తిరుపతి ప్రధాన రైల్వే స్టేషనుకు రోజూ ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. తిరుమలకు వచ్చే భక్తులలో ఎక్కువమంది రైళ్ల ద్వారానే చేరుకుంటారు. దీనివల్ల స్టేషను ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంది. ఈ తాకిడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా మరో రెండు స్టేషన్లను అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ ఐదారేళ్ల క్రితం సంకల్పించింది. అయినా నేటికీ ఈ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. ఫలితంగా తిరుపతి స్టేషనులో భక్తుల కష్టాలు తీరడం లేదు.
తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషనులో రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా మరో రెండు స్టేషన్లను అభివృద్ధి చేయాలన్న రైల్వే శాఖ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. నాలుగైదేళ్ల క్రితమే ప్రతిపాదనలు, నిధుల అంచనాల ప్రణాళికలు సిద్ధం చేసి చేతులు దులిపేసుకుంది. దీంతో ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. పదేళ్ల క్రితం రోజుకు 10వేల మంది కూడా ప్రయాణించేవారు కాదు. ఇప్పుడు సగటున 80 వేల నుంచి లక్షవరకు వస్తూపోతున్నారు. భారీ రద్దీ ఉన్న స్టేషన్లలో తిరుపతి ఒకటి.
నిధులేవీ అమాత్యా..
రైల్వేస్టేషన్‌కు తూర్పు దిక్కులోని తిరుచానూరు స్టేషన్‌ను కొత్త టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. కానీ ఇప్పుడీ కొత్త టెర్మినల్ పనులు అటకెక్కినట్లేనని రైల్వే వర్గాలే చెబు తున్నాయి. ఇంజినీరింగ్ అధికారుల ఉదాసీన నివేదికలు, డివిజన్‌లోని కొందరు తమదైన కమీషన్ల పర్వానికి తెరలేపడం ఇందుకు కారణంగా నిలుస్తోంది. 2016 బడ్జెట్‌లో ఈ టెర్మినల్ అభివృద్ధికి రైల్వేశాఖ చాలీ చాలని నిధులను విదిల్చింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు పలు పర్యాయాలు వచ్చినప్పుడు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పినా ఆచరణలో నెరవేరలేదు. ఆదిలోనే హంసపాదు పడేందుకు టీడీపీకి చెందిన టీటీడీ మాజీ చైర్మన్ స్వలాభ ఆలోచనలు తోడయ్యాయి.
ఆయన తొందరపాటు ఒత్తిళ్ల వల్ల టెర్మినల్ పనులు ప్రారంభం కాలేదనే విమర్శ ఉంది. రైల్వే స్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్థాయికి అభివృద్ధి చేసేందుకు తగిన∙స్థలం లేదు. రైల్వే మంత్రిత్వ శాఖ, బోర్డు అత్యున్నతాధికారులు ప్రత్యామ్నాయ ప్రాంతా ల్లోనే అభివృద్ధి శరణ్యమని గుర్తించారు. ఇందుకోసం తిరుపతి వెస్ట్, తిరుచానూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లను వివిధ దశల్లో పరిశీలించారు. అందులో భాగంగానే తిరుచానూరుకు ముందుగా రూ.10కోట్లు మంజూరు చేసింది. కానీ ఈ నిధులు ఎటూ చాలవు. దీంతో కొత్త నిర్మాణానికి అడ్డుకట్ట పడింది. ఏడాది క్రితమే ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు ఢిల్లీకి పంపారు. రూ.10 కోట్ల బడ్జెట్‌కు అదనంగా మరో రూ.25 కోట్లు అవసరమవుతాయని అంచనాలు రూపొందించారు. అయినా పాత నిధులు రాలేదు. కొత్త నిధులకు మోక్షంలేదు. దీంతో టెర్మినల్ పనులు ముందుకు సాగడం లేదు.
పత్తాలేని ‘పడమర’ అభివృద్ధి...
మరో ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖ పడమర స్టేషన్‌ను ప్రతిపాదించింది. పశ్చిమాన 52 ఎకరాలతో పాటు 18 ఎకరాల ప్రైవేటు స్థలముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగేళ్ల క్రితం రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, అప్పటి జీఎం వెస్ట్‌పై ఆసక్తి చూపిం చారు. డిజైనింగ్‌లు, అంచనాల ప్రతిపాదనలు తయారు చేశారు. నిర్మాణాలు చేపట్టేందుకు ప్రైవేటు ఏజెన్సీలను గుర్తించారు. కానీ ప్రస్తుత స్టేషన్ పరిసర ప్రాంతాల హోటళ్ల నిర్వాహకులు, ఇతర వాణిజ్య సముదాయాల వారు రైల్వే బోర్డుపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా వెస్ట్ పనులకు బ్రేకు పడింది. ఈ దశలో కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. వెస్ట్ స్టేషన్ పనులూ నిలిచిపోయాయి. రాజకీయ పరంగా కేంద్రంపై సరైన ఒత్తిడి తెస్తే తప్ప ఈ రెండు స్టేషన్లకు కదలిక ఉండదని ప్రయాణికులంటున్నారు. ఈ మేరకు అధికారుల్లో కదిలిక వస్తుందో లేదో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment