తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫాంపై శనివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కావడంతో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన రిజర్వేషన్ చార్టు కంప్యూటర్ డిస్‌ప్లే మానిటర్లు కాలిపోయాయి. రెండు మానిటర్లు పూర్తిగా, మరొక మానిటర్ పాక్షికంగా డామేజీ అయ్యాయి. ఈ ఘటనతో సుమారు రూ.65వేల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.
సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మొదటి ప్లాట్‌ఫాంపై ఏర్పాటై ఉన్న రిజర్వేషన్ చార్టుల డిస్‌ప్లే మానిటర్లలో నుంచి పొగ రావడంతో ప్రయాణికులు కేకలు పెట్టారు. కొన్ని క్షణాల్లోనే మంటలు రావడంతో భయాందోళనకు గురయ్యారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న టీసీ చైతన్య, జనరల్ బుకింగ్ కార్యాలయం క్లర్క్ వెంకటేష్‌లు వెంటనే అగ్నిమాపక పరికరాలతో మానిటర్లపైకి పౌడర్‌ను వెదజల్లి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఎండాకాలం కావడంతోపాటు మానిటర్ల లోపలి కేబుల్, వైరింగ్ బాగా కరిగిపోవడంతో పొగలతోపాటు మంటలు చెలరేగేందుకు కారణమయింది. ఈ చార్టుల మానిటర్లను ప్లాట్‌ఫాంపై కాకుండా స్టేషన్‌కు వెలుపల ఏర్పాటు చేయాలని అప్పట్లోనే విన్నవించుకున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఈ మానిటర్లు ఉన్న ప్లాట్‌ఫాంపై అర్దరాత్రి దాటాక వందల సంఖ్యలో ప్రయాణికులు నిద్రిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ఏదైనా ఘటన జరిగి ఉంటే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండేదని ప్రయాణికులు తెలిపారు