సాక్షి, న్యూ ఢిల్లీ: దేశంలో ఎన్నో కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పెద్దపల్లి జిల్లాకు స్వచ్ఛతలో దేశంలోనే మొదటి స్థానం రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పెద్దపల్లికి స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ అవార్డు రావడం ఇది మూడోసారి. గతంలో గ్రామపంచాయతీలకు నిధులు లేవు. ఇప్పుడు ప్రతినెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నాం. పంచాయతీ కార్మికుల జీతాలు పెంచినం.
తెలంగాణ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో చేపట్టిన 30 రోజుల ప్రణాళికపై కేంద్రమంత్రి మెచ్చుకున్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఈజేఎస్ కింద 1200 కోట్ల నిధులు రావాల్సి ఉంటే కేవలం 320 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన 600 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకువచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు కృషి చేయాలి’ అని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment