బంగారు వాకిలికి సొబగులు
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని ద్వారపాలకులు జయవిజయుల విగ్రహాల మధ్యలో ఉండే బంగారు వాకిలికి అమర్చిన బంగారు రేకులు శిథిలావస్థలో ఉన్నాయి. వీటికి కొత్త బంగారు రేకులు అమర్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అందుకు అయ్యే రూ. 86 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖర్‌కు అనుమతిస్తూ తీర్మానం చేసింది. శుక్రవారం టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సమావేశం వివరాలను చైర్మన్, ఈవో, జేఈవో మీడియాకు వివరించారు.
తీర్మానాలు
► తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ కోసం టీటీడీ రెండో సత్రం వద్ద 2.74 ఎకరాల స్థలాన్ని రైల్వేశాఖకు అప్పగించనున్నారు. దీనికి బదులుగా తిరుచానూరు వద్ద ఉన్న రైల్వే స్థలాన్ని టీటీడీకి అప్పగించనుంది.
► శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పోలూరు గ్రామంలోని పురాతన శ్రీఅలగమల్లారి కృష్ణస్వామి ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకోనున్నారు.
► తెలంగాణ ప్రభుత్వం శ్రీవారికి రూ. 5 కోట్ల విలువైన సాలిగ్రామహారం, ఐదు పేటల కంఠె (కంఠహారం) వితరణకు అనుమతి.
► రూ. 2.55 కోట్లతో పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి.
► తిరుపతి కోదండరామస్వామి ఆలయం లో అమావాస్య రోజున సహస్ర కలశాభిషేకం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవలు, ఆర్జిత సేవలు ప్రారంభానికి నిర్ణయం.