హాజరుకూ మార్కులు! | Acceptance of ISB recommendations by universities | Sakshi
Sakshi News home page

హాజరుకూ మార్కులు!

Published Wed, Nov 22 2023 5:11 AM | Last Updated on Wed, Nov 22 2023 5:11 AM

Acceptance of ISB recommendations by universities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది.

ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్‌ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐఎస్‌బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. 

ఐఎస్‌బీ అభిప్రాయ సేకరణ 
అధ్యయనంలో భాగంగా ఐఎస్‌బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు.

ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్‌ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్‌బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది.  

ప్రతి అంశానికీ మార్కులు 
సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్‌బీ ప్రస్తావించింది. యాక్టివ్‌గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్‌ చేయాలి. ప్రాజెక్టు వర్క్‌లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్‌లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి.

పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్‌షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ ఎవాల్యుయేషన్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, రోబోటిక్స్‌ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్‌బీ సిఫారసు చేసింది.

గుణాత్మక మార్పుకు దోహదం  
దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్‌– ఇంజనీరింగ్‌) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్‌వేర్‌ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం.     – ప్రొఫెసర్‌ డి.రవీందర్‌   (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement