
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఆగస్టు కోటాలో 56,310 టికెట్లను.. ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో పెట్టామన్నారు.
ఆన్‌లైన్ డిప్ విధానంలో 9,960 సేవా టికెట్లు విడుదల చేశామన్నారు. వీటిల్లో సుప్రభాతం 6,805, తోమాల 80, అర్చన 80, అష్టదళపాదపద్మారాధన 120, నిజపాదదర్శనం 2,875 టికెట్లు ఉన్నాయన్నారు. విశేషపూజ 1,500, శ్రీవారి కల్యాణం 10,925, ఊంజల్‌సేవ 3,450, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,325, వసంతోత్సవం 11,550, సహస్రదీపాలంకార సేవ 12,600 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
మరో అదనపు బూందీ పోటు
శ్రీవారి ఆలయానికి మరో అదనపు బూందీ పోటు నిర్మించే యోచనలో ఉన్నట్టు సింఘాల్ తెలిపారు. ఇటీవల వరుసగా బూందీపోటులో అగ్నిప్రమాదాలు జరుగుతున్నందున మరొకటి నిర్మిస్తే రోజువారీ శుభ్రత చర్యలు చేపట్టేందుకు వీలు ఉంటుందని చెప్పారు. శ్రీవారి ఆలయానికి వెళ్లే భక్తులను క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు ఎయిర్‌పోర్టు మోడల్ తరహాలో తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 4 కంపార్ట్‌మెంట్లలో స్కానింగ్ కేంద్రాలు, డీఎఫ్‌ఎండీ, మెటల్ డిటెక్ట ర్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే సీసీ టీవీలు, వీడి యో వాల్ పనులూ పూర్తి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment