Tirupati railway station
-
వరల్డ్ క్లాస్‌గా తిరుపతి రైల్వేస్టేషన్
ప్రపంచస్థాయి వసతులతో తిరుపతి రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. తిరుమల శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక డిజైన్లతో నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రయాణికుల అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. రూ.వందల కోట్ల వ్యయంతో అధునాతన భవనాలను ఆవిష్కరించేందుకు శరవేగంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. తిరుపతి అర్బన్ : తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఇప్పటికే ఏ క్లాస్ గుర్తింపు ఉంది. సుమారు రూ.500 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్ వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. ఇందుకోసం అద్భుతమైన డిజైన్లను రూపొందించారు. ఆ మేరకు ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇప్పటికే దక్షణం వైపు నూతన భవనాలు, 1 నుంచి 6వ ప్లాట్‌ఫాం వరకు ఎయిర్ కాన్కోర్స్ నిర్మాణం కోసం ఫౌండేషన్ కాస్టింగ్ పనులు పూర్తి చేశారు. స్టేషన్‌కు దక్షణం వైపు వాహనాల పార్కింగ్‌తోపాటు పలు భవనాలను నిర్మించారు. మరోవైపు రెండు రోజులుగా ఉత్తరం వైపు పనులు ప్రారంభించడానికి పురాతనమైన ప్రధాన ముఖద్వారం 1, 2 వద్ద భవనాలను కూల్చివేశారు. తాజాగా ఉత్తరం వైపుతోపాటు తూర్పు, పడమర అన్ని వైపులా పనులు చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా డేరాలతో నీడను కల్పిస్తున్నారు. ఇతర మౌలిక వసతుల కల్పనకు రైల్వే అధికారు కృషి చేస్తున్నారు. వచ్చే ఏడాదికి అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. సంతోషంగా ఉంది తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. రైల్వే మంత్రితోపాటు పలువురు ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడాం. ప్రధానంగా నూతన భవనాల నిర్మాణంలో భక్తిభావం ఉట్టిపడిలా డిజైన్లు రూపొందించేందుకు శ్రమించాం. తిరుపతి ఎంపీగా రైల్వేస్టేషన్, సెంట్రల్ బస్టాండ్‌ను రూ.వందల కోట్లతో అభివృద్ధి చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. – గురుమూర్తి, ఎంపీ, తిరుపతి మెరుగైన వసతులు రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక టీం పర్యవేక్షిస్తోంది. ఈ కీలక తరుణంలో ప్రయాణికులు సైతం సహకరించాలని కోరుతున్నాం. వరల్డ్ క్లాస్ స్టేషన్ పనులు పూర్తయితే అత్యంత ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. తిరుపతి కీర్తి మరింత ఇనుమడిస్తుంది. – సత్యనారాయణ, డైరెక్టర్, తిరుపతి రైల్వేస్టేషన్ -
పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్.. పలు రైళ్లు ఆలస్యం
సాక్షి, తిరుపతి: పద్మావతి ఎక్స్‌ప్రెస్ బుధవారం పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ 6 వ ప్లాట్ ఫారంలో ఎక్స్‌ప్రెస్‌లోని ఒక భోగి పట్టాలు తప్పడంతో గుర్తించిన సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. సత్వర చర్యలు చేపట్టిన అధికారులు సమస్యను పరిష్కరించారు. షంటింగ్ చేస్తుండగా బోగీ పట్టాలు తప్పిందని వెల్లడించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు సాయత్రం 4.55 గంటలకు బయలు దేరాల్సిన 12763 నెంబర్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ 19.45 నిమిషాలకు బయలుదేరనుంది. 12793 నెంబర్ తిరుపతి - నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ బయలుదేరే సమయం కూడా అధికారులు రీ షెడ్యూల్ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ 20:00 గంటలకు బయలుదేరనుంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: వైఎస్సార్సీపీ నేత మృతి..) -
అలా బయటపడ్డారు... సీట్ రిజర్వేషన్ కోసం లాంగ్ జర్నీ టికెట్
తిరుపతి అర్బన్: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. రైళ్లు.. బస్సులు విపరీతమైన రద్దీతో నడుస్తుంటాయి. ముఖ్యంగా రైళ్లలో తక్కువ దూరం ప్రయాణం చేసేవారికి సీట్ రిజర్వేషన్ దొరకడం అంత సులభం కాదు. చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది బెర్త్ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయ్యేందుకు లాంగ్ జర్నీకి టికెట్లు తీసుకుంటుంటారు. తమ గమ్యం రాగానే మధ్యలో దిగేస్తుంటారు. ఇదే ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నుంచి తిరుపతి జిల్లాలో హౌరా ఎక్స్‌ప్రెస్ ఎక్కిన వారిని కాపాడింది. ఈ విషయం గుర్తించడానికి రైల్వే అధికారులకు మూడు రోజులు పట్టింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దీనిపై పూర్తి స్పష్టత వచ్చింది. ప్రయాణికులంతా క్షేమంగా ఉండడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తిరుపతి ప్రయాణికులు సురక్షితం తిరుపతి మీదుగా వెళ్లిన హోరా ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి జిల్లా నుంచి 40 మంది ప్రయాణికులు జర్నీ చేశారు.అయితే ఒడిశా రాష్ట్రం బాలాసోర్ సమీపంలోని బహంగ్బాజర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతానికి అవతలి స్టేషన్ హోరాకు తిరుపతి నుంచి 8మంది,రేణిగుంట నుంచి 8మంది,గూడూరు నుంచి ఇద్దరు. మొత్తంగా 18 మంది టికెట్ తీసుకున్నారు. ప్రమాదం జరిగిన స్టేషన్‌కు ముందు స్టేషన్ బాలాసోర్‌కు తిరుపతి నుంచి 10 మంది టికెట్ తీసుకున్నారు.అయితే వీరంతా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ముందే దిగేసినవారే. టికెట్ తీసుకుంది వీరే.. హోరా స్టేషన్‌కు తిరుపతి నుంచి టికెట్ తీసుకున్న వారిలో అజయ్ కేఆర్,కుమారి ప్రయాంక, కమలాదేవి, ఎం.కుమార్, అనురాగ కుమార్, భూపేంద్ర,యానియా,సోలారింగ్ ఉన్నారు. గూడూరు నుంచి హోరాకు టిక్కెట్ తీసుకున్న వారిలో ఎస్కే దాస్, దూలాల్ ఉన్నారు,రేణిగుంట నుంచి హోరాకు టిక్కెట్ తీసుకున్న వారిలో చంద్రమణి,శాల్వి,తేజా,లీలావతి,రాజా,డీఎస్ సాయి,సూచిట్,సుభామిత్ర ఉన్నారు.మొత్తంగా అంతా సురక్షితంగా ఉండడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు క్షేమం తిరుపతి నుంచి ఒడిశాకు ప్రయా ణం చేసిన వారు సురక్షితంగా ఉన్నారు. టికెట్లు ఒడిశా ప్రాంతానికి తీసుకున్నప్పటికి వారు మన రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో దిగేశారు. దీంతో వారి సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారింది. ఏమైనా రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం. – సత్యనారాయణ, తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ -
ఆధునిక హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్
తిరుపతి అర్బన్: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతికి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చే పోయే ప్రయాణికులతో ఇక్కడి రైల్వే స్టేషన్ కూడా కిటకిటలాడుతుంటుంది. నిత్యం 105 రైళ్ల ద్వారా 75 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దక్షిణ మధ్య రైల్వేలో ఏపీలో విజయవాడతోపాటు తిరుపతి కూడా ఏ1 క్లాస్ స్టేషన్‌గా వినుతికెక్కింది. డివిజన్‌కు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంత ప్రాధాన్యమున్న ఈ రైల్వే స్టేషన్‌ను ఇప్పుడు అంతర్జాతీయ హంగులతో నూతనంగా తీర్చిదిద్దనున్నారు. రైల్వే స్టేషన్ల రీడెవలప్మెంట్ ప్రాజెక్టు తొలిదశ కింద తిరుపతి, నెల్లూరు స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. మల్టీ మోడల్ ట్రాన్సిట్ హాబ్‌గా తిరుపతి స్టేషన్‌ను తీర్చిదిద్దుతారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర రైల్వే శాఖ కార్యాలయం నుంచి నమూనా ఫొటోలను విడుదల చేశారు. సికింద్రాబాద్ కూడా ఈ ప్రాజెక్టు జాబితాలో ఉంది. తిరుపతికంటే ముందే సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే, సికింద్రాబాద్ స్టేషన్‌ను ఎంపిక చేయలేదు. దానికంటే ముందే తిరుపతికి అవకాశం దక్కిడం విశేషం. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.299 కోట్లు కేటాయించారు. ఢిల్లీకి చెందన ఓ కాంట్రాక్టర్ ఈ స్టేషన్ పనుల టెండర్ దక్కించుకున్నారు. మే 31వ తేదీ (మంగళవారం) నుంచి 33 నెలల్లో పనులు పూర్తి చేయాలి. ముందుగా దక్షిణం వైపు అత్యాధునిక సౌకర్యాలతో మూడంతస్తుల భవనం నిర్మిస్తారు. కార్యాలయాలు ఆ భవనంలోకి మార్చిన తర్వాత ఉత్తరం వైపు మరో మూడంతస్తుల భవనం నిర్మిస్తారు. ఈ భవనాలను 100 అడుగుల వెడల్పుతో 600 అడుగుల పొడవుతో నిర్మిస్తారు. అండర్ గ్రౌండ్లో లక్ష అడుగుల విస్త్రీర్ణంలో విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, డిస్ప్లే సిస్టమ్ వంటి ఆధునిక వసతులు కల్పిస్తారు. వీటివల్ల ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యానికి లోనుకాకుండా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుంది. రీ డెవలప్మెంట్ ఇలా.. ► ప్రయాణికుల కోసం 23 లిఫ్ట్‌లు, 20 ఎస్కలేటర్లు ► సమాచార డిస్ప్లే సిస్టం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ► సీసీ టీవీ కెమెరాలు ► స్పష్టమైన సూచిక బోర్డులు, కోచ్ ఇండికేషన్ బోర్డులు ► ఉత్తరం, దక్షిణం వైపు సకల సౌకర్యాలతో గ్రౌండ్ ప్లోర్‌తో పాటు మూడంతస్తుల భవనాలు ► ఉత్తరం–దక్షిణం భవనాలను కలుపుతూ 35 మీటర్ల వెడల్పుతో రెండు ఎయిర్కోర్సులు ► ప్లాట్ఫారంలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం ► దక్షిణం వైపు భవనంలో పార్కింగ్, డిపార్చర్ కాన్కోర్స్, అరైవల్ కాన్కోర్స్, టిక్కెట్ కౌంటర్, వెయిటింగ్ హాల్, ఫుడ్కోర్ట్, టాయిలెట్స్, క్లోక్ రూమ్. ► మొదటి, రెండో అంతస్తుల్లో రైల్వే కార్యాలయాలు ► 3వ అంతస్థులో సౌకర్యవంతమైన విశ్రాంతి భవనం. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఈ అంశాన్ని పలుసార్లు ఉన్నతస్థాయి అధికారులతో పాటు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు తెలియజేశాను. దీంతో దశాబ్దాలుగా మరుగునపడిన రీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఆధ్యాత్మిక నగరానికి తగినట్లుగా స్టేషన్ డిజైన్ ఉండాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు స్పష్టంగా చెప్పాను. స్థానికతను దృష్టిలో ఉంచుకుని డిజైన్లలో మార్పులు కూడా చేయాలని కోరాం. మూడేళ్ల తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది. స్టేషన్లో కనీస పార్కింగ్ లేకపోవడం వల్ల ఇబ్బందులను వారికి వివరించాను. దీంతో లక్ష అడుగుల విస్తీర్ణంతో విశాలమైన పార్కింగ్ ఏర్పాటుచేస్తున్నారు. –మద్దెల గురుమూర్తి, తిరుపతి పార్లమెంట్ సభ్యుడు -
వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌గా ‘తిరుపతి’.. డిజైన్లు విడుదల రైల్వే శాఖ మంత్రి
సాక్షి, తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. కాంట్రాక్టులన్ని పూర్తి చేశామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఆయన డిజైన్లు కూడా విడుదల చేశారు. దేశంలోనే ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లుగా తొలిదశలో అభివృద్ధి చేస్తున్న 14 రైల్వే స్టేషన్లలో తిరుపతి ఒకటి. చదవండి: టీటీడీ కీలక నిర్ణయం.. కచ్చితంగా ఆ రూల్స్ పాటించాల్సిందే.. ఈ 14 రైల్వే స్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు అధికంగా రైల్వే ద్వారానే వస్తుంటారు. వేలాది భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు రావడంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. -
పట్టాలు తప్పిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
తిరుపతి అర్బన్: తిరుపతి నుంచి మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి–మచిలీపట్నం రైలు ప్రమాదానికి గురైంది. రాత్రి 8.20గంటల సమయంలో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ యార్డ్ (షెడ్) నుంచి ప్లాట్‌ఫాంకు వస్తుండగా రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రైల్వేస్టేషన్‌కు రెండు వందల మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రేణిగుంట రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక బ్రేక్‌డౌన్ యంత్రాలను తిరుపతికి తెప్పించి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రమాదంతో మూడు గంటల పాటు హరిప్రియా, తిరుమల, హంస, కాకినాడ, కదిరి–దేవరపల్లి తదితర రైళ్లకు అంతరాయం కలిగింది. ఫలితంగా వందలాది మంది ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరతతోనే ప్రమాదం? తిరుపతి యార్డ్‌లో 14 మంది సిబ్బంది కొరత ఉన్నట్లు సమాచారం. ఒక రైలును యార్డ్ నుంచి ప్లాట్‌ఫాంకు తీసుకురావడానికి ఓ షిఫ్ట్‌కు ఏడుగురు సిబ్బంది అవసరం. అయితే, ఇద్దరు, ముగ్గురు సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ప్రధానంగా షంటింగ్ మాస్టర్, పాయింట్ మెన్, డిప్యూటీ స్టేషన్‌మాస్టర్ తదితర కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న సిబ్బందితోనే సర్దుకుపోతున్నారు. దీంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. -
గన్ .. బుల్లెట్ల బ్యాగు చోరీ
తిరుపతి క్రైం : గణపతి నగరం ఎమ్మెల్యే గన్‌మెన్ బ్యాగు తిరుపతి రైల్వే స్టేషన్లో బుధవారం చోరీకి గురైంది. ఈస్ట్ పోలీసుల కథనం మేరకు.. విజయనగరం జిల్లా గణపతి నగరం ఎమ్మెల్యే అప్పలనాయుడు గన్‌మెన్ శంకరరావు బందోబస్తు నిమిత్తం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. బ్యాగును రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఉంచి వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తి దాన్ని చోరీ చేశాడు. దీంతో గన్‌మెన్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో గన్, 20 రౌండ్ల బుల్లెట్లు, 20 రౌండ్ల మ్యాగ్జిన్, డబ్బులు ఉన్నట్టు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు సీఐ చంద్రబాబునాయుడు స్పెషల్ టీమ్‌తో తనిఖీ లు చేపట్టారు. ఈ క్రమంలో ఏడుకొండల బస్టాండులో బ్యాగు లభ్యమైంది. అందులో అన్నీ ఉండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుపతి రైల్వేస్టేషన్లో మరింత భద్రత
చిత్తూరు, తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషన్లో భద్రతను మరింత పెంచేందుకు రైల్వే బోర్డుకు సిఫార సు చేయనున్నట్టు సదరన్ రైల్వే (చెన్నై) చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్కె మెహతా చెప్పారు. భవిష్యత్‌లో పెరగనున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తిరుపతి రైల్వే స్టేషన్లో భద్రత పెంపు విషయమై పరిశీలించి అధికారులతో సమీక్షించేందుకు గురువారం మెహతా బృందం ఇక్కడికి వచ్చింది. ముందుగా రైల్వే స్టేషన్లో ప్రయాణికులు, రైల్వే ఆస్తులకు కల్పిస్తున్న భద్రత అంశాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు సీఐ సైదయ్య, గుంతకల్ డివిజన్ భద్రతా అధికారులతో వీఐపీ లాంజ్‌లో సమీక్షిం చారు. అనంతరం ప్లాట్‌ఫారాలు, ప్రయాణికులు వేచివుండే ప్రాంతాలు, రైళ్లు రాకపోకలు సాగించే ప్రాంతాలు, బోగీల శుభ్రత విభాగం, ఎలక్ట్రికల్ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రైల్వే స్టేషన్‌కు వివిధ మార్గాల్లో ప్రవేశాలు ఉండడంతో భద్రత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని ప్రాంతాలను గుర్తించి రైల్వే బోర్డుకు నివేదిక ఇవ్వనున్నామన్నారు. రెండు రైల్వే పోలీసు విభాగాల్లో సిబ్బంది కొరతను తీర్చడంపై రైల్వే మంత్రిత్వశాఖకు నివేదికలు పంపుతామన్నారు. ప్రయాణికుల రాకపోకలను ప్రతిక్షణం క్షుణ్ణంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా సీసీ కెమెరా కింద కంట్రోల్ రూమ్ ఆధునీకరణకు సిఫారసు చేస్తామని తెలిపారు. రైల్వేలో భద్రతను పటిష్టపరిచే క్రమంలో ప్రస్తుతం మంజూరవుతున్న ఏక మొత్తం నిధులతో సంబంధం లేకుండా భద్రతా విభాగాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించేందుకు రైల్వే బోర్డు చైర్మన్‌తో చర్చిస్తామన్నారు. అందులో భాగంగా తిరుపతిలో మరో 55 అధునాతన సీసీ కెమెరాలతో పాటు ఏడాదికి రూ.కోటికిపైగా భద్రతకు నిధులు వెచ్చించేలా రైల్వే మంత్రికి విన్నవిస్తామన్నారు. సేఫ్టీ అధికారి సురేష్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ రాజశేఖర్, సంజీవనాయుడు, తవమనిపాండి, సీడీవో నితిన్పచోరి, స్టేషన్ మేనేజర్ సుభోద్మిత్రా, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
రైలు బండ్లలో బస్సు టికెట్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయివేట్ ఆపరేటర్ల దోపిడీని అరికట్టి శ్రీవారి భక్తులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించేందుకు రైల్వే, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన రైళ్లలో బస్సు టికెట్ల జారీ ప్రయోగం సత్ఫలితాలను అందిస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఇది అమలవుతోంది. రోజుకి 150కి పైగా టికెట్లు జారీ చేస్తున్నామని తిరుపతి, అలిపిరి ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇదే ప్రయోగాన్ని మిగతా రైళ్లలోనూ అమలు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇలా ఎందుకంటే... నిత్యం తిరుపతి రైల్వేస్టేషన్లో దిగే ప్రయాణికులు 1.20 లక్షల నుంచి 1.45 లక్షల మంది ఉంటారు. వీరిలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు 40 వేల మందికి పైనే ఉంటారు. ప్రతి రోజూ ఉదయమే తిరుపతి చేరుకునే రైళ్లు పదికి పైనే ఉన్నాయి. ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో, జీపులు, ట్యాక్సీల ఆపరేటర్లు చుట్టుముడతారు. కొండ మీదకు వెళ్లే భక్తుల నుంచి పెద్ద మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారు. ఎక్కడో ఉన్న ఆర్టీసీ బస్సులను వెదుక్కుని లగేజీలతో వెళ్లి ఎక్కడం కష్టంగా భావిస్తున్న చాలా మంది ప్రయాణికులు ఎదురుగా ఉన్న ఏదో ఒక ప్రయివేటు వాహనాన్ని ఎక్కి వెంటనే కొండకు ప్రయాణమవుతున్నారు. దీన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు రెండు నెలల కిందట రైల్వే డీఆర్ఎం, సీనియర్ డీసీఎంతో చర్చించారు. కొన్ని ప్రత్యేక రైళ్లలో టికెట్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని లిఖిత పూర్వకంగా కోరారు. దీంతో రైల్వే శాఖ అంగీకరించింది. మొదటి దశలో బస్సు టికెట్ల జారీ కోసం సికింద్రాబాద్ నుంచి రోజూ తిరుపతి చేరుకునే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (12733) రైలు బండిని ఎంపిక చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇందులో ప్రయాణికులకు బస్సు టికెట్లు ఇస్తున్నారు. శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్లో ఎక్కుతున్న ముగ్గురు ఆర్టీసీ కండక్టర్లు స్లీపర్ క్లాస్, జనరల్, ఏసీ కోచ్‌లలో తిరుమల వెళ్లే భక్తులకు బస్సు టికెట్లు ఇస్తున్నారు. రోజుకు 150కి పైగా టికెట్లు పోతున్నాయి. రైల్లోనే టికెట్లు తీసుకున్న ప్రయాణికులు స్టేషన్ బయటకు రాగానే ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సులు ఎక్కి తిరుమల చేరుతున్నారు. ఈ ప్రయోగం బాగానే ఉందని ప్రయాణికుల నుంచి స్పందన వస్తుందని ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు చెప్పారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో చెన్నై–తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు–తిరుపతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ బస్సు టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. -
రైల్వే రెడ్‌సిగ్నల్
తిరుపతి ప్రధాన రైల్వే స్టేషనుకు రోజూ ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. తిరుమలకు వచ్చే భక్తులలో ఎక్కువమంది రైళ్ల ద్వారానే చేరుకుంటారు. దీనివల్ల స్టేషను ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంది. ఈ తాకిడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా మరో రెండు స్టేషన్లను అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ ఐదారేళ్ల క్రితం సంకల్పించింది. అయినా నేటికీ ఈ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. ఫలితంగా తిరుపతి స్టేషనులో భక్తుల కష్టాలు తీరడం లేదు. తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషనులో రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా మరో రెండు స్టేషన్లను అభివృద్ధి చేయాలన్న రైల్వే శాఖ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. నాలుగైదేళ్ల క్రితమే ప్రతిపాదనలు, నిధుల అంచనాల ప్రణాళికలు సిద్ధం చేసి చేతులు దులిపేసుకుంది. దీంతో ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. పదేళ్ల క్రితం రోజుకు 10వేల మంది కూడా ప్రయాణించేవారు కాదు. ఇప్పుడు సగటున 80 వేల నుంచి లక్షవరకు వస్తూపోతున్నారు. భారీ రద్దీ ఉన్న స్టేషన్లలో తిరుపతి ఒకటి. నిధులేవీ అమాత్యా.. రైల్వేస్టేషన్‌కు తూర్పు దిక్కులోని తిరుచానూరు స్టేషన్‌ను కొత్త టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. కానీ ఇప్పుడీ కొత్త టెర్మినల్ పనులు అటకెక్కినట్లేనని రైల్వే వర్గాలే చెబు తున్నాయి. ఇంజినీరింగ్ అధికారుల ఉదాసీన నివేదికలు, డివిజన్లోని కొందరు తమదైన కమీషన్ల పర్వానికి తెరలేపడం ఇందుకు కారణంగా నిలుస్తోంది. 2016 బడ్జెట్లో ఈ టెర్మినల్ అభివృద్ధికి రైల్వేశాఖ చాలీ చాలని నిధులను విదిల్చింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు పలు పర్యాయాలు వచ్చినప్పుడు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పినా ఆచరణలో నెరవేరలేదు. ఆదిలోనే హంసపాదు పడేందుకు టీడీపీకి చెందిన టీటీడీ మాజీ చైర్మన్ స్వలాభ ఆలోచనలు తోడయ్యాయి. ఆయన తొందరపాటు ఒత్తిళ్ల వల్ల టెర్మినల్ పనులు ప్రారంభం కాలేదనే విమర్శ ఉంది. రైల్వే స్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్థాయికి అభివృద్ధి చేసేందుకు తగిన∙స్థలం లేదు. రైల్వే మంత్రిత్వ శాఖ, బోర్డు అత్యున్నతాధికారులు ప్రత్యామ్నాయ ప్రాంతా ల్లోనే అభివృద్ధి శరణ్యమని గుర్తించారు. ఇందుకోసం తిరుపతి వెస్ట్, తిరుచానూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లను వివిధ దశల్లో పరిశీలించారు. అందులో భాగంగానే తిరుచానూరుకు ముందుగా రూ.10కోట్లు మంజూరు చేసింది. కానీ ఈ నిధులు ఎటూ చాలవు. దీంతో కొత్త నిర్మాణానికి అడ్డుకట్ట పడింది. ఏడాది క్రితమే ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు ఢిల్లీకి పంపారు. రూ.10 కోట్ల బడ్జెట్‌కు అదనంగా మరో రూ.25 కోట్లు అవసరమవుతాయని అంచనాలు రూపొందించారు. అయినా పాత నిధులు రాలేదు. కొత్త నిధులకు మోక్షంలేదు. దీంతో టెర్మినల్ పనులు ముందుకు సాగడం లేదు. పత్తాలేని ‘పడమర’ అభివృద్ధి... మరో ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖ పడమర స్టేషన్‌ను ప్రతిపాదించింది. పశ్చిమాన 52 ఎకరాలతో పాటు 18 ఎకరాల ప్రైవేటు స్థలముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగేళ్ల క్రితం రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, అప్పటి జీఎం వెస్ట్‌పై ఆసక్తి చూపిం చారు. డిజైనింగ్‌లు, అంచనాల ప్రతిపాదనలు తయారు చేశారు. నిర్మాణాలు చేపట్టేందుకు ప్రైవేటు ఏజెన్సీలను గుర్తించారు. కానీ ప్రస్తుత స్టేషన్ పరిసర ప్రాంతాల హోటళ్ల నిర్వాహకులు, ఇతర వాణిజ్య సముదాయాల వారు రైల్వే బోర్డుపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా వెస్ట్ పనులకు బ్రేకు పడింది. ఈ దశలో కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. వెస్ట్ స్టేషన్ పనులూ నిలిచిపోయాయి. రాజకీయ పరంగా కేంద్రంపై సరైన ఒత్తిడి తెస్తే తప్ప ఈ రెండు స్టేషన్లకు కదలిక ఉండదని ప్రయాణికులంటున్నారు. ఈ మేరకు అధికారుల్లో కదిలిక వస్తుందో లేదో చూడాల్సి ఉంది. -
తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం
తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫాంపై శనివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కావడంతో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన రిజర్వేషన్ చార్టు కంప్యూటర్ డిస్ప్లే మానిటర్లు కాలిపోయాయి. రెండు మానిటర్లు పూర్తిగా, మరొక మానిటర్ పాక్షికంగా డామేజీ అయ్యాయి. ఈ ఘటనతో సుమారు రూ.65వేల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మొదటి ప్లాట్‌ఫాంపై ఏర్పాటై ఉన్న రిజర్వేషన్ చార్టుల డిస్ప్లే మానిటర్లలో నుంచి పొగ రావడంతో ప్రయాణికులు కేకలు పెట్టారు. కొన్ని క్షణాల్లోనే మంటలు రావడంతో భయాందోళనకు గురయ్యారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న టీసీ చైతన్య, జనరల్ బుకింగ్ కార్యాలయం క్లర్క్ వెంకటేష్‌లు వెంటనే అగ్నిమాపక పరికరాలతో మానిటర్లపైకి పౌడర్‌ను వెదజల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎండాకాలం కావడంతోపాటు మానిటర్ల లోపలి కేబుల్, వైరింగ్ బాగా కరిగిపోవడంతో పొగలతోపాటు మంటలు చెలరేగేందుకు కారణమయింది. ఈ చార్టుల మానిటర్లను ప్లాట్‌ఫాంపై కాకుండా స్టేషన్‌కు వెలుపల ఏర్పాటు చేయాలని అప్పట్లోనే విన్నవించుకున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఈ మానిటర్లు ఉన్న ప్లాట్‌ఫాంపై అర్దరాత్రి దాటాక వందల సంఖ్యలో ప్రయాణికులు నిద్రిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ఏదైనా ఘటన జరిగి ఉంటే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండేదని ప్రయాణికులు తెలిపారు -
బంగారు వాకిలికి సొబగులు
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని ద్వారపాలకులు జయవిజయుల విగ్రహాల మధ్యలో ఉండే బంగారు వాకిలికి అమర్చిన బంగారు రేకులు శిథిలావస్థలో ఉన్నాయి. వీటికి కొత్త బంగారు రేకులు అమర్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అందుకు అయ్యే రూ. 86 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖర్‌కు అనుమతిస్తూ తీర్మానం చేసింది. శుక్రవారం టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సమావేశం వివరాలను చైర్మన్, ఈవో, జేఈవో మీడియాకు వివరించారు. తీర్మానాలు ► తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ కోసం టీటీడీ రెండో సత్రం వద్ద 2.74 ఎకరాల స్థలాన్ని రైల్వేశాఖకు అప్పగించనున్నారు. దీనికి బదులుగా తిరుచానూరు వద్ద ఉన్న రైల్వే స్థలాన్ని టీటీడీకి అప్పగించనుంది. ► శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పోలూరు గ్రామంలోని పురాతన శ్రీఅలగమల్లారి కృష్ణస్వామి ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకోనున్నారు. ► తెలంగాణ ప్రభుత్వం శ్రీవారికి రూ. 5 కోట్ల విలువైన సాలిగ్రామహారం, ఐదు పేటల కంఠె (కంఠహారం) వితరణకు అనుమతి. ► రూ. 2.55 కోట్లతో పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి. ► తిరుపతి కోదండరామస్వామి ఆలయం లో అమావాస్య రోజున సహస్ర కలశాభిషేకం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవలు, ఆర్జిత సేవలు ప్రారంభానికి నిర్ణయం. -
శ్రీకాళహస్తి-కాణిపాకం మధ్య మెట్రోరైలు
- సింగపూర్ సంస్థలతో విభేదాలు లేవు - మీడియాతో మంత్రి నారాయణ తిరుపతి అర్బన్: ఆధ్యాత్మిక క్షేత్రాల అనుసంధాన ప్రక్రియలో భాగంగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి-కాణిపాకం మధ్య మెట్రో రైలు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వానికి విభేదాలు అనేది కేవలం పుకారు మాత్రమేనని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వర్తింపజేయాలనే ఉద్దేశంతోనే పథకాలు, ప్రాజెక్ట్‌లు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. తిరుపతి సర్వతోముఖాభివృద్ధికి త్వరలోనే కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి ఉన్నారు. -
తిరుపతి రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు
తిరుపతి: ఇప్పటికే ఉగ్రవాదుల టార్గెట్‌గా ఉన్న దక్షిణ భారత ఆథ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలోని రైల్వే స్టేషన్లో బాంబు కలకలం చెలరేగింది. నిత్యం లక్షల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే తిరుపతి రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి.. పోలీస్ హెల్ప్ లైన్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. రైల్వే స్టేషన్‌లోని వివిధ ప్రదేశాల్లో మొత్తం 8 బాంబులు అమర్చినట్లు ఆగంతకుడు పోలీసులకు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. బుధవారం ఉదయం మూడు గంటల వరకు రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. 8 డాగ్ స్క్వాడ్, 4 బాంబ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. అయితే చివరికి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల హడావుడి చూసి అక్కడున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగళవారం రాత్రి 11:30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి పోలీస్ హెల్ప్ లైన్‌కి ఫోన్ చేసి రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. -
రైల్వే స్టేషన్లో మంత్రి తనిఖీలు
తిరుపతి : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. కృష్ణపట్నం పర్యటన ముగించుకుని ప్రత్యేక రైలులో మంత్రి ఉదయం 11.30 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. రైల్వే క్యాటరింగ్ విభాగంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం ప్లాట్‌ఫాంపై ఉన్న తాగునీటి కొళాయిలను, ప్రయాణికులు సామాన్లు భద్రపరిచే (క్లాక్‌రూం) గదిని, టాయ్లెట్లను పరిశీలించారు. మంత్రికి రైల్వే గుంతకల్ డివిజన్ మేనేజర్ మనోజ్ జోషి, అసిస్టెంట్ డివిజన్ మేనేజర్ సత్యనారాయణ, లైజనింగ్ ఆఫీసర్ కుప్పాళ్ల సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ గంగులప్ప, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకుడు గిరిధర్‌కుమార్, రాస్ ప్రధాన కార్యదర్శి గుత్తా మునిరత్నం, సింగంశెట్టి సుబ్బరామయ్య, బీజేపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి తదితరులు మంత్రికి స్వాగతం పలికారు. మునుపెన్నడూ లేని విధంగా మంత్రి రాక సందర్భంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌ కర్యార్థం మెడికల్ క్లినిక్‌ను ఏర్పాటు చేయాలని బీజే యువమోర్చా నాయకులు మంత్రిని కోరారు. వృద్ధు లు, వికలాంగుల కోసం వీ ల్చైర్లు అందుబాటులో ఉం చాలని బీజేవైఎం నాయకు లు విశ్వనాథ్ మంత్రికి విన తి పత్రం సమర్పించారు. దీనిపై ఆయన సానుకూలం గా స్పందించారు. -
తిరుపతిలో కేంద్ర రైల్వే మంత్రి తనిఖీ
-
తిరుపతిలో కేంద్ర రైల్వే మంత్రి తనిఖీ
తిరుపతి: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. ఇందుకోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైల్వేల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు అవసరమని సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. రైల్వే మంత్రి రాక సందర్భంగా పోలీసులు అతిగా వ్యవహరించారు. మీడియా ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి నెట్టేవేశారు. -
తిరుపతిలో భారీగా గంజాయి పట్టివేత
తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్లో భారీగా గంజాయిని రైల్వే పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి... అతడ్ని విచారిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... అహ్మదాబాద్ నుంచి తిరుపతికి నాలుగు పెద్ద బాక్సులు పార్విల్లో వచ్చాయి. పార్శిళ్లుగా వచ్చిన బాక్సులు తీసుకువెళ్లేందుకు వచ్చిన రమేష్‌ను... బాక్సుల్లో ఏమున్నాయని పోలీసులు ప్రశ్నించారు. దాంతో అతడు పొంతన లేని సమాధానాలు వెల్లడించాడు. దాంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో బాక్సుల్లో గంజాయి ఉందని తెలిపాడు. దీంతో పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకుని సీజ్ చేసి... అతడిని విచారిస్తున్నారు.