రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ నమూనా
తిరుపతి అర్బన్: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతికి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చే పోయే ప్రయాణికులతో ఇక్కడి రైల్వే స్టేషన్ కూడా కిటకిటలాడుతుంటుంది. నిత్యం 105 రైళ్ల ద్వారా 75 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దక్షిణ మధ్య రైల్వేలో ఏపీలో విజయవాడతోపాటు తిరుపతి కూడా ఏ1 క్లాస్ స్టేషన్‌గా వినుతికెక్కింది. డివిజన్‌కు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంత ప్రాధాన్యమున్న ఈ రైల్వే స్టేషన్‌ను ఇప్పుడు అంతర్జాతీయ హంగులతో నూతనంగా తీర్చిదిద్దనున్నారు.
రైల్వే స్టేషన్ల రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు తొలిదశ కింద తిరుపతి, నెల్లూరు స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. మల్టీ మోడల్ ట్రాన్సిట్ హాబ్‌గా తిరుపతి స్టేషన్‌ను తీర్చిదిద్దుతారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర రైల్వే శాఖ కార్యాలయం నుంచి నమూనా ఫొటోలను విడుదల చేశారు. సికింద్రాబాద్ కూడా ఈ ప్రాజెక్టు జాబితాలో ఉంది. తిరుపతికంటే ముందే సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే, సికింద్రాబాద్ స్టేషన్‌ను ఎంపిక చేయలేదు. దానికంటే ముందే తిరుపతికి అవకాశం దక్కిడం విశేషం.
తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.299 కోట్లు కేటాయించారు. ఢిల్లీకి చెందన ఓ కాంట్రాక్టర్ ఈ స్టేషన్ పనుల టెండర్ దక్కించుకున్నారు. మే 31వ తేదీ (మంగళవారం) నుంచి 33 నెలల్లో పనులు పూర్తి చేయాలి. ముందుగా దక్షిణం వైపు అత్యాధునిక సౌకర్యాలతో మూడంతస్తుల భవనం నిర్మిస్తారు. కార్యాలయాలు ఆ భవనంలోకి మార్చిన తర్వాత ఉత్తరం వైపు మరో మూడంతస్తుల భవనం నిర్మిస్తారు.
ఈ భవనాలను 100 అడుగుల వెడల్పుతో 600 అడుగుల పొడవుతో నిర్మిస్తారు. అండర్ గ్రౌండ్‌లో లక్ష అడుగుల విస్త్రీర్ణంలో విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, డిస్‌ప్లే సిస్టమ్ వంటి ఆధునిక వసతులు కల్పిస్తారు. వీటివల్ల ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యానికి లోనుకాకుండా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుంది.
రీ డెవలప్‌మెంట్ ఇలా..
► ప్రయాణికుల కోసం 23 లిఫ్ట్‌లు, 20 ఎస్కలేటర్లు
► సమాచార డిస్‌ప్లే సిస్టం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్
► సీసీ టీవీ కెమెరాలు
► స్పష్టమైన సూచిక బోర్డులు, కోచ్ ఇండికేషన్ బోర్డులు
► ఉత్తరం, దక్షిణం వైపు సకల సౌకర్యాలతో గ్రౌండ్ ప్లోర్‌తో పాటు మూడంతస్తుల భవనాలు
► ఉత్తరం–దక్షిణం భవనాలను కలుపుతూ 35 మీటర్ల వెడల్పుతో రెండు ఎయిర్‌కోర్సులు
► ప్లాట్‌ఫారంలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం
► దక్షిణం వైపు భవనంలో పార్కింగ్, డిపార్చర్ కాన్‌కోర్స్, అరైవల్ కాన్‌కోర్స్, టిక్కెట్ కౌంటర్, వెయిటింగ్ హాల్, ఫుడ్‌కోర్ట్, టాయిలెట్స్, క్లోక్ రూమ్.
► మొదటి, రెండో అంతస్తుల్లో రైల్వే కార్యాలయాలు
► 3వ అంతస్థులో సౌకర్యవంతమైన విశ్రాంతి భవనం.
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఈ అంశాన్ని పలుసార్లు ఉన్నతస్థాయి అధికారులతో పాటు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు తెలియజేశాను. దీంతో దశాబ్దాలుగా మరుగునపడిన రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఆధ్యాత్మిక నగరానికి తగినట్లుగా స్టేషన్ డిజైన్ ఉండాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు స్పష్టంగా చెప్పాను.
స్థానికతను దృష్టిలో ఉంచుకుని డిజైన్లలో మార్పులు కూడా చేయాలని కోరాం. మూడేళ్ల తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది. స్టేషన్‌లో కనీస పార్కింగ్ లేకపోవడం వల్ల ఇబ్బందులను వారికి వివరించాను. దీంతో లక్ష అడుగుల విస్తీర్ణంతో విశాలమైన పార్కింగ్ ఏర్పాటుచేస్తున్నారు.
–మద్దెల గురుమూర్తి, తిరుపతి పార్లమెంట్ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment