
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బస్సు టికెట్లు ఇస్తున్న ఆర్టీసీ అలిపిరి డిపో కండక్టర్
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయివేట్ ఆపరేటర్ల దోపిడీని అరికట్టి శ్రీవారి భక్తులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించేందుకు రైల్వే, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన రైళ్లలో బస్సు టికెట్ల జారీ ప్రయోగం సత్ఫలితాలను అందిస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఇది అమలవుతోంది. రోజుకి 150కి పైగా టికెట్లు జారీ చేస్తున్నామని తిరుపతి, అలిపిరి ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇదే ప్రయోగాన్ని మిగతా రైళ్లలోనూ అమలు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
ఇలా ఎందుకంటే...
నిత్యం తిరుపతి రైల్వేస్టేషన్‌లో దిగే ప్రయాణికులు 1.20 లక్షల నుంచి 1.45 లక్షల మంది ఉంటారు. వీరిలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు 40 వేల మందికి పైనే ఉంటారు. ప్రతి రోజూ ఉదయమే తిరుపతి చేరుకునే రైళ్లు పదికి పైనే ఉన్నాయి. ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో, జీపులు, ట్యాక్సీల ఆపరేటర్లు చుట్టుముడతారు. కొండ మీదకు వెళ్లే భక్తుల నుంచి పెద్ద మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారు. ఎక్కడో ఉన్న ఆర్టీసీ బస్సులను వెదుక్కుని లగేజీలతో వెళ్లి ఎక్కడం కష్టంగా భావిస్తున్న చాలా మంది ప్రయాణికులు ఎదురుగా ఉన్న ఏదో ఒక ప్రయివేటు వాహనాన్ని ఎక్కి వెంటనే కొండకు ప్రయాణమవుతున్నారు. దీన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు రెండు నెలల కిందట రైల్వే డీఆర్‌ఎం, సీనియర్ డీసీఎంతో చర్చించారు. కొన్ని ప్రత్యేక రైళ్లలో టికెట్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని లిఖిత పూర్వకంగా కోరారు. దీంతో రైల్వే శాఖ అంగీకరించింది.
మొదటి దశలో బస్సు టికెట్ల జారీ కోసం సికింద్రాబాద్ నుంచి రోజూ తిరుపతి చేరుకునే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (12733) రైలు బండిని ఎంపిక చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇందులో ప్రయాణికులకు బస్సు టికెట్లు ఇస్తున్నారు. శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్‌లో ఎక్కుతున్న ముగ్గురు ఆర్టీసీ కండక్టర్లు స్లీపర్ క్లాస్, జనరల్, ఏసీ కోచ్‌లలో తిరుమల వెళ్లే భక్తులకు బస్సు టికెట్లు ఇస్తున్నారు. రోజుకు 150కి పైగా టికెట్లు పోతున్నాయి. రైల్లోనే టికెట్లు తీసుకున్న ప్రయాణికులు స్టేషన్ బయటకు రాగానే ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సులు ఎక్కి తిరుమల చేరుతున్నారు. ఈ ప్రయోగం బాగానే ఉందని ప్రయాణికుల నుంచి స్పందన వస్తుందని ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు చెప్పారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో చెన్నై–తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు–తిరుపతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ బస్సు టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment