివి మ్యూజియంలో పనిచేశాను, తర్వాత క్యాలికో మిల్స్ ఉద్యోగం కోసం అహ్మదాబాద్ వెళ్లాను. ముప్పై ఏళ్లకు నాకు సరైన ప్రొఫెషన్ ఏదో తెలుసుకోగలిగాను. అంటే... పిల్లలకు కెరీర్ గెడైన్స్ అవసరమేనంటారా? కృష్ణమూర్తి: గెడైన్స్ అవసరమే కానీ అది ఆదేశం కాకూడదు. మంచిచెడుల గురించి గెడైన్స్ ఇచ్చినట్లే ఇది కూడ. ఎందుకంటే ఎవరి నడకను వాళ్లు నడవాల్సిందే, ఎవరి జీవితాన్ని వాళ్లు జీవించాల్సిందే. ఆ ఫిలాసఫీనే ఎప్పుడూ నమ్ముతాను. మా తరంతో పోల్చుకుంటే ఈ తరం పిల్లలకు ఎక్స్పోజర్ ఎక్కువ. ఎన్ని రకాల కెరీర్ ఆప్షన్లు ఉన్నాయనే సమాచారం వాళ్ల ముంగిట్లో ఉంటోంది. అందులో, తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే అవకాశాన్ని వాళ్లకే ఇవ్వాలి. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి వాళ్ల నాన్నగారి నుంచి టైమ్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. ఆయన రోజూ టంచన్‌గా తొమ్మిదిన్నరకు ఆఫీసులో ఉండేవారు. సొంత ఆఫీసే కదా అని ఆలస్యంగా వెళ్లడం ఆయనకు అలవాటు లేదు. ఇప్పటికీ ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. డెబ్బై ఏళ్ల వయసులో కూడా కన్సల్టెన్సీ నడుపుతున్నారు. ఆయన అబద్ధాలు చెప్పరు. పిల్లలకు అదే అలవాటైంది. - లీల మా అమ్మగారు, అత్తమామలు కూడా మాతోనే ఉండేవారు. అలా పిల్లలకు చిన్నప్పటినుంచి గ్రాండ్పేరెంట్స్కి సహాయం చేయడం అలవాటైంది. ఇవన్నీ వ్యక్తిని తీర్చిదిద్దే అంశాలే. మనం బాధ్యతగా ఉంటే పిల్లలూ అదే నేర్చుకుంటారు. మనం మన అమ్మానాన్నలను, ఇతరులను ఎవరినైనా కించపరిచేటట్లు మాట్లాడితే పిల్లలూ అదే నేర్చుకుంటారు. మా అమ్మగారితో ఈవిడ పోట్లాడిన సందర్భం ఒక్కటీ లేదు. భార్యాభర్తలు ఇంటిని యుద్ధరంగం చేయకుండా ప్రశాంతంగా ఉంచడంలో సక్సెస్ అయితే పిల్లల పట్ల బాధ్యతగా ఉన్నట్లే. - కృష్ణమూర్తి