
సాక్షి, హైదరాబాద్: ది ఫైనాన్షియల్ టైమ్స్–గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 23వ స్థానం, ఆసియాలో ఐదో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. దేశంలోనే టాప్ 25లో స్థానం దక్కించుకున్న ఏకైక సంస్థ ఐఎస్‌బీ కావడం గమనార్హం. పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ)లో ఈ ర్యాంకులు సాధించింది.
ఈ ర్యాంకుల కోసం 2017కు చెందిన పీజీపీ విద్యార్థులను సర్వే చేశారు. ర్యాంకింగ్స్ కోసం ది ఫైనాన్షియల్ టైమ్స్ పరిగణనలోకి తీసుకున్న అనేక రంగాల్లో ఈ విద్యాసంస్థ మెరుగైన ప్రతిభ కనబర్చింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకుంది.
సమష్టి కృషితోనే సాధ్యమైంది..
అత్యుత్తమ ప్రపంచస్థాయి విద్యను అందించడంలో ఐఎస్‌బీ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పర్చుకుంది. అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, సిబ్బంది, బోర్డు మద్దతు, సమష్టి కృషికి ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్ నిదర్శనం. నాణ్యమైన మేనేజ్‌మెంట్ విద్యకు దేశంలోనే కలికితురాయిగా ఐఎస్‌బీ నిలిచింది.
– ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ, ఐఎస్‌బీ డీన్
Comments
Please login to add a commentAdd a comment