
భద్రతను పరిశీలిస్తున్న చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ మెహతా
చిత్తూరు, తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషన్‌లో భద్రతను మరింత పెంచేందుకు రైల్వే బోర్డుకు సిఫార సు చేయనున్నట్టు సదరన్ రైల్వే (చెన్నై) చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్‌కె మెహతా చెప్పారు. భవిష్యత్‌లో పెరగనున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తిరుపతి రైల్వే స్టేషన్లో భద్రత పెంపు విషయమై పరిశీలించి అధికారులతో సమీక్షించేందుకు గురువారం మెహతా బృందం ఇక్కడికి వచ్చింది. ముందుగా రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు, రైల్వే ఆస్తులకు కల్పిస్తున్న భద్రత అంశాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు సీఐ సైదయ్య, గుంతకల్ డివిజన్ భద్రతా అధికారులతో వీఐపీ లాంజ్‌లో సమీక్షిం చారు. అనంతరం ప్లాట్‌ఫారాలు, ప్రయాణికులు వేచివుండే ప్రాంతాలు, రైళ్లు రాకపోకలు సాగించే ప్రాంతాలు, బోగీల శుభ్రత విభాగం, ఎలక్ట్రికల్ విభాగాలను పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రైల్వే స్టేషన్‌కు వివిధ మార్గాల్లో ప్రవేశాలు ఉండడంతో భద్రత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని ప్రాంతాలను గుర్తించి రైల్వే బోర్డుకు నివేదిక ఇవ్వనున్నామన్నారు. రెండు రైల్వే పోలీసు విభాగాల్లో సిబ్బంది కొరతను తీర్చడంపై రైల్వే మంత్రిత్వశాఖకు నివేదికలు పంపుతామన్నారు. ప్రయాణికుల రాకపోకలను ప్రతిక్షణం క్షుణ్ణంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా సీసీ కెమెరా కింద కంట్రోల్ రూమ్ ఆధునీకరణకు సిఫారసు చేస్తామని తెలిపారు. రైల్వేలో భద్రతను పటిష్టపరిచే క్రమంలో ప్రస్తుతం మంజూరవుతున్న ఏక మొత్తం నిధులతో సంబంధం లేకుండా భద్రతా విభాగాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించేందుకు రైల్వే బోర్డు చైర్మన్‌తో చర్చిస్తామన్నారు. అందులో భాగంగా తిరుపతిలో మరో 55 అధునాతన సీసీ కెమెరాలతో పాటు ఏడాదికి రూ.కోటికిపైగా భద్రతకు నిధులు వెచ్చించేలా రైల్వే మంత్రికి విన్నవిస్తామన్నారు. సేఫ్టీ అధికారి సురేష్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ రాజశేఖర్, సంజీవనాయుడు, తవమనిపాండి, సీడీవో నితిన్‌పచోరి, స్టేషన్ మేనేజర్ సుభోద్‌మిత్రా, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.