పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వీక్షిస్తున్న ఈఓ సింఘాల్
తిరుపతి అర్బన్: టీటీడీ ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు తీసుకునే తాజా మార్పులపై ముందుగా టీటీడీ సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఈ విషయమై గురువారం తిరుమల, తిరుపతిలోని టీటీడీ సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్లలో పనిచేసే సిబ్బందికి శ్వేత భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్తులకు వసతి, దర్శనం, ఇతర సౌకర్యాల గురించి వివరించడంలో పాటించా ల్సిన జాగ్రత్తల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ టీటీడీలో ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను భక్తులకు సకాలంలో చేరవేయడంలో సమాచార కేంద్రాల సిబ్బంది మరింత చురుకైన పాత్ర పోషించాలన్నారు. సిబ్బందికి సంపూర్ణ అవగాహన ఉంటేనే భక్తులకు కావాల్సిన సమాచారాన్ని సమగ్రంగా, స్పష్టంగా చెప్పగలుగుతారన్నారు. భక్తుల నుంచి సూచనలు, సలహాలు, ఫిర్యాదులను స్వీకరించి ఆయా విభాగాలకు తెలియజేయాలన్నారు.
దర్శనం, సేవల రద్దు సమాచారంలో జాగ్రత్తలు
టీటీడీ పరిధిలోని అన్ని సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది శ్రీవారి దర్ళనం వేళలు, ఆర్జిత సేవల రద్దు సమాచారం తెలుసుకుని భక్తులకు చెప్పడంలో జాగ్రత్త వహించాలని ఈఓ కోరారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరిస్తే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తిరుమలలో గదులకు సంబంధించిన సమస్యలపై భక్తులు కాల్ సెంటర్‌కు ఫోన్‌చేస్తే అక్కడి సిబ్బంది తక్షణం ఎఫ్‌ఎంఎస్ హెల్ప్‌లైన్‌కు కలపాలని ఈఓ ఆదేశించారు. అదేవిధంగా భక్తులు ఏ అంశంపై ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్నారో గుర్తించి నమోదు చేసుకోవడం ద్వారా ఆ విభాగంలోని ఉద్యోగులను అప్రమత్తం చేయవచ్చన్నారు. వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఫోన్‌ద్వారా సమాచారం అడుగుతున్న నేపథ్యంలో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సమాచారం ఇచ్చే అంశాలపై సాంకేతిక విభాగం అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించారు. టీటీడీ ప్రాజెక్ట్‌ల స్పెషలాఫీసర్ ముక్తేశ్వరరావు, శ్వేత డైరెక్టర్ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment