Swachh Survekshan
-
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే కోసం కూటమి ప్రభుత్వం పాట్లు.
విశాఖ: కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో ఈసారి జీవీఎంసీ ప్రదర్శన ఆశించిన మేర ఉండేలా కనబడటం లేదు. నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. ఈ సర్వే కోసం సచివాలయ సిబ్బందిపై జీవీంఎసీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేయాల్సిన సర్వేను.. సచివాలయ సిబ్బందికి అప్పగించారు. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి 300 మంది ప్రజలు ఓటీపీలు సేకరించాలని ఆదేశించారు. అయితే ఓటీపీలు చెప్పడానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. దాంతో జోనల్ కమిషనర్ శివప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనుకున్న టార్గెట్ చేరలేకపోయారంటూ సచివాలయ సిబ్బందికి నోటీసులు పంపారు శివ ప్రసాద్. ఆయన తీరుతో సచివాలయ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేయించాల్సిన సర్వేను తమతో చేయించడంపై మండిపడుతున్నారు. -
Hyderabad: స్వచ్ఛ ర్యాంక్ దక్కేనా?
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్(Swachh Survekshan) ర్యాంకుల్లో ఈసారి హైదరాబాద్ (hyderabad) పరిస్థితి ఏం కానుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణాలు ఉన్నాయి. నగరంలో గతంలో ఎత్తేసిన డంపర్ బిన్లను తిరిగి ఏర్పాటు చేస్తుండటం ఇందుకు ఒక కారణం కాగా.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటనలో తప్పుడు వివరాలిచ్చినట్లు గుర్తిస్తే పెనాల్టీ విధించనున్నారు. అంటే మైనస్ మార్కులుంటాయి. తద్వారా మెరుగైన ర్యాంకు వచ్చే అవకాశం ఉండదు. నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు పొందేందుకు గతంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. కేవలం స్వచ్ఛ ర్యాంకుల కోసమే నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డంపర్ బిన్లను ఎత్తివేశారు. దీంతో ప్రజల నుంచి పలు విమర్శలు ఎదురయ్యాయి. రోడ్ల వెంబడి ఎక్కడికక్కడే చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. నగరంలో చెత్త పరిస్థితులకు డంపర్బిన్లు లేకపోవడం కూడా ముఖ్య కారణంగా భావించిన కమిషనర్ ఇలంబర్తి తిరిగి వాటిని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. గతంలో మాదిరిగా కాకుండా ఆధునిక సాంకేతికతతో చెత్త పూర్తిగా నిండకముందే కంట్రోల్‌రూమ్‌కు ‘అలర్ట్’ వెళ్తుంది. వెంటనే వాహనం వెళ్లి ఆటోమేటిక్‌గా చెత్త తరలిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు చెత్త వేసేందుకు ఇతర ఏర్పాట్లు చేశారు. ఎటొచ్చీ బహిరంగ ప్రదేశాల్లో ఉండే ‘చెత్త సేకరణ’తో మార్కులు తగ్గుతాయి. తప్పుడు వివరాలిస్తే.. ప్రస్తుతం నడుస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్–2024లో కొన్ని నిబంధనలు ఇటీవల కొత్తగా చేర్చారు. స్వచ్ఛ కార్యక్రమాల అమలు గురించి పోటీలో పాల్గొనే స్థానికసంస్థలు నిర్ణీత వ్యవధుల్లో సంబంధిత ‘స్వచ్ఛతమ్’ పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తాయి. పోర్టల్‌లో పొందుపరిచిన వివరాలు నిజంగా అమలవుతున్నదీ, లేనిదీ పరిశీలించేందుకు కేంద్రం నుంచి వచ్చే బృందాలు తమ తనిఖీలు, పరిశీలనల్లో తప్పుడు వివరాలు నమోదైనట్లు గుర్తిస్తే పెనాల్టీ విధిస్తాయి. మైనస్ మార్కులు వేస్తాయి. ‘రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్’ థీమ్‌తో నడుస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్–2024కు సంబంధించి మూడు సర్వేలో మూడు దశలు పూర్తయ్యాయి. నాలుగో దశ కోసం ఈ మార్పులు చేశారు. అమలు విధివిధానాల్లోనూ కీలక మార్పులు చేశారు. ఈ మేరకు మార్పులు ఇలా ఉన్నాయి.. ⇒ జనాభా ప్రాతిపదికన నిబంధనలు. ⇒ పది విభాగాలో ఇండికేటర్స్ సరళీకరణ. ⇒ కొత్తగా ‘సూపర్ స్వచ్ఛ్ లీగ్’ పట్టణాలు. ⇒ కొన్ని అంశాలకు కొత్త ఇండికేటర్స్. ⇒ పాఠశాలలు, జనసమ్మర్థం ఉండే çపర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. ⇒ స్వచ్ఛతకు సంబంధించి పాఠశాలలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు. ⇒ స్వచ్ఛతమ్ పోర్టల్‌లో పొందుపరిచిన వివరాలు.. క్షేత్రస్థాయి çపరిస్థితులకు భిన్నంగా ఉంటే మైనస్ మార్కులు. ⇒ ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు మంచి ర్యాంక్ రావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్వచ్ఛ్ లీగ్.. కొత్తగా పొందుపరిచిన అంశాల్లో సూపర్ స్వచ్ఛ్ లీగ్‌ను ప్రవేశపెట్టారు. జనాభా ప్రాతిపదికన 2021, 2022, 2023లలో స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకుల్లో కనీసం రెండు పర్యాయాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచిన నగరాలు సూపర్ స్వచ్ఛ్ లీగ్‌గా గుర్తిస్తారు. సదరు పట్టాణాల్లో అమలయ్యే స్వచ్ఛ కార్యక్రమాలను ప్రత్యేక ఇండికేటర్స్ ఆధారంగా పరిశీలిస్తారు. అవి తమ ప్రత్యేక హోదాను కాపాడుకునేందుకు అవి భవిష్యత్‌లో 85 శాతం మార్కుల్ని పొందాల్సి ఉంటుంది. ఇండోర్ వంటి నగరాలు సూపర్ స్వచ్ఛ్ లీగ్‌లో చేరితే, హైదరాబాద్‌కు గతం కంటే మెరుగైన ర్యాంకు వస్తుందనుకుంటే.. మారిన నిబంధనలు, మైనస్ మార్కులతో మంచి ర్యాంకుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
స్వచ్ఛతలో 5వ ర్యాంక్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏటా అందజేసే ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. పరిశుభ్రమైన నగరాలు (క్లీన్ సిటీస్), అతి పరిశుభ్రమైన (క్లీనెస్ట్) కంటోన్మెంట్, సఫాయిమిత్ర సురక్ష, గంగా టౌన్స్, మంచి పనితీరు కనబరచిన రాష్ట్రాలు (బెస్ట్ పెర్ఫారి్మంగ్ స్టేట్స్) కేటగిరీలన్నీ కలిపి 110 అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణకు నాలుగు జాతీయ అవార్డులు లభించగా.. మొత్తం 3,029.32 పాయింట్లతో రాష్ట్రం 5వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది క్లీనెస్ట్ సిటీ అవార్డును ఉమ్మడిగా ఇండోర్, సూరత్‌లు గెలుచుకున్నాయి. ఆలిండియా క్లీన్ సిటీ కేటగిరీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 9వ ర్యాంకును కైవసం చేసుకుంది. మరికొన్ని అవార్డులు లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరీలో తెలంగాణలో క్లీన్ సిటీగా గుండ్ల పోచంపల్లి అవార్డు గెలుచుకుంది. 25 వేలు –50 వేలు జనాభా కేటగిరీలో సౌత్ జోన్లో క్లీన్ సిటీగా నిజాంపేట్, 50 వేలు – 1 లక్ష జనాభా కేటగిరీలో సౌత్ జోన్లో క్లీన్ సిటీగా సిద్దిపేట స్థానిక సంస్థలు అవార్డులు కైవసం చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఓడీఎఫ్ కేటగిరీలో 19, ఓడీఎఫ్+ కేటగిరీలో 77, ఓడీఎఫ్++ కేటగిరీలో 45, వాటర్+ కేటగిరీలో 2 స్థానిక సంస్థలు ఉన్నాయి. చెత్త రహిత నగరాల్లో హైదరాబాద్‌కు 5 స్టార్ రేటింగ్ రాగా, సిద్దిపేట, నిజాంపేట్, గుండ్ల పోచంపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పీర్జాదిగూడ, సిరిసిల్ల, భువనగిరి, నార్సింగి స్థానిక సంస్థలకు 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. గురువారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీలు అవార్డులను అందజేశారు. -
మరోసారి సత్తా చాటిన ఇండోర్.. వరుసగా ఏడోసారి నెంబర్ వన్..
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి నెంబర్ వన్‌గా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుల్లో వరుసగా ఏడోసారి తొలి స్థానాన్ని దక్కించుకుంది . ఇండోర్‌తోపాటు గుజరాత్‌లోని సూరత్ కూడా క్లీనెస్ట్ సిటీ తొలి ర్యాంక్‌ను సంయుక్తంగా గెలుచుకుంది.ఈ జాబితాలో మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది. పరిశుభ్రత నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా సత్తా చాటాయి. ఏపీలో విశాఖపట్నం నాలుగు, విజయవాడ (6), తిరుపతి (8), తెలంగాణ రాజధాని హైదరాబాద్ (9) నగరాలు తొలి 10 సిటీల్లో చోటు దక్కించుకున్నాయి. అయితే టాప్ 100 లిస్ట్‌లో తమిళనాడు నుంచి ఏ నగరం కూడా ఎంపికవ్వలేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో చెన్నై 199 స్థానంలో ఉండటం గమనార్హం. Speaking at the Swachh Survekshan awards event in New Delhi, President Droupadi Murmu said that if we deeply understand the concept of value from waste, it becomes clear that everything is valuable and nothing is waste.https://t.co/l5hs7J7Vmb pic.twitter.com/goP4l8zTyw — President of India (@rashtrapatibhvn) January 11, 2024 విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత పరిశుభ్రత రాష్ట్రంగా మహారాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ గెలుచుకుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నాల్గో స్థానంలో ఒడిశా, అయిదో స్థానంలో తెలంగాణ నిలిచింది. -
ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట
సాక్షి, ఢిల్లీ: ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచింది. జాతీయ స్థాయిలో గుంటూరు ఆలిండియా రెండో ర్యాంకు, గ్రేటర్ విశాఖపట్నం ఆలిండియా 4వ ర్యాంక్, విజయవాడ ఆలిండియా 6వ ర్యాంక్, తిరుపతి ఆలిండియా 8వ ర్యాంకు సాధించాయి. అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకుగానూ ఏపీ ఈ అవార్డులను దక్కించుకుంది. పట్టణాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న కృషికి ఈ అవార్డులు ఈ అవార్డులు చిహ్నమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. క్లీన్ ఏపీ (క్లాప్) ప్రోగ్రాం విజయవంతమైందన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించామని, వారంతా తిరిగి విధుల్లో చేరారన్నారు. సమ్మె వల్ల కొంత ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం జరిగిందని మంత్రి ఆదిమూలపు అన్నారు. కాగా, 2022లో కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కు ‘సఫాయిమిత్ర సురక్షా సెహెర్’ అవార్డు దక్కింది. సీఎం జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయనడానికి ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడమే నిదర్శనం. ఇదీ చదవండి: ఏపీలో రేపు మూడు కొత్త రైళ్ల ప్రారంభం -
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల్లో సిరిసిల్ల టాప్
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2023 అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే ఫోర్ స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానం దక్కింది. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన రహితం) ప్లస్ కేటగిరిలో మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దినందుకుగాను ఈ అవార్డు లభించింది. కేంద్ర తాగునీరు–పారిశుధ్య మంత్రిత్వ శాఖ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఓడీఎఫ్ ప్లస్ మోడల్ కింద అన్ని గ్రామాల్లోని ఇళ్లు, సంస్థలలో మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవడం, గ్రామాలలో తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్ట్ షెడ్ల వినియోగం, అన్ని గ్రామాలలో మురుగు నీటి నిర్వహణ, అన్నింటినీ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చి దిద్దడంతో పాటు ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ అవార్డును ప్రకటించారు. అద్భుతాన్ని ఆవిష్కరించారు: మంత్రి కేటీఆర్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ –2023 అవార్డుల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు దృఢ సంకల్పంతో అద్భుతాన్ని ఆవిష్కరించారని అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని కోరారు. తాజా అవార్డుపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులను అభినందిస్తూ మంత్రి ట్వీట్ చేశారు. కాగా, ‘మీ నిరంతర మార్గదర్శనం, సహకారం కారణంగానే ఇది సాధ్యమైందంటూ’కలెక్టర్ కూడా ట్వీట్ చేశారు. -
రాష్ట్రానికి మరో 7 ‘స్వచ్ఛ’ అవార్డులు.. కేటీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించిన స్వచ్ఛ అవార్డుల జాబితాలో తెలంగాణలోని ఏడు పట్టణాలకు చోటు దక్కింది. ఇప్పటికే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగంలో 16 అవార్డులు రాగా, ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ఎల్) విభాగంలో మరో మూడు అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రదానం చేసింది. తాజాగా కాగజ్‌నగర్, జనగామ, ఆమన్‌గల్, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్ధన్నపేట, గ్రేటర్ వరంగల్ పురపాలికలకు ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీస్ (వేగంగా ఎదుగుతున్న నగరాలు) కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దీంతో తెలంగాణ మొత్తం 26 అవార్డులను సాధించినట్లయింది. 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయి శానిటేషన్ సర్వేను జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు నిర్వహించింది. పారిశుధ్యం, మున్సిపల్ ఘన..ద్రవ వ్యర్థాల నిర్వహణ, అవగాహనపై దేశ వ్యాప్తంగా ఉన్న 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్వహించారు. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఘన వ్యర్ధాల నిర్వహణ, ఉమ్మి రహిత వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు.. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, ద్రవ..వ్యర్ధాల నిర్వహణ, ప్రజల అవగాహన, సిటిజెన్స్ ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్స్ తదితర అంశాలు పరిశీలించారు. అనంతరం అవార్డులు ప్రకటించారు. తక్కువ మున్సిపాలిటీలు.. ఎక్కువ అవార్డులు: కేటీఆర్ రాష్ట్రానికి మరిన్ని స్వచ్ఛ అవార్డులు దక్కడంపై పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారి అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ మార్గనిర్దేశనంలో అటు పల్లెలు, ఇటు పట్టణాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే జాతీయ స్థాయిలో తెలంగాణకు అవార్డులు దక్కుతున్నాయని చెప్పారు. తక్కువ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ఉన్నప్పటికీ అత్యధిక అవార్డులు దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. తెలంగాణ అద్భుత, వినూత్న కార్యక్రమాలను యావత్ దేశం ఆదర్శంగా తీసుకుంటోందని అన్నారు. ఈ అవార్డులు రావడంలో పురపాలక శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర వహించారంటూ వారిని అభినందించారు. అవార్డులు సాధించిన పురపాలికల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచి్చన పట్టణాలకు రూ.2 కోట్ల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహక నిధులను ప్రకటించారు. ఇదీ చదవండి: Hyderabad: జనవరిలో నూతన భవనంలోకి యూఎస్ కాన్సులేట్ -
సీఎం వైఎస్ జగన్‌తో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీతలు(ఫోటోలు)
-
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీతలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్– 2022లో ఆంధ్రప్రదేశ్‌కు వివిధ కేటగిరీల్లో 11 అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో అవార్డులు అందుకున్న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు, సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ కేటగిరీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ ఆర్ శిరీష, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి కమిషనర్ అనుపమ అంజలిని అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు బిగ్ క్లీన్ సిటీ కేటగిరీలో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు సాధించింది. డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, సతీష్, కమిషనర్ రాజబాబు, అడిషనల్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాస్త్రీలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ► క్లీన్ స్టేట్ క్యాపిటల్ కేటగిరీలో విజయవాడ అవార్డు గెల్చుకుంది. ఈ క్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్, అడిషనల్ కమిషనర్ కె వి సత్యవతిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది. అవార్డు అందుకున్న పులివెందులు మున్సిపాలిటీ ఛైర్మన్ వి వరప్రసాద్, వైస్ ఛైర్మన్లు వైయస్.మనోహర్‌రెడ్డి, హఫీజుల్లా, కమిషనర్ వి వి నరసింహారెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్.జగన్. ► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో పుంగనూరు మున్సిపాలిటీ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా ఛైర్మన్ అలీమ్ భాషా, కమిషనర్ నరసింహ ప్రసాద్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసించారు. ► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీలో(15వేలలోపు జనాభా) స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన పొదిలి మున్సిపల్ కమిషనర్ కె డేనియల్ జోసఫ్, మున్సిపల్ మేనేజర్ ఎస్ వి శ్రీకాంత్‌రెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీ(లక్ష నుంచి 3 లక్షలలోపు జనాభా)లో స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేశు, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జి వెంకటరావులను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► 25 వేల నుంచి 50 వేలులోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో సాలూరు మున్సిపాలిటీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, కమిషనర్ హనుమంతు శంకరరావులను అభినందించారు సీఎం వైయస్.జగన్. కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ లక్ష్మీషా, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి సంపత్ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్పర్సన్ పి దేవసేన, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ సీఓఓ కిరణ్ కుమార్, టీం లీడర్ పాతూరు సునందలు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్ -
రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలు
సాక్షి, అమరావతి/ న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పలు నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో అనుసరిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలకు స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పలు అవార్డులు సొంతమయ్యాయి. పలు యూఎల్బీలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. ప్రజాభిప్రాయమే ప్రాతిపదికగా ఈ ఏడాది మూడు దశల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహించి, అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో రాష్ట్రానికి చెందిన పలు పట్టణాలు, నగరాలు ఉత్తమ ఫలితాలను సాధించి అవార్డులను సొంతం చేసుకున్నాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవçహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్–2022 వేడుకలో రాష్ట్రానికి పలు అవార్డులు ప్రదానం చేశారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కు ‘సఫాయిమిత్ర సురక్షా సెహెర్’ అవార్డు దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మిలు ఈ అవార్డులను అందుకున్నారు. జాతీయ టాప్–10లో మూడు యూఎల్బీలు ► స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలవగా, లక్ష కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు టాప్–10 కేటగిరీలో స్థానం సంపాదించాయి. వీటితోపాటు కర్నూలు, నెల్లూరు, కడప, రాజమహేంద్రవరం యూఎల్బీలు (అర్బన్ లోకల్ బాడీస్) కూడా టాప్–100 కేటగిరీలో నిలిచాయి. ► సౌత్ జోన్లో 50 వేల నుంచి లక్ష జనాభా కేటగిరీలో టాప్–100 యూఎల్బీల్లో రాష్ట్రంలోని 21 నగరాలు నిలిచాయి. ఇందులో పుంగనూరు మున్సిపాలిటీ 3వ ర్యాంకు, పులివెందుల 9వ ర్యాంకు సాధించాయి. ► 25 – 50 వేల జనాభా విభాగంలో 8 యూఎల్బీలు టాప్ 100 ర్యాంకింగ్‌లో నిలిచాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ‘స్వచ్ఛ రాష్ట్ర రాజధాని నగరం’గా నిలవగా, 10–40 లక్షల జనాభా కేటగిరీలో విశాఖపట్నం ‘క్లీన్ బిగ్ సిటీ’గా అవార్డు పొందింది. ► సౌత్ జోన్‌లోని 50 వేలు– లక్ష జనాభా కేటగిరీలో ‘ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో పులివెందుల, 25–50 వేల జనాభా కేటగిరిలో సాలూరు అవార్డు సాధించగా, ప్రజాభిప్రాయం విభాగంలో పుంగనూరును మున్సిపాలిటీ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇదిలావుండగా, ఇండియన్ స్వచ్ఛతా లీగ్ విభాగంలో మిలియన్ ప్లస్ కేటగిరీలో విశాఖపట్నం ‘టాప్ ఇంపాక్ట్ క్రియేటర్’ అవార్డును సొంతం చేసుకోగా, ప్రత్యేక కేటగిరీలో శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్, పొదిలి యూఎల్బీలు అవార్డులను అందుకున్నాయి. చెత్త రహిత నగరాల్లో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లు ‘ఫైవ్ స్టార్’ రేటింగ్ సాధించాయి. సీఎం విప్లవాత్మక నిర్ణయాల వల్లే అవార్డులు గత మూడేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయనడానికి ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడమే నిదర్శనమని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలో ఈ అవార్డులను అధికారులతో కలిసి అందుకున్న అనంతరం ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలోని 123 స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 పోటీలో పాల్గొన్నాయి. ఇందులో ఏపీ మునుపెన్నడూ లేని విధంగా అవార్డులను గెలుచుకోవడం ఒక రికార్డు. గతంలో చంద్రబాబు సీఎంగా తన సొంత నియోజకవర్గం కుప్పంను అభివృద్ధి చేసుకోలేకపోవడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. అదే సమయంలో పులివెందుల దేశ స్థాయిలో అవార్డును కైవసం చేసుకోవడం గమనార్హం’ అన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. అన్ని నగరాల అభివృద్ధికి పెద్దపీట ► చెత్త సేకరణ కోసం సుమారు 3 వేల వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. 1.25 కోట్ల చెత్తబుట్టలను ఇంటింటికి పంపిణీ చేశాం. పారిశుధ్య కార్మికుల వేతనాలను గణనీయంగా పెంచాం. అధికారులు, కార్మికుల సమిష్టి కృషి.. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల పనితీరు.. వీటన్నింటి వల్ల ఇన్ని అవార్డులు వచ్చాయి. ► పరిపాలనలో వికేంద్రీకరణ, అభివృద్ధి అనే ఒక ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న కారణంగా కేవలం విజయవాడ మాత్రమే కాకుండా ఇన్ని నగరాలు అభివృద్ధి చెందుతూ దేశ స్థాయిలో పోటీపడే స్థాయికి చేరుకున్నాయి. ► రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ హౌజింగ్, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లకు ఇప్పటికే శ్రీకారం చుట్టాం. అన్ని మున్సిపాలిటీల్లో దశల వారీగా ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గిస్తాం. ఆధ్యాత్మిక నగరానికి అరుదైన గౌరవం తిరుపతి తుడా: ఆధ్యాత్మిక నగరం తిరుపతికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక స్వచ్ఛ సిటీ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలిలు అవార్డు అందుకున్నారు. ఇంటింటా చెత్త సేకరణ, చెత్త తరలింపు, సెగ్రిగేషన్, ప్రాసెసింగ్ వంటి అంశాల్లో తిరుపతి నగరం మేటిగా నిలిచింది. బహిరంగ మరుగుదొడ్ల నిర్వహణ, సుందరీకరణ వంటి అంశాల్లోనూ సత్తా చాటింది. వ్యర్థపు నీటిని శుద్ధి చేయడం, వాటి ద్వారా ఆదాయం పొందడం, రైతులకు ఉచితంగా సరఫరా చేయడం వంటి అంశాల్లోనూ ఆదర్శంగా నిలవడంతో ఈ ఘనత దక్కింది. తొలిసారిగా 5 స్టార్ రేటింగ్‌కు పోటీపడిన తిరుపతి అన్ని అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచి.. ఆ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. గత కమిషనర్ పీఎస్ గిరీష, ఎమ్మెల్యే భూమనలు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలు నేడు సత్ఫలితాలను ఇచ్చాయి. -
తెలంగాణకు 16 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమాల్లో మంచి పురోగతి చూపిన నగరాలకు కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్–2022 అవార్డులను అందజేసింది. శనివారం ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 160కిపైగా అవార్డులను ఇచ్చారు. అందులో తెలంగాణకు 16 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయి. సౌత్‌జోన్ విభాగంలో తెలంగాణ 15 అవార్డులను కైవసం చేసుకోగా.. 100కుపైగా మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో 2990 స్కోర్‌తో 4వ ర్యాంకు సాధించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, రాష్ట్ర అధికారులు అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు కూడా పాల్గొన్నారు. ఏ నగరానికి ఏ ర్యాంకు? దేశంలో లక్షకుపైగా జనాభా ఉన్న టాప్–100 పట్టణ స్థానిక సంస్థల్లో గ్రేటర్ హైదరాబాద్ 26వ ర్యాంకు, సిద్దిపేట 30వ ర్యాంకు, వరంగల్ 84వ ర్యాంకు, కరీంనగర్ 89వ ర్యాంకు సాధించాయి. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న టాప్–100 పట్టణాల్లో బడంగ్పేట్ 86వ ర్యాంకు పొందింది. ఇక దేశంలోని కంటోన్మెంట్ బోర్డులకు ఇచ్చిన ర్యాంకుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ 4వ ర్యాంకు సాధించడంతోపాటు పౌరుల అభిప్రాయాలు తీసుకొనే ఉత్తమ కంటోన్మెంట్ బోర్డుగా నిలిచింది. సౌత్‌జోన్ పరిధిలో రాష్ట్రానికి స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు ఇవీ.. 50వేలు– లక్ష జనాభా ఉన్న పట్టణాల కేటగిరీ 1) పరిశుభ్రమైన నగరం: బడంగ్పేట్ 2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: కోరుట్ల 3) స్వయం సమృద్ధి నగరం: సిరిసిల్ల 25వేలు–50వేల మధ్య జనాభా కేటగిరీ 1) పరిశుభ్రమైన నగరం: గజ్వేల్ 2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: తుర్కయాంజాల్ 3) పౌరుల అభిప్రాయాలు తీసుకున్న నగరం: వేములవాడ 15వేలు–25 వేల మధ్య జనాభా కేటగిరీ 1) పరిశుభ్రమైన నగరం: ఘట్కేసర్ 2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: కొంపల్లి 3) పౌరుల అభిప్రాయాలు తీసుకున్న నగరం: హుస్నాబాద్ 4) స్వయం సమృద్ధి నగరం: ఆదిభట్ల 15 వేలలోపు జనాభా కేటగిరీ 1) పరిశుభ్రమైన నగరం: కొత్తపల్లి 2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: చండూరు 3) పౌరుల అభిప్రాయాలు తీసుకున్న నగరం: నేరడుచెర్ల 4) ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులు అవలంబిస్తున్న నగరం: చిట్యాల 5) స్వయం సమృద్ధి నగరం: భూత్పూర్ -
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022: వరుసగా ఆరోసారి తొలిస్థానంలో ‘ఇండోర్’
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా ఆరో ఏడాది తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గుజరాత్‌లోని సూరత్ నగరం తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్రలోని నావి ముంబై మూడో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నాలుగో స్థానంలో ఉంది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్- 2022’లో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు నిలిచాయి. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్, సూరత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. నావి ముంబై, విజయవాడలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు.. 100లోపు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపురకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లోని మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.. ► ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ► లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్‌గాని నగరం తొలి స్థానం సాధించింది. ఆ తర్వాత పటాన్(ఛత్తీస్‌గఢ్), కర్హాద్(మహారాష్ట్ర)లు ఉన్నాయి. ► లక్షకుపైగా జనాభా కలిగిన గంగా పరివాహక నగరాల్లో హరిద్వార్ తొలిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, రిషికేశ్‌లు ఉన్నాయి. లక్షలోపు జనాభా కలిగిన నగరాల్లో బిజ్నోర్కు ఫస్ట్ ర్యాంక్, ఆ తర్వాత కన్నౌజ్, గర్‌ముఖ్తేశ్వర్ నగరాలు నిలిచాయి. ► మహారాష్ట్రలోని డియోలాలి దేశంలోనే స్వచ్ఛమైన కంటోన్మెంట్ బోర్డుగా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా 2016లో 73 నగరాలను పరిగణనలోకి తీసుకోగా.. ఈ ఏడాది ఏకంగా 4,354 నగరాలను పరిశీలించి అవార్డులు ప్రకటించారు. ఇదీ చదవండి: ‘పోక్సో’ కేసులో సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష -
సత్తాచాటిన ఏపీ.. వరుసగా రెండో ఏడాది జాతీయ అవార్డు
సాక్షి, ఢిల్లీ: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటుకుంది. వరుసగా రెండో ఏడాది కూడా స్వచ్చ సర్వేక్షన్లో జాతీయ అవార్డులు అందుకుంది. కాగా, స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్‌కు జాతీయ అవార్డు లభించింది. అలాగే, విశాఖ, విజయవాడ, పుంగనూరు, పులివెందులకు కూడా స్వచ్చ సర్వేక్షన్ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సురేష్‌తో పాటుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పాల్గొన్నారు. -
ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మరోసారి ఏపీ సత్తా చాటింది. తిరుపతి కార్పొరేషన్ జాతీయ అవార్డు దక్కించుకుంది. పులివెందుల మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు లభించింది. విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లు, పుంగనురు, సాలూరు అవార్డులు దక్కించుకున్నాయి. గత ఏడాదిలానే ఈ ఏడాది ఏపీకి ఆరు అవార్డులు దక్కాయి. అక్టోబర్ 2న అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ తెలిపారు. చదవండి: అందుకే హెల్త్ యూనివర్శిటికీ వైఎస్సార్ పేరు.. వాస్తవాలివిగో.. -
జాతీయ స్థాయిలో మెరిసిన తిరుపతి
తిరుపతి తుడా (చిత్తూరు జిల్లా): స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి నగరం మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది. న్యూఢిల్లీలో ఆదివారం వాటర్‌ప్లస్ సర్టిఫికేషన్ పొందిన నగరాల జాబితాను ప్రకటించారు. ఈ పోటీల్లో తిరుపతి నగరం వాటర్ ప్లస్ విభాగంలో జాతీయ స్థాయిలో నాల్గో నగరంగా నిలిచింది. ఇండోర్, సూరత్, నార్త్ ఢిల్లీ నగరాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే సౌత్ ఇండియా నుంచి ఎంపికైన ఏకైక నగరంగా తిరుపతి గుర్తింపు పొందింది. రేణిగుంట సమీపంలోని తూకివాకం గ్రీన్ సిటీలో ఎస్టీపీ ప్లాంట్‌ను కార్పొరేషన్ నిర్వహిస్తోంది. పలు విధాలుగా నీటిని శుద్ధిచేసి ఆపై వినియోగంలోకి తీసుకొస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఓడీఎఫ్ ప్లస్, ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ విభాగంలో ప్రతిభ చాటి తిరుపతి నగరం ఇప్పటికే త్రీ స్టార్ రేటింగ్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఫైవ్ స్టార్ రేటింగ్‌లో పోటీ పడాలంటే తప్పనిసరి వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. వచ్చే పోటీల్లో ఫైవ్ స్టార్ రేటింగ్‌కు పోటీపడేందుకు తిరుపతి నగరం సిద్ధంగా ఉందని కమిషనర్ పీఎస్ గిరీష సంతోషం వ్యక్తం చేశారు. -
‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో దూసుకెళ్తున్న విశాఖ
సాక్షి, విశాఖపట్నం: విశ్వ నగరి విశాఖను స్వచ్ఛత విషయంలోనూ అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజలు భుజానికెత్తుకున్నారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ ప్రారంభమైనప్పటి నుంచి టాప్–3లో కొనసాగుతున్న విశాఖ నగరం.. చివరి రోజు ముగిసేసరికి పర్సంటేజ్ పరంగా మూడో స్థానంలో, ఫీడ్ బ్యాక్ అందించిన ప్రజల సంఖ్య పరంగా చూస్తే అగ్రస్థానంలో నిలిచింది. తొలి రోజు నుంచీ అదే జోరు.. దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు నగరాలను ఎంపిక చేస్తోంది. గతేడాది టాప్–9లో చోటు దక్కించుకున్న విశాఖ.. ఈ ఏడాది టాప్–5లో ఉండాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జీవీఎంసీ అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. దీంతో సిటిజన్ ఫీడ్ బ్యాక్ ప్రారంభమైన జనవరి 1 నుంచి చివరి రోజైన మార్చి 31వ తేదీ వరకు ప్రజలు విశేషంగా స్పందించారు. 31 శాతం మంది ప్రజలు స్పందించడంతో 100 నగరాల్లో విశాఖ మూడో స్థానంలో నిలిచింది. దేశంలో అన్ని నగరాలలో కంటే విశాఖ ప్రజలే అత్యధిక సంఖ్యలో స్పందించడం విశేషం. ఇక, టాప్ 10లో ఏపీ నుంచి విశాఖ తప్ప ఏ నగరం కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఫీడ్ బ్యాక్ విషయంలో సహకారం అందించిన నగర ప్రజలకు జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, అదనపు కమిషనర్, స్వచ్ఛ సర్వేక్షణ్ నోడల్ అధికారి డాక్టర్ వి.సన్యాసిరావు కృతజ్ఞతలు తెలిపారు. -
‘స్వచ్ఛ’ నగరాల ఏపీ
సాక్షి, అమరావతి/ సాక్షి విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: పారిశుధ్యం, పరిశుభ్రత నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్’ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డుల మోత మోగించింది. పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో ఆరో స్థానం (2018–19లో ర్యాంక్ 20) సాధించి సత్తా చాటింది. రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాలు కూడా జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు దక్కించుకున్నాయి. 2019–20కి కేంద్రం గురువారం ప్రకటించిన ర్యాంకుల్లో 10 లక్షల కంటే మించిన జనాభా ఉన్న నగరాల కేటగిరీలో విజయవాడ నాలుగో ర్యాంకు సాధించగా.. విశాఖపట్నానికి తొమ్మిదో ర్యాంకు దక్కింది. 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో తిరుపతికి ఆరో ర్యాంకు లభించింది. టీడీపీ ప్రభుత్వ హయాం (2018–19)లో టాప్– 20లో కూడా చోటు దక్కించుకోలేని నగరాలు ఈసారి టాప్–10లోకి దూసుకెళ్లాయి. కాగా, జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు దక్కింది. హైదరాబాద్ 23వ ర్యాంక్ సాధించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణపై చూపిన ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రం ర్యాంకుల్లో పైకి ఎగబాకింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఇందుకు ఎంతో ఉపకరించింది. దీంతో విజయవాడ గతేడాది కంటే 8 స్థానాలు, విశాఖపట్నం 14 స్థానాలు, తిరుపతి రెండు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్–10లో చోటు సాధించాయి. 4,242 నగరాలు/పట్టణాల పరిధిలో.. ►4,242 నగరాలు/పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల పరిధిలో కేంద్రం సర్వే నిర్వహించింది. ►డిజిటల్ విధానంలో 28 రోజులపాటు నిర్వహించిన సర్వేలో భాగంగా 24 లక్షలకుపైగా ఫొటోలను జియోట్యాగింగ్ చేశారు. ►దాదాపు 2 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలు సేకరించారు. వివిధ కేటగిరీల్లో టాప్ ర్యాంకులు మనవే.. ►100కుపైగా పట్టణ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో ర్యాంక్ సాధించింది. ►10 లక్షల లోపు జనాభా కేటగిరీలో టాప్–100 ర్యాంకుల్లో రాజమహేంద్రవరం 51, ఒంగోలు 57, కాకినాడ 58, తెనాలి 75, కడప 76, చిత్తూరు 81, హిందూపూర్ 93, తాడిపత్రి 99 ర్యాంకులు దక్కించుకున్నాయి. ►10 లక్షల నుంచి 40 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో అతిపెద్ద శుభ్రమైన నగరంగా విజయవాడ ూ లక్ష నుంచి 3 లక్షలు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఉత్తమ స్థిరమైన (సస్టైన్‌బుల్) చిన్ననగరంగా తిరుపతి ►50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో ఉత్తమ స్థిరమైన చిన్ననగరంగా చీరాల ూ 25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న కేటగిరీలో ఉత్తమ స్థిరమైన చిన్ననగరంగా ఆత్మకూరు ూ సౌత్ జోన్లో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగినవాటిలో పరిశుభ్రమైన నగరంగా పలమనేరు ూ 25 వేలు లోపు జనాభా కలిగిన వాటిలో అతిచిన్న ఫాస్ట్ మూవింగ్ సిటీగా ముమ్మడివరం సౌత్ జోన్‌లోనూ ఏపీదే అగ్రస్థానం ►50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన నగరాల కేటగిరీలో సౌత్ జోన్లో టాప్–100 ర్యాంకుల్లో ఏకంగా 40 ర్యాంకులు రాష్ట్రానికి దక్కాయి. 1 నుంచి 8 ర్యాంకులు పలమనేరు, చీరాల, పుంగనూరు, కందుకూరు, మండపేట, పులివెందుల, నర్సాపూర్, తణుకు సాధించాయి. ►25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో టాప్–10లో పుట్టపర్తి 2, జమ్మలమడుగు 5, నిడదవోలు 6, రామచంద్రాపురం 7వ ర్యాంకులు సాధించాయి. ఈ కేటగిరీలో టాప్–100 ర్యాంకుల్లో మన రాష్ట్రానికి 32 ర్యాంకులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతి అభినందనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్–2020 ర్యాంకుల్లో విజయవాడ, విశాఖపట్నం నగరాలు మెరుగైన స్థానాలు దక్కించుకున్నందుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ‘పది లక్షలకు పైగా ఉన్న జనాభా కేటగిరీలో నాలుగో స్థానంలో విజయవాడ, 9వ స్థానంలో విశాఖపట్నం నిలవడం ఆనందదాయకం. ఏపీ ప్రభుత్వంతోపాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి అభినందనలు’ అని ఆయన గురువారం ట్వీట్ చేశారు. సీఎం వైఎస్ జగన్ అభినందనలు స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినవారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. విజయవాడ, తిరుపతి, విశాఖ నగరాల్లోని కుటుంబాలు, పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ అధికారులు, ఇతర భాగస్వాములను ఆయన ప్రశంసించారు. -
వైజాగ్‌కు 9వ ర్యాంకు రావడమే దీనికి నిదర్శనం
సాక్షి, ఢిల్లీ : విశాఖపట్నం అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోందని, స్వచ్ఛ సర్వేక్షన్ లో వైజాగ్ కు 9వ ర్యాంకు రావడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గతంలో 23వ స్థానంలో ఉన్న విశాఖపట్నం సీఎం జగన్ నాయకత్వంలో 9వ ర్యాంక్‌కి చేరుకుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో విశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్న జీవీఎంసీ కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. Vizag is witnessing REAL PROGRESS on all metrics. The testimony for it is the fact that Vizag has JUMPED UP PHENOMENALLY and ended up with 9th RANK as against 23rd rank min the Swatch Survekshan 2020. Kudos to GVMC under the able leadership of Hon. CM YS Jagan garu. — Vijayasai Reddy V (@VSReddy_MP) August 20, 2020 -
బెస్ట్ క్లీన్ సిటీగా విజయవాడ
సాక్షి, విజయవాడ : స్వచ్ఛ సర్వేక్షణ్-2020లో విజయవాడ నగరానికి నాలుగో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని నగర మున్సిపల్ కమిషర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకంతో పాటు, విజయవాడ ప్రజల సహకారం వల్లే 4వ ర్యాంక్ సాధించగలిగామని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా శానిటైజేషన్‌లో చేసిన మార్పులే ఈ అవార్డు రావడానికి కారణమయ్యాయని చెప్పారు. కరోనా ఉన్నప్పటికీ తమ సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చామన్నారు. ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి చేపట్టిన పద్దతులు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో నగరంలో అందమైన పార్కులు తయారు చేయబోతున్నామని తెలిపారు. అలాగే విజయవాడను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని బహిరంగ ప్రదేశాల్లో చెత్తబుట్టలు ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే ఏడాది ర్యాంకుల్లో విజయవాడ నగరాన్ని మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తామని ప్రసన్నవెంకటేష్ పేర్కొన్నారు. (చదవండి : స్వచ్ఛ సర్వేక్షణ్: నాలుగో స్థానంలో విజయవాడ) కాగా, స్వచ్ఛ సర్వేక్షణ్-2020 జాబితాను కేంద్రం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ జాబితాలో మరోసారి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ముంబై నిలిచాయి. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. -
దేశంలోనే తొలి స్థానంలో ఇండోర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్-2020’ అవార్డులు ప్రకటించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా వరుసగా నాలుగో సారి ఇండోర్ తొలి స్థానాన్నే కైవసం చేసుకోవడం విశేషం. రెండో స్థానంలో సూరత్(గుజరాత్), మూడో స్థానంలో ముంబై(మహారాష్ట్ర) నిలిచాయి. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. గురువారం 'స్వచ్ఛ మహోత్సవ్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా జలందర్ కాంత్ దేశంలోనే అత్యంత పరిశుభ్రత కల కంటోన్మెంట్‌గా ప్రకటించారు. పరిశుభ్రత గల పట్టణంగా వారణాసి చోటు దక్కించుకుంది. 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డు, 92 గంగా సమీపంలోని పట్టణాల నుంచి మొత్తం 1.87 కోట్ల మంది ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే 28 రోజుల పాటు చేపట్టగా అనంతరం ర్యాంకులు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ఇండోర్ మళ్లీ తన ఆధిక్యతను ప్రదర్శించడంపై ఆ ప్రాంత ఎంపీ శివరాజ్ చౌహాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి ప్రజలు తమ నగర శుభ్రత పట్ల చూపిన అంకిత భావాన్ని కొనియాడారు. (రూల్స్ బ్రేక్: నడిరోడ్డుపై పెళ్లికొడుక్కి...) ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులు దేశంలో పరిశుభ్ర రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకోగా తెలంగాణ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది. దేశంలోనే పరిశుభ్రత గల నగరంగా విజయవాడ నాలుగో స్థానం దక్కించుకుంది. తిరుపతి ఆరో ర్యాంకు, విశాఖపట్నం తొమ్మిదో ర్యాంకు సాధించింది. బెస్ట్ మెగా సిటీ కేటగిరీలో రాజమండ్రి చోటు సంపాదించుకుంది. దీనితో పాటు ఒంగోలు, కాకినాడ, కడప, తెనాలి, చిత్తూరు, హిందూపురం, తాడిపత్రి కూడా స్థానం దక్కించుకున్నాయి -
దూసుకుపోతున్న విశాఖ నగరం
విశ్వ నగరి విశాఖ స్వచ్ఛత విషయంలోనూ అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజలు భుజానికెత్తుకున్నారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్ విషయంలో ఇన్నాళ్లూ వెనుకబడిన విశాఖ నగరం ఇప్పుడు ప్రజా చైతన్యంతో ఏకంగా మొదటి స్థానానికి చేరుకుంది. ఈ నెల 31 వరకూ ప్రజలు ఇదే రీతిలో స్పందించి ఈ స్థానాన్ని నిలబెడితే టాప్–10లో నిలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకూ వచ్చిన ప్రాతిపదికల ఆధారంగా చూస్తే రాష్ట్రంలో నంబర్ వన్‌గా విశాఖ నగరం ఉంది. అదే దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఏడో స్థానంలో నిలిచింది. మొత్తంగా వైజాగ్ స్వచ్ఛ సర్వేక్షణ్–2020లో అప్రతిహతంగా దూసుకుపోవాలంటే ప్రజలు ఇదే తరహాలో ప్రోత్సహించాలి. సాక్షి, విశాఖపట్నం: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఢిల్లీ బృందం చేపట్టే కీలకమైన ప్రత్యక్ష పరిశీలన ఈ నెల 31లోగా జరుగుతుంది. విశాఖ నగరానికి ఈ నెల 10లోపు వచ్చే అవకాశం ఉందని జీవీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ బృందం అడిగే ఎనిమిది కీలక ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తే మహా నగరం మంచి ర్యాంకుని సాధిస్తుంది. ఆ ప్రశ్నలివీ.. 1. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మీ సిటీ పాల్గొంటుందని మీకు తెలుసా..? • అవునని సమాధానం వస్తే అత్యధిక మార్కులు వస్తాయి. 2). మీ పరిసరాల పరిశుభ్రత స్థాయిపై మీ సిటీకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు.? • గరిష్టంగా 10 మార్కులు ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకుకి ఉపయోగపడుతుంది. 3). వాణిజ్య, పబ్లిక్ ప్రాంతాల్లో శుభ్రత స్థాయిపై మీ సిటీకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు.? • 10 మార్కులు వరకూ ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకు సాధించేందుకు వీలవుతుంది. 4). మీ చెత్త పట్టుకెళ్లేవారు తడి పొడి చెత్త వేరుగా ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నారా.? • అవును.. ప్రతి రోజూ అడుగుతున్నారు అని చెబితే ఉపయుక్తంగా ఉంటుంది. 5). మీ సిటీలోని రోడ్డు డివైడర్స్ పచ్చదనం పెంపొందించేలా మొక్కలతో కవర్ చేశారా.? • అవును, అన్ని రోడ్లు డివైడర్లు గ్రీనరీతో నిండాయి అని చెబితే ర్యాంకుకి ఉపయోగపడుతుంది. 6). మీ సిటీలోని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్స్ పరిశుభ్రతకు ఎన్ని మార్కులు ఇస్తారు.? • 10 మార్కులు వరకూ ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకు సాధించేందుకు వీలవుతుంది. 7). మీ సిటీ ఓడీఎఫ్(బహిరంగ మల విసర్జన రహిత) స్థితి మీకు తెలుసా.? • ఇటీవలే జీవీఎంసీ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ నగరంగా ధ్రువీకరించబడింది. కాబట్టి.. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ నగరంగా చెబితే చాలు. 8). మీ సిటీ గార్బేజ్ ఫ్రీ సిటీ స్టార్ రేటింగ్ స్థితి మీకు తెలుసా.? •జీవీఎంసీ 5 స్టార్ రేటింగ్ నగరంగా గుర్తింపు పొందేందుకు దరఖాస్తు చేసుకుంది. ►ఇప్పటివరకు స్వచ్ఛతలో రాష్ట్ర స్థాయి ర్యాంకు– 1 ►ఇప్పటివరకు స్వచ్ఛతలో దేశ స్థాయిలో ర్యాంకు– 7 ►ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ నగరంగా ధ్రువపత్రం సాధించిన జీవీఎంసీ ►గార్బేజ్ ఫ్రీ సిటీగా 5 స్టార్ రేటింగ్‌కు దరఖాస్తు ప్రజలే వారధులు.. స్వచ్ఛతలో నగరాన్ని అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టేందుకు జీవీఎంసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. కీలకమైన ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తే.. వైజాగ్ మంచి ర్యాంకు సాధించగలదు. కమిషనర్ సూచనలతో నగర వ్యాప్తంగా 8 ప్రశ్నలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రజల సహకారం ఈ నెల 31 వరకూ అందిస్తే.. టాప్–10లోకి దూసుకుపోతాం. – విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ -
నీరసిస్తున్న ‘స్వచ్ఛ’ దీక్ష
సాక్షి, విశాఖపట్నం : దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. మొదటి మూడేళ్లలో 5, 3, 7 స్థానాల్లో నిలిచిన విశాఖ గతేడాది మాత్రం దారుణంగా చతికిలపడుతూ ఏకంగా 23వ స్థానానికి పరిమితమైపోయింది. దీనికి కారణం ప్రజలు దీనిపై స్పందించకపోవడం, అవగాహన రాహిత్యమనే చెప్పుకోవాలి. కారణమేదైనా మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరం మురిసి మెరవాలంటే ప్రజలే కీలక పాత్ర పోషించాలి్సన అవసరం ఉంది. కానీ ఆశించినంత స్పందన మాత్రం ప్రజల నుంచి రావడం లేదు. దీంతో ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టిన లీగ్ దశల్లో విశాఖ గతేడాదితో పోలిస్తే రెండడుగులు ముందుకు వెళ్లినా ఫైనల్లో టాప్–10లో నిలిపేందుకు ఈ పెర్ఫార్మెన్స్ సరిపోదనే చెప్పాలి. ఈ ఏడాది కాస్తా విభిన్నంగా... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గత నాలుగేళ్లలో జరిగిన పోటీల్లో ప్రజలు చూపించిన చొరవ ప్రస్తుతం కనిపించడం లేదు. ఈసారి విభిన్నంగా సర్వేక్షణ్ పోటీని విభజించారు. ఈసారి మూడు క్వార్టర్లుగా విభజించి స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్–2020గా మార్చారు. ఏప్రిల్ నుంచి జూన్, జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ ప్రతి 3 నెలల్ని ఓ భాగంగా విభజించారు. అనంతరం జనవరి 4 నుంచి 31 వరకూ వార్షిక ప్రగతిపై ఢిల్లీ బృందాలు నేరుగా ఫీడ్ బ్యాక్‌ను తీసుకోనున్నాయి. చివరిగా మార్చిలో ర్యాంకులు వెల్లడించనున్నాయి. ప్రతి లీగ్‌లోనూ 2 వేల మార్కులుంటాయి. ఆ క్వార్టర్లోని ప్రతి నెలా 5వ తేదీలోపు ఆ నెలలో స్వచ్ఛ సర్వేక్షణ్కు సంబంధించి నిర్వహించిన పనులు, ఇతరత్రా వివరాలను కచ్చితంగా పొందుపరచాలి. దీన్నే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎంఐఎస్)గా పిలుస్తారు. ఈ ఎంఐఎస్‌లో ఆ నెలలో ఎలాంటి స్వచ్ఛత పనులు చేపట్టారన్న వివరాలను వార్డుల వారీగా నమోదు చెయ్యాలి. ఇలా పొందుపరిచిన వివరాల్ని సరిచూసేందుకు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్‌ను ఆ క్వార్టర్ చివరి నెలలో తీసుకుంటారు. దీని ప్రకారం మార్కులు కేటాయిస్తుంటారు. దీనికి తోడు ప్రతి క్వార్టర్లోనూ 1300 మార్కులకు తగ్గకుండా రావడంతో పాటు యావరేజ్ ర్యాంకులో 200 మార్కులు వస్తే 5 శాతం వెయిటేజీ ఇస్తారు. మొదటి రెండు క్వార్టర్లలోని ఎంఐఎస్‌లో ఎలాంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యకపోయినా పరిగణనలోకి తీసుకుంటారు. చివరి లీగ్‌లో మాత్రం అన్నింటికీ సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యాల్సిందే. 12 అంశాలపై లీగ్ దశలో కాల్స్ రూపంలోనూ, యాప్ రూపంలోనూ సిటిజన్ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. లీగ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ డిసెంబర్ 24కల్లా వెబ్సైట్లో అప్లోడ్ చెయ్యాల్సిందే. లీగ్‌లో పర్ఫార్మెన్స్కు 25 శాతం వెయిటేజీ లభిస్తుంది. లీగ్ దశ పూర్తి కాగానే జనవరి 4 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా కీలక సర్వే జరగనుంది. మొదటి లీగ్‌లో 18 రెండో లీగ్‌లో 24 ప్రజల నుంచి వ్యాలిడేషన్ ద్వారా మార్కులు నిర్ధారించే ఈ లీగ్ దశ ఫలితాల్ని డిసెంబర్ 31న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ప్రోత్సాహం, జీవీఎంసీ ఉద్యోగులు, కార్మికులు నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు తీసుకుంటున్న చర్యల కారణంగా 10 లక్షల పైచిలుకు జనాభా ఉన్న కేటగిరిలో విశాఖ నగరం 19వ స్థానంలో నిలిచింది. గతేడాది టాప్–10 లో ఉన్న విజయవాడ మాత్రం 20వ స్థానానికి పరిమితమైంది. అయితే రెండో క్వార్టర్లో మాత్రం నగర ప్రజలు అంతగా స్పందించకపోవడంతో మార్కుల్లో వెనుకబడిన విశాఖ 24వ స్థానానికి పరిమితమైపోయింది. విజయవాడ మాత్రం రెండో లీగ్‌లో 2 స్థానాలు మెరుగుపరచుకొని 20లో నిలిచింది. మొత్తంగా లీగ్–1లో 3,971 నగరాలు పాల్గొనగా విశాఖ 267వ స్థానంలో నిలవగా విజయవాడ మాత్రం 284 స్థానానికి పరిమితమైంది. లీగ్–2లో మొత్తం 4,157 నగరాల్లో విజయవాడ 288 ర్యాంకు సాధించగా విశాఖ మాత్రం ఏకంగా 409 నగరానికి పడిపోయింది. పౌరుల స్పందనే ముఖ్యం.. కానీ.. లీగ్ దశలో 12 కేటగిరీల్లో జీవీఎంసీ చేసిన పనులకు తమ తరఫున మార్కులు వేసుకుంటారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం ఆ మార్కులకు అనుగుణంగా సిటిజన్ వ్యాలిడేషన్ని ఫోన్ కాల్స్ ద్వారా తీసుకుంటుంది. వివిధ వర్గాల ప్రజల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా జీవీఎంసీ వివరాలు అడుగుతుంది. వాటికి అనుకూల సమాధానం వస్తే వ్యాలిడేషన్‌లో ఎక్కువ మార్కులు వేస్తారు. ఫలితంగా మార్కులు పెరిగి ర్యాంకు పెరిగేది. లీగ్–1, లీగ్–2లో స్వచ్ఛభారత్ మిషన్ నుంచి వచ్చిన కాల్స్‌ని నగర ప్రజలు చాలా మంది రిసీవ్ చేసుకోకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో చాలా మార్కులను నగరం కోల్పోయింది. దీని వల్ల తొలి రెండు లీగ్స్‌లో సరైన స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది. లీగ్–3 కూడా డిసెంబర్–31తో పూర్తయ్యింది. ఈ ర్యాంకుల్ని ఈ నెలలోనే ప్రకటించనున్నారు. ఆ లీగ్‌లోనైనా మంచి స్థానం సాధిస్తే ఫైనల్ ర్యాంక్‌కు తోడ్పడుతుంది. 4 నుంచి అసలైన ‘స్వచ్ఛ’ పరీక్ష స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్), ఎంఐఎస్ డేటా నవీకరణ ద్వారా 12 సేవాస్థాయి ధ్రువీకరణ ద్వారా ఒక్కో క్వార్టర్‌కు 2 వేల మార్కులు కేటాయిస్తారు. రెండు కేటగిరీలుగా ర్యాంకులు ఇస్తారు. ఈ నెల 4 నుంచి అసలైన పరీక్ష మొదలవ్వనుంది. ►లీగ్ ర్యాంకులు స్వచ్ఛ సర్వేక్షణ్–2020 ఫలితాల్ని నిర్దేశిస్తాయి. ఇవి వార్షిక సర్వేకు 25 శాతం వెయిటేజీ ఇస్తాయి. ►జనవరి 4 నుంచి 31 వరకు జరిగే ఈ సర్వేలో పౌరులు స్వయంగా పాల్గొనవచ్చు. ►స్వచ్ఛతా హెల్ప్‌లైన్ నంబర్ 1969కి పౌరులు ఫోన్ చేసి తమ ప్రాంతంలోని పరిశుభ్రత, తదితర అంశాలపై ఫీడ్ బ్యాక్ తెలియపరచవచ్చు. లేదా స్వచ్ఛతా యాప్, స్వచ్ఛ సర్వేక్షణ్–2020 పోర్టల్ ద్వారా గానీ, ఓట్ ఫర్ యువర్ సిటీ యాప్ ద్వారా గానీ పౌరులు స్పందన తెలియజేయవచ్చు. ఉత్తమ స్థానంలో నగరాన్ని నిలబెడదాం స్వచ్ఛ సర్వేక్షణ్–2020 నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గార్బేజ్ ఫ్రీ సిటీ అమలు కోసం చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించాం. తడిపొడి చెత్త విభజన, సేకరణ, రవాణాకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. చెత్త ప్రోసెసింగ్ దినచర్యగా మారుతోంది. ఇప్పటివరకు ఉన్న 7 తడి చెత్త, 5 పొడిచెత్త ప్రోసెసింగ్ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో వినియోగిస్తున్నాం. ఓఎఫ్‌డీ ప్లస్ ప్లస్ నగరంగా కొనసాగేందుకు జీవీఎంసీ పరిధిలో ఉన్న 328 కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ప్రజలంతా చెత్తను వేరు చేసి ఇస్తూ సిబ్బందికి సహకరించాలి. 2020 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖను మళ్లీ టాప్‌లో నిలబెట్టేందుకు అందరం కలిసి పనిచేద్దాం. ఈ నెల 4 నుంచి వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ బృందానికి ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 తిరుపతిలో 5కె రన్
-
స్వచ్ఛత సాగేదిలా..
తిరుపతి తుడా: స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ పోటీల్లో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ఖ్యాతిని మరింత ఇనుమడింపచేసేందుకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది. నగరంలో ఉత్పత్తయ్యే 197 మెట్రిక్ టన్నుల చెత్తను జీరో స్టోరేజ్‌గా అమలుచేస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛత కోసం చేస్తున్న ప్రయోగాలు, మార్పులపై కమిషనర్ గిరీషా అధికారులతో కలిసి మంగళవారం మీడియా ప్రతినిధులతో కలిసి స్వచ్ఛ యాత్రను చేపట్టారు. ఆయనతో పాటు సూపరింటెండెంట్ ఇంజినీర్ ఉదయ్‌కుమార్, డి ప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వరరెడ్డి, మున్సి పల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, డీఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి స్వచ్ఛత, సాలిడ్ వేస్టు నిర్వహణపై అందించిన వివరాలు ఇవి.. ♦ చెత్త రోడ్డుపైకి రాకముందే ఇంటి వద్దే సేకరించేందుకు పూర్తిస్థాయిలో కార్మికులను నియమించుకుని 100 శాతం సేకరిస్తున్నారు. 60 శాతం ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేరుచేసి సేకరిస్తున్నారు. ఇందుకోసం 905 మంది కార్మికులు, 371 పుష్కాట్లు, 25 ఆటోలు, 20 కాంప్యాక్టర్లు, 15 ట్రాక్టర్లు, 2 జేసీబీలు, 6 చిన్న జేసీబీలు ఉపయోగిస్తున్నారు. ♦ నగరంలో ఉత్పత్తయ్యే 197 మెట్రిక్ టన్నుల చెత్తలో 120 టన్నుల తడి చెత్త ఉంది. 52 టన్నుల పొడి చెత్త, 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాల తరలింపునకు 3 ట్రాన్స్ఫర్ స్టేషన్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కోమల్‌రెడ్డి కూడలి వద్ద ఒక స్టేషన్‌ను రూ.8 కోట్ల ఖర్చుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ♦ నగరంలో రోజుకు ఉత్పత్తయ్యే 120 టన్నుల తడి చెత్తలో 50 టన్నుల చెత్తను బయోగ్యాస్‌కు ఉపయోగిస్తున్నారు. 1,500 వందల కేజీల గ్యాస్ ఉత్పత్తులను ఇక్కడ నిర్వహిస్తూ దేశంలోనే అతిపెద్ద బయోగ్యాస్ ప్లాంట్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇక్కడ ఉత్పత్తయ్యే ఈ గ్యాస్‌ను నగరంలోని 10 హోటళ్లకు సరఫరా చేసి మిగిలిన దాన్ని చెన్నై, బెంగళూరు హోటళ్లకు తరలిస్తున్నారు. ♦ నిత్యం ఉత్పత్తయ్యే 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పునర్వినియోగంలోకి తీసుకొచ్చేందుకు సీ అండ్ డీ (కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిష్) ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ♦ తూకివాకంలోని గ్రీన్ సిటీలో విన్డ్రో కంపోస్టు ద్వారా రోజుకు 60 టన్నుల చెత్తను విన్డ్రో, బాక్స్ కంపోస్టు ద్వారా ఎరువు తయారు చేస్తున్నారు. ఈ ఎరువులను పార్కులు, మొక్కల పెంపకానికి ఉపయోగస్తున్నారు. బయో మైనింగ్ 35 ఏళ్ల నాటి నుంచి రామాపురం సమపంలోని డంపింగ్ యార్డులో సుమారు 5 లక్షల టన్నుల చెత్త నిల్వ ఉంది. ఈ చెత్తను 100 శాతం సెగ్రిగేషన్, రీసైక్లింగ్ చేపట్టడం ద్వారా జీరో స్థాయి నిల్వ లక్ష్యంగా బయో మైనింగ్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. రోజుకు 600 టన్నుల చెత్తను సెగ్రిగేషన్ (వేరుచేయడం), రీసైక్లింగ్(తిరిగి వినియోగంలోకి) చేస్తున్నారు. తద్వారా ఆరు నెలల్లో డంపింగ్ యార్డుల్లోని చెత్తను కనుమరుగు చేసే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ఇక్కడ వెలికి తీసుకున్న ఇనుము, ప్లాస్టిక్, రాయి, టైర్లను రీసైక్లింగ్ ద్వారా విక్రయిస్తున్నారు. ఏళ్ల నాటి చెత్త కావడంతో ఇప్పటి వరకు 10 వేల టన్నుల ఎరువును విక్రయానికి సిద్ధంగా ఉంచారు. మిగులు చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో.. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ తిరుపతి కిరీటాన్ని దక్కించుకుంటాం. నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను 100 శాతం సెగ్రిగేషన్, రీసైక్లింగ్ చేస్తున్నాం. తిరుపతి కార్పొరేషన్ అమలు చేస్తున్న కొత్త ప్రయోగాలతో వచ్చే ఏడాది కల్లా దేశంలో మరేనగరం పోటీ పడనంతగా ఉండబోతోంది. ఇంటింటా చెత్త సేకరణ ఇకపై వాహనాల ద్వారానే చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. డిసెంబర్ చివరి నుంచి జనవరి నెలాఖరు వరకు స్వచ్ఛ పోటీలకు అత్యంత కఠినమైన రోజులు, ఈ నేపథ్యంలో ప్రజలు మరింతగా సహకరించాల్సి ఉంది. – పీఎస్ గిరీష, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ -
తెలంగాణకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ : మెరుగైన పారిశుద్ధ్య విధానాల అమలు, ఫలితాల సాధనకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రానికి 2019 ఏడాదికిగానూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు దక్కింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సదానందగౌడ చేతుల మీదుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచుల చొరవతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. -
‘గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం’
సాక్షి, న్యూ ఢిల్లీ: దేశంలో ఎన్నో కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పెద్దపల్లి జిల్లాకు స్వచ్ఛతలో దేశంలోనే మొదటి స్థానం రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పెద్దపల్లికి స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ అవార్డు రావడం ఇది మూడోసారి. గతంలో గ్రామపంచాయతీలకు నిధులు లేవు. ఇప్పుడు ప్రతినెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నాం. పంచాయతీ కార్మికుల జీతాలు పెంచినం. తెలంగాణ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో చేపట్టిన 30 రోజుల ప్రణాళికపై కేంద్రమంత్రి మెచ్చుకున్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఈజేఎస్ కింద 1200 కోట్ల నిధులు రావాల్సి ఉంటే కేవలం 320 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన 600 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకువచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు కృషి చేయాలి’ అని ఆయన కోరారు. -
స్వచ్ఛ న్యాయనిర్ణేతలు మీరే..!
సాక్షి, చిలకలూరిపేట: మీ గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి ఎలా ఉంది?.. మీ పట్టణంలో స్వచ్ఛతకు ఏ ర్యాంకు ఇవ్వవచ్చు?.. మీ ప్రాంతంలో స్వచ్ఛత విషయంలో అధికారుల పనితీరు ఎలా ఉంది?.. ఇలాంటి అంశాలపై ఇక ప్రజలే న్యాయనిర్ణేతలు. వారి అభిప్రాయం మేరకే ర్యాంకు నిర్ధారిస్తారు. ఇందు కోసం ఓ యాప్ రూపొందించి, దానిద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ యాప్‌ద్వారా నిర్భయంగా మన అభిప్రాయాలు వెల్లడించి పారిశుధ్ధ్యాన్ని మెరుగు చేసుకొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్‌పై అవగాహన పెంచుకోవటం ద్వారా స్వచ్ఛతలో మనమూ భాగస్వాములు కావచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ నినాదంతో పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. పల్లెల్లో పారిశుధ్ధ్య సమస్యలను ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళుతుంటారు. కాని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి న స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ్ – 2019 సర్వే యాప్ ద్వారా నేరుగా పల్లె, పట్టణ ప్రజలే తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛర్యాంకుల్లో మన జిల్లాస్థానాన్ని నిర్ధారించేందుకు జిల్లా ప్రజలే తమ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్‌ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. సెప్టెంబర్ 25 తేదీవరకు యాప్ ద్వారా అభిప్రాయం తెలిపే అవకాశం ఉంది. నాలుగు విధాలుగా సర్వే.. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కింద ప్రధానంగా నాలుగు విధాలుగా సర్వే చేయనున్నారు. అభిప్రాయాలను ర్యాంకుల ప్రాతిపదికగా తీసుకుంటారు. ప్రజా సంబంధిత ప్రదేశాల్లో ప్రత్యేక్ష పరిశీలనకు 25శాతం, పారిశుద్ధ్య ప్రమాణాలకు అనుగుణంగా పురోగతి ఉంటే 25 శాతం, యాప్ ద్వారా ఆన్లైన్లో ప్రజాభిప్రాయ సేకరరణతో పాటు గ్రామాల్లో ప్రజలు నేరుగా ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌కు 25శాతం, అధికారులు సమర్పించే ధ్రువీకరణకు, మరుగుదొడ్ల వినియోగంపై కలిపి 25శాతం మార్కులు కేటాయించారు. ఆయా అంశాల్లో ప్రజా స్పందన ఎక్కువగా ఉంటే జిల్లాకు మెరుగైన ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ.. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత తెలుసుకొనేందుకు ప్రజల నుంచి అభిప్రాయాలను ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి. ప్రజలు చెప్పిన అభిప్రాయాలతో దేశవ్యాప్తంగా జిల్లాలకు ర్యాంకులు ఇస్తారు. ప్రధానంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల సద్వినియోగం, కాల్వల శుభ్రత, తాగునీటి ట్యాంకుల క్లోరినేషన్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. జిల్లా యంత్రాంగం ఇచ్చే నివేదికలతో పాటు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలు, వారపు సంతలు, పంచాయతీ కార్యాలయాలు ఉన్న చోట, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. స్వచ్ఛత పురోగతిపై ఆరా తీస్తారు. దేశవ్యాప్తంగా 698 జిల్లాల్లో 17,475 గ్రామాల పరిధిలోని ఎంపిక చేసిన 87,375 పబ్లిక్ ప్రదేశాలలో ఈ సర్వేను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో 379 గ్రామాలు ఎంపిక చేశారు. యాప్‌లో ఇలా... ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉన్న ఫోన్లో ఒక నంబర్‌తో ఒక సారి మాత్రమే స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ్ – 2019 సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ముందుగా సెల్ఫోన్లో ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాలేషన్ తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దానికి ఓకే బటన్ నొక్కాలి. తరువాత ఎస్ఎస్జీ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రాష్ట్రం, జిల్లా, లాంగ్వేజ్, కాలమ్స్ వివరాలను పూర్తి చేశాక రెండు పేజీల్లో నాలుగు ప్రశ్నలు, నాలుగు ఆప్షన్లతో కనిపిస్తాయి. 1. మీరు స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ్ గురించి విన్నారా..? 2. స్వచ్ఛభారత్ అమలుతో మీ గ్రామంలో సాధారణంగా పరిశుభ్రత ఎంత వరకు మెరుగుపడింది? 3. ఘనవ్యర్ధాలను సురక్షితంగా పారవేయటానికి ఏర్పాట్లు ఉన్నాయా..? 4. ద్రవ వ్యర్ధాల కోసం గ్రామస్థాయిలో ఏర్పాట్లు జరగాయా? అనే ప్రశ్నలకు ఫీడ్‌బ్యాక్ ఇవాల్సి ఉంటుంది. వారి అభిప్రాయాన్ని తెలియజేసిన తరువాత సబ్మిట్ బటన్ నొక్కితే సర్వే పూర్తి అవుతుంది. అయితే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సర్వేపై తగిన ప్రచారం లేని కారణంగా ఎంతవరకు ప్రజాభిప్రాయం వెల్లడౌతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. స్వచ్ఛత, పరిశుభ్రత పెంచుకునేందుకు ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాన్ని ఈ వి«ధానం కల్పిస్తుంది. -
‘గ్రామ వాలంటీర్లను భాగస్వాముల్ని చేయాలి’
సాక్షి,కాకినాడ: జిల్లా అధికారులందరూ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2019లో భాగస్వాములవ్వాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సర్వే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 27 మధ్యలో జరుగుతుందని పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ.. జిల్లాలో సెప్టెంబర్ మాసం చివరిలో సర్వే బృందాలు పర్యటించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా సుమారు 30 గ్రామాల్లో ఈ బృందాలు పర్యటిస్తాయిని పేర్కొన్నారు. దీంతోపాటు సర్వే ర్యాకింగ్ ఆధారంగా జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందజేస్తారని స్పష్టం చేశారు. ఈ పురస్కారాలను అక్టోబర్ 2న ప్రధానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాకు మంచి ర్యాంకు సాధించే దిశగా కిందిస్థాయి ఉద్యోగులకు సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఆన్లైన్ సమీక్షలు అందించే అంశంలో కళాశాల విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా అన్ని గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండేలా చూసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లను భాగస్వాముల్ని చేయాలని అధికారులను సూచించారు. ‘స్వచ్ఛ దర్పణ్’ ర్యాంకుల్లో రాష్ట్రంలోనే తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉందని మురళీధర్ రెడ్డి తెలిపారు. -
స్వచ్ఛతలో సత్తుపల్లి ర్యాంకెంత..?
సాక్షి, సత్తుపల్లి: కేంద్ర ప్రభుత్వం సత్తుపల్లి స్వచ్ఛతకు పట్టం కట్టింది. బుధవారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్–2019 ర్యాంకుల్లో సత్తుపల్లి మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో 65 ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం దక్కింది. జాతీయ స్థాయిలో 4,041 మున్సిపాలిటీతో పోటీపడి 4వేల మార్కులకు 2214.58 మార్కులు సాధించింది. అదేవిధంగా జాతీయస్థాయిలో ఇల్లెందు(389వ ర్యాంక్), మణుగూరు(953వ ర్యాంక్), కొత్తగూడెం(339వ ర్యాంక్), మధిర(501వ ర్యాంక్), పాల్వంచ(967వ ర్యాంక్) పొందాయి. జనవరిలో సర్వే జరిపిన కేంద్ర ప్రత్యేక బృందాలు.. స్వచ్ఛ సర్వేక్షన్లో ర్యాంకు కేటాయించేందుకు జనవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్వే సంస్థ మున్సిపాలిటీలో సర్వే నిర్వహించింది. సెల్‌ఫోన్‌తో ప్రత్యేక యాప్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో 200 మంది ప్రజల అభిప్రాయాలు సేకరించింది. రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, బహిరంగ మల విసర్జన, తాగునీటి సరఫరా, తడి, పొడి చెత్తల సేకరణ, డంపింగ్ యార్డ్, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మున్సిపాలిటీ : సత్తుపల్లి విస్తీర్ణం : 18.90 చదరపు కిలోమీటర్లు జనాభా : 31,893 వార్డులు : 20 నివాసాలు : 7,202 పారిశుద్ధ్య సిబ్బంది : 115 మంది వాటర్ ట్యాంకర్లు : 2 పారిశుధ్య వాహనాలు : రిక్షాలు–12, ఆటోలు–2, డంపర్బిన్లు–20, డీసీఎం–1, ట్రాక్టర్లు–4 రోజువారీ సేకరించే చెత్త : 14 టన్నులు చాలా సంతోషంగా ఉంది దేశంలోనే సత్తుపల్లి మున్సిపాలిటీకి స్వచ్ఛతలో ఉత్తమ ర్యాంక్ రావటం చాలా సంతోషంగా ఉంది. వరంగల్ రీజియన్‌లో సత్తుపల్లి మున్సిపాలిటీకి స్వచ్ఛతలో మూడవ స్థానం లభించినందుకు గర్వంగా ఉంది. కౌన్సిలర్లు, ఉద్యోగులపై మరింత బాధ్యత పెరిగింది. ప్రధానంగా ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఈ ర్యాంక్‌ను సాధించగలిగాం. – దొడ్డాకుల స్వాతి, చైర్పర్సన్, సత్తుపల్లి మున్సిపాలిటీ అందరి కృషితోనే సత్తుపల్లి మున్సిపాలిటీలోని అధికారులు, కార్మికులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఉత్తమ ర్యాంక్ సాధించగలిగాం. ఇదే స్ఫూర్తితో మరింత సుందరంగా సత్తుపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. పట్టణాభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలి. – చీమా వెంకన్న, కమిషనర్, సత్తుపల్లి మున్సిపాలిటీ -
అత్యంత స్వచ్ఛ నగరంగా ఇండోర్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఇండోర్ ఈ అవార్డును సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను బుధవారం ఇక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుల జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, కర్ణాటకలోని మైసూర్ స్థానం సంపాదించాయి. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకులు పొందిన రాష్ట్రాలకు మహాత్మా గాంధీ మెమొంటోను ప్రదానం చేశారు. ‘పరిశుభ్రతను ఉద్యమంగా వ్యాప్తి చేయడంలో మహాత్మా గాంధీ క్రియాశీలకంగా వ్యవహించారు. ఇటీవల ముగిసిన కుంభమేళాలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాల నుంచి ప్రజలు పరిశుభ్రత పట్ల ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నా’అని కోవింద్ పేర్కొన్నారు. దీనిపై అవగాహన పెంపొందించడానికి పాఠశాలల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో పరిశుభ్రతను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. అవార్డుల వివరాలు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాకు ‘స్వచ్ఛమైన చిన్న నగరం’అవార్డు ‘ఉత్తమ గంగా పట్టణం’గా ఉత్తరాఖండ్‌లోని గౌచర్ అహ్మదాబాద్‌కు ‘స్వచ్ఛమైన పెద్ద నగరం’అవార్డు వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద నగరంగా రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) ‘మధ్య స్థాయి స్వచ్ఛమైన నగరం’గా మధుర (ఉత్తర ప్రదేశ్) వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యస్థాయి నగరంగా బృందవాన్ (యూపీ) -
తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్– 2019 పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పురస్కారాల్లో తెలంగాణలోని నాలుగు మున్సిపాలిటీలకు అవార్డులు వరించాయి. సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు స్వచ్ఛతలో మెరుగైన ఫలితాలు సాధించి అవార్డులు దక్కించుకున్నాయి. మొత్తంగా దక్షిణ భారతంలోనే ఈ నాలుగు మున్సిపాలిటీలు టాప్–10లో నిలిచాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్– 2019 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కార్యక్రమంలో పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రతిభ కనబర్చిన పట్టణాలకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అవార్డులను అందించారు. దేశవ్యాప్తంగా 4,238 పట్టణాల్లో అమలవుతున్న స్వచ్ఛ భారత్ మిషన్‌ను పరిశీలించి రాష్ట్రాల వారీగా కేంద్రం అవార్డులు ప్రకటించింది. హర్దీప్ సింగ్‌పురి చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని దేవదాస్, మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ అవార్డులు అందుకున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర అభివృద్ధితో పాటు, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ అవార్డులు దక్కడమే అందుకు నిదర్శనమని అధికారులు ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. -
స్వచ్ఛమేవ జయతే!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాన్ని ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2019’లో అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. సిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇకపై నిరంతరంగా స్వచ్ఛ కార్యక్రమాలు అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందుకు ‘సాఫ్ హైదరాబాద్.. షాందార్ హైదరాబాద్’ నినాదంతో నూతన కార్యక్రమాలు చేపట్టనుంది. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులు ‘ఎలక్ట్రానిక్ మానిటరింగ్’తో మూడు కొత్త కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించారు. నానో మానిటరింగ్ పారిశుద్ధ్య కార్యక్రమాల అమలును సూక్ష్మస్థాయిలో పర్యవేక్షించడమే ‘నానో మానిటరింగ్’. ఇందుకు కారుకు ముందు భాగంలో మూడు కెమెరాలు అమర్చుతారు. దృశ్యాల్ని 360 డిగ్రీల్లో బంధించే కెమెరాలున్న ఈ కార్లు జోన్ పరిధిలో తిరుగుతాయి. ఈ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయి దృశ్యాలను ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తారు. రహదారుల వెంబడి ఎక్కడైనా చెత్త, నిర్మాణ వ్యర్థాలు వంటివి కనిపిస్తే వెంటనే తగుచర్యలు చేపడతారు. ప్రయోగాత్మకంగా ఒక జోన్లో పరీక్షించి.. తర్వాత గ్రేటర్‌లోని ఆరు జోన్లలోనూ కెమెరాలు అమర్చిన ఆరు కార్లను వినియోగిస్తారు. చిన్న రోడ్లున్న ప్రాంతాల్లోనూ తిరిగేందుకు వీలుగా చిన్న కార్లను ఎంపిక చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు ఇలాంటి విధా నం ఇప్పటిదాకా దేశంలోనిఏ నగరంలోను చేపట్టలేదు. హైదరాబాదే మొదటి నగరం కానుంది. 2. స్వచ్ఛ వార్డు ఆఫీసర్లు జీహెచ్ఎంసీలోని 150 వార్డుల్లో (కార్పొరేటర్ డివిజన్లకు)ఒక్కో వార్డుకు ఓ అధికారిని స్వచ్ఛ కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు ప్రత్యేకంగా నియమించారు. ఇంజినీర్ లేదా ఇతర అధికారులను వార్డుకొకరిని ఎంపిక చేసి వారికి ట్యాబ్‌లు అందజేశారు. వీరు తమ పరిధిలో చెత్త సేకరణ సరిగ్గా జరుగుతోందా.. చెత్తను డంప్ చేసేందుకు స్థలం ఉందా తదితర అంశాలను పర్యవేక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ట్యాబ్‌లలో అప్లోడ్ చేసి.. తదుపరి చర్యలకోసం ఉన్నతాధికారులకు పంపిస్తారు. 3. స్వచ్ఛ విజిల్ యాప్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం రూపొందించిన ‘సీ విజిల్’ లాంటిదే ఈ ‘స్వచ్ఛ విజిల్’ యాప్. త్వరలో ఈయాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. ప్రజలు ఎవరైనా తమకు కనబడ్డ చెత్త దృశ్యాల్ని ఫొటోలు తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే.. సంబంధిత సిబ్బందిని అక్కడకు పంపించి తొలగిస్తారు. చెత్తకుప్పలు, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఈ యాప్ ఎంతో ఉపకరిస్తుందని, త్వరలో అందుబాటులోకి రానుందని అడిషనల్ కమిషనర్(ఐటీ) ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ: దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ స్వచ్ఛ కార్యక్రమాలు ర్యాంకుల కోసమేననే అపోహ ఉందని, తాము మెరుగైన ర్యాంకుకు పోటీపడుతూనే నిరంతర ప్రక్రియగా స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ‘ఇప్పటికే వాణిజ్య ప్రాంతాల్లో ప్రతి కిలోమీటర్‌కు డస్ట్బిన్ల ఏర్పాటు, ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు వెలువడే హోటళ్లలో కంపోస్టు యూనిట్ల ఏర్పాటు తదితర చర్యలు చేపట్టాం. రహదారుల వెంబడి చెత్తడబ్బాలు ఏర్పాటు చేయాల్సిందిగా హెచ్ఎండీఏ, మెట్రోరైలు అధికారులను కోరాం. నాలాల పూడికతీత, వర్టికల్ గార్డెన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. మానవ విసర్జితాల శుద్ధికి జలమండలి ద్వారా 18 ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య పెంచుతాం. మరింత మెరుగ్గా స్వచ్ఛ కార్యక్రమాల కోసం తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం. ప్రజలు భాగస్వాములైతేనే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుంది’ అని వివరించారు. ఆస్తిపన్ను పెంచం.. వసూళ్లు పెంచుతాం ఆస్తిపన్ను పెంచే యోచన లేదని దానకిశోర్ స్పష్టం చేశారు. ఆస్తిపన్ను వసూళ్లు పెరిగేందుకు నగరంలోని ఇళ్లన్నింటినీ జీఐఎస్ ద్వారా మ్యాపింగ్ చేసే ప్రక్రియ చేపడుతున్నామని, తద్వారా ఇప్పటి వరకు ఆస్తిపన్ను జాబితాలో లేని ఇళ్లను ఆస్తిపన్ను పరిధిలోకి తెస్తామని పేర్కొన్నారు. ఎస్సార్డీపీ పనులకు అవసరమైన నిధుల కోసం మూడోవిడత బాండ్ల సేకరణకు త్వరలోనే మేయర్‌తో కలిసి ముంబై వెళ్లనున్నట్లు తెలిపారు. -
రండి.. స్వచ్ఛతలో మెరుగైన ర్యాంకు సాధిద్దాం
సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2019’లో నగరం ర్యాంకును ఎంపిక చేసేందుకు నేటి (4 జనవరి) నుంచి ఈ నెలాఖరులోగా ఎప్పుడైనా స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులు నగరంలో పర్యటించనున్నందున జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమంపై శ్రద్ధ వహించింది. ప్రజలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ప్రతినిధులడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వాల్సిందిగా భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలకు సిద్ధమైంది. తొలి పది స్థానాల్లో ర్యాంకు పొందేందుకు గత మూడేళ్లుగా జీహెచ్ఎంసీ ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, ప్రజాభిప్రాయానికి సంబంధించిన విభాగంలో మార్కులు తగ్గుతుండటంతో అది ర్యాంకుపై ప్రభావం చూపుతోంది. దీంతో నగర వాసులు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కలిగి ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ విజ్ఞప్తి చేశారు. మంచి ర్యాంకు వల్ల ప్రయోజనాలెన్నో.. హైదరాబాద్‌ను స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రస్థానంలో నిలపడానికి నగర పాలనా విభాగానికి సహకరించాల్సిన బాధ్యత నగరవాసులపై ఉంది. హైదరాబాద్ నగరానికి ఉత్తమ ర్యాంక్ లభిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులు అందే అవకాశం ఉంది. నగర నిర్వహణను ఆధునిక పద్దతుల్లో మరింత మెరుగ్గా నిర్వహించే అవకాశం ఉంటుంది. స్వచ్ఛత ద్వారా పర్యాటక రంగ అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధి పెరిగి తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 2018లో 27వ ర్యాంకు 2015లో 476నగరాల్లో మొదటి సారిగా నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరం 275స్థానాన్ని పొందింది. 2016లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ నగరం అనూహ్యంగా 19వ స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ సంయుక్తంగా చేపట్టిన పలు స్వచ్ఛ కార్యక్రమాల ఫలితంగా ఈ 19వ స్థానాన్ని పొందింది. 2017లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 434 నగరాల్లో జీహెచ్ఎంసీ 22వ స్థానంలోనూ, దేశంలోని మెట్రో నగరాల్లో అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో 4,041 నగరాలు, పట్టణాలు పోటీ పడగా నగరానికి 27వ ర్యాంకు లభించింది. 2019 స్వచ్ఛ సర్వేక్షణ్‌ను 4,379 నగరాల్లో నిర్వహించనున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏమిటి? స్వచ్ఛ భారత్ మిషన్‌ను 2014 అక్టోబర్ 2న భారత ప్రభుత్వం ప్రారంభించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణలో నగరవాసుల భాగస్వామ్యం చేయాలన్నదే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. నగరాల్లోని పబ్లిక్ స్థలాలను మరింత పరిశుభ్రంగా ఉంచడానికి గాను చెత్తను ఉత్పత్తి స్థలాల్లోనే వేరు చేయడం, వ్యర్థాల రవాణ, తొలగింపు తదితర ప్రమాణాలతో నగరాలను మూల్యాంకనం చేయడానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అనే విధానాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వచ్ఛ ప్రశ్నలివే.. 1. స్వచ్ఛ సర్వేక్షణ్–2019 సర్వేలో హైదరాబాద్ పాల్గొంటున్న విషయం మీకు తెలుసా? 2. మీ నగరం పరిశుభ్రతా స్థాయి మీకు సంతృప్తికరంగా ఉందా? 3. మీరు వ్యాపార మరియు పబ్లిక్ ఏరియాలలో చెత్త డబ్బాలను తేలికగా గుర్తుపడుతున్నారా ? 4. వ్యర్థాలను సేకరించే వ్యక్తి తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని మిమ్మల్ని కోరడం జరిగిందా? 5. మీ వద్ద సేకరించిన వ్యర్థ పదార్థాలు (చెత్త) డంపింగ్ యార్డుకు పారిశుధ్య స్థలానికి (ల్యాండ్ ఫిల్లింగ్ సైట్) లేదా ప్రాసెసింగ్ స్థలానికి వెళ్తాయని మీకు తెలుసా? 6. ప్రస్తుతం నగరంలోని మూత్రశాలలు/మరుగుదొడ్లు ప్రవేశానికి (వాడకానికి) వీలుగా, శుభ్రంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? 7. మీ నగరం ఓడీఎఫ్ (బహిరంగ మల, మూత్ర విసర్జన) స్థాయి గురించి మీకు తెలుసా? వీటన్నింటికీ సానుకూల సమాధానమివ్వడం ద్వారా నగరం మంచిర్యాంకు సాధించేందుకు వీలుంటుంది. ఈ ఏడు ప్రశ్నలకు టోల్ ఫ్రీ నెంబర్ 1969కు ఫోన్‌చేసి కానీ www.swachhsurvekshan2018.org కిగాని లేదా swachhata app ద్వారా గానీ తెలియచేసి హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
విరామం లేదు మిత్రమా..!
సాక్షి, వరంగల్ అర్బన్: దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలకు మధ్య నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 పోటీలకు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. పోటీల్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. స్వచ్ఛత ప్రణాళికలపై దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల కేంద్రం థర్డ్ పార్టీ బృందం క్యూసీఐ రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో నిర్వహించిన సర్వేలో వరంగల్ నగరం 3వ ర్యాంక్ సాధించింది. ఈ నేపథ్యంలో కమిషనర్ వీపీ గౌతమ్, ఎంహెచ్ఓ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి స్వచ్ఛ సర్వేక్షణ్‌లోని మార్గదర్శకాలపై శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉత్తమ ర్యాంక్ కోసం వ్యూహాలను రచించి, అమలుకు ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో గత నాలుగేళ్లుగా గ్రేటర్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తొలి ఏడాది 2016లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 73 నగరాల పోటీలో గ్రేటర్ వరంగల్ 32 ర్యాంక్ సాధించింది. 2017 సంవత్సరంలో 28వ ర్యాంక్ సాధించింది. ఇక 2018లో 31 ర్యాంక్‌ను దక్కించుకుంది. 2019లో ఉత్తమ ర్యాంక్‌ను సాధించేందుకు ప్రణాళిక లక్ష్యాల తయారీలో నిమగ్నమయ్యారు. 4,231 నగరాలు, పట్టణాలతో పోటీ దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో 4,231 నగరాలు పోటీ పడుతున్నాయి. గతంలో ఎన్నాడూ లేని విధంగా పోటీ పెరిగింది. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం విరామం లేకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ శ్రమిస్తూ ఉత్తమ స్వచ్ఛ నగర కల సాకారం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సమయం రోజులే.. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీ దగ్గర పడుతోంది. 2019 జనవరి 4 నుంచి ఫిబ్రవరి 4వ తేదీల్లో ఎప్పడైనా స్వచ్ఛ సర్వేక్షణ్ థర్డ్ పార్టీ క్యూసీఐ బృందాలు నగరాలు, పట్టణాల్లో తనిఖీ చేస్తాయి. స్వచ్ఛ సర్వేక్షణ్కు వస్తున్న బృందాల్లోని సీనియర్ అసెసర్లు నగరంలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. ప్రజల అభిప్రాయాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత, దేవాలయాలు, మసీదు, చర్చిలు, ఆర్టీసీ బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, చెత్త సేకరిస్తున్న విధానం, అందుకు వినియోగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాలు, సేకరించిన చెత్త నిల్వ కేంద్రాలు, చెత్త ప్రాసెసింగ్ తదితర వివరాలను మదింపు చేస్తారు. ప్రత్యేక ప్రశ్నవళి ద్వారా ప్రజలను ప్రశ్నించి వివరాలను రాబట్టుకుంటారు. శ్రమించాల్సిందే.. మునిసిపాలిటీల వారీగా పరిస్థితి చూస్తే దేశవ్యాప్త పోటీలో సత్తా చాటడానికి చాలా సన్నద్ధత అవసరం. బహిరంగ మల మూత్ర విసర్జనను వంద శాతం నిషేధించాలి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేరు చేసి అందించాలి. వేరు చేసేలా పారిశుద్ద్య కార్మికులు బాధ్యతగా తీసుకొని చేయించుకోవాలి. కార్మికులకు, జవాన్లకు నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించాలి. సామర్థ్యాలను పెంచాలి. స్వచ్ఛత విషయంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి. గ్రేటర్ సిబ్బంది ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి. ప్రజల ఫీడ్ బ్యాక్, నివాసాల పరిశుభ్రతపై అప్రమత్తం చేయాలి. గత ఏడాది కంటే బహిరంగ మల,మూత్ర విసర్జనలో వరంగల్ ఓడీఎఫ్ సర్టిఫికేట్‌ను సాధించింది. అంతేగాక అమ్మవారిపేటలో మల,మూత్ర వ్యర్థాల శుద్ధీకరణ అదనపు ప్లాంట్‌తో గ్రేటర్ వరంగల్‌కు కలిసోచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంటింటా తడి,పొడి చెత్త సేకరణ వంద శాతం జరగడం లేదు. సేకరించిన తడి చెత్తను శుద్ధీకరణ బాగా వెనుకబడిపోయాం. ప్లాంట్లు ఉన్నా శుద్ధీకరణ నిలిచిపోయింది. అంతేగాక వరంగల్‌ను ఓడీఎఫ్‌గా ప్రకటించినప్పటికీ ఇప్పటికే నగరంలో వీధికో చోట బహిరంగ మల, మూత్ర విసర్జన జరుగుతోంది. 8 వేలకు పైగా కుటుంబాలకు మరుగుదొడ్లు లేక బయటికి వెళ్తున్నారు. సెప్టిక్ ట్యాంకులు లేక 12 వేల ఇళ్ల నుంచి నేరుగా మల,మూత్ర వ్యర్థాలు కాల్వల్లోకి పారుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం నిషేధంలో ఉంది. కానీ విచ్ఛలవిడిగా అమ్మకాలు, కొనుగోలు, వాడకం జరుగుతోంది. ఈ పరిణామాలు మార్కులకు గండికొట్టనున్నాయి. అందువల్ల గ్రేటర్ అధికార యంత్రాంగం స్వచ్ఛ సర్వేక్షణ్‌పై శ్రమించాల్సి ఉంది. ప్రజలను జాగృతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. విభాగాల వారీగా మార్కులు ఇలా సర్వీస్ లెవెల్ బెంచ్ మార్కు 1,250 థర్డ్ పార్టీ అసెసర్ల క్షేత్ర స్థాయి పరిశీలన 1,250 సిటిజన్ ఫీడ్ బ్యాక్ ప్రజల అభిప్రాయానికి 1,250 సర్టిఫికేషన్, ఓడీఎఫ్, గార్బేజీ ఫ్రీ సిటీ, కెపాసిటీ బిల్డింగ్ 1,250 -
చిత్త‘శుద్ధి’ తగ్గింది..!
సాక్షి, హైదరాబాద్ : ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2018’ ర్యాంకుల్లో తెలం గాణ నగరాలు, పట్టణాలు నిరాశాజనక ప్రదర్శన కనబరిచాయి. లక్షకుపైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో టాప్–100లో రాష్ట్రం నుంచి ఈసారి మూడు నగరాలే చోటు దక్కించు కున్నాయి. గతేడాది జాతీయ స్థాయిలో 22వ స్థానంలో నిలిచిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ).. ఈ ఏడాది 27వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. సూర్యాపేట 45, కరీంనగర్ 73వ స్థానంలో నిలిచాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్ నగరాలు తొలి రెండు ర్యాంకులు, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ మూడో ర్యాంకును సాధించాయి. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలు వరుసగా 5, 6, 7 స్థానాల్లో నిలిచాయి. ఒంగోలు 83, చిత్తూరు 95వ స్థానాల్లో నిలిచాయి. తెలంగాణకు 7వ స్థానం స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకుల నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ శనివారం వెల్లడించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నగరాలకు ఇండోర్‌లో పురస్కారాలు ప్రదానం చేసింది. స్వచ్ఛతలో జాతీయ స్థాయిలో జార్ఖండ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తొలి ఐదు ర్యాంకుల సాధించగా.. తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ఆయా రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలు సాధించిన సగటు స్కోరు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. పౌరుల అభిప్రాయం ప్రకారం పారిశుధ్యం మెరుగుదలలో లక్షకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో జాతీయ స్థాయిలో 14వ స్థానంలో, లక్ష లోపు జనాభా ఉన్న నగరాల విభాగంలో 26వ స్థానంలో తెలంగాణ నిలిచింది. రాష్ట్రాల వారీగా లక్షకు పైగా జనాభా ఉన్న పురపాలికల విభాగంలో 7వ స్థానంలో, లక్ష లోపు జనాభా ఉన్న పురపాలికల విభాగంలో 6వ స్థానంలో నిలిచింది. దక్షిణాదిలో సిద్దిపేట టాప్.. ఘన వ్యర్థాల నిర్వహణలో జాతీయ స్థాయిలో ఉత్తమ నగరంగా నిలిచిన జీహెచ్ఎంసీ పురస్కారం అందుకుంది. ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ ప్రాంతాల వారీగా లక్ష లోపు జనాభా ఉన్న 4 పురపాలికలకు పురస్కారాలు అందించగా.. దక్షిణాది రాష్ట్రాల తరఫున 4 పురస్కారాల్లో మూడింటిని రాష్ట్రం కైవసం చేసుకుంది. దక్షిణాదిలో అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేట, పౌరుల అభిప్రాయం ప్రకారం అత్యుత్తమ నగరంగా బోడుప్పల్, ‘నూతన ఒరవడి, ఉత్తమ విధానాల అమలు’లో పీర్జాదిగూడ పురపాలిక పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, మోయర్ బొంతు రామ్మోహన్ల నేతృత్వంలోని బృందం ఈ పురస్కారాలు అందుకుంది. రాష్ట్రం నుంచి రెండు పురపాలికలే.. జాతీయ స్థాయిలో లక్ష లోపు జనాభా ఉన్న టాప్–100 పురపాలికల్లో సిద్దిపేట రెండో ర్యాంకును కైవసం చేసుకోగా, భువనగిరి 49వ ర్యాంకును సాధించింది. ఈ విభాగంలో రాష్ట్రం నుంచి రెండు పురపాలికలకే స్థానం దక్కింది. మహారాష్ట్రలోని పంచ్గని తొలి స్థానం కైవసం చేసుకోగా, ఏపీ నుంచి ఒక్క పట్టణానికీ చోటు దక్కలేదు. దేశంలోని 61 కంటోన్మెంట్ బోర్డులకు ర్యాంకులకు కేటాయించగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 46వ స్థానంలో నిలిచింది. జోనల్ ర్యాంకుల విభాగంలో దక్షిణాది ప్రాంతంలో సిద్దిపేట అగ్రస్థానంలో, భువనగిరి 3వ స్థానంలో నిలిచాయి. సిరిసిల్ల 5, పీర్జాదిగూడ 6, బోడుప్పల్ 8, షాద్‌నగర్ 12, కోరుట్ల 15, భైంసా 18వ ర్యాంకు సాధించాయి. జాతీయ, జోనల్ స్థాయిల్లో ర్యాంకులు దేశంలోని అన్ని పురపాలికలు, కంటోన్మెంట్ బోర్డుల్లో జనవరి 4 నుంచి మార్చి 10 వరకు స్వచ్ఛ సర్వేక్షన్–2018ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించింది. లక్షకు పైగా, లక్ష లోపు జనాభా ఉన్న నగరాలకు వేర్వేరుగా సర్వే జరిపింది. లక్షకు పైగా జనాభా ఉన్న నగరాలకు జాతీయ స్థాయిలో, లక్ష లోపు ఉన్న నగరాలకు జోన్ల వారీగా ర్యాంకులు ప్రకటించింది. 2017 జనవరి–డిసెంబర్ మధ్య పురపాలికలు సాధించిన పురోగతి ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. 4 అంశాల ఆధారంగా సర్వే నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా 4,000 మార్కులకు సర్వే నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కింద చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి పురపాలికల నుంచి సేకరించిన ప్రమాణ పత్రాల ఆధారంగా 1,400 మార్కులు కేటాయించారు. పత్రాల్లో, క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో తేడాలుంటే మార్కుల్లో కోత పెట్టారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి మరో 1,200 మార్కులు, పౌరులు అందించిన సమాచారం ఆధారంగా 1,000 మార్కులు, స్వచ్ఛత యాప్ డౌన్లోడ్ సంఖ్య, యాప్ ద్వారా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలకు 400 మార్కులు ఇచ్చారు. -
అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం గా ఇండోర్ గుర్తింపు తెచ్చుకుంది. 2018 సంవత్స రానికి గాను కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ఇండోర్ మొదటి స్థానంలో నిలిచిందని గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దేశ వ్యాప్తంగా 4,200 నగరాల్లో చేపట్టిన సర్వేలో ఇండోర్ తర్వాతి స్థానాల్లో భోపాల్, చండీగఢ్ ఉన్నాయని తెలిపారు. గత ఏడాది 430 నగరాల్లో చేపట్టిన సర్వేలోనూ ఇండోర్‌కే మొదటి స్థానం దక్కిందన్నారు. అదేవిధంగా, పరిశుభ్రత పాటించే రాష్ట్రాల్లో జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్–2018 సర్వే
కరీంనగర్ కార్పొరేషన్: స్వచ్ఛభారత్ మిషన్, కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 4041 నగరాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో భాగంగా మంగళవారం ఢిల్లీ బృందం నగరంలో పర్యటించింది. ముగ్గురు సభ్యుల బృందం నగరానికి చేరుకోగా నగరపాలక పారిశుధ్య సిబ్బందికి తెలియకుండానే రెండు రోజులపాటు పర్యటించినట్లు తెలిసింది. ఇద్దరు సభ్యుల బృందం పలు డివిజన్లలో పర్యటించి, వివరాలు సేకరించినట్లు సమాచారం. ఒకరు కార్పొరేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తెలిసింది. రెండు రోజులు సుమారు 10 డివిజన్లలో పర్యటించి, పారిశుధ్య పరిస్థితిపై ఫొటోలు తీయడంతోపాటు స్థానికులను అడిగి పలు విషయాలపై అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచే సూచనలు.. నగరానికి వచ్చిన బృందం సభ్యులు ఎక్కడికి వెళ్లాలి.. ఏయే విషయాలు పరిశీలించాలనే అంశాలకు సంబంధించి ఢిల్లీ నుంచే సూచనలు అందాయి. కరీంనగర్ చేరుకునే వరకు ఇక్కడి పరిస్థితులపై ఎలాంటి అవగాహన లేని సభ్యులు వారికి సెల్‌ఫోన్ ద్వారా అందిన లొకేషన్లు, ఇంటి నంబర్ల ఆధారంగా డివిజన్లలో పర్యటించారు. పలు కాలనీలకు వెళ్లి స్వచ్ఛ టాయిలెట్ల నిర్మాణం, ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ, డ్రెయినేజీల శుభ్రత, రోడ్లు ఊడ్చడం, రైతు బజార్లు, మార్కెట్లు తదితర అంశాలపై ఆరా తీశారు. వెంటవెంటనే ఫొటోలు తీస్తూ అప్లోడ్ చేశారు. దీంతో నేరుగా ఢిల్లీ నుంచే ఫోన్లు చేసి ప్రజల ద్వారా పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. కార్యాలయంలో డాక్యుమెంట్ల పరిశీలన.. నగరపాలక సంస్థలో స్వచ్ఛ భారత్ పనుల నిర్వహణపై అధికా రులు నమోదు చేస్తున్న రికార్డులు, డాక్యుమెంట్లను ఢిల్లీ బృం దం సభ్యుడు పరిశీలించారు. ఢిల్లీకి పంపించిన రికార్డులు, ఇక్క డ నిర్వహిస్తున్న రికార్డులను సరిచూశారు. శానిటేషన్ పనులు నిర్వహణ తీరును రికార్డుల్లో పర్యవేక్షించారు. డివిజన్లలో సి బ్బంది కేటాయింపు, నైట్ స్వీపింగ్, ప్రధాన రహదారులను శు భ్రపరచడం పనులు ఎలా జరుగుతున్నాయని తెలుసుకున్నారు. మరో రెండు రోజులు..: మొదటి రెండు రోజులు డివిజన్లలో పర్యటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం, బుధ, గురువారాల్లో కూడా నగరంలో శానిటేషన్ పనులు, చెత్త సేకరణ, చెత్త కలెక్షన్ పాయింట్లు, వాహనాల ద్వారా చెత్త తరలింపు, డంప్‌యార్డు నిర్వహణపై పర్యవేక్షించనుంది. నాలుగు రోజుల షెడ్యూల్ ఉన్నప్పటికీ మూడు రోజుల్లోనే ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణŠ బృందం ఇచ్చే మార్కులపైనే నిధుల రాబడి ఆధారపడి ఉన్నందునా డివిజన్లలో శానిటేషన్ పనులు పక్కాగా చేపడుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి ర్యాంకు సాధించి భారీగా నిధులు పొందాలనే అధికారులు చేసిన కసరత్తు ఫలితమిస్తుందో లేదో చూడాల్సిందే..!! -
జనవరి 4 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్
-
జనవరి 4 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్
సాక్షి, హైదరాబాద్: పారిశుద్ధ్య స్థితిగతులపై మధింపు జరిపి ర్యాంకులు కేటాయించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వచ్చే ఏడాది జనవరి 4 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ –2018ను నిర్వహించనుంది. మార్చి చివరితో ఈ సర్వే ముగియనుంది. గతేడాది దేశ వ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాల్లో ఈ సర్వేను నిర్వహించి ర్యాంకులు కేటాయించగా, ఈ సారి దేశ వ్యాప్తం గా అన్ని నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. స్వచ్ఛ సర్వేక్షణ్–2017లో జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ 22, వరంగల్ 28, సూర్యాపేట 30, సిద్దిపేట 45వ ర్యాంకులను సాధించాయి. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలు గత సర్వేలో 200 పైనే ర్యాంకులు సాధించాయి. దీంతో వచ్చే జనవరి నుంచి ప్రారంభం కానున్న సర్వేకు రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధిం చేందుకు అమలు చేయాల్సిన సంస్కరణలు, చేయాల్సిన పనులను వచ్చే తక్షణమే చేపట్టాలని రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. నిర్దేశించిన పనులు చేపట్టేందుకు నిధులు లేని మునిసిపాలిటీలు సంబంధించిన పనులకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తామని పురపాలక శాఖ సూచించింది. పురపాలికల నివేదికలే కీలకం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు మునిసిపాలిటీలు కేంద్ర పట్టణా భివృద్ధి శాఖకు సమర్పించే నివేదికలే కీలకం కానున్నాయి. ఈ సర్వేను మూడు భాగాలుగా విభజించి నిర్వహించనుండగా, తొలి భాగం కింద మునిసిపాలిటీలు సమర్పించే నివేదికలకు 900 మార్కులు, రెండో భాగం కింద సర్వే నిర్వహణ ఏజెన్సీలు నేరుగా పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులను పరిశీలించి మదింపు జరపడం ద్వారా 500 మార్కులు, మూడో భాగం కింద స్థానిక పౌరుల నుంచి స్వీకరించే అభిప్రాయాల ఆధారంగా 600 మార్కులను కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో మునిసిపాలిటీలు సమర్పించే పారిశుద్ధ్య నివేదికలను పకడ్బందీగా రూపొందించాలని మునిసిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. ఇదిలా ఉండగా, మొత్తం 2,000 మార్కుల్లో.. నగర, పట్టణ ప్రాంతాల్లో చెత్తసేకరణ, రోడ్లను ఊడ్చటం, చెత్త రవాణాకు తీసుకుంటున్న చర్యలకు 40% మార్కులు, మునిసిపల్ వ్యర్థాల నిర్వహణ, చెత్త నిర్మూలన చర్యలకు 20%మార్కులు, బహిరంగ మల విసర్జన నిర్మూలన, టాయిలెట్లకు 30% మార్కులు, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పనకు తీసుకుంటున్న చర్యలకు 5% మార్కు లు, సంస్థాగత నిర్మాణం, స్వచ్ఛ భారత్ మిషన్ ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్ వినియోగించుకుంటు న్న తీరుకు 5% మార్కుల్ని కేటాయిస్తారు. కేంద్ర సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ మదింపు జరగనుంది. -
స్వచ్ఛ సర్వేక్షణ్కు జీహెచ్ఎంసీ సన్నద్ధం
హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సన్నద్ధం అయింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమం శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరగనుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వచ్ఛతపై నగర పౌరుల్లో మరింత అవగాహన పెంచాల్సి ఉందని,. స్వచ్ఛ హైదరాబాద్ కింద ఉత్తమ సేవలు అందించిన వారిని తగు రీతిలో సన్మానిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతను ఒకరోజు, ఒక వారానికే పరిమితం చేయొద్దని, నిరంతరం కొనసాగాలని అన్నారు. ఈసారి స్వచ్ఛభారత్ ర్యాంకుల్లో కేంద్రం 500 నగరాలను పరిగణనలోకి తీసుకోనుందని, స్వచ్ఛభారత్‌లో గతంలో హైదరాబాద్‌కు వచ్చిన ర్యాంకును నిలబెట్టుకోవాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్-2017 కింద 'వాహ్... హైదరాబాద్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి కేటీఆర్, పలువురు క్రీడా, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. -
మోదీ అంటే ఏంటి?
న్యూఢిల్లీ: What is Narendra Modi?(నరేంద్ర మోదీ అంటే ఏమిటి?) అని ఎవరిని అడిగినా.. నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రివర్యుని నామధేయమని, పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని, ఊరు గుజరాత్ మెహసానా జిల్లాలోని వాద్ నగర్ అని.. మోద్ ఘన్చి తేలి(చమురు అద్దకం) వృత్తిదారులు కావడంతో 'మోదీ' వారి ఇంటిపేరుగా స్థిరపడిందని.. దామోదర్‌దాస్ ముల్చంద్, హీరాబెన్ మోదీల ఆరుగురు పిల్లల్లో మూడో సంతానమైన నరేంద్ర మోదీ చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసేవారని... ఇలా ఆయన జీవిత చరిత్ర మొత్తం చెప్పగలరు. కానీ వీటన్నింటికంటే మిన్నగా మోదీని విశ్లేషించగల సామర్థ్యం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఒక్కరికే సొంతం. ఎలాగంటారా?.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ పథకం గురించి మనందరికి తెలిసిందే. దేశంలోని 500 నగరాల్లో ఆ పథకం తీసుకొచ్చిన మార్పులు, భవిష్యత్ కార్యాచరణ తదితర వివరాలను పొందుపరుస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సర్వే నిర్వహించింది. 'స్వచ్ఛ సర్వేక్షణ్' పేరుతో నిర్వహించిన ఆ సర్వే ప్రతులను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ఢిల్లీలో విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిననాడే మోదీ గారు చెప్పారు.. ఇది కచ్చితంగా ప్రజాఉద్యమంగా మారుతుందని. అవును. ఆయన ఊహించినట్లే ఇవ్వాళ స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యారు. అదేదో ప్రభుత్వ కార్యక్రమంలా భావించకుండా ప్రజలంతా స్వచ్ఛ భారత్ ను తమదిగా స్వీకరించించారు. అందుకే నేనంటాను.. మోదీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా (MODI means Making Of Developed India) అని! వాజపేయి హయాంలో భారత్ వెలిగిపోతోంది (షైనింగ్ ఇండియా) నినాదం తరహాలో వెలుగులోకి వచ్చిన మోదీ (మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా) నినాదం వచ్చే ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపుతుందోమరి!