ISB
-
గొప్ప పనుల కోసం రిస్క్ తీసుకోవాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఎంత గొప్ప నాయకుడికైనా ధైర్యం ముఖ్యం. తెలివి తేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేసే తత్వంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కలసి రావాలి. గొప్ప పనులు చేయడానికి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో లీడర్షిప్ ఇన్ ఇండియా అనే అంశంపై నిర్వహించిన సదస్సులో రేవంత్ మాట్లాడారు. తాను రాజకీయాలు, జీవితం ద్వారా నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నా నని చెప్పారు. కాంగ్రెస్ అద్భుత రాజకీయ వారసత్వాన్ని కలిగి ఉందని.. ప్రధానంగా మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ, పటేల్, ఇందిరా గాందీ, పీవీ, మన్మోహన్‌ల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ‘గొప్ప నాయకులు త్యాగాలకు సిద్ధంగా ఉంటారు. ధైర్యం, త్యాగంతోనే గొప్ప నాయకులుగా తయారవుతారు. విజయం సాధిస్తారు. ఈ పోరాటంలో మనం చాలా కోల్పోవాల్సి రావచ్చు. ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకోవాలి. అప్పుడే ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి సేవ చేయగలుగుతారు. పేద, ధనిక, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా, సమాన గౌరవమిస్తూ స్నేహభావంతో అందరినీ కలుపుకొనిపోవాలి’అని సీఎం రేవంత్ సూచించారు. ప్రభుత్వంలో పనిచేయండి.. ‘అసాధారణ ప్రతిభ ఉన్న యువ ఐఎస్బీ విద్యార్థులు హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రంతోపాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లు. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న మా లక్ష్యానికి చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాల్సి ఉంటుంది. తెలంగాణను ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి నాకు సహకారం అందించండి’అని ఐఎస్బీ విద్యార్థులను సీఎం రేవంత్ కోరారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలతో తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడాలని సూచించారు. దేశంలోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని తాను కోరుకోవడం లేదని.. న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రపంచంలో భారతదేశం, హైదరాబాద్ అత్యుత్తమంగా మారాలన్నది భారీ లక్ష్యమే అయినా అసాధ్యం కాదన్నారు. తమ ప్రభుత్వంతో రెండు, మూడేళ్లు కలిసి పనిచేయాలని విద్యార్థులను కోరారు. కార్పొరేట్ల తరహాలో ప్రభుత్వం భారీ జీతాలను ఇవ్వలేకపోయినా మంచి అవకాశాలు, లక్ష్యాలు, సవాళ్లను ఇస్తామని చెప్పారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఉండేలా.. హైదరాబాద్‌ను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తన ఆలోచన సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దక్షిణ కొరియాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించానని.. చిన్న దేశమైనా ఒలింపిక్స్‌లో చాలా పతకాలు గెలిచిందని చెప్పారు. మన దేశం ఒక్క బంగారు పతకం సాధించలేకపోయిందన్నారు. ఒలింపిక్స్ పతకాలు సాధించడం తమ లక్ష్యమని చెప్పారు. -
భారత్‌లో టాప్ బిజినెస్ స్కూల్ ఇదే..
మేనేజ్మెంట్ విద్యలో మెరికల్లాంటి విద్యార్థులను సానబెట్టి ప్రపంచ సంస్థలకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అందిస్తోంది. ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలతో, వ్యాపార ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ, ఉన్నత స్థాయిలో, విశ్వవ్యాప్తంగా రాణిస్తున్నారు. దేశంలోని బిజినెస్ స్కూల్స్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అగ్రస్థానంలో నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ 2024 విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్‌లో ఐఎస్బీ 31వ ర్యాంకింగ్‌ను దక్కించుకుంది. గత ఏడాది ఐఎస్బీ 39వ స్థానంలో ఉండగా ఈసారి ఏకంగా 31 స్థానానికి దూసుకుపోయింది. మరోవైపు ఆసియాలోని టాప్ బీ స్కూల్స్‌లో 6 నుంచి 5వ స్థానానికి చేరుకుంది. రీసెర్చ్‌పరంగా భారత్‌లో నంబర్‌వన్ ర్యాకింగ్ను దక్కించుకోగా అంతర్జాతీయంగా 52వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థను 2001లో స్థాపించారు. 260 ఎకరాల్లో (110 హెక్టార్లు) ఇది విస్తరించి ఉంది. ఇందులో 130 నుంచి 210 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేలా ఏర్పాటు చేశారు. -
హాజరుకూ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. ఐఎస్బీ అభిప్రాయ సేకరణ అధ్యయనంలో భాగంగా ఐఎస్బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు. ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది. ప్రతి అంశానికీ మార్కులు సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్బీ ప్రస్తావించింది. యాక్టివ్‌గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్టు వర్క్‌లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్‌షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్బీ సిఫారసు చేసింది. గుణాత్మక మార్పుకు దోహదం దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్– ఇంజనీరింగ్) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్వేర్ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ) -
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ఐఎస్బీకి 78వ ర్యాంకు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లోని అగ్రశ్రేణి మేనేజ్మెంట్ కాలేజీల జాబితాతో కూడిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2024లో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సత్తా చాటింది. ప్రపంచ టాప్–100 బి–స్కూల్స్ ర్యాంకుల్లో 78వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఐఐఎం–బెంగళూరు 48వ ర్యాంకుతో టాప్–50లో చోటు సంపాదించగా ఐఐఎం–అహ్మదాబాద్ 53వ ర్యాంకు, ఐఐఎం–కలకత్తా 59వ ర్యాంకు సాధించాయి. గతేడాది విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లోనూ టాప్–100లో ఈ నాలుగే ఉండటం విశేషం. ఇండోర్, ఉదయ్‌పూర్, లక్నో ఐఐఎంలు 150–200 ర్యాంకింగ్స్ మధ్య నిలవగా ఢిల్లీ, గుర్గావ్ ఐఐఎంలు 200–250 ర్యాంకుల మధ్య నిలిచాయి. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్ తొలి స్థానంలో నిలిచింది. -
యూపీఎస్సీ పరీక్ష కంటే.. రాజకీయాలు కఠినం!
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజకీయాల్లోకి వచ్చే యువ త క్షేత్రస్థాయి నుంచి పనిచేసి వస్తే విజయం సాధించే అవకాశం ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాకు తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రజాక్షేత్రంలో క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు అవకాశం దొరికింది. రాజకీయాల్లో ప్రజా క్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసిన దానికన్నా కఠినమైనది..’’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. పంజాబ్‌లో మొహాలీలోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)’లో శుక్రవారం జరిగిన ‘అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ’కోర్సు ప్రారంభ సమావేశంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుడిగా తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు కేటీఆర్ మాటల్లోనే.. ‘‘అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలు నిధుల కొరత అనే అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్నాయి. రుణాలు తీసుకోకుండా ఉండాలన్న పాతకాలపు ఆలోచన ధోరణితో దేశం వెనుకబడుతోంది. రుణాలను భవిష్యత్తుపై పెట్టుబడిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ భారత్‌లో మాత్రం అనేక అపోహలు ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి. రాష్ట్రాల్లో అమలవుతున్న ఆదర్శ విధానాల నుంచి కేంద్రం స్ఫూర్తి పొందడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. అధికారులు ఆ ఆలోచన వీడాలి ప్రభుత్వ పాలనలో శాశ్వతంగా ఉంటామనే ఆలోచన విధానం నుంచి అధికారులు బయటికి రావాలి. మారుతున్న పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులతో కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకుల దూరదృష్టి గొప్పదైతే ప్రభుత్వ యంత్రాంగం కూ డా అదే స్ఫూర్తితో పనిచేస్తుందని తెలంగాణ తొ మ్మిదేళ్ల అనుభవం నిరూపించింది. నాయకత్వం అంటే ప్రతిరోజు నేర్చుకోవడమే. భవిష్యత్తు బాగుంటుందనే ఆశను ప్రజలకు కల్పించగలిగితే వారు ప్రభుత్వాలు, పార్టీలకు అండగా ఉంటారు. విజయం కోసం త్యాగాలు చేయాలనే భావనకు రాజకీయ నాయకులు మినహాయింపేమీ కాదు. విభిన్న రంగాల్లో అనుభవం కలిగిన నిపుణులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. దేశం తెలంగాణను అనుసరిస్తే..: గడిచిన దశాబ్ద కాలంలో తెలంగాణను ఇతర రాష్ట్రాలు, కేంద్రం అనుసరించి ఉంటే.. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండేది. ప్రజాస్వా మ్య పోరాటాలు, ఉద్యమాలతో ఏర్పాటైన తెలంగాణను ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి మా ర్గంలో నడపడంలో మేం విజయం సాధించాం. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను అతి తక్కువ సమయంలో సాధించింది తెలంగాణ మాత్రమే’’అని కేటీఆర్ పేర్కొన్నారు. శాంతిభద్రతలు సవాల్‌గా మారుతున్నాయి దేశంలో ఎంత వైరుధ్యమున్నా సమైక్యంగానే ఉంటుందనే నమ్మకముంది. కానీ దేశంలో విభజన రాజకీయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో సుహృద్భావ వాతావరణంలో రాజకీయ పార్టీల మధ్య చర్చలు జరుగుతాయని భావించడం కొంత వాస్తవ దూరమే. మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటం భవిష్యత్తులో అన్ని ప్రభుత్వాలకు పెద్ద సవాల్‌గా మారబోతోంది. -
విద్యార్థులకేం కావాలి..?
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలోకి ప్రవేశించే విద్యార్థులు ఏం ఆశిస్తున్నారనే అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అభిప్రాయపడింది. విద్యార్థులకేం కావాలి.? వాళ్లు ఏం కోరుకుంటున్నారు.. అనే ప్రాతిపదికన పరీక్షల విధానం, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు మూల్యాంకన విధానం రూపొందించే దిశగా ముందుకెళుతోంది. ఉన్నత విద్యామండలి, కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఉన్నత విద్య పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై అధ్యయనానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) తోడ్పాటు తీసుకోనున్నాయి. ఇందుకోసం ఐఎస్బీతో ప్రత్యేక అధ్యయనం చేయిస్తున్నట్టు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఇక్కడ కీలక భేటీ జరిగింది. సమావేశంలో పలు విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు, ఏడు డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. పరీక్షలు, మూల్యాంకన విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకు మార్కెట్లో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగం కోరుకునే అర్హతలపై ఐఎస్బీ విశ్లేషణకు ఈ డేటాను వాడుకోనుంది. మార్పు అనివార్యం: నవీన్ మిత్తల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మూల్యాంకన విధానంలో మార్పులు అవసరమని, దీనికి ప్రత్యేక అధ్యయనం చేయాలని కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ అభిప్రాయపడ్డారు. ఈ ఉద్దేశంతోనే ఐఎస్బీతో క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టినట్టు తెలిపారు. దీనివల్ల ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ఉపాధి, ఎంటర్ ప్రెన్యూర్, సాధికారతకు మూల్యాంకన, విద్యా బోధనలో మార్పులు చేసేందుకు ఐఎస్బీ అధ్యయనం కీలకం కానుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు. ఐఎస్బీ అధ్యయనం తర్వాత ఉపాధి అవసరాలకు తగ్గట్టుగా బోధన ప్రణాళికల్లో మార్పు వచ్చే వీలుందన్నారు. తాము చేపట్టబోయే అధ్యయనం గురించి ఐఎస్బీ ప్రతినిధి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శ్రీపాద ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో మండలి వైస్–చైర్మన్ ప్రొఫెసర్ వి. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఐఎస్బీ స్కిల్లింగ్ కోర్సుల్లో శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు ఉపాధి మార్గాలు మెరుగుపడేలా విస్తృత ఉపాధి నైపుణ్యాలు అందజేసే ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుంది. పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలు, ఫార్మసీ కాలేజీలతోపాటు పలు అటానమస్ కాలేజీల్లో చదువుకుంటున్న, పూర్వ విద్యార్థుల్లో ఆసక్తి గలవారు శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వ్యాపార అక్షరాస్యత నైపుణ్యాలు (బిజినెస్ లిటరసీ స్కిల్స్), ప్రవర్తనా నైపుణ్యాలు (బిహేవియరల్ స్కిల్స్), డిజిటల్ అక్షరాస్యత నైపుణ్యాలు (డిజిటల్ లిటరసీ స్కిల్స్), వ్యవస్థాపక అక్షరాస్యత నైపుణ్యాలు (ఎంట్రప్రెన్యూరల్ లిటరసీ స్కిల్స్) కోర్సుల్లో ఒక్కొక్క కోర్సుకు 40 గంటలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ కోర్సులను ఐఎస్బీ, దాని అనుబంధ అధ్యాపకులు ఆన్లైన్లో బోధిస్తారు. విద్యార్థులకు తక్కువ ధరలో నాణ్యమైన శిక్షణ అందించాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఐఎస్బీ కలిసి పనిచేస్తున్నాయని తెలిపింది. ఆయా కోర్సులకు సంబంధించిన ఫీజు, ఇతర వివరాల కోసం https://skillshub.isb.edu/apssdc/ ద్వారా తెలుసుకోవచ్చని స్కిల్ డెవలప్మెంట్–ట్రైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సారభ్ గౌర్ తెలిపారు. నిపుణుల సహకారంతో కార్పొరేషన్ రూపొందించిన స్కిల్ ట్రైనింగ్ ప్లాట్ ఫామ్స్‌ను యువత సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ ఎండీ సత్యనారాయణ కోరారు. -
ప్రపంచాన్ని నిడిపించగల సత్తా భారత యువతలో ఉంది: ప్రధాని మోదీ
-
బడా కంపెనీలు నడపడమే కాదు.. చిరు వ్యాపారులనూ గుర్తుపెట్టుకోండి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రులై వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) విద్యార్థులు పెద్దపెద్ద కంపెనీలను నడపడమే కాకుండా చిన్న వ్యాపారాలను, వ్యాపారులనూ గుర్తుపెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిరు వ్యాపారులకు టెక్నాలజీని అందుబాటులోకి తేవడంతోపాటు కొత్త మార్కెట్లను గుర్తించి వారికి చేరువ చేయాలని సూచించారు. తద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐఎస్బీ 20వ వార్షికోత్సవం, 2022 పీజీపీ విద్యార్థుల స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఐఎస్బీ హైదరాబాద్ క్యాంపస్‌తోపాటు మొహాలీ క్యాంపస్ విద్యా ర్థులతో ఉమ్మడిగా జరిగిన ఈ స్నాతకోత్సవంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రధాని ప్రోత్సాహకాలు అందించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఈ అమృత ఘడియల్లో ఐఎస్బీ విద్యార్థులు తమ వ్యక్తిగత లక్ష్యాలకు దేశ ప్రయోజనాలనూ జోడించి ముందడుగు వేయాలని కోరారు. వారికి ఇదో గొప్ప అవకాశమన్నారు. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించిన ఐఎస్బీ ఇప్పుడు ప్రపంచంలోనే పేరెన్నికగన్న బిజినెస్ స్కూల్‌గా అవతరించిందని చెప్పారు. సంస్కరణల ఫలాన్ని దేశం చూస్తోంది... గత ప్రభుత్వాలు అసాధ్యంగా భావించిన అనేక పాలనా సంస్కరణలను తాము వేగంగా చేపట్టడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన రిఫార్మ్ (సంస్కరణలు), పెర్ఫార్మ్ (పనిచేయడం), ట్రాన్స్‌ఫార్మ్ (మార్పు తీసుకురావడం) నినాదం ఫలితాలను దేశం ఇప్పుడిప్పుడే చూస్తోందని ప్రధాని తెలిపారు. జీ–20 దేశాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మొదలుకొని.. స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగంలో తొలి స్థానానికి, ఇంటర్నెట్, రిటైల్ రం గాల్లో రెండో స్థానానికి, స్టార్టప్‌ల రంగం, అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో మూడోస్థానంలో ఉండటాన్ని ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నా రు. ఇందులో ప్రభుత్వం మాత్రమే కాకుండా ఐఎస్బీ, వృత్తి నిపుణుల భాగస్వామ్యమూ ఉందన్నారు. భారతీయులకు, భారతీయ ఉత్పత్తులకూ తమ ప్రభుత్వ హయాంలో కొత్త గుర్తింపు, గౌరవం దక్కాయని, దేశ సమస్యల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు, పరిష్కార మార్గాలు ఇప్పుడు ప్రపంచస్థాయిలో అమలవుతున్నాయని వివరించారు. దేశంలో వ్యాపారాభివృద్ధికి, విస్తరణకు ఇప్పుడున్న విస్తృత అవకాశాలను ఐఎస్బీ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. 2014 తరువాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చర్యలను ఐఎస్బీతోపాటు మేనేజ్మెంట్ విద్యార్థులు తమ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అమలు చేస్తే తప్పకుండా అద్భుత ఫలితాలు లభిస్తాయని మోదీ తెలిపారు. సంబంధిత వార్త: నమో హైదరాబాద్.. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అప్డేట్స్ మీపై నమ్మకం ఉంది... కరోనాను ఎదుర్కొన్న తీరు భారత్ సత్తాను ప్రపం చానికి మళ్లీ చాటిందని ప్రధాని చెప్పారు. ఈ దేశ యువత ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్న నమ్మకం తనకుందన్నారు. విద్యార్థుల హర్షధ్వానాల మధ్య ప్రధాని మరోసారి ఈ విషయాన్ని చెబుతూ ‘నాకు మీపై నమ్మకం ఉంది. మీకు మీపై ఆ నమ్మకం ఉందా?’ అని ప్రశ్నించి.. ‘ఉంది’ అన్న సమాధానాన్ని రాబట్టారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా ఇప్పుడు దేశం ఫిన్‌టెక్, వైద్యం, వైద్య విద్య, క్రీడల్లాంటి అనేక రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతోందని, అద్భుత ప్రగతి సాధిస్తోందని ప్రధాని గణాంకాలతో వివరించారు. ప్రజల భాగస్వామ్యం కూడా పెరిగిన కార ణంగానే స్వచ్ఛ భారత్, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర హోం సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐఎస్బీ డీన్ పిల్లుట్ల మదన్‌తోపాటు చైర్మన్ హరీశ్ మన్వానీ, మొహాలీ క్యాంపస్ ముఖ్యాధికారి రాకేశ్ భారతీ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ వేదికపై ఉన్న ప్రముఖులను పేర్లతో పలకరించినా తలసానిని మాత్రం తెలంగాణ మంత్రిగానే ప్రస్తావించడం గమనార్హం! -
నైపుణ్యాభివృద్ధిలో ఐఎస్బీ భాగస్వామ్యం
సాక్షి, అమరావతి: యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ముందుకొచ్చింది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం కొత్త కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ), ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీతో (అపిట) కలసి శిక్షణ కార్యక్రమాల్లో ఐఎస్బీ పాలుపంచుకోనుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమక్షంలో ఏపీఎస్ఎస్డీసీ, అపిట, ఐఎస్బీ మధ్య ఒప్పందం జరగనుంది. ప్రవర్తన నైపుణ్యాలు, వ్యాపార దక్షత కోర్సుల్లో శిక్షణకు ఐఎస్బీ సహకారం అందిస్తుంది. ఔత్సాహికవేత్తలు, నిరుద్యోగ యువతకు చాలా తక్కువ ఫీజుతో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను పెంపొందించడమే ఒప్పందం ప్రధాన లక్ష్యమని ఏపీఎస్ఎస్డీసీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. దావో ఈవీటెక్‌తో ఒప్పందం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఈ కామర్స్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం లక్ష్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ మాన్యుఫార్చురింగ్ కంపెనీ దావో ఈవీటెక్, అనుబంధ సంస్థ అమరావతి ఈవీ కన్సల్టింగ్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఏపీఎస్ఎస్డీసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తాడేపల్లిలోని ఏపీఎస్ఎస్డీసీ కార్యాలయంలో సంస్థ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి సమక్షంలో ఎండీ ఎన్.బంగార్రాజు, దావో ఈవీటెక్ సీఈవో మైఖేల్ లియు, దావో ఈవీటెక్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ డెవలప్మెంట్) మనీష్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కామర్స్ బిజినెస్‌కు డెలివరీ సిబ్బంది నియామకాలు, శిక్షణలో దావో ఈవీటెట్కు ఏపీఎస్ఎస్డీసీ సహకరిస్తుంది. గ్రామీణ నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేలా ఒప్పందం ఉపకరిస్తుంది. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని దావో ఈవీటెక్ తెలిపింది. -
దేశంలో నంబర్‌వన్ బీ–స్కూల్‌గా ‘ఐఎస్బీ’
రాయదుర్గం(హైదరాబాద్): ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) దేశంలోనే నంబర్‌వన్ బిజినెస్ స్కూల్‌గా మరోసారి గుర్తింపు సాధించింది. బ్లూమ్‌బెర్గ్ బిజినెస్ వీక్ ఉత్తమ బీ–స్కూల్స్– 2021 ర్యాంకింగ్స్‌ను బుధవారం ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో 5వ స్థానంలో నిలిచింది. బిజినెస్ స్కూల్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(పీజీపీ)లో ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. 2021–22 ర్యాంకింగ్స్‌ను ప్రకటించేందుకు బ్లూమ్‌బెర్గ్ బిజినెస్ వీక్ ప్రపంచవ్యాప్తంగా 119 బిజినెస్ స్కూల్స్‌ను సర్వే చేసింది. 6,640 మంది విద్యార్థులు, 12,462 మంది పూర్వ విద్యార్థులు, 853 మంది యజమానులను సర్వే చేసి ర్యాంకింగ్స్‌ను నిర్ధారించారు. బిజినెస్ స్కూల్స్‌లో నిర్వహణ, ఎడ్యుకేషన్–లెరి్నంగ్, నెట్ వర్కింగ్, ఎంట్రప్రెన్యూర్íÙప్ వంటి నాలుగు అంశాలను ఆధారంగా చేసుకుని ర్యాంకింగ్స్‌ను ఇచ్చారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఐఎస్బీ లెరి్నంగ్, నెట్ వర్కింగ్‌లో రెండోస్థానం, ఎంట్రప్రెన్యూర్íÙప్లో మూడో స్థానం, పరిహారంలో ఆరవ స్థానంలో నిలిచింది. సమష్టి కృషికి నిదర్శనం ఐఎస్బీ అత్యుత్తమ ర్యాంకింగ్ సాధనకు ఫ్యాకల్టీ, అధికారులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సమష్టిగా చేసిన కృషికి నిదర్శనం. ర్యాంకింగ్‌లు మెరుగుపడటంతో మరింత బాధ్యతగా చిత్తశుద్ధితో కృషి చేస్తాం. –ప్రొఫెసర్ మదన్పిల్లుట్ల– డీన్ ఐఎస్బీ -
హైదరాబాద్ ఐఎస్బీ.. దేశంలోనే టాప్!
రాయదుర్గం (హైదరాబాద్): గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరో అరుదైన ఘనత సాధించినట్లు ఐఎస్బీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్సీఎం జర్నల్ లిస్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఎస్బీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఎస్సీఎం జర్నల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రీసెర్చ్ జర్నల్ పబ్లికేషన్స్‌లలో ప్రచురించబడిన పరిశోధనా పత్రాలను పరిగణిస్తుంది. ప్రధానంగా విశ్లేషణాత్మక, అనుభావిక రంగాలలో పరిశోధన పత్రాలపై దృష్టి పెడుతుంది. ఈ క్రమంలో ఉత్తమ నిర్వహణ పరిశోధన విశ్వవిద్యాలయాలు, బీ–స్కూల్స్, సంస్థల ర్యాంకింగ్స్‌ను ఎస్సీఎం జర్నల్ లిస్ట్ 2015–20 కాలానికి ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఐఎస్బీ దేశంలోని బిజినెస్ స్కూళ్ళలో మొదటిస్థానంలో, ప్రపంచస్థాయిలో 64వ స్థానంలో నిలిచింది. ఇక్కడ చదవండి: రాష్ట్రపతి ఆమోదం: 95% ఉద్యోగాలు స్థానికులకే.. ‘సేఫ్’ జోన్లోకి సైబర్ వాంటెడ్స్ -
హైదరాబాద్ ఐఎస్బీ.. మరో ఘనత
సాక్షి, హైదరాబాద్: ది ఫైనాన్షియల్ టైమ్స్–గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 23వ స్థానం, ఆసియాలో ఐదో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. దేశంలోనే టాప్ 25లో స్థానం దక్కించుకున్న ఏకైక సంస్థ ఐఎస్బీ కావడం గమనార్హం. పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ)లో ఈ ర్యాంకులు సాధించింది. ఈ ర్యాంకుల కోసం 2017కు చెందిన పీజీపీ విద్యార్థులను సర్వే చేశారు. ర్యాంకింగ్స్ కోసం ది ఫైనాన్షియల్ టైమ్స్ పరిగణనలోకి తీసుకున్న అనేక రంగాల్లో ఈ విద్యాసంస్థ మెరుగైన ప్రతిభ కనబర్చింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకుంది. సమష్టి కృషితోనే సాధ్యమైంది.. అత్యుత్తమ ప్రపంచస్థాయి విద్యను అందించడంలో ఐఎస్బీ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పర్చుకుంది. అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, సిబ్బంది, బోర్డు మద్దతు, సమష్టి కృషికి ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్ నిదర్శనం. నాణ్యమైన మేనేజ్మెంట్ విద్యకు దేశంలోనే కలికితురాయిగా ఐఎస్బీ నిలిచింది. – ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ, ఐఎస్బీ డీన్ చదవండి: శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా మాస్క్ తీసి ఫొటో దిగు నాయనా.. -
రిమోట్ వర్క్‌పై తర్వలోనే ఎంవోయూలు
సాక్షి, అమరావతి: పారిశ్రామిక పరివర్తన దిశగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దడానికి ఐఎస్బీ భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని క్యాంప్ కార్యలయం నుంచి గురువారం గౌతమ్ రెడ్డి ఐఎస్బీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాలసీ ల్యాబ్, రిమోట్ వర్క్, పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. 'రిమోట్ వర్క్'పై త్వరలో ఎంవోయూలు కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. విశాఖ కేంద్రంగా ఫార్మా సహా పలు రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయం జాన్స్ హాప్ కిన్స్ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిందని తెలిపారు. (చదవండి: ఏపీలో ‘లంబోర్గిని’) -
భారత్‌లో ఐఎస్బీ నంబర్–1
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరో అరుదైన గుర్తింపు సాధించింది. ఫైనాన్షియల్ టైమ్స్–2020 సోమవారం ప్రకటించిన ఈఎంబీఏ ర్యాంకింగ్స్‌లో పీజీ పీమ్యాక్స్ కోర్సు నిర్వహణతో దేశంలోకే ఐఎస్బీ మొదటి స్థానం పొందగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 53వ స్థానం పొందింది. (క్యాబ్ చార్జీలు; డ్రైరన్ పేరిట బాదుడు) ఐఎస్బీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వ్యాపార యజమానులకు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న 15 నెలల కాలపరిమితితో కూడిన గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ స్థాయి ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. 2017 పీజీ పీమ్యాక్స్ క్లాస్ నుంచి ఐఎస్బీ పూర్వ విద్యార్థులు ఈ ఏడాది ర్యాంకింగ్ కోసం సర్వే చేయబడ్డారు. ప్రధానంగా లక్ష్యాల సాధన, జీతాల పెంపుదల, ప్రస్తుత జీతాలు, కెరియర్ ప్రొగ్రామ్స్ నిర్వహణ, మహిళా ఫ్యాకల్టీ, విద్యార్థినులు, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, అంతర్జాతీయ విద్యార్థులు వంటి అంశాలపై పరిశీలించి ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంక్‌లను ప్రకటించింది. గతేడాది 52వ ర్యాంక్ పొందగా ఈ ఏడాది 53 వస్థానం పొందగలిగింది. తాజా ర్యాకింగ్స్ వల్ల ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రాముఖ్యతతో పాటు ఐఎస్బీ ప్రాధాన్యత పెరిగిందని డీన్ ప్రొఫెసర్ రాజేంద్రశ్రీవాత్సవ అన్నారు. -
‘ఐఎస్బీ’తో ఒప్పందం
-
‘ఐఎస్బీ’తో ఒప్పందం
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడంతోపాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో ఏపీ ఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలు చేయడం ద్వారా వర్చువల్ ఒప్పందం జరిగింది. పారదర్శకతకు పబ్లిక్ పాలసీ ల్యాబ్: మంత్రి మేకపాటి ► ఆర్థిక రంగం పునరుద్ధరణలో భాగంగా విశాఖను కీలకంగా తీర్చిదిద్దడం, రాయలసీమలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యం, ఈ–గవర్నెన్స్‌కు పెద్దపీట, నైపుణ్య, శిక్షణలో సరికొత్త విధానాలు లాంటి చర్యలు చేపడతామని మంత్రి మేకపాటి తెలిపారు. ► ఏపీని అభివృద్ధి పథంవైపు నడిపేందుకు ఐఎస్బీతో కలిసి ‘పబ్లిక్ పాలసీ ల్యాబ్’ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ల్యాబ్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించే పారదర్శకత, జవాబుదారీతనం, త్వరితగతిన కచ్చితమైన నిర్ణయాలు, ఖర్చులను తగ్గించడం లాంటి లక్ష్యాలను సాధించి పాలనను ప్రజల ముంగిటకు తెస్తామన్నారు. ► తాజా ఒప్పందంతో పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ తెలిపారు. ► దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడం తమ బాధ్యతను మరింత పెంచిందని ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాట్రే పేర్కొన్నారు. ► వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఐఎస్బీ ఒప్పందం చారిత్రాత్మకం : మేకపాటి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్బీ ఒప్పందం కుదుర్చుకోవడంతో పరిపాలనలో కొత్త ఒరవడి ప్రారంభమైందని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మేకపాటి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఐఎస్బీ ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ జరిగిందన్నారు.ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా 'ఆంధ్రప్రదేశ్ తో - ఐఎస్ బీ' ఒప్పందంజరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సమగ్రాభివృద్ధి దిశగా 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్ బీ పబ్లిక్ పాలసీ ల్యాబ్'కు శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు. ఐఎస్బీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో కీలక సమస్యలకూ వెంటనే పరిష్కారం లభించనుందని తెలిపారు. (ఐఎస్బీ ఒప్పందం దేశంలోనే తొలిసారి: గౌతమ్ రెడ్డి) విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలను తీసుకురావడం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఐఎస్బీ కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నారు. భవిష్యత్ లో వెనుకబడిన ప్రాంతాలే లేని సమానాభివృద్ధికై సీఎం తపిస్తున్నారన్నారు. ఆర్థిక, పారిశ్రామిక, నైపుణ్య, ఐటీ, ఉపాది రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అధ్యయనం, విజ్ఞానం, విశ్లేషణ, పరిశోధన, ప్రణాళిక, వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకెళతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం దేశంలోనే తొలిసారని గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థికవనరుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు. సత్వరమే కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు మేకపాటి వెల్లడించారు. -
'ఐఎస్బీ ఒప్పందం దేశంలోనే తొలిసారి'
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్బీ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై శనివారం అధికారులతో మంత్రి గౌతమ్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐటీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు ఈ భేటిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్ట్ 5న ఐఎస్బీ ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ జరగనుందన్నారు. ఐఎస్బీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో కీలక సమస్యలకూ వెంటనే పరిష్కారం లభించనుందని తెలిపారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలను తీసుకురావడం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఐఎస్బీ కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించారు. మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించేందుకు ఐఎస్బీ తోడ్పాటు అందించనుందని తెలిపారు. మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు ఐఎస్బీ సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ కల్లా నైపుణ్య కాలేజీల ఏర్పాటు అంతకముందు నైపుణ్య కాలేజీల ఏర్పాటుపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్‌లో నైపుణ్య కాలేజీలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో ఏ అవకాశాన్ని వదలకూడదన్నారు. ఈ సందర్భంగా నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు రుణాలందించడానికి ఏయే బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ఆరా తీశారు. దీనికి సంబంధించి బ్యాంకులు ఎంత మొత్తంలో రుణాలందించేందుకు సుముఖంగా ఉన్నాయో ఎండీ అర్జా శ్రీకాంత్ మంత్రికి వివరించారు. ప్రభుత్వ పూచికత్తుతోనే మరిన్ని నిధులు సాధ్యమని నైపుణ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము మంత్రికి వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్కిల్ కాలేజీ ఏర్పాటు అవుతున్నందున స్థానిక ఎంపీల నిధుల నుంచి కొంత సాయం పొందవచ్చని ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. యువత భవిష్యత్ ను మార్చే స్కిల్ కాలేజీల ఏర్పాటులో ప్రతీ రూపాయి అవసరమేనని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేరాలని గౌతమ్‌రెడ్డి తెలిపారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి మరింత లోతుగా చర్చిద్దామని మంత్రి మేకపాటి అధికారులతో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ హాజరయ్యారు. -
‘ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం’
రాయదుర్గం: ఎన్నికల్లో వ్యయం పెరగడం ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదమని, దీన్ని పూర్తిగా తగ్గిస్తేనే ప్రజాస్వామ్యం ఆశించిన స్థాయిలో విజయవంతమవుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. గచ్చిబౌలిలోని ఇండి యన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్, ఐఎస్బీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ వార్షిక సదస్సుల సిరీస్‌లో భాగంగా ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’అనే అంశంపై 2 రోజుల చర్చా కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యానల్ డిస్కషన్లో ‘ఆర్గనైజేషనల్ బర్డన్ ఆన్ పొలిటికల్ పార్టీస్’అనే అంశంపై జరిగిన చర్చకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ.. ప్రస్తుత లోక్‌సభలో అత్యధికంగా కోటీశ్వర్లు ఉన్నట్లు పత్రికల్లోనే వస్తున్నాయని అన్నారు. అయిదేళ్ల పదవీకాలం తర్వాత కొందరి ఆస్తులు 500 రెట్లు పెరిగాయని మనం వింటున్నామని తెలిపారు. ఢిల్లీలో తాను పాల్గొన్న ఓ సమావేశంలో మాజీ ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఒక ఎంపీ ఎన్నికల్లో రూ.50 కోట్లు వ్యయం చేశారని, ఒక మహిళ కూడా రూ.50 కోట్ల వరకు వ్యయం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు వెల్లడించారు. ప్రముఖులు ఎవరేమన్నారు.. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని పూర్తిగా తగ్గించే అంశంపై అంతటా చర్చ జరగాలని తెలంగాణ ఎన్నికల అధికారి రజత్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో 2018, 2019లో నిర్వహించిన ఎన్నికల్లో డబ్బు, మద్యం గణనీయంగా పట్టుబడిందని తెలిపారు. ప్రజల్లో మార్పు వస్తే ఇలాంటి వాటిని సులభంగా అరికట్టవచ్చని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు ఇచ్చే నిధులపై నిషేధం విధించాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు కార్యకర్తలే బలమని, కేడర్‌పై చేసే వ్యయం ఏమాత్రం భారం కాబోదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలను నడపడం వ్యయంతో కూడుకున్న ప్రక్రియగా మారిందని ఎంపీ రాజీవ్‌గౌడ తెలిపారు. స్థానిక సంస్థలకు పార్టీయేతర ఎన్నికలు పెడితే గ్రామీణ స్థాయిలో డబ్బు ప్రభావం గణనీయంగా తగ్గే అవకా«శం ఉందని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కె మాధవరావు అభిప్రాయపడ్డారు. సమావేశంలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో 1.. ప్రపంచంలో16
హైదరాబాద్: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరో ఘనతను సాధించింది. పోయట్స్ అండ్ క్వాంట్స్ సోమవారం ప్రకటించిన బిజినెస్ స్కూళ్ల ర్యాంకింగ్స్‌లో ఐఎస్బీ సత్తా చాటింది. దేశంలోనే టాప్ బిజినెస్ స్కూల్‌గా గచ్చిబౌలిలోని ఐఎస్బీ నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో ఐఎస్బీ 16వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు పోయట్స్ అండ్ క్వాంట్స్ పదో వార్షిక ర్యాంకింగ్స్‌లో ఐఎస్బీ సాధించిన ఘనతలను సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కార్పొరేట్ రిక్రూటర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, డీన్లు, ఫ్యాకల్టీ, ప్రచురణల రికార్డులు, తరగతులు, జీమ్యాట్ స్కోర్లు, పూర్వ విద్యార్థుల తాజా జీతం, ఉపాధి గణాంకాలు ఇతరత్రా పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి ఐదు స్థానాల్లో ఇన్సీడ్, లండన్ బిజినెస్ స్కూల్, ఐఈఎస్ఈ, హెచ్ఈసీ పారిస్, ఐఎండీ నిలిచాయి. సమష్టి కృషికి నిదర్శనం.. ఐఎస్బీ విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమే తాజాగా అత్యుత్తమ ర్యాంకులను సాధించడం. 2019లో ర్యాంకుల్లో చాలా మెరుగుపడ్డాం. ప్రస్తుతం పోయట్స్ అండ్ క్వాంట్స్ ర్యాంకుల్లో దేశంలో టాప్ ర్యాంక్, ప్రపంచంలో 16వ స్థానం పొందడం గర్వంగా ఉంది. ఆశాభావ దృక్పథంతో 2020లో ముందుకుసాగుతాం. –ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ, డీన్, ఐఎస్బీ -
కిరణ్ మజుందార్ షాకు అరుదైన గౌరవం
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) గవర్నింగ్ బోర్డు సభ్యురాలు కిరణ్ మజుందార్ షాకు అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితి విభాగం యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్(యూఎస్‌ఎన్‌ఏఈ) సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు. యూఎస్‌ఎన్‌ఏఈ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ షానే కావడం గమనార్హం. బయో ఫార్మాసూటికల్స్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవకాశం దక్కింది. ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడంపై గవర్నింగ్ బోర్డు ప్రతినిధులు, ఫ్యాకల్టీ హర్షం వ్యక్తం చేశారు. -
ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఐఎస్బీ ప్రొఫెసర్
న్యూఢిల్లీ: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్ క్యాంపస్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. మూడు సంవత్సరాలపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అరవింద్ సుబ్రమణియన్ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవిని (సీఈఏ) ఈ ఏడాది జూలైలో వీడగా, అప్పటి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ పోస్ట్‌కు ఐఎస్బీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను నియమించాలన్న ప్రతిపాదనను కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదించినట్టు ప్రభుత్వం శుక్రవారం తెలియజేసింది. పారిశ్రామికాభివృద్ధి, విదేశీ వాణిజ్యం, పారిశ్రామిక ఉత్పత్తి, ప్రధాన ఆర్థిక విషయాల ప్రకటనల్లో కేంద్ర ప్రభుత్వానికి విధానపరమైన సూచనలు, సలహాలను సీఈఏ ఇవ్వాల్సి ఉంటుంది. అపార అనుభవం ఐఐటీ, ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన సుబ్రమణియన్ ఫైనాన్షియల్ ఎకనమిక్స్‌లో అమెరికాలోని షికాగో యూనివర్సిటీ, బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీయే, పీహెచ్డీ పట్టాలు పొం దారు. బ్యాంకింగ్, కార్పొరేట్ గవర్నెన్స్, ఎకనమిక్ పాలసీల్లో సుబ్రమణ్యం దిట్ట. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కార్పొరేట్ గవర్నెన్స్ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంకింగ్ గవర్నెన్స్ కమిటీల్లోనూ పనిచేశారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్, ప్రైమరీ మార్కెట్స్, సెకండరీ మార్కెట్స్, రీసెర్చ్ విషయాల్లో సెబీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించారు. బంధన్ బ్యాంకు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకు మేనేజ్మెంట్, ఆర్బీఐ అకాడమీ బోర్డులకు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2015 ఆర్థిక సర్వేపై అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌ను సహకారం అందించారు. ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్యతో కలసి 2009లో దివాలా కోడ్‌పై పనిచేశారు. కెరీర్ ప్రారంభానికి ముందే జేపీ మోర్గాన్ చేజ్‌కు కన్సల్టెంట్‌గా, ఐసీఐసీఐ బ్యాం కులోనూ పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ‘‘ఐఎస్బీ అధ్యాపకవర్గంలో ఒకరు కేంద్ర ప్రభుత్వంలో ఎంతో ముఖ్యమైన పదవికి ఎంపిక కావడం ప్రతిష్టాత్మకం. మేము గర్వపడాల్సిన విషయం’’ అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ డీన్ రాజేంద్రశ్రీవాస్తవ ప్రకటన చేశారు. సుబ్రమణియన్ ఐఎస్బీ హైదరాబాద్‌కు 2009లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేయడం ఆరంభించారు. 2010లో ఫైనాన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. -
వచ్చే పదేళ్లూ ఆకాశమే హద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘అమెరికా జనాభా 33 కోట్లు. కానీ, అక్కడ వాణిజ్య విమానాల సంఖ్య 5 వేలు. ఇండియా జనాభా 120 కోట్లకు పైనే. కానీ, ఇక్కడ సేవలందిస్తున్న విమానాలు జస్ట్ 500–600 మాత్రమే! అమెరికాతో పోలిస్తే నాలుగు రెట్ల జనాభా ఎక్కువున్న ఇండియాలో పది రెట్ల విమానాలు తిరగాల్సిన అవసరముంది. ఇదే దేశీ విమాన కంపెనీలకు వ్యాపార అవకాశాలను కల్పిస్తుంది’’ అని ఇండిగో డిసిగ్నేటెడ్ సీఈఓ గ్రేగొరీ టేలర్ చెప్పారు. వచ్చే పదేళ్ల వరకూ దేశీ విమానయాన పరిశ్రమలో విమాన కంపెనీలతో పాటు టెక్నాలజీ సంస్థలకూ అపారమైన వ్యాపార అవకాశాలుంటాయని తెలిపారు.శనివారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లీడర్షిప్ సమ్మిట్–18లో ‘ఇండిగో... తర్వాత ఏంటి?’ అనే అంశంపై మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే.. ‘‘రెండేళ్ల క్రితం ఇండిగో వద్ద 30–40 విమానాలుండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 180కి చేరింది. ఈ ఏడాది ముగింపు నాటికి మరో 20 విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చి మొత్తంగా 200కు చేరుస్తాం. 2006లో దేశీయ విమాన పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇండిగో.. ప్రస్తుతం 42 శాతం వాటాతో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం ఇండిగో వద్ద 42 న్యూ జనరేషన్ ఏ320 ఎన్ఈవో, 126 ఏ320 సీఈఓ, 10 ఏటీఆర్‌లు ఉన్నాయి. 48 డొమెస్టిక్, 9 ఇంటర్నేషనల్స్‌లో 57 గమ్యస్థానాల్లో సేవలందిస్తోంది. టైమ్‌కు టేకాఫ్ అయితేనే.. ప్రపంచ విమానయాన పరిశ్రమలో ఇండియాది ఉత్సాహపూరితమైన మార్కెట్. తక్కువ టికెట్ ధరలు, సమయానికి టేకాఫ్, ల్యాండింగ్, సులువైన నిర్వహణ ఉంటేనే ఏ విమాన కంపెనీ అయినా సక్సెస్ అవుతుంది. ఇదే ఇండిగో సక్సెస్‌కు ప్రధాన కారణం. దేశంలో ఇండిగో సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ తక్కువ టికెట్ ధర ఉంది. ద్రవ్యోల్బణం, ధరల స్థిరీకరణ వంటి కారణాలతో దేశంలో సగటు విమాన చార్జీలు 50 శాతం వరకు తగ్గిపోయాయి’’ అని టేలర్ వివరించారు. విమానాలు పెంచితే సరిపోదు.. విమానయానంలో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడాలంటే కేవలం విమానాల సంఖ్యను పెంచితే సరిపోదని టేలర్ చెప్పారు. ‘‘అందుకు తగ్గట్టుగా టెక్నాలజీని వినియోగించుకొని సరికొత్త ఆవిష్కరణలను చేయాలి. సరికొత్త ఆవిష్కరణలే మేనేజ్మెంట్ నిర్వహణను మారుస్తాయి. స్థానిక ప్రజల అవసరాలు, సంస్కృతితో పోలిస్తే విమాన కంపెనీలకు మూలధనం సమస్య కాదు. దేశంలో విమానయాన కంపెనీలు ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను విస్తరించడం కంటే ఆయా కంపెనీల్లో సరైన సంస్కృతిని పెంచాలి. దీర్ఘకాలిక ఆలోచనలు చేయాలి’’ అని ఆయన సూచించారు. ఇండిగోలో కొత్త ఉద్యోగాలు.. పైలట్ల కొరతే ఏ విమాన సంస్థకైనా ప్రధాన సమస్యని, బోయింగ్ వంటి కంపెనీలకూ ఇదే సమస్య గా మారిందని ఐఎస్బీ సదస్సులో పాల్గొన్న ఇండిగో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మానవ వనరుల విభాగం) రాజ్ రాఘవన్ అభిప్రాయపడ్డారు. ‘‘పైలట్ రహిత విమానాలు ఆవిష్కరించినా.. అవి సక్సెస్ అవుతాయనేది సందేహమే. ఎందుకంటే పైలట్ లేకుండా ప్రయాణికులు ఎక్కుతారా? అనేది ప్రశ్నే’’ అని సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండిగోలో 20 వేల మంది ఉద్యోగులున్నారని, పైలెట్స్, ఆపరేషన్స్, హెచ్ఆర్, బ్యాగేజ్ వంటి అన్ని విభాగాల్లోనూ కొత్త ఉద్యోగులను తీసుకోనున్నామని ఆయన తెలిపారు. -
దేశ ప్రగతిలో దక్కన్ పాత్ర కీలకం
హైదరాబాద్: ఉత్పాదక రంగ బలోపేతానికి ఆర్థిక దౌత్యం దోహదం చేస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ అన్నారు. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, ఐఎస్బీ సంయుక్తంగా ‘డెక్కన్ డైలాగ్’ పేరిట నిర్వహించిన మొదటి సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆర్థిక దౌత్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల ద్వారా ప్రపంచంలో భారత దేశం ప్రత్యేక స్థానం పొందిందన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులు మనదేశ ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా రాష్ట్రాలు బలోపేతం కావడానికి, రాష్ట్రాలకు పెట్టుబడులు సమకూరడానికి మరింత తోడ్పాటు అందిస్తామన్నారు. దేశప్రగతిలో దక్కన్ ప్రాంతం పాత్ర కీలకంగా మారిందన్నారు. పెట్టుబడులకు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా సులభతర వాణిజ్య విధానాల అమలు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ముందున్నదని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ఉపాధి కల్పన పెద్ద సవాలుగా మారిందని, దానికి కొత్త పరిశ్రమల ఏర్పాటే పరిష్కారమన్నారు. భారతదేశం విభిన్న సంస్కృతులు, వేషభాషలకు నిలయమని, ప్రతి 200 కిలోమీటర్ల దూరానికి అనేక మార్పులు కలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి వినోద్ కే జాకబ్, యూఎన్వో మాజీ శాశ్వత ప్రతినిధి టీపీ శ్రీనివాసన్, కెనడా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ దావుబేనీ, టర్కీ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ అద్నాన్ అల్టే ఆల్టినోర్స్, యూఎస్ కాన్సల్ జనరల్ కేథరిన్ బి హడ్డా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వీకే యాదవ్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఎస్బీతో గిరిజన సంక్షేమశాఖ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ పథకం కింద ఔత్సాహిక గిరిజన యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. గచ్చిబౌలిలోని ఖేమ్కా ఆడిటోరియంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బి మహేశ్ దత్ ఎక్కా ప్రారంభించి మాట్లాడారు. హస్తకళలు, నగలు, సాంప్రదాయ కళాఖండాలను అభివృద్ధి చేసే నైపుణ్యంతో పాటుగా ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా గిరిజన యువకులకు శిక్షణ అందించాలన్నారు. వీరిని సాన బెడితే కోహినూర్ వజ్రాలుగా తయారవుతారన్నారు. ఈ పథకం కింద ఆన్లైన్ ద్వారా ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, అర్హులైన వారిని ఎంపిక చేసి శిక్షణ అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టీనా జెడ్ చోంగ్తు, ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా హరీష్ మన్వానీ
హైదరాబాద్: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు కొత్త చైర్మన్‌గా హరీష్ మన్వాని ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం హెచ్‌యూఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. శుక్రవారం ముంబయిలో ప్రస్తుత చైర్మన్ ఆది గోద్రేజ్ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ బోరుడ సమావేశంలో మన్వానీ నియామకంపై నిర్ణయం తీసుకున్నారు. ఈయన ఈ బాద్యతలను ఏప్రిల్‌లో స్వీకరిస్తారు. 2011 ఏప్రిల్ నుంచీ ఆది గోద్రేజ్ ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 42 దేశాలలో 8600 మంది ఐఎస్బీ పూర్వ విద్యార్థులు ఉన్నారని గోద్రేజ్ చెప్పారు. ఐఎస్బీకి గుర్తింపును ఇనుమడింపచేసేందుకు కృషిచేస్తాన ని మన్వానీ పేర్కొన్నారు. -
‘టాస్క్’ ఇచ్చి.. నైపుణ్యం పెంచి..
హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన 22 ఏళ్ల కస్తుబ్ కౌండిన్య.. నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల నుంచి 2012–16 మధ్య మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ, టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రాంలో చేరాడు. తన ఇద్దరు సహ విద్యార్థులు శ్రీకాంత్ కొమ్ముల, ఆనంద్ కుమార్‌లతో కలసి ‘జార్‡్ష ఇన్నొవేషన్స్’ పేరుతో ఓ స్టార్టప్‌ను స్థాపించారు. ఈ ముగ్గురు విద్యార్థులు రూపొందించిన ఎయిర్ కండిషన్డ్ హెల్మెట్‌కు ఎంతో ప్రాచుర్యం లభించింది. స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద వీరి పరిశ్రమ అత్యధికంగా 74 రకాల పన్నులకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. అధిక ఉష్ణోగ్రతల మధ్య మైనింగ్, చమురు, షిప్పింగ్, సిమెంట్ పరిశ్రమల్లో పని చేసే కార్మికులను దృష్టిలో పెట్టుకుని వీరు ఆ హెల్మెట్‌ను రూపొందించారు. ఇందులో రెండు రకాల హెల్మెట్లు ఉండగా, ఒకసారి చార్జింగ్ చేస్తే 2 గంటలు, 8 గంటలు అవి పని చేస్తాయి. ఇదే కాన్సెప్ట్‌తో మోటార్ సైకిల్ చోదకుల కోసం ఎయిర్ కండిషన్డ్ హెల్మెట్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. 2019లో హెల్మెట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడతామని కస్తుబ్ ‘సాక్షి’కి తెలిపారు. సాక్షి, హైదరాబాద్: పరిశ్రమ ఎలా స్థాపించాలి, స్థాపించిన తర్వాత విజయవంతంగా ఎలా నడపాలి.. అనే అంశాలపై తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సంస్థ సరైన అవగాహన, మార్గ నిర్దేశకత్వం చేస్తోంది. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సహకారంతో టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం అనే రెండేళ్ల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సును అంది స్తోంది. కొత్త పరిశ్రమలు స్థాపించాలనే ఆసక్తి గల ఇంజనీరింగ్ మూడో ఏడాది విద్యార్థులు ఈ కోర్సు లో చేరేందుకు అర్హులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త ఆలోచనతో ఓ ప్రోడక్ట్‌ను రూపొందించడం, దాని ఉత్పత్తికి పరిశ్రమను స్థాపించడం, విజయవంతంగా మార్కెటింగ్ చేసి లాభాలు ఆర్జించేందుకు కావాల్సిన విషయ పరిజ్ఞానాన్ని ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు అందిస్తున్నారు. ఒప్పందంతో అందివచ్చిన అవకాశం విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు టాస్క్ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకుని పలు రకాల కోర్సులు అందిస్తోంది. ఈ క్రమంలో ఐఎస్బీతో ఎంఓయూ కుదుర్చుకుని 2014లో టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్ షిప్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఐఎస్బీలో ప్రవేశం పొందేందుకు ప్రవేశ పరీక్షలో తీవ్ర పోటీని ఎదుర్కొని సీటు సాధించడంతోపాటు కనీసం రూ.10 లక్షలకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడాదికి కేవలం రూ.8 వేలు చొప్పున రెండేళ్లలో రూ.16 వేలు చెల్లించి ఐఎస్బీ నుంచి టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగామ్‌ను పూర్తి చేసి సర్టిఫికెట్ పొందేందుకు రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ఎంఓయూ ద్వారా అవకాశం కలిగింది. టాస్క్ ద్వారా ప్రభుత్వం ఐఎస్బీకి రూ.53 వేలు వరకు ఒక్కో విద్యార్థి తరఫున చెల్లిస్తోంది. ఇప్పటి వరకు రూ.10 కోట్ల వరకు చెల్లించింది. కఠోర పరి‘శ్రమ’ అవసరం కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్తో బయటికి రావడం అత్యంత కఠోర శ్రమతో కూడిన పని అని టాస్క్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2014–16 మధ్య కాలంలో ఈ కోర్సులో 381 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చేరగా, అందులో 41 శాతం మంది మాత్రమే విజయవంతంగా కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్లు అందుకున్నారు. ఇప్పటికే తొలి బ్యాచ్ నుంచి నలుగురు విద్యార్థులు పరిశ్రమలను స్థాపించి తమ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఐఎస్బీలో నేర్చుకున్న పాఠాలు, అందిపుచ్చుకున్న విషయ పరిజ్ఞానం, సర్టిఫికెట్లతో మిగిలిన విద్యార్థులు కూడా ప్రతిష్టాత్మక సంస్థల్లో కొలువు లు, ఉన్నత చదువుల సీట్లను పొందారని టాస్క్ సీఈఓ సుజీవ్ నాయర్ ‘సాక్షి’కి తెలిపారు. కోర్సులో చేరేందుకు ఇంజనీరింగ్‌లోని పది విభాగాల విద్యార్థులు అర్హులు. సివిల్, కెమికల్, బయోటెక్నాలజీ, ఏరో స్పేస్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీఈ, ఈఈఈ, ఐటీ, మెకానికల్ బ్రాంచీలకు చెందిన 1,800 మందికి పైగా విద్యార్థులు ఇప్పటి వరకు ఈ కోర్సులో ప్రవేశం పొందగా, అందులో 36 శాతం మంది అమ్మాయిలు ఉండటం విశేషం. నాలుగు సెమిస్టర్ల కార్యక్రమం ఈ కోర్సు.. రెండేళ్ల కాల వ్యవధితో నాలుగు సెమిస్టర్లు ఉంటుంది. ఐఎస్బీ అధ్యాపకుల బృందం ఈ కోర్సులో చేరిన విద్యార్థుల కాలేజీలకు వెళ్లి వారికి పాఠాలు చెబుతుంది. ఐఎస్బీలో సైతం ఈ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులు కొత్త ప్రోడక్ట్‌కు నమూనా తయారు చేసేందుకు అధ్యాపకులు మార్గదర్శకత్వం వహిస్తారు. విద్యార్థులు రూపొందించిన నమూనాలపై పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలు స్వీకరించి ప్రోడక్ట్‌కు తుది రూపు ఇచ్చేందుకు సహకరిస్తారు. ఇలా విజయవంతంగా ప్రోడక్ట్ నమూనాలకు రూపకల్పన చేసిన విద్యార్థులకు మాత్రమే ఐఎస్బీ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. పరిశ్రమను నెలకొల్పేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా అందించేందుకు టాస్క్ సహకరిస్తుంది. -
‘సేవల్లో’ కుటుంబ సంస్థల వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరళీకరణ కారణంగా దేశంలో స్వతంత్ర కుటుంబ వ్యాపార సంస్థలు (స్టాండలోన్ ఫ్యామిలీ ఫరమ్స్) వృద్ధి చెందుతున్నాయి. తయారీ రంగంలో కుటుంబ వ్యాపార సంస్థలు, సేవల రంగంలో స్వతంత్ర కుటుంబ వ్యాపార సంస్థలు వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నట్లు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లోని ఫ్యామిలీ ఎంటర్ప్రైజ్ సెంటర్ థామస్ స్కమిధినీ స్టడీ నివేదించింది. ♦ డాక్టర్ నుపుర్ పవన్ బంగ్, ప్రొఫెసర్ కవిల్ రామచంద్రన్, ప్రొఫెసర్ సౌగతా రాయ్ (ఐఐఎం కోల్‌కతా)ల బృందం 1990–2015 మధ్య కాలంలో ఇండియన్ ఫ్యామిలీ బిజినెస్‌ల తీరుపై పరిశోధన జరిపింది. దీనికోసం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో నమోదైన 4,809 కంపెనీలను పరిగణలోకి తీసుకుంది. ♦ ఆయా కంపెనీలను షేర్‌హోల్డింగ్, మేనేజ్మెంట్ నియంత్రణలను బట్టి రెండు రకాలుగా విభజించారు. కుటుంబ వ్యాపార సంస్థలు (ఎఫ్బీ), కుటుంబేతర వ్యాపార సంస్థలు (ఎన్‌ఎఫ్‌బీ). ఎఫ్బీలను కూడా కుటుంబ వ్యాపార సమూహ అనుబంధ సంస్థలు (ఎఫ్బీజీఎఫ్), స్వతంత్ర కుటుంబ వ్యాపార సంస్థలు (ఎస్ఎఫ్ఎఫ్) అని 2 రకాలుగా విభజించింది. ఎన్ఎఫ్బీలను ప్రభుత్వ యాజమాన్య సంస్థలు (ఎస్ఓఈ), బహుళజాతి అనుబంధ సంస్థలు (ఎంఎన్సీ), వ్యాపార బృంద అనుబంధ సంస్థలు (ఓబీజీఎఫ్)గా విభజించింది. ♦ 73 శాతం స్వతంత్య్ర కుటుంబ వ్యాపార సంస్థలు 1981–1995 మధ్య ప్రారంభమైతే... ఈ సమయంలో ప్రారంభమైన ఓబీజీఎఫ్ సంస్థలు 49 శాతమే. స్వతంత్ర కుటుంబ సంస్థలకు టోకు వర్తకం, ఆర్ధిక సేవలు, సమాచార సాంకేతిక (ఐటీ) రంగాలంటే అత్యంత ప్రీతిపాత్రం. అందుకే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల రంగం వృద్ధి వాటా పెరుగుతోంది. -
నావల్లే హైదరాబాద్‌కు ఐఎస్బీ: సీఎం
సాక్షి, అమరావతి: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) తన వల్లే హైదరాబాద్‌కు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా చెన్నై లేదా పుణేలో ఈ సంస్థ క్యాంపస్‌ను పెట్టాలనుకున్నారని, కానీ తాను చొరవ తీసుకుని హైదరాబాద్‌లో నెలకొల్పేలా చేశానన్నారు. నల్సార్ యూనివర్సిటీని కూడా తానే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించానని చెప్పారు. ఈ–ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐఎస్బీ సౌజన్యంతో అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని చంద్రబాబు శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించి మాట్లాడారు. శిక్షణకు 33 శాఖల నుంచి నలుగురిని ఎంపిక చేశామని, ఆరు నెలలపాటు ఐఎస్బీ ప్రొఫెసర్లు వివిధ అంశాల్లో వారికి శిక్షణ ఇస్తారని సీఎం తెలిపారు. టెక్నాలజీలో నా మనుమడు నన్ను మించిపోయాడు..: టెక్నాలజీలో తన కంటె తన మనుమడు ముందున్నాడని, రెండేళ్ల వయసులోనే సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేస్తున్నాడని సీఎం చంద్రబాబు చెప్పారు.మీడియా ఎప్పుడూ వ్యతిరేక వార్తల కోసం చూస్తుందని, అవి లేకపోతే వారికి పాఠకులు, వీక్షకులు ఉండరని వ్యాఖ్యానించారు. ఇటీవల రెండు మూడు వ్యతిరేక వార్తలు చూశానని, అవేవీ నిజం కాదన్నారు. మౌస్‌లు, విండోస్ల గురించి తెలిసింది మా నాన్న హయాంలోనే: లోకేశ్ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ యంత్రాంగం మౌస్‌లు ఎన్ని ఉన్నాయంటే సచివాలయంలో వెతికి ఎలుకలు లేవని చెప్పేవారని, విండోస్‌లు ఎన్ని ఉన్నాయంటే కిటీకీలు లెక్కపెట్టేవారని చెప్పారు. తన తండ్రి హయాంలో ఐటీని అభివృద్ధి చేశాక మౌస్ అంటే కంప్యూటర్ మౌస్‌లని, విండోస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అని తెలుసుకుని వాటిని ఉపయోగించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. -
ప్రభుత్వ బ్యాంకులను లూటీ చేస్తున్నారు
⇒ ఈ సొమ్మంతా పన్ను చెల్లించినవాళ్లదే ⇒ బజాజ్ గ్రూప్ హెడ్ రాహుల్ బజాజ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త వ్యాపార ఆలోచన, పోటీతత్వానికే ప్రపంచం విలువ ఇస్తుందని బజాజ్ గ్రూప్ హెడ్ రాహుల్ బజాజ్ అన్నారు. శుక్రవారమిక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. బృందం కలిసికట్టుగా సాధించనిది ఈ ప్రపంచంలో లేదని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ‘సమగ్రత, అభిరుచి, దృష్టి, సమర్థత, నిబద్ధత, నిర్ణయాలు, ధైర్యం, మానవత్వం వంటి గుణాలు విజయానికి సోపానం. ఈ సుగుణాలు కలిగిన ఉద్యోగులున్న కంపెనీ వినియోగదార్లకు ప్రియమైనది. అలాగే పోటీ కంపెనీలకు దడ పుట్టిస్తుంది. ప్రతిభ చూపిన కంపెనీలే పోటీ ప్రపంచంలో నిలుస్తాయి’ అని అన్నారు. ఆదాయమెందుకు తక్కువ..? భారతీయుల సగటు ఆదాయం ఎందుకు తక్కువ ఉంది అని రాహుల్ బజాజ్ ప్రశ్నించారు. ‘70వ దశకం ప్రారంభంలో భారత్‌కు సమానంగా ఉన్న సింగపూర్, దక్షిణ కొరియా, చైనాలు ఇప్పుడెందుకు మించిపోయాయి. 1970–90 కాలంలో తప్పుదోవ పట్టించిన పారిశ్రామికీకరణే ఇందుకు కారణం. పబ్లిక్ సెక్టార్లో వనరులను వృధా చేశారు. అదే సమయంలో ప్రైవేటు రంగాన్ని ఎదగనీయలేదు. సబ్సిడీల భారం ఎకానమీపై గుదిబండగా మారింది. ప్రభుత్వాల అవినీతి క్రమేపీ పెరిగింది. ఆ సమయంలో ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితికి వచ్చాయి. ప్రభుత్వాల అసమర్థత, అవినీతి ప్రభావంతో పన్ను ఎగవేతలు పెరిగాయి. దీంతో నిజాయితీ గలవారికి దుష్ప్రయోజనాలు, అవినీతిపరులకు ప్రయోజనం కలిగింది’ అని అన్నారు. బ్యాంకులను దోచుకున్నారు.. కార్మిక, పన్ను చట్టాల మూలంగా ప్రైవేటు రంగంలోని 90% మంది ఉద్యోగులు అవ్యవస్థీకృత రంగంవైపు వెళ్లారని బజాజ్ తెలిపారు. ‘ఈ పరిణామంతో పోటీతత్వం పోయింది. నాణ్యత పడిపోయింది. కార్మికులకు తక్కువ వేతనాలు ఉన్నాయి. తక్కువ ఉత్పాదకత, పనితీరు ద్రవ్యలోటుకు కారణమైంది. ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడులు తగ్గిపోయాయి’ అని అన్నారు. ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వ రంగ బ్యాంకులను రాజకీయ నాయకులు, వ్యాపారులు దోచుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో మొండి బకాయిలు పెరిగాయని అన్నారు. నిజాయితీగల వ్యక్తులు పన్ను రూపంలో చెల్లించిన మొత్తమే దోపిడీకి గురవుతోందని స్పష్టం చేశారు. నిజాయితీకి ప్రోత్సాహం..: నియంత్రణలను సడలించి ప్రభుత్వం నుంచి ఉత్తమ పాలనను వ్యాపారులు కోరుకుంటున్నారని బజాజ్ గ్రూప్ హెడ్ అభిప్రాయపడ్డారు. ‘సమర్థులు, నిజాయితీపరులను ప్రోత్సహించాలి. అసమర్థులు, అవినీతిపరులను శిక్షించాలి. నల్లధనం కట్టడి, నేరస్తులు ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకట్ట వేయాలి. కేంద్రం, రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలి’ అని పేర్కొన్నారు. -
వ్యాపారాలకు టెక్నాలజీ దన్ను...
* డిజిటల్ ఇండియాలో అపార అవకాశాలు * ఐఎస్బీ కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొంగొత్త టెక్నాలజీలు వ్యాపార స్వరూపాలను మార్చివేస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలు సాంకేతికతను ఆకళింపు చేసుకుని, అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ సూచించారు. డిజిటల్, సోషల్, మొబైల్ మాధ్యమాలు అత్యంత ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో డిజిటల్ ఇండియాలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మెరుగైన జీడీపీ వృద్ధి, విదేశీ మారక నిల్వలు తదితర సానుకూల అంశాలతో భారత్ కాంతిమంతంగా వెలుగొందుతోందని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా చందా కొచర్ ఈ విషయాలు తెలిపారు. యువ జనాభా అత్యధికంగా ఉండటం, టెక్నాలజీని త్వరితగతిన అందిపుచ్చుకోగలగడం భారత్‌కు లాభించే అంశాలన్నారు. టెక్నాలజీ స్టార్టప్స్ రంగంలో భారత్ అత్యంత వేగంగా మూడో స్థానానికి చేరిందని చెప్పారు. నిలకడగా రాణించడంతో పాటు మారే పరిస్థితులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని విద్యార్థులకు ఆమె సూచించారు. మరోవైపు, కేవలం మంచి మేనేజరు అనిపించుకోవడం కన్నా మంచి లీడర్లుగా పేరు తెచ్చుకోవడం ముఖ్యమని ఐఎస్బీ చైర్మన్ ఆది గోద్రెజ్ విద్యార్థులకు సూచించారు. ఇటు ఆర్థికాంశాల్లోనూ అటు మేధోపరంగానా నైతికతకు పెద్ద పీట వేయాలని ఆయన ఉద్బోధించారు. పదిహేనేళ్ల ప్రస్థానం.. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఐఎస్బీలో చదివిన విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 7,500 మార్కును దాటిందని ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం 2016 బ్యాచ్‌లో 559 మంది, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూ టివ్స్ 2015 బ్యాచ్‌లో 57 మంది తాజాగా పట్టా పొం దారని చెప్పారు. ఈసారి రికార్డు స్థాయిలో 1,150 నియామక ఆఫర్లు రాగా వీటిలో పలు సీఎక్స్‌వో స్థాయి ఆఫర్లు ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. ఐఎస్బీ పూర్వ విద్యార్థులు దాదాపు 400 వ్యాపార సంస్థలనూ ప్రారంభించారన్నారు. ప్రస్తుతం 45 మం ది రెసిడెంట్ ఫ్యాకల్టీ ఉండగా, 120 పైగా విజిటింగ్ ఫ్యాకల్టీ ఉన్నారన్నారు. యూటీ డల్లాస్ అధ్యయనం ప్రకారం టాప్-100 అంతర్జాతీయ రీసెర్చ్ ర్యాంకింగ్‌లలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా ఐఎస్బీ నిల్చిందని పేర్కొన్నారు. పట్టాల బహూకరణ సందర్భంగా వివిధ విభాగాల్లో టాపర్లకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. ఆల్‌రౌండర్ అవార్డును పీటర్ రాజ్‌కుమార్ పాల్ అందుకున్నారు. -
2-3 ఏళ్లలో కొత్త డ్రగ్‌లు
సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ వెల్లడి హైదరాబాద్, సాక్షి : వచ్చే 2-3 సంవత్సరాల్లో కొత్త మందుల కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) వద్ద అప్లికేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సన్‌ఫార్మా తెలియజేసింది. ‘‘మా సంస్థకు చెందిన పరిశోధన విభాగం సన్‌ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ (స్పార్క్) ప్రస్తుతం మూడు డ్రగ్‌లకు సంబంధించి పనిచేస్తోంది. అవిపుడు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి’’ అని సన్‌ఫార్మా మేనేజింగ్ డెరైక్టర్ దిలీప్ సంఘ్వీ చెప్పారు. గురువారమిక్కడ ఐఎస్బీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘కొన్నేళ్ల కిందట మేం ఒక ఆలోచన చేశాం. కొత్త ఆవిష్కరణలు చేసే విభాగాన్ని విడిగా చేయాలనే ఉద్దేశంతో స్పార్క్ ను ఏర్పాటు చేశాం. ఇపుడా కంపెనీ మూడు ఉత్పత్తులపై పనిచేస్తూ క్లినికల్ ట్రయల్స్ దశకు తీసుకొచ్చింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే రెండు మూడేళ్లలో మేం మా సొంత కొత్త ఉత్పత్తుల్ని యూఎస్ఎఫ్డీఏ వద్ద నమోదు చేసే అవకాశం ఉంది’’ అని వివరించారు. అయితే ఈ మూడు మందులూ ఏఏ రంగాలకు సంబంధించినవనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం సంస్థకు దాదాపు 1800 మందికి పైగా రీసెర్చ్ సైంటిస్టులున్నారు. -
జూన్ నుంచి ఐఎస్బీలో కొత్త కోర్సుకు శ్రీకారం
♦ ‘హ్యపీనెస్’పై ఆరు వారాల ఆన్లైన్ కోర్సు ♦ ఐఎస్బీ,కోర్సెరా సంయుక్తంగా నిర్వహణ హైదరాబాద్: ఇప్పటి వరకు వ్యాపార, నిర్వహణ అంశాలతో కూడిన కోర్సులను అందించిన గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వినూత్న కోర్సుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ‘ఏ లైఫ్ ఆఫ్ హ్యాపినెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్’ పేరిట ఆరు వారాల పాటు ఆన్లైన్ ద్వారా కోర్సును ఐఎస్బీ హైదరాబాద్, మొహలీ రెండు కేంద్రాలలో అందుబాటులో ఉంచుతారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆన్లైన్ కోర్సులను విస్త్రృత స్థాయిలో అందిస్తున్న కోర్సెరా సంస్థతో ఈ ఆన్లైన్ కోర్సు అందించేందుకు ఐఎస్బీ ఒప్పందం కుదుర్చుకుంది. సానుకూల మనస్తత్వ ధోరణిని ఆధారంగా చేసుకొని శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా ఈ కోర్సుకు శ్రీకారం చుట్టారు. ఐఎస్బీలో జూన్ 15, 2015 నుంచి ఈ కోర్సు మొదలవుతుంది. ప్రస్తుతం 70 దేశాలలో అమలు చేస్తున్న ఈ కోర్సులో ఇప్పటికే 20 వేల మంది విద్యార్థులు చేరారని ఐఎస్బీ అధికారులు తెలిపారు. ఇంటర్నెట్ యాక్సెస్ కలిగిన ఎవరికైనా ఉచితంగా ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులు ఈ కోర్సును పూర్తి చేస్తే తమ విధులను ఆనందమైన ఆలోచనా విధానాలతో మరింత మెరుగ్గా చేసుకోవడానికి, సంస్థ మనుగడ మరింతగా ఇనుమడింప చేయడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఐఎస్బీ అధికారులు తెలిపారు. ఈ కోర్సును ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్, ఐఎస్బీ విజిటింగ్ ప్రొఫెసర్ రాజ్ రఘునాథన్ భోదిస్తారు. -
విలువలతోనే కుటుంబ వ్యాపారాల మనుగడ
తొలితరం తరవాత 70% విచ్ఛిన్నం మూడోతరం తరవాత మిగులుతున్నవి 5 శాతమే ‘సాక్షి’తో గోద్రెజ్ గ్రూపు ఛైర్మన్ ఆది గోద్రెజ్ వ్యాఖ్యలు ఐఎస్బీలో ఫ్యామిలీ బిజినెస్ సెంటర్ ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో కుటుంబాలు నడిపే వ్యాపార సామ్రాజ్యాలు తొలి తరం తప్పుకున్న వెంటనే 70 శాతానికి పైగా విచ్ఛిన్నమవుతున్నాయని గోద్రెజ్ గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు. ‘‘డబ్బు, పరపతి ఉన్నంత మాత్రాన కుటుంబ వ్యాపారాలను సమర్థంగా నిర్వహించగలరని అనుకోవద్దు. వ్యక్తిగత బాధ్యత, సమగ్రత, నిరంతర అధ్యయనం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్... ఈ నాలుగూ ఉంటేనే ఏ రంగంలోనైనా ఫ్యామిలీ బిజినెస్‌లు సక్సెస్ అవుతాయి. సరైన భాగస్వామిని ఎంచుకోవటం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవటం, వ్యక్తిగతంగా సమయాన్ని కేటాయించుకోవటం, నాణ్యమైన సేవలు అందించటం కూడా కీలకం. ఫ్యామిలీ బిజినెస్‌లలో అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలు విజయవంతమైనట్టు ఇండియా, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా వంటివి కావట్లేదు. పెద్ద వాళ్లు వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకున్నాక చిన్న వారిలో వ్యాపారంపై సమగ్ర అవగాహన ఉండట్లేదు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచుల్లో తేడాలుంటున్నాయి. అదే ప్రధాన కారణం’’ అని వివరించారు. శనివారమిక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ‘5వ ఏషియన్ ఫ్యామిలీ బిజినెస్ సదస్సు’కు హాజరైన సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. రెండో తరం తరవాత కూడా విచ్ఛిన్నం కాకుండా కొనసాగుతున్న ఫ్యామిలీ బిజినెస్‌లు కేవలం 15 శాతమేనన్నారు. సంపదపై ఏకాభిప్రాయం లేకే... అంతకు ముందు సదస్సులో మాట్లాడిన గోద్రెజ్... వ్యాపార వారసత్వానికి సంబంధించిన అంశాలు, సంపద నిర్వహణ, వ్యాపార విస్తరణపై ఏకాభిప్రాయం లేకే ఎక్కువ చిన్న, మధ్య తరహా కుటుంబ వ్యాపారాలు విచ్ఛిన్నమవుతున్నాయని తెలియజేశారు. స్పష్టమైన విధానాలు, పారదర్శకత ఉంటే చిన్న, మధ్య తరహా కుటుంబ వ్యాపారాలు కూడా సక్సెస్ అవుతాయన్నారు. ‘‘ఫ్యామిలీ బిజినెస్ సక్సెస్ అనేది ఉద్యోగుల పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఆయా కంపెనీల్లో ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని రివార్డులు, బహుమతులతో ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలి’’ అని ఐఎస్బీ బోర్డు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న గోద్రెజ్ తెలియజేశారు. స్టార్టప్స్‌కు సంధానకర్తగా ఉండాలి... మారుతున్న ధోరణులు, టెక్నాలజీ తీరుతెన్నులకు అనుగుణంగా ఫ్యామిలీ బిజినెస్‌లూ మారాలని స్పెక్ట్రం వాల్యూ మేనేజ్మెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ ష్మిథేనీ సూచించారు. ఇందుకోసం స్థానిక విశ్వ విద్యాలయాల్లో స్టార్టప్స్ ఫోరంలను ఏర్పాటు చేయాలని, ఇవి యువ పారిశ్రామిక వేత్తలకు, నైపుణ్యం ఉన్న యువతకు మధ్య సంధానకర్తగా వ్యవహరించాలని చెప్పారు. అకాడెమీ దశలోనే సాయం చేయటంపై, కుటంబ వ్యాపారాలపై అవగాహన కల్పించాలన్నారు. -
సాధారణ అంశాలే విజయాన్ని అందిస్తాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘అసాధారణ అంశాలతోనే విజయం సాధిస్తామన్న భావన తప్పు. కష్టపడడం, పట్టుదల, నిజాయితీ.. విస్మరించిన ఈ సాధారణ అంశాలే విజయాన్ని అందించి, కొనసాగిస్తాయి’ అని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. ఇక్కడి ఐఎస్బీలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అసమానతలు ఎదుర్కొంటున్న, అన్యాయానికి గురైన, సర్వస్వం కోల్పోయిన వారికి సహాయం చేయండి. ప్రత్యేకతలు ఉన్నవారు దీనిని మంచి అవకాశంగా భావించాలని చెప్పారు. ఆపన్నులకు చేతనైనంత సహాయం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఎంత ఎదిగినా ఈ విషయాలను మరవరాదని తెలిపారు. అందరూ కలిసి ఒకే లక్ష్యంగా పనిచేస్తే సమాజంలో అపరిమితమైన మార్పు చోటు చేసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఐఎస్బీ హవా: ఇప్పటికి 6,000కు పైగా విద్యార్థులు ఐఎస్బీలో విద్యనభ్యసించారు. వీరిలో 180 మంది వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నారు. ఐఎస్బీ డీన్ అజిత్ రంగ్నేకర్ తెలిపారు. 350 మందికిపైగా విద్యార్థులు సొంతంగా వ్యాపారాలను ప్రారంభించారని పేర్కొన్నారు. సమాజాన్ని, చట్టాన్ని గౌరవించండి. బాధ్యతగల నాయకులుగా నిలవండని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యా సంబంధ పరిశోధనల్లో తమ స్కూల్ ముందుందని ఐఎస్బీ చైర్మన్ ఆది గోద్రెజ్ తెలిపారు. కాగా, 2013 బ్యాచ్‌లో 61 మంది విద్యార్థులు పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, 2014 బ్యాచ్‌లో 766 మంది విద్యార్థులు పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ను పూర్తి చేశారు. -
ఐడియా ఛాలెంజ్‌కు 450కి పైగా దరఖాస్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నిర్వహిస్తున్న 5వ ఐడియా ఛాలెంజ్‌కు 16 రాష్ట్రాల నుంచి 450కి పైగా దరఖాస్తులు (నూతన ఆలోచనలు) వచ్చాయి. ఐఐటీ, ఐఐఎం, లండన్ బిజినెస్ స్కూల్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ తదితర యూనివర్సిటీల్లో విద్యనభ్యసించిన వృత్తి నిపుణులు సైతం ఈ చాలెంజ్ కోసం పోటీపడుతున్నారు. విజేతలుగా నిలిచిన టాప్-5 ఆలోచనలకు నగదు బహుమతిగా రూ.2 లక్షల దాకా ఐఎస్బీ అందించనుంది. అలాగే ఇంక్యుబేషన్ నిధి కింద రూ.2.5 కోట్లను బూట్‌క్యాంప్ ఫైనలిస్ట్స్ దక్కించుకునే అవకాశం ఉంది. ఈ నిధిని ఇంటెల్లిక్యా ప్, విల్గ్రోలు సమకూరుస్తాయి. తుది వరకు నిలిచిన 10 బృందాల కోసం నవంబరు 25 నుంచి 30 వరకు ఐఎస్బీ బూట్ క్యాంప్ నిర్వహిస్తోంది.