
న్యూఢిల్లీ: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), హైదరాబాద్ క్యాంపస్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. మూడు సంవత్సరాలపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అరవింద్ సుబ్రమణియన్ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవిని (సీఈఏ) ఈ ఏడాది జూలైలో వీడగా, అప్పటి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ పోస్ట్‌కు ఐఎస్‌బీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను నియమించాలన్న ప్రతిపాదనను కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదించినట్టు ప్రభుత్వం శుక్రవారం తెలియజేసింది. పారిశ్రామికాభివృద్ధి, విదేశీ వాణిజ్యం, పారిశ్రామిక ఉత్పత్తి, ప్రధాన ఆర్థిక విషయాల ప్రకటనల్లో కేంద్ర ప్రభుత్వానికి విధానపరమైన సూచనలు, సలహాలను సీఈఏ ఇవ్వాల్సి ఉంటుంది.
అపార అనుభవం
ఐఐటీ, ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన సుబ్రమణియన్ ఫైనాన్షియల్ ఎకనమిక్స్‌లో అమెరికాలోని షికాగో యూనివర్సిటీ, బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీయే, పీహెచ్‌డీ పట్టాలు పొం దారు. బ్యాంకింగ్, కార్పొరేట్ గవర్నెన్స్, ఎకనమిక్ పాలసీల్లో సుబ్రమణ్యం దిట్ట. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కార్పొరేట్ గవర్నెన్స్ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బ్యాంకింగ్ గవర్నెన్స్ కమిటీల్లోనూ పనిచేశారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్, ప్రైమరీ మార్కెట్స్, సెకండరీ మార్కెట్స్, రీసెర్చ్ విషయాల్లో సెబీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించారు. బంధన్ బ్యాంకు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకు మేనేజ్‌మెంట్, ఆర్‌బీఐ అకాడమీ బోర్డులకు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2015 ఆర్థిక సర్వేపై అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌ను సహకారం అందించారు. ప్రస్తుత ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్యతో కలసి 2009లో దివాలా కోడ్‌పై పనిచేశారు. కెరీర్ ప్రారంభానికి ముందే జేపీ మోర్గాన్ చేజ్‌కు కన్సల్టెంట్‌గా, ఐసీఐసీఐ బ్యాం కులోనూ పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ‘‘ఐఎస్‌బీ అధ్యాపకవర్గంలో ఒకరు కేంద్ర ప్రభుత్వంలో ఎంతో ముఖ్యమైన పదవికి ఎంపిక కావడం ప్రతిష్టాత్మకం. మేము గర్వపడాల్సిన విషయం’’ అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ డీన్ రాజేంద్రశ్రీవాస్తవ ప్రకటన చేశారు. సుబ్రమణియన్ ఐఎస్‌బీ హైదరాబాద్‌కు 2009లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేయడం ఆరంభించారు. 2010లో ఫైనాన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు.