లేకుంటే కొన్ని సాధించలేం.. ఐఎస్‌బీ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఎంత గొప్ప నాయకుడికైనా ధైర్యం ముఖ్యం. తెలివి తేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేసే తత్వంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కలసి రావాలి. గొప్ప పనులు చేయడానికి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో లీడర్‌షిప్ ఇన్ ఇండియా అనే అంశంపై నిర్వహించిన సదస్సులో రేవంత్ మాట్లాడారు. తాను రాజకీయాలు, జీవితం ద్వారా నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నా నని చెప్పారు.
కాంగ్రెస్ అద్భుత రాజకీయ వారసత్వాన్ని కలిగి ఉందని.. ప్రధానంగా మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ, పటేల్, ఇందిరా గాందీ, పీవీ, మన్మోహన్‌ల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ‘గొప్ప నాయకులు త్యాగాలకు సిద్ధంగా ఉంటారు. ధైర్యం, త్యాగంతోనే గొప్ప నాయకులుగా తయారవుతారు. విజయం సాధిస్తారు. ఈ పోరాటంలో మనం చాలా కోల్పోవాల్సి రావచ్చు. ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకోవాలి. అప్పుడే ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి సేవ చేయగలుగుతారు. పేద, ధనిక, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా, సమాన గౌరవమిస్తూ స్నేహభావంతో అందరినీ కలుపుకొనిపోవాలి’అని సీఎం రేవంత్ సూచించారు.
ప్రభుత్వంలో పనిచేయండి..
‘అసాధారణ ప్రతిభ ఉన్న యువ ఐఎస్‌బీ విద్యార్థులు హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రంతోపాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లు. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న మా లక్ష్యానికి చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాల్సి ఉంటుంది. తెలంగాణను ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి నాకు సహకారం అందించండి’అని ఐఎస్‌బీ విద్యార్థులను సీఎం రేవంత్ కోరారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలతో తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడాలని సూచించారు.
దేశంలోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని తాను కోరుకోవడం లేదని.. న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రపంచంలో భారతదేశం, హైదరాబాద్ అత్యుత్తమంగా మారాలన్నది భారీ లక్ష్యమే అయినా అసాధ్యం కాదన్నారు. తమ ప్రభుత్వంతో రెండు, మూడేళ్లు కలిసి పనిచేయాలని విద్యార్థులను కోరారు. కార్పొరేట్ల తరహాలో ప్రభుత్వం భారీ జీతాలను ఇవ్వలేకపోయినా మంచి అవకాశాలు, లక్ష్యాలు, సవాళ్లను ఇస్తామని చెప్పారు.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఉండేలా..
హైదరాబాద్‌ను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తన ఆలోచన సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దక్షిణ కొరియాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించానని.. చిన్న దేశమైనా ఒలింపిక్స్‌లో చాలా పతకాలు గెలిచిందని చెప్పారు. మన దేశం ఒక్క బంగారు పతకం సాధించలేకపోయిందన్నారు. ఒలింపిక్స్ పతకాలు సాధించడం తమ లక్ష్యమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment