కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశం
గ్రీన్ హైడ్రోజన్, ఇంధన స్టోరేజీ, రీసైకిల్ పట్ల ఆసక్తి
మీడియాకు వెల్లడించిన జంషెడ్ గోద్రేజ్
ముంబై: జంషెడ్ గోద్రేజ్ ఆధ్వర్యంలోని గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ (జీఈజీ) రానున్న మూడేళ్లలో వివిధ వ్యాపారాల్లో రూ.7,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత తయారీ సామర్థ్యాల విస్తరణ, మార్కెటింగ్, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), టెక్నాలజీపై వ్యయం చేయనున్నట్టు తెలిపింది. గోద్రేజ్ గ్రూప్ ఇటీవలే పరస్పర అంగీకారంతో రెండు గ్రూపులుగా విడిపోవడం తెలిసిందే.
ఆది గోద్రేజ్, నాదిర్ గోద్రేజ్ ఆధ్వర్యంలో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్, జంషెడ్ గోద్రేజ్ ఆధ్వర్యంలో జీఈజీ గ్రూప్ వేరయ్యాయి. లాక్‌లు (తాళాలు), రిఫ్రిజిరేటర్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్, ఫర్నిచర్ తదితర వ్యాపారాల్లో జీఈజీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రా, ఏరోస్పేస్ రంగంలోనూ వ్యాపారాలు నిర్వహిస్తోంది. గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోయినప్పటికీ వినియోగదారుల పరంగా ఎలాంటి మార్పుల్లేవని జంషెడ్ గోద్రేజ్ మీడియాకు తెలిపారు.
వ్యాపారాల వృద్ధికి కొత్త విభాగాలను గుర్తించినట్టు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్, ఇంధన స్టోరేజీ, నిర్మాణ రంగ మెటీరియల్స్ రీసైక్లింగ్ తమ గ్రూప్‌నకు భవిష్యత్ వృద్ధి విభాగాలుగా ఉంటాయని చెప్పారు. ఇందులో భాగంగా యూఎస్‌కు చెందిన రెండు స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇవి మినహా ఇతర కొత్త వ్యాపార ప్రణాళికలేవీ లేవన్నారు.
ఇంజనీరింగ్, డిజైన్ ఆధారిత దిగ్గజ గ్రూప్‌గా జీఈజీని మార్చడం తమఉద్దేశ్యమని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నైరికా హోల్కర్ తెలిపారు. జంషెడ్ గోద్రేజ్ సోదరి స్మితాకృష్ణ కుమర్తెనే హోల్కర్. 2032 నాటికి గ్రూప్ ఆదాయంలో సగం మేర గ్రీన్ ఉత్పత్తుల ద్వారానే వస్తుందన్నారు. ప్రస్తుతం గ్రూప్ వార్షిక టర్నోవర్ రూ.16,000 కోట్లుగా ఉండగా, ఇందులో రూ.10,000 కోట్లు కన్జ్యూమర్ వ్యాపారాల నుంచి, మిగిలిన రూ.6,000 కోట్లు 13 ఇతర వ్యాపారాల నుంచి సమకూరుతున్నట్టు చెప్పారు. ఈ టర్నోవర్‌ను రూ.20,000 కోట్లకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.
మూడు క్లస్టర్లుగా గ్రూపు వ్యాపారం
వ్యాపారాలను మూడు క్లస్టర్లుగా విభజిస్తున్నట్టు జంషెడ్ గోద్రేజ్ తెలిపారు. ‘‘కన్జ్యూమర్ ఫస్ట్ వ్యాపారం కింద గృహోపకరణాలు, లాక్‌లు ఉంటాయి. నేషన్ ఫస్ట్ కింద ఏరోస్పేస్, అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ తదితర వ్యాపారాలు, ఫ్యూచర్ ఫస్ట్ కిందకు గ్రీన్ హైడ్రోజన్, జింక్–మాంగనీస్ బ్యాటరీ, రీసైకిల్డ్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ వస్తాయి’’అని వివరించారు. కంపెనీ వృద్ధి ప్రణాళికల్లో బ్యాటరీ స్టోరేజీ కూడా ఉన్నట్టు చెప్పారు.
‘‘నేడు ప్రపంచంలో అధిక శాతం బ్యాటరీలు లిథియం ఐయాన్ లేదా సోడియం ఐయాన్ ఆధారితమైనవి. మేము వీటికి భిన్నమైన జింక్, మాంగనీస్ కెమిస్ట్రీపై దృష్టి సారించాం. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన పైలట్ ప్లాంట్ ఇప్పటికే పని మొదలు పెట్టింది. బ్యాటరీ స్టోరేజీ ద్వారా దేశ ఇంధన పరివర్తనలో కీలక పాత్ర పోషించనున్నాం’’అని వెల్లడించారు. జీఈజీ గ్రూప్ పరిధిలో పెద్ద వ్యాపారాలున్నప్పటికీ ఒక్క లిస్టెడ్ కంపెనీ లేకపోవడం గమనార్హం.
సమీప భవిష్యత్తులోనూ ఇందులో మార్పు ఉండదని జంషెడ్ గోద్రేజ్ స్పష్టం చేశారు. బలమైన వ్యాపారాలు కావడంతో, నగదు ప్రవాహాలు కూడా మెరుగ్గా ఉన్నాయంటూ.. దీంతో పెట్టుబడులకు కావాల్సిన నిధులను అంతర్గతంగానే సమకూర్చుకోగలమని చెప్పారు. అందుకే నిధుల కోసం ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడలేదన్నారు. ఇప్పటి వరకు అయితే గ్రూప్ కంపెనీలకు సంబంధించి ఐపీవో ప్రణాళికల్లేవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment