ప్రపంచస్థాయి వసతులతో తిరుపతి రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. తిరుమల శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక డిజైన్లతో నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రయాణికుల అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. రూ.వందల కోట్ల వ్యయంతో అధునాతన భవనాలను ఆవిష్కరించేందుకు శరవేగంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు.
తిరుపతి అర్బన్ : తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఇప్పటికే ఏ క్లాస్ గుర్తింపు ఉంది. సుమారు రూ.500 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్ వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. ఇందుకోసం అద్భుతమైన డిజైన్లను రూపొందించారు. ఆ మేరకు ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇప్పటికే దక్షణం వైపు నూతన భవనాలు, 1 నుంచి 6వ ప్లాట్‌ఫాం వరకు ఎయిర్ కాన్‌కోర్స్ నిర్మాణం కోసం ఫౌండేషన్ కాస్టింగ్ పనులు పూర్తి చేశారు.
స్టేషన్‌కు దక్షణం వైపు వాహనాల పార్కింగ్‌తోపాటు పలు భవనాలను నిర్మించారు. మరోవైపు రెండు రోజులుగా ఉత్తరం వైపు పనులు ప్రారంభించడానికి పురాతనమైన ప్రధాన ముఖద్వారం 1, 2 వద్ద భవనాలను కూల్చివేశారు. తాజాగా ఉత్తరం వైపుతోపాటు తూర్పు, పడమర అన్ని వైపులా పనులు చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా డేరాలతో నీడను కల్పిస్తున్నారు.
ఇతర మౌలిక వసతుల కల్పనకు రైల్వే అధికారు కృషి చేస్తున్నారు. వచ్చే ఏడాదికి అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
సంతోషంగా ఉంది
తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. రైల్వే మంత్రితోపాటు పలువురు ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడాం. ప్రధానంగా నూతన భవనాల నిర్మాణంలో భక్తిభావం ఉట్టిపడిలా డిజైన్లు రూపొందించేందుకు శ్రమించాం. తిరుపతి ఎంపీగా రైల్వేస్టేషన్, సెంట్రల్ బస్టాండ్‌ను రూ.వందల కోట్లతో అభివృద్ధి చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.
– గురుమూర్తి, ఎంపీ, తిరుపతి
మెరుగైన వసతులు
రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక టీం పర్యవేక్షిస్తోంది. ఈ కీలక తరుణంలో ప్రయాణికులు సైతం సహకరించాలని కోరుతున్నాం. వరల్డ్ క్లాస్ స్టేషన్ పనులు పూర్తయితే అత్యంత ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. తిరుపతి కీర్తి మరింత ఇనుమడిస్తుంది.
– సత్యనారాయణ, డైరెక్టర్, తిరుపతి రైల్వేస్టేషన్
Comments
Please login to add a commentAdd a comment