
తిరుపతి రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు
తిరుపతి: ఇప్పటికే ఉగ్రవాదుల టార్గెట్గా ఉన్న దక్షిణ భారత ఆథ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలోని రైల్వే స్టేషన్లో బాంబు కలకలం చెలరేగింది. నిత్యం లక్షల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే తిరుపతి రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి.. పోలీస్ హెల్ప్ లైన్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. రైల్వే స్టేషన్లోని వివిధ ప్రదేశాల్లో మొత్తం 8 బాంబులు అమర్చినట్లు ఆగంతకుడు పోలీసులకు తెలిపాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు.. బుధవారం ఉదయం మూడు గంటల వరకు రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. 8 డాగ్ స్క్వాడ్, 4 బాంబ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. అయితే చివరికి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల హడావుడి చూసి అక్కడున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగళవారం రాత్రి 11:30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి పోలీస్ హెల్ప్ లైన్కి ఫోన్ చేసి రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు.