మారిన నిబంధనలతో మైనస్ మార్కులు
డంపర్ బిన్ల ఏర్పాటు ప్రభావం చూపేనా?
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్(Swachh Survekshan) ర్యాంకుల్లో ఈసారి హైదరాబాద్ (hyderabad) పరిస్థితి ఏం కానుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణాలు ఉన్నాయి. నగరంలో గతంలో ఎత్తేసిన డంపర్ బిన్లను తిరిగి ఏర్పాటు చేస్తుండటం ఇందుకు ఒక కారణం కాగా.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటనలో తప్పుడు వివరాలిచ్చినట్లు గుర్తిస్తే పెనాల్టీ విధించనున్నారు. అంటే మైనస్ మార్కులుంటాయి. తద్వారా మెరుగైన ర్యాంకు వచ్చే అవకాశం ఉండదు. నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు పొందేందుకు గతంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
కేవలం స్వచ్ఛ ర్యాంకుల కోసమే నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డంపర్ బిన్లను ఎత్తివేశారు. దీంతో ప్రజల నుంచి పలు విమర్శలు ఎదురయ్యాయి. రోడ్ల వెంబడి ఎక్కడికక్కడే చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. నగరంలో చెత్త పరిస్థితులకు డంపర్‌బిన్లు లేకపోవడం కూడా ముఖ్య కారణంగా భావించిన కమిషనర్ ఇలంబర్తి తిరిగి వాటిని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. గతంలో మాదిరిగా కాకుండా ఆధునిక సాంకేతికతతో చెత్త పూర్తిగా నిండకముందే కంట్రోల్‌రూమ్‌కు ‘అలర్ట్’ వెళ్తుంది. వెంటనే వాహనం వెళ్లి ఆటోమేటిక్‌గా చెత్త తరలిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు చెత్త వేసేందుకు ఇతర ఏర్పాట్లు చేశారు. ఎటొచ్చీ బహిరంగ ప్రదేశాల్లో ఉండే ‘చెత్త సేకరణ’తో మార్కులు తగ్గుతాయి.
తప్పుడు వివరాలిస్తే..
ప్రస్తుతం నడుస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్–2024లో కొన్ని నిబంధనలు ఇటీవల కొత్తగా చేర్చారు. స్వచ్ఛ కార్యక్రమాల అమలు గురించి పోటీలో పాల్గొనే స్థానికసంస్థలు నిర్ణీత వ్యవధుల్లో సంబంధిత ‘స్వచ్ఛతమ్’ పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తాయి. పోర్టల్‌లో పొందుపరిచిన వివరాలు నిజంగా అమలవుతున్నదీ, లేనిదీ పరిశీలించేందుకు కేంద్రం నుంచి వచ్చే బృందాలు తమ తనిఖీలు, పరిశీలనల్లో తప్పుడు వివరాలు నమోదైనట్లు గుర్తిస్తే పెనాల్టీ విధిస్తాయి. మైనస్ మార్కులు వేస్తాయి. ‘రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్’ థీమ్‌తో నడుస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్–2024కు సంబంధించి మూడు సర్వేలో మూడు దశలు పూర్తయ్యాయి. నాలుగో దశ కోసం ఈ మార్పులు చేశారు. అమలు విధివిధానాల్లోనూ కీలక మార్పులు చేశారు.
ఈ మేరకు మార్పులు ఇలా ఉన్నాయి..
⇒ జనాభా ప్రాతిపదికన నిబంధనలు.
⇒ పది విభాగాలో ఇండికేటర్స్ సరళీకరణ.
⇒ కొత్తగా ‘సూపర్ స్వచ్ఛ్ లీగ్’ పట్టణాలు.
⇒ కొన్ని అంశాలకు కొత్త ఇండికేటర్స్.
⇒ పాఠశాలలు, జనసమ్మర్థం ఉండే çపర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి.
⇒ స్వచ్ఛతకు సంబంధించి పాఠశాలలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు.
⇒ స్వచ్ఛతమ్ పోర్టల్‌లో పొందుపరిచిన వివరాలు.. క్షేత్రస్థాయి çపరిస్థితులకు భిన్నంగా ఉంటే మైనస్ మార్కులు.
⇒ ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు మంచి ర్యాంక్ రావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సూపర్ స్వచ్ఛ్ లీగ్..
కొత్తగా పొందుపరిచిన అంశాల్లో సూపర్ స్వచ్ఛ్ లీగ్‌ను ప్రవేశపెట్టారు. జనాభా ప్రాతిపదికన 2021, 2022, 2023లలో స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకుల్లో కనీసం రెండు పర్యాయాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచిన నగరాలు సూపర్ స్వచ్ఛ్ లీగ్‌గా గుర్తిస్తారు. సదరు పట్టాణాల్లో అమలయ్యే స్వచ్ఛ కార్యక్రమాలను ప్రత్యేక ఇండికేటర్స్ ఆధారంగా పరిశీలిస్తారు. అవి తమ ప్రత్యేక హోదాను కాపాడుకునేందుకు అవి భవిష్యత్‌లో 85 శాతం మార్కుల్ని పొందాల్సి ఉంటుంది. ఇండోర్ వంటి నగరాలు సూపర్ స్వచ్ఛ్ లీగ్‌లో చేరితే, హైదరాబాద్‌కు గతం కంటే మెరుగైన ర్యాంకు వస్తుందనుకుంటే.. మారిన నిబంధనలు, మైనస్ మార్కులతో మంచి ర్యాంకుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment