విలువలతోనే కుటుంబ వ్యాపారాల మనుగడ
తొలితరం తరవాత 70% విచ్ఛిన్నం
మూడోతరం తరవాత మిగులుతున్నవి 5 శాతమే
‘సాక్షి’తో గోద్రెజ్ గ్రూపు ఛైర్మన్ ఆది గోద్రెజ్ వ్యాఖ్యలు
ఐఎస్‌బీలో ఫ్యామిలీ బిజినెస్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో కుటుంబాలు నడిపే వ్యాపార సామ్రాజ్యాలు తొలి తరం తప్పుకున్న వెంటనే 70 శాతానికి పైగా విచ్ఛిన్నమవుతున్నాయని గోద్రెజ్ గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు. ‘‘డబ్బు, పరపతి ఉన్నంత మాత్రాన కుటుంబ వ్యాపారాలను సమర్థంగా నిర్వహించగలరని అనుకోవద్దు. వ్యక్తిగత బాధ్యత, సమగ్రత, నిరంతర అధ్యయనం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్... ఈ నాలుగూ ఉంటేనే ఏ రంగంలోనైనా ఫ్యామిలీ బిజినెస్‌లు సక్సెస్ అవుతాయి. సరైన భాగస్వామిని ఎంచుకోవటం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవటం, వ్యక్తిగతంగా సమయాన్ని కేటాయించుకోవటం, నాణ్యమైన సేవలు అందించటం కూడా కీలకం.
ఫ్యామిలీ బిజినెస్‌లలో అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలు విజయవంతమైనట్టు ఇండియా, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా వంటివి కావట్లేదు. పెద్ద వాళ్లు వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకున్నాక చిన్న వారిలో వ్యాపారంపై సమగ్ర అవగాహన ఉండట్లేదు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచుల్లో తేడాలుంటున్నాయి. అదే ప్రధాన కారణం’’ అని వివరించారు. శనివారమిక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో ‘5వ ఏషియన్ ఫ్యామిలీ బిజినెస్ సదస్సు’కు హాజరైన సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. రెండో తరం తరవాత కూడా విచ్ఛిన్నం కాకుండా కొనసాగుతున్న ఫ్యామిలీ బిజినెస్‌లు కేవలం 15 శాతమేనన్నారు.
సంపదపై ఏకాభిప్రాయం లేకే...
అంతకు ముందు సదస్సులో మాట్లాడిన గోద్రెజ్... వ్యాపార వారసత్వానికి సంబంధించిన అంశాలు, సంపద నిర్వహణ, వ్యాపార విస్తరణపై ఏకాభిప్రాయం లేకే ఎక్కువ చిన్న, మధ్య తరహా కుటుంబ వ్యాపారాలు విచ్ఛిన్నమవుతున్నాయని తెలియజేశారు. స్పష్టమైన విధానాలు, పారదర్శకత ఉంటే చిన్న, మధ్య తరహా కుటుంబ వ్యాపారాలు కూడా సక్సెస్ అవుతాయన్నారు. ‘‘ఫ్యామిలీ బిజినెస్ సక్సెస్ అనేది ఉద్యోగుల పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఆయా కంపెనీల్లో ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని రివార్డులు, బహుమతులతో ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలి’’ అని ఐఎస్‌బీ బోర్డు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న గోద్రెజ్ తెలియజేశారు.
స్టార్టప్స్‌కు సంధానకర్తగా ఉండాలి...
మారుతున్న ధోరణులు, టెక్నాలజీ తీరుతెన్నులకు అనుగుణంగా ఫ్యామిలీ బిజినెస్‌లూ మారాలని స్పెక్ట్రం వాల్యూ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ ష్మిథేనీ సూచించారు. ఇందుకోసం స్థానిక విశ్వ విద్యాలయాల్లో స్టార్టప్స్ ఫోరంలను ఏర్పాటు చేయాలని, ఇవి యువ పారిశ్రామిక వేత్తలకు, నైపుణ్యం ఉన్న యువతకు మధ్య సంధానకర్తగా వ్యవహరించాలని చెప్పారు. అకాడెమీ దశలోనే సాయం చేయటంపై, కుటంబ వ్యాపారాలపై అవగాహన కల్పించాలన్నారు.